వ్యవసాయ మంత్రిత్వ శాఖ
నిర్ధిష్ట ప్రాంతంలో పరాన్నజీవుల ఉనికి గురించిన నివేదికల కారణంగా
ట్యూనా చేపలు తినడం మానేయవద్దని సూచించిన ఐసీఏఆర్-సీఎంఎఫ్ఆర్ఐ
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 4:57PM by PIB Hyderabad
ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని చేపల్లో పరాన్నజీవుల ఉనికిని గుర్తించినట్లు వస్తున్న నివేదికల ఆధారంగా ట్యూనా లేదా వాణిజ్యపరంగా లభించే ఇతర చేపలను తినడం మానుకోవద్దని కొచ్చిలోని ఐసీఏఆర్-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఏఆర్-సీఎంఎఫ్ఆర్ఐ) వినియోగదారులకు సూచించింది. ట్యూనా సహా భారత తీరప్రాంతంలో పరీక్షించిన ఏ రకం చేపల్లోనూ హానికరమైన పరాన్నజీవుల వ్యాప్తికి సంబంధించిన బాహ్య లక్షణాలు ఏవీ కనిపించలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇటువంటి పరిశోధనల ఫలితాలను భారత జలాల్లోని చేపలకు ఆపాదించాల్సిన అవసరం లేదని తెలిపింది.
బ్రెజిల్ తీరంలోని అట్లాంటిక్ మహాసముద్రంలోని చేపలపై నిర్వహించిన ఒక అధ్యయనం ఆధారంగా, స్కిప్‌జాక్ ట్యూనాలో పరాన్నజీవులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేశారు. చేపలు ఉండే పరిసరాల పరిస్థితులు, వాటికి ఆహారంగా లేదా ఆధారంగా ఉండే కోపెపాడ్స్ (చిన్న నీటి జీవులు) వంటి ఇతర జీవుల లభ్యతకు అనుగుణంగా... పరాన్నజీవుల సంఖ్య, వాటి వ్యాప్తి ఒక్కో చేపకు, అలాగే ఒక్కో ప్రాంతానికి మారుతూ ఉంటుందని ఐసీఏఆర్-సీఎంఎఫ్ఆర్ఐ స్పష్టం చేసింది.
ఐసీఏఆర్-సీఎంఎఫ్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ గ్రిన్సన్ జార్జ్ మాట్లాడుతూ, తమ సంస్థలోని శాస్త్రవేత్తలు చేపల జీవశాస్త్ర అధ్యయనాల్లో భాగంగా స్కిప్‌జాక్ ట్యూనా వంటి చేపలను క్రమం తప్పకుండా పరీక్షిస్తుంటారనీ, అవసరమైనప్పుడల్లా వాటిలో అసాధారణతలు, పరాన్నజీవుల ఉనికిని గమనిస్తూ ఉంటారని తెలిపారు. తమ సంస్థ పరీక్షించిన చేపల్లో హానికరమైన పరాన్నజీవుల ప్రభావం ఉన్నట్లు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని ఆయన స్పష్టం చేశారు.
చేపల జాతులు లేదా వాటి జనాభాను వేర్వేరుగా గుర్తించడానికి, వాటిలో ఉండే పరాన్నజీవుల వ్యత్యాసాలను ప్రపంచవ్యాప్తంగా ఒక సూచికగా ఉపయోగిస్తారని ఈ సంస్థ వివరించింది. అందువల్ల, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి చెందిన చేపలపై తేలిన ఫలితాలను, వేరే ప్రాంతంలో ఉండే అదే రకమైన చేపల జాతికి నేరుగా, స్వయంచాలకంగా వర్తింపజేయలేమని స్పష్టం చేసింది.
ఆహార భద్రత కోసం అదనపు జాగ్రత్తగా... చేపలను శుభ్రం చేసేటప్పుడు, ప్రాసెస్ చేసేటప్పుడు వాటి పేగులను పూర్తిగా తొలగించడం చాలా ముఖ్యమని ఐసీఏఆర్-సీఎంఎఫ్ఆర్ఐ సూచించింది. సాధారణంగా శుభ్రం చేసేటప్పుడే పేగులు, ఇతర అంతర్గత అవయవాలను తీసివేస్తారు. చేపలను సరిగ్గా ఉడికించి వండడం వల్ల దానిలో ఏవైనా పరాన్నజీవులు ఉన్నా అవి పూర్తిగా చనిపోతాయి. దీనివల్ల ఆహార భద్రతకు సంబంధించిన ఎలాంటి ప్రమాదమైనా చాలా వరకు తగ్గిపోతుందని సంస్థ స్పష్టం చేసింది.
చేపలను పచ్చిగా లేదా సగం ఉడికించి తినే అలవాటు గల దేశాల్లోనే పరాన్నజీవుల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని సంస్థ పేర్కొంది. భారత్‌లో మనం చేపలను బాగా ఉడికించి లేదా వేయించి తినడం వల్ల ఆ భయం ఉండదనీ, ఈ అలవాటు వల్ల ఆహార-భద్రత మరింత మెరుగవుతుందనీ స్పష్టం చేసింది.
ఏదో ఒక నిర్దిష్ట ప్రాంతంలోని చేపల్లో పరాన్నజీవులు ఉన్నట్లు నివేదికలు వచ్చాయనే కారణంతో, వినియోగదారులు ట్యూనా సహా మార్కెట్లో దొరికే ఇతర చేపలను తినడం మానేయాల్సిన అవసరం లేదని ఐసీఏఆర్-సీఎంఎఫ్ఆర్ఐ స్పష్టం చేసింది. చేపలు, ఇతర సముద్ర సంబంధిత ఆహారం ద్వారా లభించే పోషక విలువలను పొందుతూనే, అందులోని ప్రమాదాలను పూర్తిగా తగ్గించుకోవడానికి.. వాటిని సరిగ్గా శుభ్రం చేయడం, పేగులు తీసేయడం, బాగా ఉడికించడం వంటి పద్ధతులను పాటించాలని వినియోగదారులకు ఐసీఏఆర్-సీఎంఎఫ్ఆర్ఐ సూచించింది.
***
(రిలీజ్ ఐడి: 2314484)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15