వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దక్షిణాది ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో రాష్ట్రాల నిబద్ధతపై కాలపరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

తిని సమావేశాలు పెట్టుకొని కూర్చోవటం కాదు… మనం ఫలితాలను సాధించి తీరాలి. లేకపోతే ప్రజలను మోసం చేసినట్లే: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్రం, రాష్ట్రాలు, శాస్త్రవేత్తలు, రైతులు అందరూ ఒకే వ్యవసాయ బృందం.. వ్యవసాయాన్ని మార్చేందుకు మనం కలిసి పనిచేయాలి: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

గడువులోగా రైతు ఐడీ, అగ్రిస్టాక్ పనులు పూర్తి కావాలి.. ఏ రాష్ట్రం కూడా వెనుకబడి ఉండకూడదు: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌

పరిశోధనలు ల్యాబ్ నుంచి ల్యాండ్‌కు, నేరుగా రైతులకు చేరాలి.. భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణగా (ఫుడ్ బాస్కెట్‌) ఎదగాలి: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

13 ప్రాంతీయ భాషల్లో రైతులకు చేరువకానున్న 'భారత్ విస్తార్'.. సెప్టెంబర్ 28–29 తేదీల్లో ఢిల్లీలో రబీ సదస్సు: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2026 8:07PM by PIB Hyderabad

హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగించారు. రాష్ట్రాలు తమ వ్యవసాయ లక్ష్యాలు, నిబద్ధతలను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆయన కోరారు. రోజంతా జరిగిన చర్చల్లో గుర్తించిన ఆచరణాత్మక అంశాలపై రాష్ట్రాలు గట్టిగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ సదస్సు కేవలం చర్చలకే పరిమితం కాకుండా స్పష్టమైన చర్యలు, కొలవదగిన ఫలితాలకు దారితీయాలని ఆయన ప్రధానంగా చెప్పారు. "కేంద్రం, రాష్ట్రాలు ఒకే వ్యవసాయ బృందం. మన శాస్త్రవేత్తలు, మన రైతులు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు అందరూ కలిసి ఒకే వ్యవసాయ బృందంగా ఏర్పడ్డారు. మనం కలిసికట్టుగా పనిచేయాలి" అని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. సదస్సులో రాష్ట్రాలు చేసిన ప్రతిజ్ఞలు, ఇచ్చిన హామీలు నెరవేరాలని ఆయన స్పష్టం చేశారు. లేకపోతే ఈ సదస్సు మొత్తానికి అర్థం లేకుండా పోతుందని అన్నారు. డిసెంబర్ నాటికి రైతు ఐడీ సృష్టించటం పూర్తి చేస్తామని ఏదైనా రాష్ట్రం హామీ ఇస్తే ఆ గడువును కచ్చితంగా పాటించి తీరాల్సిందేనని ఆయన తెలిపారు. ప్రతి అంశంపై మళ్లీ మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదని.. తీసుకున్న నిర్ణయాలపై తక్షణ చర్యలు తీసుకోవడమే అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

 

లక్ష్యం ఫలితాలే.. కేవలం సమావేశాలు కాదు

ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకపోతే ఈ సదస్సుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. "మనం ఒక రోజు వచ్చి తిని సమావేశమై కూర్చొని ఆ తర్వాత ఏమీ చేయకపోతే అది ప్రజలను మోసగించడమే అవుతుంది. మనం అలా ఉండకూడదు. మనం ఫలితాలను సాధించి తీరాలి" అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో పనిచేస్తున్న వ్యవసాయ బృందాలపై పూర్తి విశ్వాసం ఉన్నట్లు తెలిపిన ఆయన.. ఈ రంగంలో అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి అన్ని స్థాయిలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. "గొడవ చేయడం నా ఉద్దేశం కాదు. పరిస్థితిని మార్చాలన్నదే నా కోరిక. మనం వ్యవసాయ రూపురేఖలను మారుస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. తమ వ్యవసాయ అవగాహన కార్యక్రమాలకు రాష్ట్రాలు ఏ తేదీలను ఖరారు చేసినా కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకేలు) నిపుణులు వస్తారని 'వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్' సమయంలో ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు. శాస్త్రవేత్తలు గ్రామాలు-వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులతో కలిసి కూర్చొని రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో చర్చలు జరుపుతారు. వ్యవసాయ పరిశోధనలకు, రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేయటమే దీని ముఖ్య ఉద్దేశం.

 

రైతు ఐడీ, అగ్రిస్టాక్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచన

రైతు ఐడీల తయారీలో సాధించిన పురోగతి గురించి మాట్లాడుతూ.. అగ్రిస్టాక్ ప్రాముఖ్యతను రాష్ట్రాలు అర్థం చేసుకొని ఉంటాయని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రైతు ఐడీని సృష్టించటంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు 75 శాతానికి పైగా పూర్తి చేశాయని ఆయన తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో జియో-రెఫరెన్సింగ్ పనుల్లో కూడా మంచి పురోగతి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు డిజిటల్ పంట సర్వేను పూర్తి చేశాయని ఆయన తెలియజేశారు. కేరళ, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు మాత్రం ఫార్మర్ ఐడీని సృష్టించే పనులను మరింత వేగవంతం చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే సంవత్సరాల్లో అనేక వ్యవసాయ వ్యవస్థలు దీనిపైనే ఆధారపడి ఉంటాయని.. కాబట్టి గడువులోగా రైతు ఐడీ పనులు పూర్తి కావాలని ఆయన చెప్పారు. "ఏ రాష్ట్రం కూడా వెనుకబడి ఉండకూడదని నేను ఆశిస్తున్నాను" అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

