పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని జైపూర్‌లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సును ప్రారంభించిన కేంద్ర పర్యావరణశాఖ మంత్రి


స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ, సహజీవనంపై ప్రపంచవ్యాప్త చర్యలకు పిలుపునిచ్చిన శ్రీ భూపేందర్ యాదవ్

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2026 2:12PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని జైపూర్‌లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (ప్రపంచ పర్యావరణ పరిరక్షణ నిధి-డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పరిరక్షణ సదస్సును కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అదనపు జనరల్ (వన్యప్రాణులు) శ్రీ రమేష్ పాండే, రాజస్థాన్ ప్రభుత్వ అటవీ దళ అధిపతి, ప్రధాన అటవీ సంరక్షణాధికారి శ్రీ అరిజిత్ బెనర్జీ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంతర్జాతీయ విభాగ ప్రధాన పర్యావరణ పరిరక్షణ అధికారి శ్రీ దౌదీ సాంబ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ భారత్ సీఈఓ శ్రీ రవి సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

100కుపైగా దేశాల నుంచి సదస్సుకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రసంగిస్తూ.. ప్రకృతి పరిరక్షణ, మానవ-జీవుల ఘర్షణ రహిత మనుగడ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. సమాజంగా మళ్లీ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిలవాలని.. పర్యావరణ పరిరక్షణలో సాధిస్తున్న పురోగతితో ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటూస్పష్టమైన దిశానిర్దేశంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వన్యప్రాణుల పరిరక్షణలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను శ్రీ యాదవ్ వివరించారు. గత దశాబ్ద కాలంలో రక్షిత ప్రాంతాల సంఖ్య సుమారు 750 నుంచి 1,000కు పైగా పెరిగిందని తెలిపారుపులుల అభయారణ్యాల సంఖ్య 47 నుంచి 58కు, ఏనుగుల అభయారణ్యాల సంఖ్య 30 నుంచి 33కు పెరిగిందని చెప్పారు. రామ్‌సర్‌ సైట్లు (చిత్తడి నేలలు) సంఖ్య 24 నుంచి 101కు పెరిగిందని పేర్కొన్నారుప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో దేశంలో చిరుతలను తిరిగి తీసుకువచ్చిన కార్యక్రమ విజయాన్ని కూడా ఆయన వివరించారు.

దేశంలో వన్యప్రాణులు, విభిన్న జాతుల సంరక్షణ  కేవలం రాజ్యాంగబద్ధమైన బాధ్యత మాత్రమే కాదని, అది మన సంస్కృతిలో భాగమని కేంద్రమంత్రి తెలిపారు. ఆధునిక రక్షిత ప్రాంతాల చట్టాలు ఏర్పడటానికి ముందే మన జీవన విధానంలోనే పర్యావరణ రక్షణ దాగి ఉందన్నారు. వన్యప్రాణుల రక్షణను ఒకవైపు ప్రభుత్వ బాధ్యతగా, మరోవైపు ప్రతి పౌరుడి ప్రాథమిక విధిగా భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్లు తెలిపారు. అయితే ఈ అధికారిక వ్యవస్థ మన ప్రాచీన జీవన సంస్కృతిపైనే ఆధారపడి ఉందన్నారుభారత్ సీఐటీఈఎస్, సీఎంఎస్, సీబీడీ, రామ్‌సర్ ఒప్పందాల్లో కీలక భాగస్వామిగా ఉందని చెప్పారు. పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు, ఆసియా సింహాల సంఖ్యను పునరుద్ధరించడంలో భారత్ సాధించిన ఫలితాలు, నిరంతర రాజకీయ సంకల్పంతో ఎలాంటి విజయాలను సాధించవచ్చో నిరూపించిందన్నారు

శాస్త్రీయ పరిశోధనలు, పర్యవేక్షణ వ్యవస్థలు దేశంలో పరిరక్షణ రంగంలో విజయాలు సాధించడానికి ఎలా దోహదపడ్డాయో కేంద్ర మంత్రి ప్రస్తావించారు. పులులు, ఏనుగులు, డాల్ఫిన్లు, సింహాలు, మంచు చిరుతలు జంతువుల సంఖ్యను దేశవ్యాప్తంగా శాస్త్రీయంగా అంచనా వేయడం ద్వారా వాటి నివాస ప్రాంతాలను మెరుగుపరచడం, వన్యప్రాణుల సంచార మార్గాలను రక్షించడం, భారీ జంతువుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని అవలంబించడం వంటి అంశాలపై కీలక సమాచారం లభించిందని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లో అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (జీఐబీ) పక్షుల సంరక్షణ కోసం చేపట్టిన సంతానోత్పత్తి కార్యక్రమం విజయవంతమవ్వడాన్ని కేంద్రమంత్రి వివరించారు. ‘ఓరాన్’గా పిలిచే పవిత్ర వనాలను స్థానిక ప్రజలే స్వచ్ఛందంగా పరిరక్షించుకోవడం ద్వారా భూసార సమతుల్యతను కాపాడటానికి ఎంతగానో తోడ్పడుతోందని తెలిపారు

అడవులు, చిత్తడి నేలలతోపాటు గడ్డిభూముల పరిరక్షణ కూడా అత్యంత ఆవశ్యకమని శ్రీ యాదవ్ చెప్పారు. గడ్డిభూములపై ఆధారపడే భారీ శాకాహార జంతువుల సంరక్షణకు  భారత్ అనుసరిస్తున్న విధానాలను ఆయన తెలియజేశారు. ఒంటికొమ్ము ఖడ్గమృగాలు, అడవి దున్నల సంరక్షణకు ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టులను వివరించారు. వన్యప్రాణి సంరక్షకులందరూ కేవలం చర్చలకే పరిమితం కాకుండా.. సాధించిన విజయాల నుంచి నేర్చుకుంటూ, సమర్థవంతమైన ఫలితాలను ఇచ్చే విధానాలను కార్యాచరణలోకి తీసుకురావడానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిస్తూ కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

***


(రిలీజ్ ఐడి: 2313056) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil , Kannada