వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 అక్టోబర్ 20 నుంచి అమల్లోకి రానున్న భారత్–న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం


భారత్–న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ద్వైపాక్షిక వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడుల సంబంధాలకు కొత్త ఊపు: వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌



తొలి రోజు నుంచే న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులపై 100 శాతానికి సుంకం మినహాయింపు



వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఇంజినీరింగ్‌ వస్తువులు, వ్యవసాయ-ఆహార శుద్ధి ఉత్పత్తులకు సుంకం లేని మార్కెట్‌తో వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు ప్రయోజనాలు



ఉపాధి, పెట్టుబడులు, కార్మికుల చలనశీలత పెరగడంతో భారత యువత, మహిళలు, రైతులు, ఎంఎస్‌ఎంఈలకు కొత్త అవకాశాలు

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2026 7:01PM by PIB Hyderabad

వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య రంగంలో కీలక ముందడుగుగా భారత్–న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) 2026 అక్టోబర్‌ 20 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంపై 2026 ఏప్రిల్ 27న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి శ్రీ టాడ్ మెక్‌క్లే సంతకాలు చేశారు.

 

నేడు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌, న్యూజిలాండ్‌ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి శ్రీ టాడ్‌ మెక్‌క్లే వర్చువల్‌ సమావేశం ద్వారా చర్చించారు. ఇరు దేశాల్లో అంతర్గత ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో ఒప్పందం అమల్లోకి వచ్చే తేదీని ప్రకటించారు. న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ ఈ ఒప్పందానికి సంబంధించిన చట్టాన్ని 2026 సెప్టెంబర్‌ 16న ఆమోదించింది.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్‌, న్యూజిలాండ్‌ తమ ద్వైపాక్షిక సంబంధాలను నిరంతరం మరింతగా విస్తరిస్తూ, బలోపేతం చేస్తున్నాయి.  2026 జూలైలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూజిలాండ్‌లో పర్యటించారు. నాలుగు దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపునిచ్చింది. భారత్–న్యూజిలాండ్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాల్సిన ప్రాధాన్యతను కూడా ఈ పర్యటన తెలియజేసింది. ఈ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరో కీలక స్థాయికి తీసుకెళ్తూ భారత్‌, న్యూజిలాండ్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. అలాగే రాబోయే నాలుగేళ్లలో సహకారానికి మార్గనిర్దేశం చేసే ఉమ్మడి విధానంగా ‘భారత్–న్యూజిలాండ్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం: 2030 దిశగా కార్యాచరణ ప్రణాళిక’ను ఆమోదించాయి. 2030 నాటికి వస్తువులు, సేవల్లో ద్వైపాక్షిక మొత్తం వాణిజ్యాన్ని రెండింతలు చేసి 7 బిలియన్‌ న్యూజిలాండ్‌ డాలర్లకు (సుమారు రూ.35,000 కోట్లు) పెంచాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కూడా నిర్దేశించాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడం ద్వారా ‘2030 దిశగా కార్యాచరణ ప్రణాళిక’లోని వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను స్పష్టమైన ఆర్థిక ఫలితాలుగా మార్చేందుకు కీలకమైన ఊతం లభించనుంది.

 

ఈ మైలురాయి ప్రాధాన్యతను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ వివరిస్తూ.. “భారత్–న్యూజిలాండ్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వైపాక్షిక భాగస్వామ్యానికి కొత్త ఊపునిస్తుంది. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య మరింత సమన్వయాన్ని పెంపొందిస్తుంది. భారీ స్థాయి ఉత్పత్తి ద్వారా లభించే ప్రయోజనాలను అందుబాటులోకి తెస్తుంది. మొత్తం పోటీతత్వాన్ని పెంచేందుకు దోహదపడుతుంది” అని అన్నారు. ఎంచుకున్న తేదీ ప్రాధాన్యతను వివరించారు.  “భారత్–న్యూజిలాండ్‌ ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చే తేదీగా పవిత్రమైన దసరా–విజయదశమి రోజును ఎంచుకున్నాం. ఈ ఒప్పందం అమల్లోకి రావడం ద్వారా మన వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడుల సంబంధాల మధ్య ఉన్న అన్ని అవరోధాలు తొలగిపోతాయని, ఇరు దేశాల ప్రజలకు సుసంపన్నత చేకూరుతుందని నేను విశ్వసిస్తున్నాను” అని అన్నారు. 

