ఉప రాష్ట్రపతి సచివాలయం
భారత్ మండపంలో తొమ్మిదో ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ – 2026ను ప్రారంభించిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
జలవనరులను వివేకంతో ఉపయోగించాలని, సంరక్షించాలని, సమగ్రంగా నిర్వహించాలని ఉప రాష్ట్రపతి పిలుపు
‘‘జల సంరక్షణ... జన సంరక్షణకు, దేశ సంరక్షణకు దారి తీస్తుంది’’: ఉప రాష్ట్రపతి
ప్రస్తుతం ఎదురవుతున్న జల సంబంధిత సమస్యలను పరిష్కరించే విలువైన మార్గాలను భారతీయ సంప్రదాయ విజ్ఞానం అందిస్తుంది: ఉప రాష్ట్రపతి
నీటిని పొదుపు చేసే చిన్న చర్యలే మానవాళి, ప్రపంచ ప్రయోజనాలకు తోడ్పడతాయి: ఉప రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2026 2:40PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో తొమ్మిదో ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ (ఐఐడబ్ల్యూడబ్ల్యూ)-2026ను ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘వాతావరణ మార్పులను తట్టుకోగల జల యాజమాన్యం’’ అనే ఇతివృత్తం కేంద్రంగా సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు అయిదు రోజుల పాటు జల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ప్రసంగిస్తూ... జీవానికి, నాగరికతలకు జలమే ఆధారమన్నారు. నీటిని వివేకంతో ఉపయోగించడం, సంరక్షించడం, సమర్థంగా నిర్వహించడం అవసరమని స్పష్టం చేశారు.
తమిళనాడులో తన బాల్య అనుభవాలను శ్రీ సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేసుకున్నారు. తాను స్వయంగా నీటి కొరతను చూశానని, ప్రజలకు తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్న ప్రాధాన్యం తనకు గుర్తుందని ఆయన చెప్పారు. ‘‘నీటిని పొదుపు చేయడమే మానవాళికి, ఈ ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన అంశం’’ అని తెలిపారు.
రెండు దశాబ్దాల క్రితం తమిళనాడు వ్యాప్తంగా 19,000 కి.మీ. రథయాత్ర చేపట్టానని ఉప రాష్ట్రపతి తెలిపారు. నదుల అనుసంధానం, నీటి పరిరక్షణ, నీటి వనరుల సరైన నిర్వహణపై అవగాహన కల్పించడమే ఈ యాత్ర లక్ష్యమన్నారు. కొన్ని ప్రాంతాలు వరదలతో, మరికొన్ని ప్రాంతాలు కరవుతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులను నదుల అనుసంధానం ద్వారా పరిష్కరించవచ్చని ఆయన తెలిపారు.
నదులతో భారతదేశానికి ఉన్న నాగరికత సంబంధాల గురించి ఉప రాష్ట్రపతి వివరించారు. నీటిని నిల్వ చేయడానికి, పంచుకోవడానికి, నిర్వహించడానికి భారతీయ సమాజాలు శతాబ్దాలుగా గొప్ప సంప్రదాయాలను, విధానాలు అభివృద్ధి చేశాయని తెలిపారు. ‘‘ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన విలువైన మార్గాలను మన సంప్రదాయ విజ్ఞానం అందిస్తుంది’’ అని ఆయన తెలిపారు.
ప్రపంచ భూభాగంలో 2.4 శాతం, జనాభాలో 18 శాతం వాటా భారతదేశానికి ఉండగా, మంచినీటి వనరుల్లో మాత్రం కేవలం 4 శాతం మాత్రమే వాటా ఉందని ఉపరాష్ట్రపతి చెప్పారు. అధిక నీటి లభ్యత, తక్కువ జనాభా ఉన్న దేశాలతో భారతదేశ నీటి వినియోగ అవసరాలను పోల్చలేమని ఆయన స్పష్టం చేశారు.
