ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్యాంకింగ్‌ సేవలు అంతరాయం లేకుండా అందేలా చూడాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులకు విజ్ఞప్తి

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2026 7:50PM by PIB Hyderabad

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల మద్దతుతో  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌, ఇతర కొన్ని యూనియన్లు, సంఘాలు రెండు ప్రధాన డిమాండ్ల సాధన కోసం వరుస సమ్మెలకు పిలుపునిచ్చాయి. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయడం, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)ను ఉపసంహరించుకోవడం ఈ రెండు ప్రధాన డిమాండ్లు. యూనియన్లు, సంఘాలు లేవనెత్తిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సమగ్ర చర్చల అనంతరం పీఎల్ఐ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవతో యూనియన్ల  రెండు ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరింది.

దరిమిలా ఇరు పక్షాల మధ్య పరస్పర చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, మిగిలిన అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పలుమార్లు సయోధ్య చర్చలు నిర్వహించింది. ప్రభుత్వం యూనియన్ల రెండు ప్రధాన డిమాండ్లలో ఒకదాన్ని పరిష్కరించడంతో పాటు, నిరంతరం సయోధ్యపూర్వక చర్చలు కొనసాగించినప్పటికీ బ్యాంకులకు ఐదు రోజుల పనివారాన్ని అమలు చేయాలన్న ఏకైక డిమాండ్‌తో యూనియన్లు  సెప్టెంబర్‌ 11న ఒకరోజు సమ్మె చేశాయి. తదుపరి 2026 సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. మళ్ళీ  26 - 10- 2026 నుంచి నిరవధిక సమ్మెకు ప్రతిపాదించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్థిక సమ్మిళితం, డిజిటల్‌ బ్యాంకింగ్‌, ఆర్థిక అక్షరాస్యత, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవల విస్తరణలో ఇవి ముందంజలో ఉన్నాయి. సమాజంలోని ప్రతి వర్గానికీ ఆర్థిక సేవలు అందేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ఈ పాత్రను గుర్తించి, బలమైన బ్యాంకింగ్ వ్యవస్థకు ఉత్సాహపూరితమైన, భద్రత కలిగిన, సమర్థవంతమైన సిబ్బంది అత్యవసరమని అంగీకరిస్తూ... బ్యాంక్ ఉద్యోగుల పని వాతావరణం, పారదర్శకత, సంక్షేమాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. వాటిలో ప్రధానమైనవి:

  •   అన్ని కేడర్లకు కొత్త వేతన స్కేళ్లను నిర్ణయించడంతో పాటు వేతనాలు, భత్యాల పెంపు.

  •  ప్రభుత్వ రంగ బ్యాంకులలో పని చేస్తున్న,  రిటైర్ అయిన  ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల (ఆరోగ్య సంబంధిత ఖర్చులు, క్యాంటీన్ సబ్సిడీలు, క్రీడా, సాంస్కృతిక కార్యకలాపాలు, విద్యకు సంబంధించిన ఆర్థిక సహాయం మొదలైనవి) కోసం బ్యాంకులు కేటాయించే  స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్ డబ్ల్యూఎఫ్) ను 2024 ఆగస్టులో 56% పెంచారు.

  •   అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలలోని ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్యను పెంచారు. 

  • బ్యాంక్ ఉద్యోగుల నియామకాలు గణనీయంగా పెరిగాయి.  2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి  2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 4,82,800మంది ఉద్యోగులను నియమించుకున్నాయి.  గత మూడేళ్లలో నియామకాలు రెట్టింపయ్యాయి. 01.07.2026 నాటికి, 95.84% మంది అధికారులు, 92% మంది సబోర్డినేట్/అవార్డ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

  •   ఉద్యోగాల్లో చేరకముందే వైదొలిగే ధోరణిని తగ్గించడానికి,  బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ఫలితాల ప్రకటనను మరింత క్రమబద్ధీకరించడానికి ఆధార్ ధృవీకరణ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా బ్యాంకింగ్ నియామక ప్రక్రియను మరింత పటిష్టం చేశారు.

  •  సమయానికి ప్రమోషన్లు లభించేలా చూసేందుకు ప్రమోషన్ ప్రక్రియలను మరింత క్రమబద్ధీకరించారు. 

  •   బదిలీలు, పదోన్నతుల సమయంలో ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తూ, ఆన్‌లైన్‌ వేదికలను అభివృద్ధి చేశారు. తద్వారా బదిలీలను స్వయంచాలకంగా, సకాలంలో నిర్వహించేలా బదిలీ విధానాలను మెరుగుపరిచారు.

  •   మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేశారు. రుతుక్రమ సమయంలో సెలవు, సంతానలేమి చికిత్స, రెండో బిడ్డను దత్తత తీసుకోవడం, మృత శిశువు జననం వంటి సందర్భాలకు ఈ ప్రత్యేక సెలవులు వర్తిస్తాయి.

  •   బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులకు అందే ఫ్యామిలీ పెన్షన్‌ను సవరించారు. రాజీనామా చేసిన బ్యాంక్ ఉద్యోగులకు కూడా పెన్షన్ ఎంపిక పొందేందుకు అవకాశం కల్పించారు.

