హోం మంత్రిత్వ శాఖ
పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) నిర్వహిస్తున్న
ప్రత్యేక ప్రచారం–6లో పాల్గొనేందుకు సిద్ధమైన హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఏ)
స్వచ్ఛతను సంస్థాగతం చేయడం, ప్రభుత్వంలో అపరిష్కృత అంశాలను తగ్గించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత స్ఫూర్తితో పరిశుభ్రతను ప్రోత్సహించడం, పనిని క్రమబద్ధీకరించడం, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రచార నిర్వహణ
హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ప్రజలతో నేరుగా మమేకమయ్యే క్షేత్రస్థాయి, అవుట్ స్టేషన్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి
ప్రత్యేక క్యాంపెయిన్‌లో సుస్థిరమైన, పర్యావరణహితమైన పని ప్రదేశాలను తయారు చేయడంపై దృష్టి సారించడంతో పాటు వివిధ విభాగాల్లో పెండింగులో ఉన్న సిఫారసులు, అంశాలను పరిష్కరించనున్న ఎంహెచ్ఏ
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2026 1:16PM by PIB Hyderabad
పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచారం–6లో పాల్గొనేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహిస్తోంది.
1. సన్నాహక దశ: 2026 సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు
2. అమలు దశ: 2026 అక్టోబర్ 2 నుంచి 31 వరకు
స్వచ్ఛతను సంస్థాగతం చేయడం, ప్రభుత్వంలో అపరిష్కృత అంశాలను తగ్గించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత స్ఫూర్తితో పరిశుభ్రతను ప్రోత్సహించడం, పనిని క్రమబద్దీకరించడం, పెండింగులో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ప్రజలతో నేరుగా మమేకమయ్యే క్షేత్రస్థాయి, అవుట్ స్టేషన్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
సుస్థిరమైన, పర్యావరణహిత పని ప్రదేశాలను రూపొందించేలా ప్రత్యేక క్యాంపెయిన్–6లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అదే సమయంలో పెండింగులో ఉన్న సిఫారసులను, అంశాలను పరిష్కరిస్తుంది. వీటిలో పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన సిఫారసులు, పార్లమెంటు హామీలు, అంతర మంత్రిత్వ శాఖ సంప్రదింపులు, ప్రజా ఫిర్యాదులు, అప్పీళ్లతో పాటు మెరుగైన రికార్డు నిర్వహణ కూడా ఉంది.
మంత్రిత్వశాఖలో అత్యున్నత స్థాయిలో ప్రత్యేక ప్రచారం–6 అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యం గురించి కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఏపీఎఫ్), కేంద్రీయ పోలీసు సంస్థలకు (సీపీవో) అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి సమిష్టిగా కృషి చేస్తూ, మరింత చొరవ చూపాలని వారిని ప్రోత్సహించారు.
పారిశుద్ధ్యం, సమర్థమైన రికార్డు నిర్వహణ, పెండింగులో ఉన్న అంశాలను సకాలంలో పరిష్కరించడం, స్వచ్ఛమైన, పర్యావరణహితమైన, మరింత ఉత్పాదకమైన పని ప్రదేశాలను రూపొందించేందుకు చేపడుతున్న ప్రయత్నాల ద్వారా ఈ ప్రత్యేక ప్రచారం సాధించిన ఫలితాలను సంస్థాగతం చేయడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
పెండింగులో ఉన్న అంశాలను తగ్గించడం, పారిశుద్ధ్యాన్ని, సమర్థమైన రికార్డు నిర్వహణను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించిన ప్రత్యేక ప్రచారంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ/అధీన సంస్థలు చురుగ్గా పాల్గొంటున్నాయి. నవంబర్ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు పెండింగులో ఉన్న అంశాలను పరిష్కరించడంలోనూ స్వచ్ఛమైన, మరింత సమర్ధమైన పని ప్రదేశాలను తయారుచేయడంలో మంత్రిత్వ శాఖ, క్షేత్రస్థాయి/అవుట్ స్టేషన్ కార్యాలయాలు గణనీయమైన ప్రగతిని సాధించాయి.
ఈ సమయంలో సాధించిన ప్రధాన విజయాలు:
-
క్షేత్రస్థాయి, అవుట్ స్టేషన్ కార్యాలయాలతో సహా వివిధ ప్రాంతాల్లో 761 స్వచ్ఛతా క్యాంపెయిన్లను మంత్రిత్వశాఖ నిర్వహించింది.
-
పార్లమెంటు సభ్యుల నుంచి వచ్చిన 299 సిఫారసులు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన 336 సిఫారసులు, 7 పీఎంవో సిఫారసులు పరిష్కారమయ్యాయి.
-
ఈ కాలంలో వచ్చిన మొత్తం 52,050 ప్రజా ఫిర్యాదులను,, 7,410 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లను మంత్రిత్వశాఖ పరిష్కరించింది.
-
ఎంహెచ్ఏ, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్)కు చెందిన కార్యాలయాల్లో 1,02,084 చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఖాళీ అయింది.
ఎలాంటి అవరోధాలు లేకుండా సమాచారాన్ని సమీకరించడానికి, కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ అంతర్గత పోర్టల్‌ను ఉపయోగిస్తోంది. దీని ద్వారా ప్రచారానికి సంబంధించిన డేటాను కేంద్రపాలిత ప్రాంతాలు, ఢిల్లీ పోలీసు విభాగాలతో సహా మంత్రిత్వశాఖలోని అన్ని విభాగాలు అప్‌లోడ్ చేస్తాయి. ఈ పోర్టల్ ద్వారా వివిధ విభాగాలు, కార్యాలయాల మధ్య సమన్వయం మెరుగుపడింది. అలాగే కచ్చితమైన సమాచారాన్ని సకాలంలో సేకరించి, క్రోడీకరించడం సులభతరమైంది.
***
(రిలీజ్ ఐడి: 2314022)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4