 

భూమి రికార్డులు, రైతు రిజిస్ట్రీ అనుసంధానం కావాలి

భూముల వివరాలు ఇంకా అనుసంధానించని రాష్ట్రాలు.. ముఖ్యంగా తమిళనాడు, కేరళ త్వరితగతిన ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి ఆదేశించారు. కేరళలో భూ రికార్డుల డేటాకు, రైతు రిజిస్ట్రీకి మధ్య సరైన సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. కౌలు రైతులు, భాగస్వామ్యంలో పంట సాగు చేసే వారు, వ్యవసాయ కౌలుదారుల కోసం ప్రామాణిక కార్యచరణ విధానాలను (ఎస్ఓపీలు) రూపొందించి నోటిఫై చేయాలని దక్షిణాది రాష్ట్రాలను ఆయన కోరారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు ఈ విషయంలో తక్షణమే పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పుదుచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలు గ్రామ పటాల జియో-రెఫరెన్సింగ్ పనులను వెంటనే చేపట్టాలని ఆయన ఆదేశించారు.

 

13 ప్రాంతీయ భాషల్లో రైతులకు చేరువకానున్న 'భారత్ విస్తార్'

రైతులు ప్రతిరోజూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని.. ప్రతి సమస్యపై సలహా కోసం వారు వేర్వేరు కార్యాలయాలకు తిరగాలని ఆశించలేమని శ్రీ శివరాజ్ సింగ్‌ చౌహాన్ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మొబైల్ ఫోన్ ద్వారా రైతులకు తగిన సలహాలు అందేలా 'భారత్ విస్తార్' వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉన్న దీనిని తಮಿళం, తెలుగు, కన్నడ, మలయాళంతో సహా 13 ప్రాంతీయ భాషలకు విస్తరించనున్నారు. రైతులు సొంత భాషలో ప్రశ్నలు అడగటంతో పాటు అదే భాషలో సమాధానాలను పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి తెలుగులో మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ.. సొంత భాషలో భావాలను వ్యక్తపరచడం వల్ల సమాచార మార్పిడి మరింత కచ్చితంగా, ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. "రైతులకు వారి సొంత భాష బాగా అర్థమవుతుంది. అందుకే ఈ వ్యవస్థకు సంబంధించిన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మనం రాష్ట్రాలతో కలిసి పనిచేయాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా వీలైనంత త్వరగా 'భారత్ విస్తార్'తో అనుసంధానించాలని ఆయన కోరారు.

 

పరిశోధనలు ల్యాబ్ నుంచి ల్యాండ్‌కు నేరుగా రైతులకు చేరాలి

సౌలభ్యాన్ని బట్టి 15 లేదా 20 రోజుల వ్యవసాయ అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్రాలు ప్రణాళిక వేసుకోవచ్చని.. ఇవి చేపడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాస్త్రవేత్తలు ఆయా రాష్ట్రాలను సందర్శిస్తారని కేంద్ర మంత్రి అన్నారు. ఐకార్ సంస్థలు, కేవీకేలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల పాత్ర గురించి మాట్లాడుతూ.. "మన వద్ద 16,000 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు" అని ఆయన తెలిపారు. కేవలం పరిశోధనలు నిర్వహించడం కోసమే కాకుండా ఆ పరిశోధనల ఫలితాలు రైతులకు చేరేలా చూసేందుకు కూడా ఈ సంస్థలు ఏర్పాటయ్యాయని ఆయన పేర్కొన్నారు. "రైతులు, శాస్త్రవేత్తలు కలిసి కూర్చునే వరకు, పరిశోధనలు రైతులకు చేరే వరకు ఇది ఆగకూడదు. పరిశోధనలు ల్యాబ్ నుంచి ల్యాండ్‌కు కదిలి వెళ్లాలి" అని ఆయన చెప్పారు.

 

భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి వ్యవసాయ దేశంగా ఎదగాలి

వ్యవసాయ రంగంలో భారత్‌ను ప్రపంచ నాయకత్వ దేశంగా తీర్చిదిద్దడానికి పూర్తి అంకితభావం, నిజాయితీతో పనిచేయాలని కోరుకుంటున్నట్లు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. "మనం భారతదేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా(ఫుడ్ బాస్కెట్) మార్చాలి. ఇది సాధ్యమే. ఇది అసాధ్యం కాదు. ఇది కచ్చితంగా జరుగుతుంది. అయితే దీనికోసం మనందరం కలిసి పనిచేయాలి" అని ఆయన పేర్కొన్నారు. భారతీయ వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయన్న ఆయన.. ఈ రంగంలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడానికి మరింత మార్పులు తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.

 

సెప్టెంబర్ 28–29 తేదీల్లో ఢిల్లీలో రబీ సదస్సు

సెప్టెంబర్ 28, 29 తేదీలలో ఢిల్లీలోని పూసా ఇనిస్టిట్యూట్‌లో రబీ సదస్సును నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, అధికారులు తమతమ బృందాలతో కలిసి ఈ సదస్సుకు హాజరకానున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల రబీ సీజన్‌కు సంబంధించిన వివరణాత్మక ప్రణాళికలను ఇక్కడ చర్చిస్తారు. రబీ సీజన్‌లో వేయాల్సిన పంటలు, ప్రతి పంట కిందకు తీసుకురావాల్సిన విస్తీర్ణంపై ఈ సదస్సులో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ప్రణాళికల ఆధారంగా విత్తనాల లభ్యత, ఎరువుల అవసరాలు, ఇతర ముఖ్యమైన వనరులను అంచనా వేసి తదుపరి సన్నాహాలు చేస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2312458) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam