సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే-2024 అవార్డు
· భారతీయ సినిమాకు చేసిన సేవలు… ఆయన విశిష్ట సినీ ప్రస్థానానికి గుర్తింపుగా పురస్కారం
· ఈ నెల 22న గుజరాత్‌లోని కెవాడియాలో నిర్వహించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో పురస్కార ప్రదానం
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 6:18PM by PIB Hyderabad
కన్నడ సినిమా రంగంలో ప్రముఖ నటుడు శ్రీ అనంత్ నాగ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. గుజరాత్‌లోని కెవాడియాలో ఈ నెల 22న నిర్వహించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కార ప్రదాన వేడుకలో ఆయనను ఈ అవార్డుతో సత్కరిస్తారు. భారతీయ చలనచిత్ర రంగం అభివృద్ధి, పురోగమనంలో ఆయన విశిష్ట కృషికి, అమూల్య సేవల గుర్తింపుగా 2024కుగాను ఎంపిక కమిటీ ఆయన పేరును ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు సిఫారసు చేసింది. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన విశిష్ట సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆయన చలనచిత్ర రంగ ప్రయాణం తరతరాల కళాకారులకు స్ఫూర్తినిచ్చి దేశ సాంస్కృతిక స్వరూపాన్ని సుసంపన్నం చేసింది.
శ్రీ అనంత్ నాగ్ నేపథ్యం
శ్రీ అనంత్ నాగ్ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ తాలూకాలోని షిరాలీ గ్రామంలో 1948 సెప్టెంబరు 4న జన్మించారు. భారత చలనచిత్ర రంగానికి 5 దశాబ్దాలకు పైగా తన బహుముఖ ప్రజ్ఞతో ఆయన చేసిన సేవల ద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధులయ్యారు. మాతృభాష కన్నడంలో ‘సంకల్ప్’ చిత్రంతో నట జీవితానికి శ్రీకారం చుట్టిన ఆయన, హిందీ చిత్రం ‘అంకుర్’తో జాతీయ స్థాయిలో అరంగేట్రం చేశారు. అటుపైన ‘మాల్గుడి డేస్’ వంటి కీలక చిత్రం సహా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళ, తమిళ, మరాఠీ చిత్రసీమలలో 300కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.
శ్రీ అనంత్ నాగ్ 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఐదు కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటుడు అవార్డులు సహా కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు, కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, కర్ణాటక రాష్ట్ర జీవన సాఫల్య పురస్కారం తదితరాలను సాధించారు. బెంగళూరు విశ్వవిద్యాలయం (ఉత్తర) నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. అటుపైన సినీరంగంలో తన 50 ఏళ్ల ప్రస్థానానికి గుర్తింపుగా 2023లో స్వర్ణోత్సవం చేసుకున్నారు.
సినీ రంగంలో రాణించిన శ్రీ అనంత్ నాగ్ 1988-1994 మధ్య కర్ణాటక శాసన మండలి సభ్యుడుగా, 1994-1999 దాకా శాసనసభ్యునిగా ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. ఈ పదవులు నిర్వహించిన సమయంలో ఆయన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ప్రభుత్వం 2025లో ఆయనను ‘పద్మ భూషణ్’ పురస్కారంతో సత్కరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత చలనచిత్ర రంగంలో వినమ్రుడైన బహుముఖ ప్రజ్ఞాశాలిగా శ్రీ అనంత నాగ్ చేసిన చిరస్మరణీయ కృషికిగాను అత్యంత గౌరవనీయ సాంస్కృతిక దిగ్గజాలలో ఒకరుగా నిలిచారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి…
దేశంలో తొలి పూర్తి నిడివి మూకీ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ను 1913లో రూపొందించిన భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే. జాతీయ చలనచిత్ర రంగానికి ఫాల్కే విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1969లో ఆయన పేరిట ప్రవేశపెట్టిన ఈ చలనచిత్ర రంగ అత్యున్నత అవార్డును తొలిసారి నటి దేవికా రాణి అందుకున్నారు. జాతీయ చలనచిత్ర రంగ విస్తృతి, పురోగమనానికి చేసిన కృషికిగాను ఈ పురస్కారానికి చలనచిత్ర రంగంలో ఏటా ఒకరిని ఎంపిక చేస్తారు. ఈ అవార్డు గ్రహీతలకు ‘స్వర్ణ కమల పతకం’, ₹10 లక్షల నగదు బహుమతి ప్రదానంతో పాటు శాలువా కప్పి సత్కారం చేస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2311144)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7