అలవాట్లలో మార్పులు తీసుకురావాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. దైనందిన జీవితాల్లో సాధారణ నీటి పొదుపు పద్ధతులను స్వీకరించాలని పౌరులను కోరారు. ‘‘స్నానానికి రెండు బకెట్లు లేదా ఇరవై బకెట్లు వాడొచ్చు. ఏది ఎంచుకోవాలనే నిర్ణయం మాత్రం మనదే. బ్రష్ చేసుకొనేటప్పుడు కుళాయిని మూసివేయవచ్చు. ఇవి చిన్న విషయాలుగానే కనిపిస్తాయి. కానీ ఈ చిన్న చర్యల్లోనే మానవాళి, ప్రపంచ ప్రయోజనం ఇమిడి ఉంది’’ అని చెప్పారు.
వాతావరణ మార్పు, వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల జల నిర్వహణను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయని ఉప రాష్ట్రపతి చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ వనరుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వ, సమర్థమైన నీటి పారుదలతో కూడిన సమగ్ర విధానం అవసరమని ఆయన తెలిపారు.
నీటి పంపిణీ సమస్యల పరిష్కారంలో రాష్ట్రాల మధ్య సహకారానికున్న ప్రాధాన్యాన్ని ఉపరాష్ట్రతి వివరించారు. నీటి పంపిణీకి సంబంధించి 10 అంతర్రాష్ట్ర ఎంవోయూలు కుదిరాయని చెబుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. సహకారాత్మక పరిష్కారాలను ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం, జలశక్తి మంత్రిత్వశాఖ, సంబంధిత రాష్ట్రాల కృషిని ఆయన అభినందించారు. ఆరు రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట సహకారానికి కిషౌ బహుళార్థక సాధక ప్రాజెక్టు ఒప్పందాన్ని ఉదాహరణగా చూపించారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ ప్రయాణిస్తోందని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. దీనికి సమర్థమైన, సుస్థిరమైన నీటి నిర్వహణ కీలకమని తెలిపారు. ‘‘జల్ సంచాయ్ జన భాగీదారీ’’ కోసం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును ఆయను గుర్తు చేశారు. నీటి పరిరక్షణ సామాజిక ఉద్యమంలా చేపట్టాలని పౌరులను కోరారు.
వ్యవసాయంలో ఉన్న గణనీయమైన డిమాండు, పెరుగుతున్న పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, రీసైక్లింగ్ చేయడం, పునర్వినయోగించడానికి ఉన్న ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. స్పందన నుంచి ముందస్తు అంచనా వేసే, సాంకేతిక ఆధారిత జల నిర్వహణకు మారాలని పిలుపునిచ్చారు.
జల సంబధిత సమస్యలను ఒక సంస్థ, విభాగం లేదా రాష్ట్రం పరిష్కరించలేదంటూ... బహుళ భాగస్వామ్య, బహుముఖ విధానానికి శ్రీ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ – 2026లో జరిగే చర్చలు వాతావరణ పరిస్థితులను తట్టుకొనే, సమీకృత జల నిర్వహణకు వినూత్న సాంకేతిక, విధాన, సామాజిక–ఆర్థిక, పర్యావరణ విధానాలను రూపొందిస్తాయనే విశ్వాసం వ్యక్తం చేశారు.
విజ్ఞానాన్ని పంచుకోవాలని, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని, నీటిని పొదుపు చేయడానికి, సంరక్షించడానికి తమని తాము అంకితం చేసుకోవాలని ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉప రాష్ట్రపతి కోరారు. ‘‘జల సంరక్షణతోనే, జన సంరక్షణ, దేశ సంరక్షణ సాధ్యమవుతుంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సుస్థిర పట్టణ నదీ నిర్వహణ (ఎస్‌యూఆర్ఎం) విధానం, ఏఐ/ఎంఎల్ ఆధారిత రిజర్వాయర్ పూడిక నిర్వహణను ప్రారంభించారు. ఇది సాంకేతిక ఆధారితమైన, వాతావరణ పరిస్థితులను తట్టుకొనే జల నిర్వహణ దిశగా వేసిన ముందడుగును సూచిస్తుంది.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సీఆర్ పాటిల్, జలశక్తి శాఖ సహాయ మంత్రులు శ్రీ వీ సోమన్న, శ్రీ రాజ్ భూషణ్ చౌదరి, మంత్రిత్వ శాఖ కార్యదర్శులు శ్రీమతి అర్చనా వర్మ, శ్రీ అశోక్ మీనా, కేంద్ర జల కమిషన్ ఛైర్మన్ శ్రీ అనుపమ్ ప్రసాద్, దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2313592)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16