 

న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి శ్రీ టాడ్‌ మెక్‌క్లే మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి, పెరుగుతున్న సుంకాల నేపథ్యంలో భారత్–న్యూజిలాండ్‌ ఎఫ్‌టీఏ విశ్వాసాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడం ద్వారా కేవలం తొమ్మిది నెలల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒప్పందాల్లో ఒకదాన్ని రూపొందించామని, ఇది ఇరు దేశాల్లోని వ్యాపారాలు, భాగస్వామ్య వర్గాలకు స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ప్రజల మధ్య సంబంధాలు, సంస్కృతి, క్రీడలు, వ్యాపారం, పెట్టుబడులు వంటి మరిన్ని రంగాల్లో ఇరు ప్రభుత్వాలు సహకరించేందుకు ఈ ఒప్పందం ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల్లో వ్యాపారాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి, మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు కలిసి పనిచేస్తామని తెలిపారు.

 

ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే న్యూజిలాండ్‌కు భారత్‌ చేసే 100 శాతం ఎగుమతులకు సంబంధించిన ప్రతి టారిఫ్‌ లైన్‌పై సుంకాలు పూర్తిగా తొలగిపోతాయి. తద్వారా న్యూజిలాండ్‌ ఇతర వాణిజ్య భాగస్వాములకు లభిస్తున్న సమాన అవకాశాలు భారత పరిశ్రమకు కూడా లభిస్తాయి. దేశవ్యాప్తంగా జీవనోపాధికి కీలకమైన వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్‌ వస్తువులు, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల రంగాలు తక్షణ ప్రయోజనం పొందనున్నాయి. న్యూజిలాండ్‌లో గరిష్ఠంగా 10 శాతం వరకు ఉన్న సుంకాలు తొలగిపోనున్నాయి. అలాగే చెక్క దుంగలు, కోకింగ్‌ బొగ్గు, లోహ వ్యర్థాలు వంటి కీలక ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకునే అవకాశం భారతీయ తయారీదారులకు లభిస్తుంది. ఇది ప్రపంచ మార్కెట్లలో భారతీయ పరిశ్రమల పోటీతత్వాన్ని మరింత పెంచనుంది.

 

డెయిరీ ఉత్పత్తులు, గొర్రె మినహా ఇతర జంతువుల మాంసం, కీలక వ్యవసాయ ఉత్పత్తులు, చక్కెర, వంట నూనెలు వంటి సున్నితమైన ఉత్పత్తులను సుంకం రాయితీల పరిధి నుంచి మినహాయించడం ద్వారా భారత రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షించింది. న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్‌, కివీ పండ్లు, మనుకా తేనెకు టారిఫ్‌ రేట్‌ కోటాల ద్వారా నియంత్రిత మార్కెట్‌ ప్రవేశాన్ని కల్పించారు. ఇందులో కనీస దిగుమతి ధర, కాలానుగుణ దిగుమతి వ్యవధులు ఉండటంతో పాటు దేశీయ రైతుల ప్రయోజనాలను పరిరక్షించే భద్రతా చర్యలు కూడా ఉన్నాయి. భారత్‌లో వ్యవసాయ ఉత్పాదకత, నాణ్యత, రైతుల ఆదాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో కివీ పండ్లు, యాపిల్స్‌, తేనెకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో వ్యవసాయ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు వ్యవసాయ ఉత్పాదకత భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం ఏర్పాటు చేస్తోంది. తోటల నిర్వహణ, కోత అనంతర విధానాలు, సరఫరా వ్యవస్థలు, ఆహార భద్రత, సుస్థిర తేనెటీగల పెంపకం వంటి రంగాల్లో అత్యుత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యాల మార్పిడికి వీలుగా అత్యుత్తమ నైపుణ్య కేంద్రాలు  ఏర్పాటు చేయనున్నారు. మార్కెట్‌ ప్రవేశంతో పాటు వ్యవసాయ ఉత్పాదకత భాగస్వామ్యం కింద న్యూజిలాండ్‌ చేపట్టే సహకార కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయో లేదో సంయుక్త వ్యవసాయ ఉత్పాదకత మండలి పర్యవేక్షిస్తుంది.

