ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో బ్రిక్స్ దేశాల పన్నుల విభాగాధిపతుల సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
బ్రిక్స్ పన్నుల విభాగ సారథిగా సాంకేతికత, పరిపాలన, మానవ వనరుల రంగాల్లో చరిత్రాత్మక విజయాలు సాధించిన భారత్
అంతర్జాతీయ పన్నుల విధానం, ఆదాయ గణాంకాలపై భారత్ నేతృత్వంలో అధికారికంగా రెండు నూతన కార్యాచరణ బృందాల ఏర్పాటు
బ్రిక్స్ పన్నుల పురోగతి నివేదిక-2026కు ఆమోదం
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2026 8:38PM by PIB Hyderabad
పన్నుల సహకార విభాగంలో బ్రిక్స్ సారథిగా భారత్ పదవీకాలం ముగింపు సందర్భంగా... న్యూఢిల్లీలో నిర్వహించిన 'బ్రిక్స్ పన్నుల విభాగాధిపతుల సమావేశాన్ని’ కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి, రెవెన్యూ కార్యదర్శి శ్రీ అరవింద్ శ్రీవాస్తవ ప్రసంగించారు.
ఈ సమావేశానికి సీబీడీటీ ఛైర్మన్ శ్రీ రవి అగర్వాల్, సీబీడీటీ సభ్యుడు (లెజిస్లేషన్) శ్రీ ప్రసేన్‌జీత్ సింగ్, సీబీడీటీకి చెందిన ఇతర సభ్యులు, రెవెన్యూ శాఖ (డీఓఆర్) సీనియర్ అధికారులు హాజరయ్యారు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నిర్వహించిన ఈ సమావేశం... బ్రిక్స్ సభ్య దేశాల పన్నుల విభాగాల అధిపతులను ఒకచోట చేర్చింది. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే పది బ్రిక్స్ దేశాల పన్నుల నిర్వహణ సంస్థల ప్రతినిధులు... తమ అనుభవాలను పంచుకోవడానికి, ఎదురవుతున్న సవాళ్లను సహకారం, సమన్వయం ద్వారా ఎదుర్కొనే మార్గాలను చర్చించడానికి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ... భారత్ సారథ్య కాలంలో బ్రిక్స్ పన్నుల సహకారంలో సాంకేతికత, పరిపాలన, మానవ వనరులు మూడు నిరంతర ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయని ప్రముఖంగా పేర్కొన్నారు. పన్నుల నిర్వహణను మరింత కచ్చితమైనదిగా మార్చడంలో, మరింత అందుబాటులోకి తీసుకురావడంలో డేటా, డిజిటల్ మౌలిక సదుపాయాల పాత్రను ఆమెను స్పష్టం చేశారు. కేవలం ఒక దేశ అధ్యక్ష పదవీ కాలానికే పరిమితం కాకుండా, భవిష్యత్తులోనూ దేశాల మధ్య సహకారం కొనసాగేలా శాశ్వత సంస్థాగత ఏర్పాట్లు, ఆచరణాత్మక సాధనాలు అవసరమని ఆమె పేర్కొన్నారు. పన్నుల విభాగాల్లో పనిచేసే సిబ్బంది నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడం, వివిధ దేశాల అధికారుల మధ్య వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించడం చాలా విలువైనదని కేంద్ర మంత్రి అన్నారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పన్నుల సహకార ఒప్పంద చర్చలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న బహుపాక్షిక పన్నుల చర్చలు న్యాయబద్ధంగా, శాశ్వతంగా కొనసాగాలంటే బ్రిక్స్ దేశాల అభిప్రాయాలు, దృక్పథాలు చాలా కీలకమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అనేక చరిత్రాత్మక నిర్ణయాలను అధికారికంగా ఆమోదించారు. అంతర్జాతీయ పన్నులు-బదిలీ ధరలు, ఆదాయ గణాంకాల విషయంగా రెండు నూతన కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ రెండింటికీ భారత్ నాయకత్వం వహించనుంది. దీనివల్ల ఏ దేశం అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ నిరంతరం పనిచేసే ఒక శాశ్వత సంస్థాగత వేదిక ఏర్పాటుకు వీలుంటుంది. ఏప్రిల్ 2026లో నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వేదికగా నిర్వహించిన తొలి "బ్రిక్స్ యువ పన్ను నిపుణుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం"ను ఇకమీదట ప్రతియేటా నిర్వహించే ఒక శాశ్వత విధానంగా మార్చారు. ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకునే ఉమ్మడి వేదికగా "బ్రిక్స్ ట్యాక్స్ క్రాస్-లెర్నింగ్ ల్యాబ్"నూ అధికారికంగా ప్రారంభించారు. "బ్రిక్స్ పన్నుల సహాయక నెట్‌వర్క్" కార్యాచరణ నిబంధనలనూ ఈ సమావేశంలో ఆమోదించారు.
బ్రిక్స్ పన్నుల విభాగం సారథిగా భారత్ పూర్తి రికార్డును సూచించే బ్రిక్స్ పన్నుల పురోగతి నివేదిక-2026ను లాంఛనంగా ఆమోదించడంతో సమావేశం ముగిసింది. 2027 సంవత్సరానికి బ్రిక్స్ పన్నుల సహకార విభాగానికి కాబోయే అధ్యక్ష దేశంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు స్వాగతం పలికారు.
ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన, బ్రిక్స్ పన్నుల విభాగ సారథ్య బాధ్యతలు ఫలప్రదంగా నిర్వహించిన భారత ప్రభుత్వాన్ని బ్రిక్స్ దేశాల పన్నుల విభాగాల అధిపతులు ప్రత్యేకంగా ప్రశంసించారు.
***
(రిలీజ్ ఐడి: 2314332)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11