  •   ప్రస్తుత ద్వైపాక్షిక వేతన ఒప్పంద కాలానికి సంబంధించి పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు నెలవారీ ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ప్రవేశపెట్టారు. అలాగే 1986కు ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వారి కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచారు.

  •   రిటైరీలకు సవరించిన వైద్య బీమా: విశ్రాంత ఉద్యోగుల కోసం 'బేస్ పాలసీ' ఆధారంగా సవరించిన వైద్య బీమా పాలసీని ప్రవేశపెట్టారు. 

  •   దివ్యాంగుల రవాణా భత్యం పెంపు: దివ్యాంగులైన ఉద్యోగులకు అందించే రవాణా భత్యాన్ని పెంచారు.

  •   వేతన ఒప్పందాల ప్రక్రియ వేగవంతం: వేతన ఒప్పందాలను పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని మరింత తగ్గించారు.

వేతన ఒప్పందాలను త్వరితగతిన అమలు చేయడానికి,  బ్యాంకు  ఉద్యోగుల వేతనాలు, భత్యాల సవరణ సరైన సమయానికి జరిగేలా చూడటానికి ప్రభుత్వం తొలిసారిగా రాబోయే ద్వైపాక్షిక ఒప్పందం కోసం ముందస్తు చర్చలను ప్రారంభించింది. నవంబర్ 2027 గడువు కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకింగ్ రంగం మరింత సమర్థవంతంగా పనిచేసేలా వ్యవస్థాగత చట్రాన్ని బలోపేతం చేస్తూనే, బ్యాంక్ ఉద్యోగుల సంక్షేమం,  వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి ఉన్న నిరంతర కట్టుబాటుకు ఈ చర్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా, ఈ చర్యలు గత కొన్ని సంవత్సరాలుగా మెజారిటీ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

బ్యాంకింగ్ సేవలు ప్రతి పౌరుడి రోజువారీ జీవితంతో ముడిపడి ఉన్నందున ఆ సేవల నిరంతరాయ లభ్యత ప్రజల సాధారణ జీవనంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. బ్యాంక్ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం 2015లోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి నెల 2వ, 4వ శనివారాలను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించిన విషయం విదితమే. ఇక మిగిలిన శనివారాలు ప్రజలు బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందడానికి ఇప్పటికీ ఒక ముఖ్యమైన అవకాశంగా ఉపయోగపడుతున్నాయి.

2026 సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు ప్రతిపాదించిన మూడు రోజుల సమ్మె కాలం సెప్టెంబర్‌ 30న బ్యాంకుల అర్ధవార్షిక ఖాతాల ముగింపు ప్రక్రియతో కూడా ముడిపడి ఉంది. ఖాతాల సర్దుబాటు ప్రక్రియ, కేటాయింపులు, ట్రెజరీ, మార్కెట్‌ కార్యకలాపాల పరంగా సెప్టెంబర్‌ 30 ఎంతో ప్రాధాన్యమైన తేదీ. ఇలాంటి సమయంలో వారాంతపు సెలవులతో కలిసి సమ్మె జరగడం వల్ల, ఆర్థిక వ్యవహారాల పరంగా ఎంతో కీలకమైన సమయంలో బ్యాంకింగ్ సేవలు వరుసగా ఐదు రోజుల పాటు పూర్తిగా స్తంభించిపోతాయి. దీని వలన ఖాతాదారులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ లావాదేవీలు, అంతర్జాతీయ బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.

ప్రభుత్వం చేపట్టిన నిరంతర చర్యలు, బ్యాంకు యాజమాన్యాలు, ఉద్యోగులు ఏళ్లుగా అందించిన క్రియాశీలక సహకారం వల్ల ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యంత సుదృఢమైన, ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నాయి. బ్యాంకులు, వాటి ఉద్యోగులు,  సేవలు పొందే పౌరులందరి ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా ఈ విజయాన్ని నిలబెట్టుకోవడం, మరింతగా ముందుకు తీసుకెళ్లడం ఎంతైనా అవసరం. సమ్మెలు లేదా ఏ రూపంలోనైనా విధులకు అంతరాయం కలిగించడం వల్ల బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.

సమ్మెల వల్ల బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలగడమే కాకుండా బ్యాంకు వ్యాపార లావాదేవీలకు విఘాతం ఏర్పడి  అంతిమంగా బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలకే నష్టం చేకూరుతుంది. సమ్మెల ద్వారా సాధించే ప్రయోజనకరమైన ఫలితమేమీ ఉండదు. బ్యాంకు ఉద్యోగుల సంక్షేమం, శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి సహేతుకమైన ఆందోళనలను, సమస్యలను నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కరించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంది.

యూనియన్లు లేవనెత్తిన చాలా సమస్యలను గణనీయంగా పరిష్కరించిన నేపథ్యంలో, మిగిలిన డిమాండ్‌పై పరిశీలన కొనసాగుతున్నందున, బ్యాంకింగ్‌ సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం చొరవతో చర్యలు చేపడుతున్నందున బ్యాంకు ఉద్యోగులు సమ్మెలకు దూరంగా ఉండాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని, బ్యాంకింగ్‌ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

 

***


(రిలీజ్ ఐడి: 2313465) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Malayalam