 

భారత్‌కు పెట్టుబడుల పరంగా మరింత విస్తృత ప్రయోజనాలకు కూడా ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది. భారత్‌లో 20 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులను సులభతరం చేసేందుకు న్యూజిలాండ్‌ నిబద్ధతను ప్రకటించింది. న్యూజిలాండ్‌ నుంచి వచ్చే ఈ పెట్టుబడులు భారత వ్యవసాయం, తయారీ, మౌలిక సదుపాయాలు, అంకుర సంస్థలకు ప్రయోజనం చేకూర్చనున్నాయి.

 

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత సేవల రంగానికి ఈ ఒప్పందం మరింత బలమైన వేదికను అందిస్తుంది. దీని ద్వారా భారత కంపెనీలు, నిపుణులు న్యూజిలాండ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించి తమ అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశం లభిస్తుంది. ఐటీ, వృత్తిపరమైన సేవలు, ఆడియో-విజువల్‌, నిర్మాణం, పర్యాటకం తదితర సుమారు 118 రంగాలకు మార్కెట్‌ ప్రవేశం లభించనుంది. దాదాపు 139 ఉపరంగాల్లో అత్యంత అనుకూల దేశ హోదాను కూడా ఈ ఒప్పందం ఖరారు చేస్తుంది. నైపుణ్యం కలిగిన భారతీయులకు ప్రత్యేకంగా 5,000 తాత్కాలిక ఉద్యోగ ప్రవేశ వీసాల కోటా, అలాగే భారత యువతకు ప్రతి సంవత్సరం 1,000 వర్కింగ్‌ హాలిడే వీసాలు అందించడం ద్వారా వృత్తిపరమైన చలనం కోసం కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ ఒప్పందం విద్యార్థుల చలనశీలతపై పరిమితి లేకుండా అవకాశం కల్పించడంతో పాటు, ఎస్‌టీఈఎం విభాగాల్లో పట్టభద్రులకు చదువు పూర్తయిన తర్వాత గరిష్ఠంగా మూడేళ్లపాటు, డాక్టరేట్‌‌ స్కాలర్‌లకు నాలుగేళ్లపాటు పని చేసే హక్కులను కల్పిస్తుంది.

 

భారత్‌కు చెందిన ఔషధాలు, వైద్య పరికరాల ఎగుమతిదారులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రయోజనం లభించనుంది. అమెరికా ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్‌ఆర్‌ఏ, హెల్త్‌ కెనడా వంటి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత కలిగిన నియంత్రణ సంస్థలు ఇచ్చే తనిఖీ ఆమోదాలను న్యూజిలాండ్‌ ఇకపై అంగీకరించనుంది. దీంతో సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న నిరీక్షణ సమయం తగ్గి, న్యూజిలాండ్‌ మార్కెట్‌లోకి భారతీయ ఉత్పత్తుల ప్రవేశం వేగవంతం కానుంది.

 

2025–26లో ఇరు దేశాల మధ్య వస్తువుల ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పటికే సుమారు 1.1 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరుకుంది. భారత్–న్యూజిలాండ్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడం ద్వారా రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు మరింత నిర్ణయాత్మక ఊతం లభించనుంది. వికసిత్‌ భారత్‌ @2047 దార్శనికతకు అనుగుణంగా కుదిరిన ఈ ఒప్పందం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో భారత్‌ విస్తరిస్తున్న భాగస్వామ్యాలకు మరో నిదర్శనంగా నిలుస్తుంది. రైతులు, మహిళలు, యువత, చేతివృత్తుల కళాకారులు, ఎంఎస్‌ఎంఈలను ఈ భాగస్వామ్యాల ప్రయోజనాల్లో ప్రధాన భాగస్వాములుగా నిలబెడుతూ ఈ ఒప్పందం రూపొందింది.

 

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ అధికారిక ఫ్యాక్ట్‌ షీట్‌ లింకు: https://www.commerce.gov.in/files/2026-04/final_0.pdf

 

తరచుగా అడిగే ప్రశ్నల లింకు: https://www.commerce.gov.in/files/2026-04/FAQs%20-%20India-New%20Zealand%20FTA.pdf

 

 

భారత్-న్యూజిలాండ్ ఎఫ్ఒ‌టీఏ ఒప్పంద సంతకం వివరాల లింకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2255914&reg=3&lang=1

 

 

***


(రిలీజ్ ఐడి: 2313260) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Malayalam