గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్టోబర్‌ 2026 నుంచి డీడీయూ–జీకేవై 2.0 శిక్షణ బ్యాచ్‌లను ప్రారంభించనున్న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ


ఈ కార్యక్రమం కింద నైపుణ్య శిక్షణ ప్రారంభించనున్న 34,920 మంది గ్రామీణ యువత

నాడు పోస్టు చేయడమైనది: 19 SEP 2026 9:49AM by PIB Hyderabad

   అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో  2026 అక్టోబర్‌ నుంచి దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ–గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై) 2.0 శిక్షణ బృందాలను ప్రారంభించేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సిద్ధమైంది. శిక్షణ బ‌ృందాల ప్రారంభానికి సంబంధించిన సన్నద్ధతపై తొలి దశలో 14 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్ష నిర్వహించారు.  అవి ఒడిశా, మిజోరం, సిక్కిం, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, బిహార్‌.

 

ఈ 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2026 అక్టోబర్‌లో 34,920 మంది గ్రామీణ యువతతో కూడిన 1,164 శిక్షణ బ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. 2027 డిసెంబర్‌ 31 నాటికి ఈ 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 3,57,112 మంది గ్రామీణ యువతకు శిక్షణ అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. డీడీయూ-జీకేవై 2.0 వేదిక ప్రకారం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 1,200కు పైగా ప్రాజెక్టులకు 5.6 లక్షల శిక్షణ లక్ష్యాలను కేటాయించారు. ఇతర రాష్ట్రాలు లక్ష్యాల కేటాయింపు ప్రక్రియలో తుది దశలకు చేరుకున్నాయి. దశలవారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు శిక్షణ బ్యాచ్‌ల ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయనున్నాయి.

 

 డీడీయూ-జీకేవై 2.0 కోసం సన్నద్ధత 

డీడీయూ-జీకేవై పేద గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలతో కూడిన నైపుణ్య శిక్షణ అందించే కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ శిక్షణ వ్యవధి 3 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. డీడీయూ-జీకేవై 2.0 అమలుకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సన్నద్ధతను సమావేశంలో సమీక్షించారు. 2026–28 రెండేళ్ల కాలానికి ఈ పథకంలో పాల్గొంటున్న మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శిక్షణ లక్ష్యాలను కేటాయించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టాల్సిన చర్యలకు ఇది కీలక దశ అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్టు అమలు సంస్థలకు (పీఐఏలు) శిక్షణ లక్ష్యాల కేటాయింపును వేగవంతం చేయడంతో పాటు, నిర్దేశించిన కాలపరిమితులకు అనుగుణంగా శిక్షణ బ్యాచ్‌లను ప్రారంభించాలని అమలు చేస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చింది. 

 

శిక్షణ ప్రారంభానికి వీలుగా 2026 అక్టోబర్‌ 31లోగా ప్రాజెక్టు అమలు సంస్థలకు (పీఐఏలు) లక్ష్యాలను కేటాయించేలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సన్నద్ధతలో వివిధ దశల్లో ఉన్నాయి. అమలు చేస్తున్న 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ మంత్రిత్వ శాఖకు అందిన సమాచారం ప్రకారం అర్హులైన గ్రామీణ యువతను సమీకరించేందుకు ఇప్పటికే 5 లక్షలకు పైగా శిక్షణ లక్ష్యాలను పీఐఏలకు కేటాయించారు. చాలా రాష్ట్రాల్లో 2026 అక్టోబర్‌లోనే యువత సమీకరణ, శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంది.

 

సమగ్ర డీడీయూ-జీకేవై 2.0 వేదిక

డీడీయూ-జీకేవై 2.0 సమగ్ర వేదిక ప్రాజెక్టు జీవితచక్రంలోని అన్ని దశలను సమర్థవంతంగా నిర్వహించేలా రూపొందించామని, తద్వారా మరింత సామర్థ్యం, పారదర్శకత, డిజిటల్‌ పర్యవేక్షణకు వీలు కలుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

ఇంకా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ఖజానా వేదికలతో అనుసంధాన ప్రక్రియను సమీక్షించారు. గ్రామీణ కౌశల్య వేదిక ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు సులభతరం చేసేందుకు అవసరమైన అనుసంధాన ప్రక్రియను 2026 సెప్టెంబర్‌ 30లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

 

పీఐఏలకు పూర్తి స్థాయి డిజిటల్‌ వేదికపై అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ 2026 అక్టోబర్‌లో నాలుగు ప్రాంతాల్లో హైబ్రిడ్‌ విధానంలో ప్రాంతీయ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ఈ వర్క్‌షాప్‌లకు కొంతమంది పీఐఏలు భౌతికంగా హాజరయ్యేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. షిల్లాంగ్‌లో 5.10.2026న, విజయవాడలో 7.10.2026న, ముంబైలో 9.10.2026న, ధర్మశాలలో 16.10.2026న ఈ వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాప్‌ల ద్వారా డీడీయూ-జీకేవై 2.0 వేదిక, దాని ప్రక్రియలు, సౌకర్యాలపై పీఐఏలకు అవగాహన కల్పించడంతో పాటు, అమలుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుంది.

 

సమావేశంలో పథకం ఆర్థిక పరిస్థితిని కూడా సమీక్షించారు. సమీక్షలో పాల్గొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2026 అక్టోబర్‌ నుంచి శిక్షణ బ్యాచ్‌లు ప్రారంభం కావడంతో పథకం కింద వ్యయం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి.

 

వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో నైపుణ్యాల విభాగం సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్‌ (స్కిల్స్‌), వివిధ రాష్ట్రాలకు చెందిన సీఈఓలు, సీఓఓలు, ఇతర రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2312456) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada