ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

‘విశ్వసంచార్ హిందుత్వ కా’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్


హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదు... అందరినీ కలుపుకొని ముందుకు సాగుతుందని వ్యాఖ్య

మౌలిక విలువలు, సంస్కృతి, జీవన విధానాలను కాపాడుకుంటూనే... మార్పును స్వీకరించినప్పుడే నాగరికత అభివృద్ధి సాధ్యం

చిన్నగా మొదలైన ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచ స్థాయి సంస్థగా ఎదిగింది

సుసంపన్నమైన భారత నాగరికత వారసత్వాన్ని చదవాలి, ప్రశ్నించాలి, అర్థం చేసుకోవాలని యువతకు ఉపరాష్ట్రపతి పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 5:47PM by PIB Hyderabad

సప్తాహిక్ వివేక్ ప్రచురించిన ‘విశ్వసంచార్ హిందుత్వ కా’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ... 1948లో స్థాపించిన 'సాప్తాహిక్ వివేక్' సుదీర్ఘ చరిత్రను, మహారాష్ట్ర సామాజిక, సాంస్కృతిక, ప్రజా జీవితాలతో దానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. భారతీయ సంస్కృతి, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, కీలకమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రచురించే ఈ సంస్థ సంప్రదాయాన్ని ఆయన అభినందించారు.

1925లో నాగపూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థ తన శతాబ్దిని పూర్తి చేసుకున్న తరుణంలో, ఈ పుస్తక ప్రచురణ సందర్భోచితంగా ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

"సంఘ్‌తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ పుస్తకావిష్కరణలో భాగం కావడం వ్యక్తిగతంగా నాకు గొప్ప గౌరవం" అని ఆయన వ్యాఖ్యానించారు.

సాంస్కృతిక హిందుత్వాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు జరిగిందన్నారు. హిందుత్వానికి, సంఘ్‌కు మధ్య అనుబంధాన్ని డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్పష్టంగా ప్రకటించారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

దీర్ఘకాలంగా పరిణామం చెందుతూ వచ్చిన సంస్థకు సంబంధించిన చరిత్ర, భావజాలం, పని విధానాల సమీక్ష కోసం ఈ శతాబ్ది ఉత్సవం ఒక అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన అన్నారు. సంఘ్ పని విధానం కాల పరీక్షకు నిలిచిందనీ, తద్వారా సామాజిక జీవనంలోని వివిధ రంగాల్లో ఉనికిని చాటుకుంటూ అది ఒక కీలక సంస్థగా ఎదిగిందనీ ఆయన పేర్కొన్నారు.

హిందూత్వ సమ్మిళిత స్వభావాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, శ్రీ సి. పి. రాధాకృష్ణన్ ఇలా అన్నారు... "హిందూత్వం ఎవరికీ వ్యతిరేకం కాదు. హిందూత్వం ఎవరికీ వ్యతిరేకం కాజాలదు. అది అందరినీ కలుపుకొని ముందుకు సాగుతుంది."

మౌలిక విలువలు, సాంస్కృతిక ఆదర్శాలు, నిజమైన మానవ సంబంధాలు, సర్వజన శ్రేయస్సు వంటి ఆదర్శాల కలయికే సాంస్కృతిక హిందూత్వమని ఆయన పేర్కొన్నారు.

వివిధ చారిత్రక, మేధోపరమైన సందర్భాల్లో 'హిందుత్వ' అనే పదానికి విభిన్న అర్థాలు వచ్చాయనీ... రాజకీయ మేధావులు, పండితులు, సంస్థలు, విమర్శకులు దీనిని గురించి విభిన్న వ్యాఖ్యలు చేశారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ అంశంపై లోతుగా చర్చించాలంటే దాని చారిత్రక పరిణామం, తాత్విక కోణాలు, దాని చుట్టూ ఉన్న విభిన్న వ్యాఖ్యానాలను పరిశీలించాల్సి ఉంటుందని ఉపరాష్ట్రపతి తెలిపారు.

గంగానదితో పోలికను చెబుతూ, ఉపరాష్ట్రపతి ఇలా అన్నారు... హిమాలయాల్లో చిన్న ప్రవాహంగా మొదలయ్యే ఆ నది క్రమంగా విస్తరిస్తూ బంగాళాఖాతాన్ని చేరేసరికి పెద్ద ఓడలనూ మోయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రస్థానాన్నీ అదే విధమైన అద్భుత విస్తరణకు సంబంధించినదిగా చూడవచ్చని ఆయన అన్నారు.

"సంఘ్ కొద్దిమంది వ్యక్తులతో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైంది. నేడు అది దేశవ్యాప్తంగా విస్తరించి ఒక అంతర్జాతీయ సంస్థగా ఎదిగింది. దీని స్వయంసేవకులు జాతీయ, సామాజిక జీవనంలోని వివిధ రంగాల్లో తమవంతు కృషి చేస్తున్నారు," అని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

శ్రీ సి. పి. రాధాకృష్ణన్ మాట్లాడుతూ, ప్రాచీన భారతీయ విధానమైన యోగా నేడు ప్రపంచవ్యాప్త ఆచరణగా మారిందనీ... భౌగోళిక, సాంస్కృతిక మూలాలను దాటి విస్తరించిందనీ... ఒక విశాలమైన ప్రపంచ స్థాయి చర్చలో భాగం కాగల భారతీయ సంప్రదాయ సామర్థ్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

"విశ్వసంచార్" అనే పదం ప్రపంచవ్యాప్తంగా భావాల ప్రసారాన్ని, వ్యాప్తిని సూచిస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. భారత సాంస్కృతిక వారసత్వంలోని అంశాలు విశ్వమంతా ప్రయాణించి, ఇతర సమాజాలతో మమేకమై, కొత్త రూపాలను, అర్థాలను సంతరించుకున్న తీరును పరిశీలించమని ఈ పుస్తకం పాఠకులను ఆహ్వానిస్తుందని ఆయన తెలిపారు.

వర్తమానాన్ని తీర్చిదిద్దే రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థల పట్ల చైతన్యంతో ఉంటూనే, భారత గొప్ప వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, పరిశోధించాలని, అర్థం చేసుకోవాలని యువతకు ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.

"ఒక నాగరికత తన మౌలిక విలువలు, సంస్కృతి, నైతిక విలువలను నిలుపుకుంటూనే... మార్పుతో మమేకమయ్యే విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే అది వర్ధిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది," అని ఆయన పేర్కొన్నారు.

'విశ్వ-సంచార్ హిందుత్వ కా' పుస్తకాన్ని వెలువరించిన సప్తాహిక్ వివేక్ రచయితలు, పరిశోధకులు, సంపాదకులు, యావత్ బృందాన్నీ శ్రీ సి. పి. రాధాకృష్ణన్ అభినందించారు.

ఈ పుస్తకం భారత సాంస్కృతిక ప్రస్థానంపై లోతైన అధ్యయనాన్ని ప్రోత్సహిస్తుందనీ... హిందుత్వ, సాంస్కృతిక గుర్తింపు, ప్రపంచంతో భారత్ కలిగి ఉన్న సంబంధంపై ఆలోచనాత్మక చర్చను ప్రేరేపిస్తుందనీ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు శ్రీ వినోద్ తావ్డే, సుయోగ్ టెలిమాటిక్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివశంకర్, సప్తాహిక్ వివేక్ సంపాదకులు శ్రీ రవీంద్ర గోలే, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2314704) సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam