|
ప్రధాన మంత్రి కార్యాలయం
పునరుత్థానం.. ఆవిష్కరణ.. సహకారం.. సుస్థిరత దిశగా అవిరళ కృషి: బ్రిక్స్ న్యూఢిల్లీ తీర్మానం
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2026 6:11PM by PIB Hyderabad
1. బ్రిక్స్ దేశాల నాయకులుగా మేము- “పునరుత్థానం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత దిశగా అవిరళ కృషి” ఇతివృత్తంతో భారత్‌లోని న్యూఢిల్లీలో 2026 సెప్టెంబరు 12, 13 తేదీల్లో నిర్వహించిన బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నాం.
2. పరస్పర గౌరవం, అవగాహన, సార్వభౌమిక సమానత్వం, సంఘీభావం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వజనీనత, సహకారం, ఏకాభిప్రాయాలతో కూడిన బ్రిక్స్ స్ఫూర్తిపై మా నిబద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం. రెండు దశాబ్దాల బ్రిక్స్ ప్రస్థానంలో రాజకీయం-భద్రత, ఆర్థిక-ద్రవ్య, సాంస్కృతిక-ప్రజా సంబంధాలనే మూడు కీలక స్తంభాల కింద బ్రిక్స్ విస్తరిస్తూ వచ్చింది. ఈ మూడు అంశాల ప్రాతిపదికన సహకార బలోపేతం, శాంతి, మరింత ప్రాతినిధ్య సహిత నిష్పాక్షిక అంతర్జాతీయ వ్యవస్థ, పునరుజ్జీవ-సంస్కరణ పూరిత బహుపాక్షిక వ్యవస్థ కోసం కృషి చేస్తాం. అంతేకాకుండా సుస్థిర ప్రగతిని, సార్వజనీన వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా మా ప్రజానీకం ప్రయోజనార్థం మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చిత్తశుద్ధితో విస్తరింపజేస్తామని ప్రతినబూనుతున్నాం.
3. బ్రిక్స్ దేశాల మధ్య సహకార విస్తరణలో భాగస్వామ్య దేశాల విలువైన పాత్రను మేం ప్రశంసిస్తున్నాం. అన్ని దేశాల ప్రయోజనార్థం అంతర్జాతీయ సంఘీభావ, సహకార స్ఫూర్తి బలోపేతంలో వర్ధమాన మార్కెట్లు, పురోమిస్తున్న దేశాలతో బ్రిక్స్ భాగస్వామ్యం కొనసాగింపు మరింత దోహదం చేస్తుందని మా ప్రగాఢ విశ్వాసం. భాగస్వామ్య దేశాలతో సార్వజనీన, పరస్పర ప్రయోజనకర, ప్రగతి ఆధారిత భాగస్వామ్య విస్తృతిపై మా కట్టుబాటును పునరుద్ఘాటిస్తున్నాం. బ్రిక్స్ కార్యక్రమాలలో వారి భాగస్వామ్యం పెంపు, సమష్టి ఆసక్తిగల రంగాల్లో ఆచరణాత్మక సహకారాన్ని కూడా ప్రోత్సహిస్తాం.
4. ప్రస్తుత 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మరింత స్నేహశీలత/బ్రిక్స్ విస్తరణ చర్చలకు ఆతిథ్యమిచ్చిన భారత్‌కు మా అభినందనలు. అంతర్జాతీయ సహకార విస్తృతి, సంఘీభావ బలోపేతం దిశగా ఇది నవ్యోత్తేజమిస్తుంది.
5. బ్రిక్స్ కూటమికి 2026లో భారత్ అధ్యక్షత సందర్భంగా- “పునరుత్థానం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత దిశగా అవిరళ కృషి” ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సదస్సు గణనీయ ప్రగతి సాధించడాన్ని మేం అభినందిస్తున్నాం. సమతుల, ఆచరణాత్మక, కార్యాచరణ సహిత, సార్వజనీన, ప్రగతి-ఆధారిత, ప్రజాకేంద్రక విధానంతో ఉమ్మడి సవాళ్ల పరిష్కారంలో బ్రిక్స్ సహకార విస్తృతిపై మా సమష్టి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తోంది. నేపథ్య ప్రాథమ్యాలపై సహకార విస్తరణ దిశగా... ప్రత్యేకించి సామర్థ్య బలోపేతం, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, సుస్థిర అభివృద్ధి, పునరుత్థాన శక్తి పెంపు తదితరాల ద్వారా మా నిబద్ధతను ప్రస్ఫుటం చేస్తున్నాం.
6. బ్రిక్స్ సహకార చట్రం కింద భారత్‌లోని 30 నగరాల్లో మంత్రులు, ఎంపీలు, వివిధ సంస్థల అధిపతులు, అధికారులు, నిపుణులు, వాణిజ్యవేత్తలు, ప్రజల స్థాయిలో 400కు పైగా సమావేశాలు, గోష్ఠుల నిర్వహణ ప్రశంసనీయం. బ్రిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. సమష్టి పునరుత్థాన సామర్థ్యం పెంపు, ఆవిష్కరణాధారిత ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం, సుస్థిర ప్రగతి కొనసాగింపు, ప్రజల మధ్య ఆదానప్రదానాల బలోపేతం, ప్రపంచ పాలన వ్యవస్థలో అధిక ప్రాతినిధ్యం కోసం బ్రిక్స్ వాణి సశక్తీకరణ వంటి అంశాలలో సాధించిన పురోగతిని సహర్షంగా స్వాగతిస్తున్నాం.
సార్వజనీన ప్రపంచ పాలన - బహుపాక్షికవాద బలోపేతం
7. బ్రిక్స్ 20వ వార్షికోత్సవ చారిత్రక సందర్భంలో ప్రపంచ పాలనలో సంస్కరణ, మెరుగుదల దిశగా మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఇందుకోసం విస్తృత సంప్రదింపులు, ఉమ్మడి సహకారం, భాగస్వామ్య ప్రయోజనాల స్ఫూర్తితో కృషి చేస్తాం. తద్వారా మరింత నిష్పాక్షిక, సమాన, చురుకైన, ప్రభావశీల, సమర్థ, ప్రతిస్పందనాత్మక, ప్రాతినిధ్య, చట్టబద్ధ, ప్రజాస్వామ్య, జవాబుదారీ సహిత అంతర్జాతీయ, బహుపాక్షిక వ్యవస్థను ప్రోత్సహిస్తాం. సమకాలీన వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా అంతర్జాతీయ సంబంధాల ప్రస్తుత స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఈ దృక్కోణంతో బహుపాక్షిక వాదం, బహుళ ధ్రువత్వ బలోపేతానికి పాటుపడతాం. అంతర్జాతీయ చట్టాన్ని దాని మూలస్తంభమైన ఐక్యరాజ్య సమితి నిర్దేశక పత్రం లక్ష్యాలు-సూత్రాలు సహా వాటి సంపూర్ణత, పరస్పర అనుసంధానాన్ని సమతులం, సమ్మిళితంగా సమర్థించడంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. అలాగే, శాంతి-భద్రతల పరిరక్షణ, సుస్థిర ప్రగతి కొనసాగింపు, సార్వజనీన ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛకు ప్రోత్సాహం-రక్షణకు భరోసా ఉండాలి. ఈ క్రమంలో జాతీయ స్థితిగతులు, జాతీయ వ్యవస్థల వైవిధ్యం, పురోగమన మార్గాలను గౌరవిస్తాం. సంఘీభావం, పరస్పర గౌరవం, న్యాయం, సమానత్వ స్ఫూర్తి ప్రాతిపదికగా సహకార విస్తృతికి సార్వభౌమ దేశాలు తోడ్పడే అంతర్జాతీయ వ్యవస్థలో ఐక్యరాజ్య సమితి కీలక పాత్రను కూడా మేం స్పష్టం చేస్తున్నాం. పరస్పర ప్రయోజనకర సహకారం ఆధారంగా అంతర్జాతీయ సమాజం కోసం ఉజ్వల ఉమ్మడి భవిష్యత్తుకు రూపమివ్వడమే దీని అంతిమ లక్ష్యం.
8. అంతర్జాతీయ నిర్ణయాధికార ప్రక్రియలు, రూపకల్పనలో ముఖ్యంగా... ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంత ప్రగతిశీల, వర్ధమాన, అత్యల్ప వర్ధమాన దేశాలకు మరింత ఎక్కువ, అర్థవంతమైన పాత్ర ఉండాలి. ఆ మేరకు వాటికి ప్రాతినిధ్యం కల్పిస్తూ, సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దడంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి సచివాలయంలో, ఇతర అంతర్జాతీయ సంస్థలలో సమాన భౌగోళిక ప్రాతినిధ్యాన్ని సకాలంలో సాధించే దిశగా పిలుపునిస్తున్నాం. ప్రత్యేకించి ఉన్నత, నిర్ణయాధికార స్థాయి సహా, వర్ధమాన దేశాల నిరంతర స్వల్ప ప్రాతినిధ్య సమస్య పరిష్కారం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరాలని మేం ప్రతిపాదిస్తున్నాం. ఆయా సంస్థలలోని అన్ని స్థాయుల సారథ్యం, బాధ్యతలలో మహిళల... ప్రధానంగా వర్ధమాన దేశాల వారి పాత్రను, వాటాను కూడా పెంచాలని కోరుతున్నాం. ఐక్యరాజ్య సమితి కార్యనిర్వాహక అధిపతులు, ఇతర ఉన్నత పదవుల ఎంపిక-నియామక ప్రక్రియ మరింత పారదర్శకం, సార్వజనీన సూత్రాలకు అనుగుణంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ఐక్యరాజ్య సమితి నిర్దేశక పత్రంలోని 101 పరిచ్ఛేదంలోగల నిబంధనలన్నిటికీ తగినట్లుగా ఉండాలన్నది మా అభిమతం. వీలైనత విస్తృత భౌగోళిక ప్రాతిపదికన సిబ్బంది నియామకం, మహిళల భాగస్వామ్యం పెంపుపై తగిన శ్రద్ధ వహించాలని అభిలషిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి వ్యవస్థలోని ఉన్నత పదవులపై ఏదైనా దేశం లేదా రాష్ట్రాల సమూహంలోని పౌరులకు గుత్తాధిపత్యం ఉండరాదనే సార్వత్రిక నియమానికి కట్టుబాటును డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థల కృషిని ఏకపక్షంగా బలహీనపరచడం, వాటి సంబంధిత ఆదేశాల అమలును దెబ్బతీయడం, అంచనా వేసిన విరాళాల ఉద్దేశపూర్వక నిలిపివేత సహా అటువంటి చర్యలను మేం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం.
9. ఐక్యరాజ్య సమితి తదుపరి ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఐరాస నిర్దేశకపత్రంలోని సంబంధిత నిబంధనలను ప్రస్తావిస్తూ, ఈ పదవికి ఏనాడూ ఒక మహిళ ఎన్నిక కాలేదనే వాస్తవాన్ని తేటతెల్లం చేస్తున్నాం. అదే సమయంలో లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల నుంచి కేవలం ఒకరు మాత్రమే లోగడ ఈ పదవికి ఎంపిక కాగా- ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి ఇద్దరు వంతున మాత్రమే ఈ బాధ్యతలను నిర్వర్తించారని మేం గుర్తుచేస్తున్నాం.
10. బహుళ ధ్రువ ప్రపంచ సమకాలీన వాస్తవాల నేపథ్యంలో మరింత నిష్పాక్షిక, సమాన ప్రపంచ పాలన దిశగా వర్ధమాన దేశాలు తమ కృషిని బలోపేతం చేసుకోవడం అత్యంత కీలకమని మా ఏకాభిప్రాయం. ఇందుకోసం ఆ దేశాల మధ్య పరస్పర ప్రయోజనకర సంబంధాల కోసం చర్చలు, సంప్రదింపులను ప్రోత్సహించడంలో అవి ప్రయత్నించాలని సూచిస్తున్నాం. ఈ దేశాలు తమ నిర్మాణాత్మక సామర్థ్యాన్ని పెంకోవడానికి, సార్వత్రిక ప్రయోజనకర, సమ్మిళిత, సుస్థిర, సమాన ఆర్థిక ప్రపంచీకరణ, సహకార ఫలాలను పొందగల అవకాశాలకు బహుళ ధ్రువత్వం తోడ్పడుతుందని మేం అభిప్రాయపడుతున్నాం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పెరుగుదల, ఆర్థిక మాంద్యం విజృంభణ, సాంకేతిక మార్పులు, రక్షణాత్మక చర్యలు, వలస సవాళ్లు, వాతావరణ మార్పులు సహా అంతర్జాతీయ సమాజం గణనీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో సానుకూల మార్పువైపు చోదక శక్తిగా వర్ధమాన దేశాల ప్రాధాన్యాన్ని మేం ప్రస్ఫుటం చేస్తున్నాం. ఈ దేశాల సమస్యలు, ప్రాథమ్యాలపై గళమెత్తడంలోనూ, అంతర్జాతీయ చట్టం ఆధారిత నిష్పాక్షిక, సుస్థిర, సార్వజనీ, ప్రాతినిధ్య, నిలకడైన ప్రపంచ వ్యవస్థను ప్రోత్సహించడంలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని స్పష్టీకరిస్తున్నాం.
11. ఆఫ్రికన్లను జంతువుల్లా వేటాడి, ఆ జాతిని బానిసలుగా మార్చి, అక్రమ రవాణా, వ్యాపారం చేయడం ప్రపంచ మానవాళి పట్ల అత్యంత క్రూర నేరంగా ప్రకటిస్తూ, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) ఆమోదించిన 80/250 తీర్మానాన్ని మేం పూర్తి ఏకాభిప్రాయంతో స్వాగతిస్తున్నాం. అన్ని రూపాలు, వ్యక్తీకరణల్లోని వలస వాదం నిర్మూలన దిశగా 2024 డిసెంబరు నాటి యూఎన్‌జీఏ తీర్మానం 79/115ను తక్షణం సంపూర్ణంగా అమలు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
12. ప్రపంచవ్యాప్తంగా విద్వేష ప్రసంగాల జోరు పెరుగుతుండగా, తప్పుడు-బూటకపు సమాచారం వెల్లువెత్తుతోంది. ఇలాంటి ఆందోళనకర ధోరణులు సహా జాతి వివక్ష, విదేశీయులపై ద్వేషం-అసహనం, మతం-విశ్వాసం లేదా నమ్మకాలపై వివక్ష ధోరణి.. వాటి అన్ని సమకాలీన రూపాలపై పోరు ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని మేం పునరుద్ఘాటిస్తున్నాం.
13. లోగడ 2023 నాటి శిఖరాగ్ర సదస్సులో (జోహన్నెస్‌బర్గ్-II) నాయకుల ప్రకటనను ప్రస్తావిస్తూ- భద్రత మండలి సహా ఐక్యరాజ్యసమితిని మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రాతినిధ్య సహితంగా, సమర్థంగా, ఫలప్రదంగా తీర్చిదిద్దగల సమగ్ర సంస్కరణల ప్రతిపాదనకు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. ప్రస్తుత ప్రపంచ సవాళ్లపై సవ్యంగా స్పందించేలా, భద్రతా మండలి సహా అంతర్జాతీయ వ్యవహారాల్లో మరింత కీలక పాత్ర పోషించాలన్న ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలలోని బ్రిక్స్ సభ్య దేశాలు సహా వర్ధమాన దేశాల ఆకాంక్షల మేరకు మండలిలో వాటి ప్రాతినిధ్యం పెంపు అవసరాన్ని స్పష్టం చేస్తున్నాం. ‘ఎజుల్విని ఏకాభిప్రాయం’, 'సిర్తే ప్రకటన' వ్యక్తీకరించిన ఆఫ్రికా దేశాల సముచిత ఆకాంక్షలను గుర్తిస్తున్నాం. ఐరాస భద్రత మండలి సంస్కరణలు అంతిమంగా వర్ధమాన దేశాల గళాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలన్నది మా నిశ్చితాభిప్రాయం. ఈ నేపథ్యంలో 2022 బీజింగ్, 2023 జోహన్నెస్‌బర్గ్-II ప్రకటనల దృక్కోణంలో ఐరాస సహా భద్రత మండలిలో మరింత కీలక పాత్ర పోషించడంపై బ్రెజిల్, భారత్ ఆకాంక్షలకు తమ మద్దతును అందులో శాశ్వత సభ్యత్వంగల చైనా, రష్యా పునరుద్ఘాటిస్తున్నాయి.
14. ఐక్యరాజ్యసమితి కర్తవ్య నిర్వహణకు, నిర్దిష్ట ప్రగతి సాధనకు సదా తగిన మద్దతిస్తామనే మా హామీని పునరుద్ఘాటిస్తున్నాం. సర్వ ప్రతినిధి సభ పునరుజ్జీవనానికి, ఆర్థిక-సామాజిక మండలి బలోపేతానికి మా కృషిని కొనసాగిస్తాం. శాంతి పునరుద్ధరణ వ్యవస్థపై 2025 నాటి సమీక్ష సమావేశ నిర్ణయాల పూర్తిస్థాయి అమలుకు మేం ఎదురుచూస్తున్నాం.
15. జాతీయ విధానాలు, నియంత్రణల పరిధిలో సుస్థిర ప్రగతి-2030 కార్యక్రమం అమలుకు, తద్వారా సమతుల-సమగ్ర విధానాలతో దాని ఉద్దేశాలకు అనుగుణంగా విస్తృత ప్రజాకేంద్రక లక్ష్యాల సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తామని పునరుద్ఘాటిస్తున్నాం. అన్ని కోణాలు, రూపాల్లోని దుర్భర పేదరిక నిర్మూలన ప్రపంచానికి అతిపెద్ద సవాలు మాత్రమేగాక సుస్థిర ప్రగతికి అత్యావశ్యకమని మేం గుర్తించాం. అదే సమయంలో వినూత్న, సమన్వయ, పర్యావరణ హిత, పారదర్శక, భాగస్వామ్య పద్ధతిలో 2030 ప్రగతి కార్యక్రమం అమలును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా అంగీకరిస్తున్నాం. ప్రపంచ అసమానతలపై కొనసాగుతున్న ఉన్నత స్థాయి చర్చలను పరిగణనలోకి తీసుకుంటూ ఆయా దేశాల్లో, దేశాల మధ్య గల అసమానతలే ప్రగతి కార్యక్రమం పరిష్కరించాల్సిన చాలా సవాళ్లకు మూలమనే వాస్తవాన్ని గుర్తిస్తున్నాం. ఈ క్రమంలో అసమానతకు దారితీసే అంశాలను ప్రత్యేకంగా పరిష్కరిస్తూ అన్ని కోణాలు, రూపాల్లో దాన్ని రూపుమాపేందుకు (ఎస్‌డీజీ 10) ప్రాధాన్యమిస్తున్నాం. అసమానతల తొలగింపులో సమష్టి కృషితోపాటు నిర్దిష్ట చర్యలు చేపట్టడంపై మా సంకల్పాన్ని ప్రకటిస్తున్నాం. ఇందులో భాగంగా ఒక అంతర్జాతీయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న దక్షిణాఫ్రికా, బ్రెజిల్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నాం. అలాగే, 2030 తదుపరి అంతర్జాతీయ ప్రగతి కార్యక్రమ రూపకల్పనలో బ్రిక్స్ దేశాల సన్నిహిత సహకారం, గణనీయ తోడ్పాటును కూడా ఆకాంక్షిస్తున్నాం.
16. ఇండోనేషియాలోని బాండుంగ్‌లో 1955నాటి ఆసియా-ఆఫ్రికా సదస్సు ప్రకటించిన సమానత్వం, స్వాతంత్ర్యం, తటస్థత, పరస్పర లబ్ధి వంటి సార్వత్రిక సూత్రాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాం. మరింత నిష్పాక్షిక, సార్వజనీన, ప్రాతినిధ్య సహిత బహుపాక్షిక వ్యవస్థకు రూపమివ్వడంలో బాండుంగ్ స్ఫూర్తి మార్గదర్శనం చేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.
17. అంతర్జాతీయ ఉత్పాదన, వృద్ధిలో కొత్త మార్కెట్లు, వర్ధమాన దేశాల వాటా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక పాలన వ్యవస్థలో సంస్కరణలకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తోంది. మరింత ప్రాతినిధ్యం, పారదర్శకత, జవాబుదారీతనంతో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను తీర్చిదిద్దడం కోసం బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సమన్వయ బలోపేతానికి కృషి చేస్తాం. బ్రెటన్ వుడ్స్ సంస్థల (బీడబ్ల్యూఐ) చట్టబద్ధత పెంచి, అవి మరింత చురుగ్గా, సమర్థంగా, విశ్వసనీయంగా సమ్మిళితంగా, సంకల్పానుగుణంగా, నిష్పాక్షికంగా, జవాబుదారీగా, ప్రాతినిధ్య సహితంగా పనిచేసేలా సంస్కరించాల్సిన తక్షణావసరాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ‘బీడబ్ల్యూఐ’ రూపుదిద్దుకున్న నాటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పలను ప్రతిబింబించేలా వాటి పాలన స్వరూపాన్ని సంస్కరించాలన్నది మా డిమాండ్. కొత్త మార్కెట్లకు ప్రాతినిధ్యం, వాటి గళానికి ప్రాధాన్యంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి సాపేక్ష స్థానాన్ని ఆ సంస్కరణలు ప్రతిబింబించాలి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సారథుల ఎంపికలో ప్రాంతీయ వైవిధ్యం, వర్ధమాన దేశాల ప్రాతినిధ్యం పెంచాలి. దాంతోపాటు ఎంపిక ప్రక్రియ యోగ్యతాధారిత, సార్వజనీన, పారదర్శక రీతిలో ఉండటం సహా నిర్వహణ విధానాల మెరుగుదలపై మా ఆకాంక్షను పునరుద్ఘాటిస్తున్నాం.
18. ఐఎంఎఫ్ కోటా, పాలన సంస్కరణలపై బ్రిక్స్ రియో డి జనీరో దృక్కోణాన్ని సమర్థిస్తున్నాం. ఐఎంఎఫ్ తన సభ్యదేశాలకు... ప్రత్యేకించి అత్యంత బలహీన దేశాలకు తగిన చేయూతనివ్వగల ప్రపంచ ఆర్థిక భద్రత వలయం కేంద్రకంగా బలమైన, కోటా ఆధారిత, సమృద్ధ వనరుల సహిత వ్యవస్థగా రూపొందాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. కోటాలపై 16వ సార్వత్రిక సమీక్ష (జీఆర్‌క్యూ) కింద అంగీకరించిన పెంపును తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే, 17వ జీఆర్‌క్యూ కింద వీలైనంత త్వరగా అర్థవంతమైన కోటా పునఃసర్దుబాటు విధానాలను రూపొందించాలని కోరుతున్నాం. ఇక కోటా, పాలన సంస్కరణల విషయంలో దిరియా మార్గదర్శక సూత్రాలను స్వాగతిస్తున్నాం. కోటా పునఃసర్దుబాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశాల సాపేక్ష స్థానాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. కొత్త మార్కెట్లు, వర్ధమాన దేశాల కోటా, ఓటింగ్ వాటా పెంచాలని, అదే సమయంలో ఈ ప్రక్రియ ఆ దేశాలకు నష్టదాయకం కారాదని పునరుద్ఘాటిస్తున్నాం. ఓ సరికొత్త, సరళ, పారదర్శక కోటా సూత్రంతో అత్యంత పేద సభ్యదేశాల కోటా, వాటాలను పరిరక్షించాలి. ఆ సూత్రం ఐఎంఎఫ్ నుంచి వనరుల సౌలభ్యానికి మార్గనిర్దేశం చేసేదిగా ఉండాలే తప్ప పరిమితం చేసేదిగా ఉండరాదని స్పష్టం చేస్తున్నాం. అలాగే, ఏవైనా స్వచ్ఛంద ఆర్థిక విరాళాల కోటా కేటాయింపును, పాలన ప్రాతినిధ్యాన్ని, ఓటింగ్ అధికారాన్ని ప్రభావితం చేసేదిగా ఉండరాదని కూడా ప్రకటిస్తున్నాం. రియో డి జనీరో దృక్కోణానికి లోబడి 17వ జీఆర్‌క్యూలో అర్థవంతమైన కోటా, వాటాల పునఃసర్దుబాటు, పాలన సంస్కరణల అంశాన్ని చేర్చడంపై భరోసా దిశగా ఐఎంఎఫ్‌లోని ఇతర సభ్య దేశాలతో నిర్మాణాత్మక చర్చలకు మా సంసిద్ధత తెలుపుతున్నాం.
19. ప్రపంచ బ్యాంకు గ్రూప్ మరింత విస్తృతంగా, చట్టబద్ధంగా, మెరుగ్గా, ప్రభావశీల అభివృద్ధి ఆర్థిక సంస్థగా, బహుపాక్షిక వాదాన్ని బలోపేతం చేసేదిగా రూపొందడంలో ‘ప్రపంచ బ్యాంకు వాటా సమీక్ష-2025’ కీలక ఉపకరణమని పునరుద్ఘాటిస్తున్నాం. 'లిమా సూత్రాల' మేరకు చారిత్రక అల్ప ప్రాతినిధ్య లోటును సరిదిద్దేలా వాటాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని, తద్వారా వర్ధమాన దేశాల గళాన్ని, ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు బ్రిక్స్ దేశాలు తమవంతు కృషిని కొనసాగిస్తాయని కూడా స్పష్టం చేస్తున్నాం.
20. బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ పరిరక్షణ, పునరుజ్జీవనంపై 2026 ప్రకటన సహా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సంస్కరణ, బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ బలోపేతంపై 2025 బ్రిక్స్ ప్రకటనను మేం గుర్తుచేసుకుంటున్నాం. తదనుగుణంగా ‘డబ్ల్యూటీఓ’లో సంస్కరణలకు, ఆ సంస్థ కేంద్రంగా వివక్ష రహిత, వినూత్న, సమాన, పారదర్శక, నిష్పాక్షిక, సార్వజనీన, అంచనానుగుణ, నియమాధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ బలోపేతంపై మా పట్టుదలను పునరుద్ఘాటిస్తున్నాం. అలాగే, అత్యంత ప్రాధాన్య దేశం హోదా, వర్ధమాన సభ్య దేశాలకు... ముఖ్యంగా అత్యల్ప ప్రగతి దేశాలకు ప్రత్యేక-భేదాత్మక హోదా వంటి ప్రాథమిక సూత్రాలను సమర్థిస్తున్నాం. జెనీవా బహుళపక్ష చర్చలు... ప్రత్యేకించి ‘డబ్ల్యూటీఓ’ సంస్కరణలపై మేం చురుగ్గా పాల్గొంటామని స్పష్టం చేస్తున్నాం. ‘డబ్ల్యూటీఓ’ సమర్థత, విశ్వసనీయతలను దెబ్బతీస్తున్న సవాళ్లు-పరిష్కారాలపై బ్రిక్స్ అనధికార సంప్రదింపుల వేదిక కింద మా వంతు కృషిని కొనసాగిస్తూ సమన్వయాన్ని మెరుగుపరుస్తాం. మంత్రిమండలి 14వ సదస్సు (ఎంసీ14) నిర్ణయాలను అమలు చేస్తూనే అపరిష్కృత సమస్యలపై మా నిర్మాణాత్మక కృషిని కొనసాగిస్తాం. ‘డబ్ల్యూటీఓ’ అధికారం, ప్రభావం, సార్వజనీనత, ఔచిత్యం పెంచడానికే కాకుండా సార్వత్రిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపకల్పన దిశగా సంస్కరణలో మా వంతు పాత్ర పోషిస్తాం. ఈ విషయంలో ప్రగతి సంబంధిత సమస్యలు సహా వివిధ బహుపాక్షిక నిబంధనలను డబ్ల్యూటీఓ చట్టబద్ధ పరిధిలోకి తెచ్చేందుకు సరైన మార్గాన్వేషణ, భవిష్యత్ అవసరాలకు తగిన నియమాల రూపకల్పన ముఖ్యమని ప్రకటిస్తున్నాం. సభ్యదేశాల మధ్య విశ్వాసానికి, అంచనా వేయదగిన వాతావరణానికి పునాది అయిన ‘రెండంచెల పటిష్ట వివాద పరిష్కార యంత్రాంగం’ తక్షణ పునరుద్ధరణ సహా విచారణాధికార యంత్రాంగం నియామక ప్రక్రియను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్ల్యూటీఓ ప్రాథమిక సూత్రాల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, అవసరమైన సంస్కరణలతో సంస్థ బలోపేతానికి, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ విశ్వసనీయత పునరుద్ధరణకు కృషి చేస్తాం. బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థలో సంపూర్ణ విలీనంపై వర్ధమాన దేశాల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ- డబ్ల్యూటీఓలో ఇథియోపియా, ఇరాన్ సభ్యత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఆఫ్రికా ఖండంలో తనతో దౌత్య సంబంధాలు గల 53 దేశాలకు ‘శూన్య సుంకం’ రాయితీ కల్పించడంపై చైనాను అభినందిస్తున్నాం.
21. బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ చాలా కాలం నుంచీ సంధి దశలో ఉండటం మేం గమనించాం. డబ్ల్యూటీఓ నిబంధనలకు విరుద్ధంగా సుంకాల విచక్షణ రహిత పెంపును చూస్తున్నాం. అలాగే, పర్యావరణ లక్ష్యాల ముసుగులో, సంరక్షణవాదం, వాణిజ్య నిరోధక చర్యల విస్తరణ రూపంలో సుంకమేతర చర్యలు కూడా మితిమీరుతున్నాయి. ప్రపంచ వాణిజ్యం మరింత తగ్గడం, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో అంతరాయం, ఆర్థిక-వాణిజ్య కార్యకలాపాల అనిశ్చితి వంటి ముప్పులకు ఇవి దారితీస్తున్నాయి. ఈ పరిణామాలతో ఇప్పటికేగల ఆర్థిక అసమానతలు మరింత తీవ్రమై, ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. వాణిజ్యాన్ని వక్రీకరించే, డబ్ల్యూటీఓ నిబంధనల విరుద్ధ ఏకపక్ష సుంకాలు, సుంకమేతర చర్యలు మితిమీరడంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. వాణిజ్య అంతరాయాలు, కొత్త మార్కెట్లు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల అవసరాలు, ప్రాథమ్యాలపై డబ్ల్యూటీఓ ప్రతిస్పందన మెరుగుపడాల్సి ఉంది. అపరిష్కృత సమస్యలపై చర్చలకు ప్రాధాన్యమిస్తూనే- బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ బలోపేతం ద్వారా కాలానుగుణ ప్రపంచ సవాళ్లకు మరింత మెరుగైన పరిష్కారాన్వేషణతో సమతుల, సార్వజనీన, నిర్దిష్ట ఫలితాల సాధనకు సమష్టిగా మద్దతిస్తాం.
22. అంతర్జాతీయ చట్ట విరుద్ధ ఏకపక్ష నిర్బంధ చర్యలను ఖండిస్తున్నాం. ఏకపక్ష ఆర్థిక.. అనుబంధ ఆంక్షల రూపంలోగల ఇలాంటి చర్యలతో లక్షిత దేశాల సామాన్యుల ప్రగతి, ఆరోగ్యం, ఆహార భద్రత హక్కు సహా మానవ హక్కులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నిరుపేదలు, బలహీన వర్గాలపై మరింత దుష్ప్రభావానికి దారితీసి, డిజిటల్ అంతరాన్ని పెంచడంతో పాటు పర్యావరణ సమస్యలను తీవ్రం చేస్తాయనే వాస్తవాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాన్ని, ఐక్యరాజ్యసమితి నిర్దేశక సూత్రాలు-సంకల్పాలను దెబ్బతీసే ఈ చట్టవిరుద్ధ చర్యలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఐరాస భద్రత మండలి ఆమోదం లేని ఆంక్షలు సహా అంతర్జాతీయ చట్టానికి, ఐరాస నిర్దేశక పత్రానికి విరుద్ధమైన ఏకపక్ష నిర్బంధ చర్యలపై సామూహిక వ్యతిరేకతను పునరుద్ఘాటిస్తున్నాం.
అంతర్జాతీయ - ప్రాంతీయ శాంతిభద్రతలు
23. ప్రపంచ దేశాల మధ్య విభజన వాదం, అపనమ్మకం విస్తరించడాన్ని మేం నిశితంగా గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ శాంతిభద్రతల బలోపేతానికి ప్రపంచవ్యాప్త చర్యలను ప్రోత్సహిస్తున్నాం. ఈ సవాళ్లు, సంబంధిత భద్రతపరమైన ముప్పులు, సంఘర్షణ పరిస్థితుల ఉపశమనం దిశగా రాజకీయ, దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులే మార్గమని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తున్నాం. అలాగే, సంఘర్షణ మూలాల పరిష్కారం సహా నివారణ కృషిలో సమష్టి భాగస్వామ్యం ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నాం. అన్ని దేశాల మధ్య భద్రత అవిభాజ్య అంశమని ప్రస్ఫుటం చేస్తూ సంభాషణ, సంప్రదింపులు, దౌత్యంతో అంతర్జాతీయ వివాదాల శాంతియుత పరిష్కారంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. సంఘర్షణల నివారణ-పరిష్కారంలో ప్రాంతీయ సంస్థల క్రియాశీల పాత్రను ప్రోత్సహిస్తూ సంక్షోభాల శాంతియుత పరిష్కారానికి తోడ్పడే ప్రయత్నాలన్నిటికీ మద్దతిస్తున్నాం. అంతర్జాతీయ వివాదాలలో ఐక్యరాజ్యసమితి నిర్దేశక పత్రం సూత్రాలు-సంకల్పాలకు లోబడి, సంబంధిత పక్షాల సమ్మతితో నివారణ, నిరోధం దిశగా దౌత్యం, మధ్యవర్తిత్వాలకు గల ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తున్నాం. సాయుధ సంఘర్షణల నివారణ, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాలు, ఆఫ్రికా సమాఖ్య శాంతి-సహాయక కార్యకలాపాలు, మధ్యవర్తిత్వం, ఇతర ప్రక్రియలలో సహకారం దిశగా మార్గాన్వేషణకు అంగీకరిస్తున్నాం.
24. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘర్షణలు సహా అంతర్జాతీయ వ్యవస్థలో విభజన వాదం, విచ్ఛిన్న వైఖరులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. వర్ధమాన దేశాలకు తగుమేర అభివృద్ధి నిధుల కేటాయింపులకు నష్టం వాటిల్లేలా ప్రపంచ సైనిక వ్యయం మితిమీరుతుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సుస్థిర ప్రగతి సాధన, ఆకలి-పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులకు ఉపశమనంపై ప్రపంచ ప్రతిస్పందనకు తోడ్పాటు వంటి కీలకాంశాలపై విభిన్న జాతీయ దృక్కోణాలు-వైఖరులను గౌరవించే బహుపాక్షిక విధానాన్ని మేం సమర్థిస్తాం. అయితే, భద్రతను వాతావరణ మార్పుల కార్యక్రమంతో ముడిపెట్టే ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
25. అణు ముప్పు పెరుగుదల, ఘర్షణల దుష్ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచ స్థిరత్వం, అంతర్జాతీయ శాంతి-భద్రతల దిశగా నిరాయుధీకరణ, ఆయుధ నియంత్రణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక వ్యవస్థ బలోపేతం సహా దాని సమగ్రత-ప్రభావాల పరిరక్షణ ఆవశ్యకతను పునరుద్ఘాటిస్తున్నాం. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక వ్యవస్థ బలోపేతంలో అణ్వస్త్ర రహిత మండలాల గణనీయ పాత్ర ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాం. అణ్వాయుధ వినియోగం లేదా వాటితో వాటిల్లే ముప్పు నివారణపై ఆ మండలాల హామీలకు మా మద్దతును, గౌరవాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ తీర్మానం 73/546కు అనుగుణంగా ఏర్పాటయ్యే సమావేశం సహా మధ్యప్రాచ్యంలో అణ్వాయుధ, ఇతర భారీ విధ్వంసక ఆయుధ రహిత మండలం ఏర్పాటుపై నిర్ణయాల అమలును వేగిరం చేసే లక్ష్యంతో సాగుతున్న కృషి ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాం. ఈ సమావేశానికి ఆహ్వానం అందిన పక్షాలన్నీ సద్భావనతో ఇందులో పాల్గొని, నిర్మాణాత్మకంగా పాలుపంచుకోవాలని పిలుపునిస్తున్నాం. “అణు-ఆయుధ రహిత మండలాల అంశంపై అన్ని కోణాల్లో సమగ్ర అధ్యయనం”పై యూఎన్‌జీఏ తీర్మానం 79/241 ఆమోదం పొందడాన్ని, గ్రూప్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందిన అధ్యయనం విజయవంతం కావడాన్ని మేం గమనించాం.
26. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి తీర్మానం 1325 (2000), దాని తదుపరి తీర్మానాల పూర్తి అమలుతోపాటు ‘మహిళలు-శాంతిభద్రతలు’ (డబ్ల్యూపీఎస్) కార్యక్రమం కొనసాగింపుపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఘర్షణల నివారణ, పరిష్కారం, మానవీయ సహాయం, మధ్యవర్తిత్వం, శాంతి పరిరక్షణ చర్యలు, శాంతి స్థాపన, ఘర్షణానంతర పునర్నిర్మాణం-అభివృద్ధి సహా శాంతిభద్రతల ప్రక్రియలోని అన్ని స్థాయుల నిర్ణయాధికారాల్లో మహిళలకు సంపూర్ణ, సమాన, సురక్షిత, అర్థవంతమైన భాగస్వామ్య కల్పన ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాం.
27. లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాన్ని పరస్పర గౌరవం, వివాద శాంతియుత పరిష్కారం, తటస్థత సూత్రాధారిత శాంతి మండలమని మేం స్పష్టం చేస్తున్నాం. ఈ మేరకు క్యూబాపై ఏకపక్ష దిగ్బంధం మరింత కఠినం కావడం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇంధన సరఫరాపై దాని దుష్ప్రభావాలు, ప్రజలపై ఆందోళనకర మానవతా ప్రభావం నేపథ్యంలో ఆ దేశ స్థితిగతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. యూఎన్‌జీఏ తీర్మానం ఏ/ఆర్‌ఈఎస్/80/4ను గౌరవిస్తూ క్యూబాపై ఆర్థిక, వాణిజ్య, ద్రవ్యపరమైన చర్యల ఉపసంహరణ ఆవశ్యకతను పునరుద్ఘాటిస్తున్నాం.
28. మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాలలో నిరంతర ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మా జాతీయ వైఖరికి లోబడి గరిష్ఠ సంయమనం పాటించాలని, పరిస్థితులను తీవ్రం చేసే చర్యలకు పాల్పడరాదని పిలుపునిస్తున్నాం. అంతేగాక దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలపై గౌరవం సహా ఐక్యరాజ్య సమితి నిర్దేశక పత్రం సూత్రాలు-సంకల్పాల పరిధిలో వాటి సంపూర్ణత, పరస్పర సంధానానికి తగినట్లు పౌరుల-పౌర మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించాలని మేం కోరుతున్నాం. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, భద్రత, స్థిరత్వానికి దోహదం చేసే దీర్ఘకాలిక అవగాహన కోసం చర్చలు-దౌత్యం ద్వారా ముమ్మర కృషిని మేం ప్రోత్సహిస్తున్నాం. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ప్రపంచ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన సరఫరా సజావుగా సాగేలా సమష్టి కృషి అవసరాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాం.
29. అంతర్జాతీయ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఐఏఈఏ తీర్మానాల ఉల్లంఘనతో పాటు దాని పూర్తి భద్రత యంత్రాంగం పరిధిలోగల పౌర మౌలిక సదుపాయాలు, శాంతియుత అణు కేంద్రాలపై ఉద్దేశపూర్వక దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ప్రజలకు, పర్యావరణానికి హాని వాటిల్లకుండా సాయుధ ఘర్షణల సందర్భాలతో పాటు భద్రత, రక్షణ దిశగా అణు భద్రత చర్యలు సదా ప్రాధాన్యమివ్వాలి.
30. ఐరాస భద్రత మండలి తీర్మానం 2803కు ఆమోదం హర్షణీయం... దీంతోపాటు సంబంధిత యూఎన్‌జీఏ తీర్మానాన్ని కూడా అమలు చేయాలని పిలుపునిస్తున్నాం. గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ కొనసాగింపు సహా పూర్తి, నిరంతరాయ మానవతా సహాయ సౌలభ్యానికి భరోసా ఇవ్వాలని అన్ని పక్షాలనూ కోరుతున్నాం. అయితే, కాల్పుల విరమణపై 2025లో ఒప్పందం కుదిరినప్పటికీ గాజాలో హింస కొనసాగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. గాజా స్ట్రిప్ నుంచి పాలస్తీనియన్లను తరిమివేసేందుకు ఉద్దేశించిన విధానాలను విడనాడాలని పిలుపునిస్తున్నాం. అలాగే, పాలస్తీనా ప్రజల అభేద్య హక్కులకు భంగం వాటిల్లే, ఆక్రమణను చట్టబద్ధం చేసే లేదా పొడిగించే చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.
31. ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణకు నిష్పాక్షిక, శాశ్వత పరిష్కారం శాంతియుత మార్గాలతోనే సాధ్యమని, దీంతోపాటు స్వీయ నిర్ణయాధికారం, దేశంలోకి పునఃప్రవేశ హక్కు సహా పాలస్తీనా ప్రజల చట్టబద్ధ హక్కులను నెరవేర్చడంపై ఆధారపడి ఉంటుందని మేం పునరుద్ఘాటిస్తున్నాం. బహుళపక్ష ఆర్థిక సంస్థలు సహా సంబంధిత అన్నిరకాల అంతర్జాతీయ సంస్థలలో పాలస్తీనాకు తగిన ప్రాతినిధ్యం, వనరుల సౌలభ్యం కల్పించాల్సిన అవసరాన్ని మేం స్పష్టం చేస్తున్నాం. అంతర్జాతీయ చట్టం సహా ఐరాస భద్రత మండలి, సర్వ ప్రతినిధి సభ తీర్మానాలకు, అరబ్ శాంతి కార్యక్రమానికి లోబడి రెండు దేశాల పరిష్కారంపై మాకున్న నిబద్ధత మేరకు ఐరాసలో పాలస్తీనా దేశానికి సంపూర్ణ సభ్యత్వంపై మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. అరబ్ శాంతి కార్యక్రమంలో భాగంగా గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ సహా తూర్పు జెరూసలేం రాజధానిగా అంతర్జాతీయ గుర్తింపు గల 1967 నాటి సరిహద్దులలో ఒక సార్వభౌమ, స్వతంత్ర, సుస్థిర పాలస్తీనా దేశం ఏర్పాటు కావాలి. అటుపైన రెండు దేశాలూ శాంతిభద్రతలతో, సన్నిహితంగా మనుగడ సాగించాలన్నదే మా ఆశయం.
32. ఆక్రమిత పాలస్తీనా భూభాగం నుంచి అక్కడి ప్రజలను ఏ కారణంతోనైనా తాత్కాలికంగా లేదా శాశ్వతంగా బలప్రయోగంతో తరలించడాన్నిగట్టిగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే, గాజా స్ట్రిప్ భూభాగంలో భౌగోళిక లేదా జనాభా సంబంధిత మార్పులను మేమెంత మాత్రం అంగీకరించం. చట్టవిరుద్ధ ఆక్రమణను అంతం చేయాలని, చట్టబద్ధ నిబంధనలను బలహీనపరిచే, నిష్పాక్షిక- శాశ్వత శాంతికి ఆటంకం కలిగించే చర్యలను తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ చట్టం, న్యాయ సంస్థలు డిమాండ్ చేస్తుండటాన్ని మేం పునరుద్ఘాటిస్తున్నాం.
33. గాజాలోని మానవతా స్థితిగతులు సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలోని దుస్థితిపై తీవ్ర ఆందోళనను పునరుద్ఘాటిస్తున్నాం. అంతర్జాతీయ చట్టానికి... ప్రత్యేకించి మానవతా చట్టానికి, మానవ హక్కుల చట్టానికి కట్టుబడాలన్నది మా అభిమతం. కానీ, వీటన్నిటినీ ఉల్లంఘిస్తుండటం... ముఖ్యంగా ఆకలిని యుద్ధ సాధనంగా వాడుకోజూడటం, ఆసుపత్రులు, ఇతర పౌర మౌలిక సదుపాయాలు, పౌరులు, వస్తుసామగ్రి లక్ష్యంగా దాడులు అమానవీయం. మానవతా సాయానికి ఇలా విఘాతం కలిగించడం అంతర్జాతీయ చట్ట విరుద్ధమేగాక దీనిపై రాజకీయం చేయడం, సైనికీకరించేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమీప ప్రాచ్య ప్రాంతంలోని పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సహాయ, కార్యాచరణ సంస్థకు మా దృఢమైన మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. పాలస్తీనాలోని ఐదు కార్యాచరణ క్షేత్రాల్లో శరణార్థులకు ప్రాథమిక సేవల ప్రదానంపై యూఎన్‌జీఏ ద్వారా లభించిన ఆదేశాన్ని అన్ని పక్షాలూ పూర్తిగా గౌరవించాలని స్పష్టం చేస్తున్నాం. ఆ మేరకు తమతమ బాధ్యతలను గౌరవిస్తూ, అత్యంత సంయమనంతో వ్యవహరించాలని, ఉద్రిక్తత పెంపు చర్యలను, రెచ్చగొట్టే ప్రకటనలను నివారించాలని పిలుపునిస్తున్నాం. ఈ విషయంలో ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా చేపట్టిన న్యాయపరమైన చర్యలలో భాగంగా అంతర్జాతీయ న్యాయస్థానం చేపట్టిన తాత్కాలిక చర్యలను గమనిస్తున్నాం. ఇతరత్రా అంశాలతో పాటు గాజాలో మానవతా సహాయానికి భరోసా ఇవ్వడంలో ఇజ్రాయెల్‌పై గల చట్టబద్ధ బాధ్యతను పునరుద్ఘాటిస్తున్నాం.
34. ఆక్రమిత జెరూసలేం చట్టబద్ధ, చారిత్రక హోదా మార్పు దిశగా ఏకపక్ష చర్యలను తిరస్కరిస్తున్నాం. నగరంలోని అన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు, యాత్రాస్థలాల పవిత్రతను పరిరక్షించాలని, ఎలాంటి ఆటంకాలూ లేకుండా అందరికీ ప్రవేశం సహా వారివారి ఆచారసంప్రదాయాలను పాటించే హక్కులను పూర్తిగా గౌరవించాలని మేము కోరుతున్నాం.
35. లెబనాన్‌లో కాల్పుల విరమణను స్వాగతిస్తూ- సంబంధిత నిబంధనలను కచ్చితంగా పాటించాలని, భద్రత మండలి తీర్మానం 1701ని పూర్తిగా అమలు చేయాలని అన్ని పక్షాలకూ పిలుపునిస్తున్నాం. లెబనాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలే కాకుండా కాల్పుల విరమణ ఒప్పందం కూడా నిరంతరం ఉల్లంఘనకు గురికావడాన్ని ఖండిస్తున్నాం. లెబనాన్ ప్రభుత్వంతో అంగీకారానికి వచ్చిన అంశాలను గౌరవిస్తూ, ఆ భూభాగంలోని ఆక్రమిత దళాలన్నిటినీ ఇజ్రాయెల్ ఉపసంహరించాలని పిలుపునిస్తున్నాం.
36. లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి తాత్కాలిక దళం కీలక పాత్రను ప్రస్ఫుటం చేస్తూ- ఐరాస సిబ్బంది, పరికరాల భద్రత, రక్షణ, స్వేచ్ఛా సంచారానికి భరోసా, ప్రాంగణాల సమగ్రతకు గౌరవం తదితరాల ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాం. ఐరాస కార్యస్థానాలు, సిబ్బందిపై అన్నిరకాల దాడులను తీవ్రంగా ఖండిస్తూ- ఇది అంతర్జాతీయ చట్టాన్ని, ఐరాస భద్రత మండలి తీర్మానం 1701 (2006)ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తున్నాం. ఈ దాడులలో ఐరాస దళంలోని నలుగురు ఇండోనేషియా శాంతి సైనికులతో పాటు ఇతర దేశాల వారు అమరులు కావడంపై ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం. ప్రభావిత దళాలను సమకూర్చే దేశాలకు ఈ సందర్భంగా సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఈ మరణాలకు దారితీసిన సంఘటనలను ఖండిస్తూ, ఐరాస శాంతి పరిరక్షకుల భద్రత, రక్షణలో రాజీపడబోమని పునరుద్ఘాటిస్తున్నాం. లెబనాన్ ప్రభుత్వానికి మద్దతు, రాజకీయ పరిష్కార అవకాశం కల్పనలో ఐరాస మధ్యంతర దళాల పాత్ర, ఆదేశాలను గౌరవించడంలోని ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాం. ఈ దాడులకు బాధ్యులైన వారిని అందుకు జవాబుదారీ చేయాలని పిలుపునిస్తున్నాం. అంతేగాక ఐరాస సిబ్బంది, ఆస్తుల భద్రత, స్వేచ్ఛా సంచారం సహా సమితి ప్రాంగణాల రక్షణకు అన్ని పక్షాలు హామీ ఇవ్వాలని కోరుతున్నాం.
37. సూడాన్‌లో పరిస్థితుల క్షీణత, మానవతా సంక్షోభ తీవ్రత సహా తీవ్రవాదం, ఉగ్రవాదాల విస్తరణ ముప్పు పెరుగుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ సహా చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి పిలుపునిస్తున్నాం. సూడాన్ ప్రజలకు నిరంతర, తక్షణం నిరాటంక మానవతా సహాయం అందాల్సిన అవసరాన్ని, పొరుగు దేశాలకూ ఈ సాయం పెంచాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నాం. “ఆఫ్రికా సమస్యలకు ఆఫ్రికా పరిష్కారం” సూత్రమే సయోధ్యకు ప్రాతిపదికగా కొనసాగాలని పునరుద్ఘాటిస్తున్నాం. ఈ అంశంపై మా వైఖరిని పునరుద్ఘాటిస్తూ- శాంతి దిశగా కృషిలో సమన్వయ విధానం పాటించాలని పిలుపునిస్తున్నాం.
38. సిరియా సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతలపై నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. పౌర భద్రత, శ్రేయస్సుకు భరోసాతో పాటు మైనారిటీలు అన్ని సామాజిక వర్గాల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా శాంతియుత-సార్వజనీన రాజకీయ రూపాంతరీకరణకు కృషి చేయాలని అన్ని పక్షాలనూ కోరుతున్నాం. ఘర్షణానంతర సిరియా పునర్నిర్మాణం, పునరావాసానికి మద్దతుపై అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విదేశీ జోక్యం లేకుండా, సిరియా సారథ్యం-యాజమాన్యాన ఐక్యరాజ్య సమితి సమన్వయంతో ఈ సమ్మిళిత రాజకీయ ప్రక్రియ దిశగా కృషికి సదా మద్దతిస్తామని ప్రకటిస్తున్నాం. ఈ ప్రక్రియ యావత్తూ భద్రత మండలి తీర్మానం 2254 (2015) సూత్రాధారితమై ఉండాలి. తద్వారా సిరియాలోని అన్ని రాజకీయ-సామాజిక వర్గాలకూ ప్రాతినిధ్యం, రక్షణ కల్పించాలి. సిరియాతోపాటు ప్రాంతీయ స్థిరత్వం, భద్రతకు విదేశీ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఆ సమస్యను తక్షణం పరిష్కరించాల్సి ఉందని స్పష్టం చేస్తున్నాం. అన్ని రకాల ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని సిరియా గట్టిగా నిరోధించాలని, ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజ ఆందోళనలకు ప్రతిస్పందనగా నిర్దిష్ట చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. సిరియా నుంచి ఆక్రమణ దళాల ఉపసంహరణ ఆవశ్యకతను పునరుద్ఘాటిస్తున్నాం.
39. ప్రపంచవ్యాప్తంగా మానవతా సంక్షోభాల పరిష్కారంలో బహుపాక్షిక సహకార బలోపేతంపై నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. మానవతా చర్యలకు కేటాయించే నిధుల తీవ్ర కొరత సహా అంతర్జాతీయ స్పందన క్షీణతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ నేపథ్యంతో నిర్దేశిత లక్ష్య సాధన కోసం తగిన వనరుల తక్షణ సమీకరణతో పాటు వివిధ ప్రాంతీయ-అంతర్జాతీయ స్థాయులలో సమన్వయం మెరుగుపడాలని పిలుపునిస్తున్నాం. ఈ క్రమంలో ఐరాస పోషిస్తున్న కీలక పాత్రను మేం ప్రశంసిస్తున్నాం. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై ఉద్దేశపూర్వక దాడులు, మానవతా సాయానికి ఆటంకం, సిబ్బంది లక్ష్యంగా చర్యలు వంటి అంతర్జాతీయ మానవతా చట్ట ఉల్లంఘనలను తీవ్రంగా ఖండిస్తూ, వీటన్నింటిపైనా జవాబుదారీతనం దిశగా డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ మానవతా చట్టంపై గౌరవం, కట్టుబాటు, సమర్థ అమలుకు తోడ్పాటు దిశగా బ్రిక్స్ సభ్య దేశాల అంతర్జాతీయ కృషిని అభినందిస్తున్నాం.
40. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు ఉగ్రవాద దుశ్చర్యలకు పాల్పడినా, వాటి నేపథ్యంతో నిమిత్తం లేకుండా అవన్నీ నేరపూరితం, అమానవీయమేనని ప్రకటిస్తూ తీవ్రంగా గర్హిస్తున్నాం. ఈ మేరకు 2025 ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆనాటి దాడిలో 26 మంది మరణించగా, మరెందరో గాయపడ్డారు. సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల నిరోధం, వారికి నిధులు సమకూర్చడం సహా ఆశ్రయం కల్పించే దుష్టశక్తులను, అన్నిరకాల ఉగ్రవాదాన్ని నిర్మూలించడంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఉగ్రవాదాన్ని జాతీయత, మతం, నాగరికత లేదా సామాజిక సమూహంతో ముడిపెట్టరాదని కూడా స్పష్టం చేస్తున్నాం. ఉగ్రవాద కార్యకలాపాలలో భాగస్వాములైన వారిని, వారి మద్దతుదారులను సంబంధిత జాతీయ-అంతర్జాతీయ చట్టాల ప్రకారం దోషులుగా నిలబెట్టాలని పిలుపునిస్తున్నాం. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని, నిరోధక చర్యలలో ద్వంద్వ ప్రమాణాలను తిరస్కరించాలని కోరుతున్నాం. ఉగ్రవాద నిర్మూలనలో ప్రపంచ దేశాల ప్రాథమిక బాధ్యతను మేం స్పష్టం చేస్తున్నాం. ఉగ్రవాద ముప్పు నివారణ, దుశ్చర్యల నిరోధంపై ప్రపంచవ్యాప్త కృషిలో భాగంగా ఐక్యరాజ్యసమితి నిర్దేశాలు సహా అంతర్జాతీయ చట్టం కింద అన్ని దేశాలూ తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి చార్టర్, దాని ఉద్దేశాలు మరియు సూత్రాలను దృష్టిలో ఉంచుకుని, వాటిని ఎదుర్కొనడంలో సంబంధిత అంతర్జాతీయ ఒప్పందాలు, విధివిధానాలను అనుసరించాలి. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, శరణార్థుల చట్టం, మానవతా చట్టాలను కూడా అనుసరించాలి. బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక, బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక కార్యవర్గం (సీటీడబ్ల్యూజీ) విధాన పత్రం ఆధారంగా పనిచేస్తున్న ఐదు ఉప-బృందాల కార్యకలాపాలను స్వాగతిస్తున్నాం. ఉగ్రవాద నిరోధక సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఆశిస్తున్నాం. ఐరాస చట్రంలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని సత్వరం ఖరారు చేసి, ఆమోదించాలని పిలుపునిస్తున్నాం. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులు, సంస్థలన్నింటిపైనా సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాం. యువతరంలో తీవ్రవాదం, తీవ్రవాద భావజాలాన్ని ఎదుర్కోవాల్సిన ప్రాముఖ్యతను కూడా మేం ప్రధానంగా చెబుతున్నాం. ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా బ్రిక్స్ దేశాలు, సంబంధిత అధికారుల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నాం.
-
ఆర్థిక స్థిరత్వం, సుస్థిరాభివృద్ధి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమగ్రతపై ప్రతికూల ప్రభావం చూపే తీవ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఆయుధాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్య నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని లాండరింగ్ చేయడం, నేరపూరిత ప్రయోజనాల కోసం ఐసీటీల వినియోగం, చట్టవిరుద్ధమైన వర్చువల్ అసెట్‌ల బదిలీలు, అవినీతి- సంబంధిత అక్రమ కార్యకలాపాలు, మనీలాండరింగ్, వ్యవస్థీకృత నేరాల ద్వారా ఆర్థిక మోసాలు, దేశీయ నియంత్రణ విధానాల ఉల్లంఘన వంటి అక్రమ ఆర్థిక బదిలీలపై మేం మా ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం పట్ల కూడా మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. వర్చువల్ అసెట్‌ల అక్రమ వినియోగం, దేశీయ నియంత్రణ విధానాల ఉల్లంఘనలతో సహా ఈ కార్యకలాపాలు ఆర్థిక స్థిరత్వాన్ని, సుస్థిరాభివృద్ధిని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని మేం అంగీకరిస్తున్నాం. డిజిటల్ సాంకేతికతలు, చెల్లింపు వ్యవస్థలు, బలహీన స్థితిలో ఉన్న వ్యక్తులను దోపిడీ చేసే సీమాంతర మోసాల ఆపరేషన్లు, స్కామ్ కాంపౌండ్‌లతో సహా వ్యవస్థీకృత స్కామ్ నెట్‌వర్క్‌ల విస్తరణపై మేం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ చట్టవిరుద్ధమైన నెట్‌వర్క్‌లను ఛేదించడానికి, నేరపూరిత ఆదాయాలను గుర్తించి తిరిగి రాబట్టడానికి, బాధితులను రక్షించడానికి, పెద్దఎత్తున జరిగే మోసాల కోసం ఆర్థిక సంస్థలు- వర్థమాన చెల్లింపు పద్ధతుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ చర్యల ప్రాముఖ్యతను మేం ప్రధానంగా చెబుతున్నాం. కస్టమ్స్ అధికారులు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, పన్ను అధికారులు, నియంత్రణ సంస్థల మధ్య సీమాంతర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మేం చెబుతున్నాం. ప్రస్తుతం ఉన్న సంబంధిత బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్‌ల ద్వారా బ్రిక్స్ ఆమోదం పొందిన పత్రాల ఆధారంగా, బ్రిక్స్ దేశాలు పక్షంగా ఉన్న సంబంధిత అంతర్జాతీయ చట్టపరమైన సాధనాల ద్వారా టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్లు, సాంకేతిక ప్లాట్‌ఫామ్‌లతో కలిసి ఈ సహకారం ఉండాలి. మెరుగైన సమాచార భాగస్వామ్యం, రిస్క్-ఆధారిత విధానం, డేటా అనలిటిక్స్, సామర్థ్య పెంపు ద్వారా వస్తువులు, సేవలతో కూడిన మనీలాండరింగ్ పద్ధతులను సమర్థవంతంగా గుర్తించడానికి, పసిగట్టడానికి, అడ్డుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఇందులో ఇన్వాయిస్ పద్ధతుల దుర్వినియోగం, వృత్తిపరమైన సేవలు, వివిధ దేశాల మధ్య ఒప్పందాలను దుర్వినియోగం చేసేవి కూడా ఉన్నాయి. సరిహద్దు చెల్లింపు వ్యవస్థలలో మోసాన్ని నివారించడంతో సహా డిజిటల్ ఆర్థిక భద్రతను బలోపేతం చేయడంలో మెరుగైన సహకారాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం.
-
అవినీతిని నివారించడం, ఎదుర్కోవడంలో బ్రిక్స్ సహకారాన్ని ప్రోత్సహించడానికి.. ఈ విషయంలో సంబంధిత అంతర్జాతీయ ఒప్పందాలను ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి అవినీతి నిరోధక కన్వెన్షన్‌ను నిరంతరం అమలు చేయడానికి మా ప్రతిజ్ఞను మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఆ సందర్భంగా అసెట్ రికవరీ, సీమాంతర అవినీతిని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో బ్రిక్స్ యాంటీ కరెప్షన్ వర్కింగ్ గ్రూప్ సాధించిన పురోగతిని మేం గుర్తించాం. నోడల్ పాయింట్లు, నిపుణుల మధ్య సహకారాన్ని మెరుగుపరచడానికి 'బ్రిక్స్ ఎక్స్‌పర్ట్ నెట్‌వర్క్ ఆన్ అసెట్ రికవరీ' ఏర్పాటును మేం స్వాగతిస్తున్నాం. ఈ నెట్‌వర్క్ అభివృద్ధి చేసిన ఆచరణాత్మక సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించాలని సంబంధిత అధికారులను మేం కోరుతున్నాం. అవినీతికి పాల్పడి పరారైన నేరస్తులను గుర్తించడం, వారి అప్పగింతకు (ఎక్స్ట్రాడిషన్) మద్దతు ఇవ్వడం కోసం 'బ్రిక్స్ రిపాజిటరీ ఆన్ ఇన్‌ఫార్మల్ కోఆపరేషన్' ఏర్పాటును కూడా మేం స్వాగతిస్తున్నాం. మా దేశీయ చట్టపరమైన విధానాలకు అనుగుణంగా పరారైన నేరస్తులపై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి 'నెట్‌వర్క్ ఆఫ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాక్టీషనర్స్'ను అభివృద్ధి చేసే ప్రతిపాదనపై జరుగుతున్న చర్చలను మేం స్వాగతిస్తున్నాం. పరిపాలనలో పారదర్శకత, సమగ్రత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించటం.. నైతిక పాలన, సాంకేతికత ఆధారిత వ్యవస్థలకు సంబంధించి ఉత్తమ పద్ధతుల మార్పిడిని లక్ష్యంగా చేసుకున్న బ్రిక్స్ దేశాల కార్యక్రమాలను కూడా మేం గుర్తిస్తున్నాం. అవినీతి నిరోధక విధానాలను, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల మధ్య నిరంతర సహకారాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం. అవినీతిని ఎదుర్కోవడంలో సమర్థవంతమైన నేరస్థుల ఆస్తుల రికవరీ ప్రాముఖ్యతను మేం ప్రధానంగా చెబుతున్నాం. యూఎన్సీఏసీ, దేశీయ చట్టాలకు అనుగుణంగా ఆస్తుల రికవరీ, వాటిని వెనక్కి తీసుకురావడాన్ని సులభతరం చేసే లక్ష్యంతో ఆస్తులను గుర్తించే నెట్‌వర్క్‌లు, ఇతర ఆచరణాత్మక విధానాల ద్వారా సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని బ్రిక్స్ దేశాలను మేం కోరుతున్నాం.
-
ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేయటం, రవాణా చేయటం, వినియోగంపై నెలకొన్న పరిస్థితి పట్ల మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రజా భద్రతకు, ఆరోగ్య పరిరక్షణకు, మానవాళి శ్రేయస్సుకు తీవ్రమైన ముప్పుగా పరిణమించడంతోపాటు దేశాల సుస్థిరాభివృద్ధిని దెబ్బతీస్తోందని మేం గుర్తిస్తున్నాం. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మాదకద్రవ్యాల నిరోధక శాఖల సారథులు చేసిన 'గౌహతి ప్రకటన'ను మేం స్వాగతిస్తున్నాం. ఇది బ్రిక్స్ మాదకద్రవ్యాల నిరోధక ఏజెన్సీల మధ్య కార్యాచరణ, సాంకేతిక సహకారాన్ని మరింత సులభతరం చేస్తుంది.
-
ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు, సామాజిక ఆర్థిక అభివృద్ధిని పెంపొందించేందుకు అంతరిక్ష సాంకేతికతను వినియోగించుకోవడంలో 'బ్రిక్స్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కాన్సిస్టిలేషన్' (బ్రిక్స్ ఆర్ఎస్ఎస్‌సీ) సాధించిన విజయాలను మేం అభినందిస్తున్నాం. అంతరిక్ష వ్యవస్థల శాంతియుత వినియోగంతో సహా అంతరిక్షాన్ని శాంతియుతంగా అన్వేషించడం, ఉపయోగించడంలో అంతర్జాతీయ సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను మేం గుర్తిస్తున్నాం. బ్రిక్స్ దేశాల మధ్య అంతరిక్ష సామర్థ్యాలలో ఉన్న ప్రస్తుత అసమానతలను తగ్గించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించడంలో అంతరిక్ష వ్యర్థాల నివారణ ప్రాముఖ్యతను చాటిచెబుతూ బెంగళూరులో జరిగిన బ్రిక్స్ అంతరిక్ష సంస్థల సారథుల సమావేశంలోని చర్చలను మేం స్వాగతిస్తున్నాం. కొత్త బ్రిక్స్ అంతరిక్ష సంస్థలకు చోటు కల్పించేందుకు వీలుగా 'బ్రిక్స్ ఆర్ఎస్ఎస్‌సీ ఒప్పందానికి' సవరణలను ఖరారు చేయడం, 'బ్రిక్స్ స్పేస్ కౌన్సిల్' కోసం విధివిధానాలను రూపొందించడంలో సాధించిన గణనీయమైన పురోగతిని మేం అభినందిస్తున్నాం. 1961 ఏప్రిల్ 12న శ్రీ యూరి గగారిన్ చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష ప్రయాణపు 65వ వార్షికోత్సవాన్ని (స్వర్ణోత్సవాన్ని) మేం సాదరంగా స్వాగతిస్తున్నాం. ఈ యాత్ర అంతరిక్ష అన్వేషణలో ఒక చారిత్రక మైలురాయిగా నిలవటంతో పాటు మానవాళి మొత్తానికి కొత్త ప్రపంచపు ద్వారాలను తెరిచింది.
-
అంతరిక్ష వ్యవస్థల వినియోగంతో పాటు అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతల విజయాలను శాంతియుత ప్రయోజనాల కోసమే ఉపయోగించేలా చూడాల్సిన అవసరాన్ని మేం గుర్తిస్తున్నాం. అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించటానికి, అంతరిక్షంలో ఆయుధ పోటీని (పీఏఆర్ఓఎస్), అంతరిక్ష ఆయుధీకరణను నివారించడానికి, అంతరిక్ష వస్తువులపై బల ప్రయోగం లేదా బెదిరింపులను అరికట్టడానికి మా మద్దతును మేం మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. ప్రపంచ భద్రతను నిర్ధారించడానికి సంబంధిత చట్టపరమైన బహుపాక్షిక సాధనాన్ని ఆమోదించడానికి జరిగే చర్చలతో సహా పలు విధాలుగా ఈ దిశగా కృషి చేస్తాం. ఈ లక్ష్య సాధనలో భాగంగా 2014లో నిరాయుధీకరణ సదస్సుకు సమర్పించిన ‘అంతరిక్షంలో ఆయుధాల ఏర్పాటు నివారణ, అంతరిక్ష వస్తువులపై బెదిరింపులు లేదా బలప్రయోగంపై నూతన ముసాయిదా ఒప్పందం’ (పీపీడబ్ల్యూటీ) సమర్పణను ఒక ముఖ్యమైన అడుగుగా మేం గురిస్తున్నాం. పారదర్శకత, విశ్వాస పెంపుదల చర్యలు (టీసీబీఎంలు).. సార్వత్రిక ఆమోదం ఉన్న నిబంధనలు, నియమాలు, సూత్రాలు వంటి ఆచరణాత్మక, కట్టుబడి ఉండాల్సిన అవసరం లేని నిబద్ధతలు కూడా పీఏఆర్ఓస్‌కు దోహదపడతాయని మేం ప్రముఖంగా చెబుతున్నాం. సమగ్ర, సమ్మిళిత, సమర్థ చర్చలను సులభతరం చేయడానికి జనరల్ అసెంబ్లీలో కొందరు బ్రిక్స్ సభ్యులు ఒక ఓపెన్-ఎండెడ్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలన్న చొరవను మేం గమనించాం. ఇప్పటికే సాధించిన విజయాల ఆధారంగా పీఏఆర్ఓఎస్‌పై చట్టబద్ధమైన సాధనంలోని ముఖ్యమైన అంశాలపై ఈ ప్రక్రియలో నిర్మాణాత్మకంగా పాల్గొనడానికి మేం కట్టుబడి ఉన్నాం.
-
బ్రిక్స్ దేశాలలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి, డిజిటల్ పరివర్తనకు ఒక ప్రధాన చోదక శక్తిగా ఉన్న సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికతల (ఐసీటీలు) పరివర్తనాత్మక ప్రభావాన్ని మేం గుర్తిస్తున్నాం. ప్రతి దేశం జాతీయ ప్రాధాన్యతలు, అంతర్జాతీయ నిబద్ధతల ఆధారంగా ఈ విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మా నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. ప్రతి దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ భద్రతను గౌరవిస్తూనే తెరిచి ఉన్న, సురక్షితమైన, స్థిరమైన, అందుబాటులో ఉండే, శాంతియుతమైన, పరస్పర చర్యకు అనుకూలమైన ఐసీటీ వాతావరణానికి మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. అంతేకాకుండా అంతర్జాతీయ భద్రత నేపథ్యంలో ఐసీటీ రంగంలోని పరిణామాలు, ఐసీటీల వినియోగంలో బాధ్యతాయుతమైన దేశాల ప్రవర్తనను పెంపొందించడంపై ప్రపంచ యంత్రాంగం కార్యచరణను మేం స్వాగతిస్తున్నాం. ఐసీటీల వినియోగంలో భద్రతపై సాధారణ అవగాహనలను పెంపొందించేందుకు నిర్మాణాత్మక చర్చను ప్రోత్సహించడంలో కేంద్ర బిందువుగా ఉన్న ఐక్యరాజ్యసమితి పాత్రను మేం ప్రధానంగా చెబుతున్నాం. ఈ రంగంలో సార్వత్రిక చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంపై చర్చలు, ఐసీటీల వినియోగంలో దేశాల బాధ్యతాయుతమైన ప్రవర్తన కోసం సార్వత్రిక ఆమోదం ఉన్న నిబంధనలు, నియమాలు, సూత్రాల తదుపరి పరిశీలన ఇందులో ఉన్నాయి. సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచడానికి 'ఐక్యరాజ్యసమితి సైబర్ నేరాల నిరోధక సదస్సు' త్వరగా అమల్లోకి వచ్చేలా చూసేందుకు.. దేశీయ చట్టాలు, ప్రక్రియలు, విధానాలకు అనుగుణంగా దానిపై సంతకం చేయడానికి, ఆమోదించడానికి అన్ని దేశాలను మేం కోరుతున్నాం.
-
ఐసీటీల వినియోగంలో భద్రతను నిర్ధారించడంపై ఆచరణాత్మక సహకార రోడ్‌మ్యాప్, దాని ప్రగతి నివేదికకు అనుగుణంగా బ్రిక్స్ సహకారాన్ని ప్రోత్సహించడంలో సాధించిన పురోగతిని మేం గుర్తిస్తున్నాం. విధాన మార్పిడి, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ల (సెర్ట్లు) మధ్య ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యం, చట్టపరమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ సహకారం, సంయుక్త పరిశోధన-అభివృద్ధి వంటి రంగాల్లో బ్రిక్స్ సభ్యుల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో 'ఐసీటీల వినియోగంలో భద్రతపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్' కీలక పాత్రను మేం గుర్తిస్తున్నాం. బ్రిక్స్ అకాడమిక్, పరిశోధన మార్పిడి ప్రాముఖ్యతను మేం ప్రధానంగా చెబుతున్నాం. శాంతియుత, అభివృద్ధి ప్రయోజనాల కోసం మరింత సమగ్రమైన, అందుబాటులో ఉండే, సుస్థిరమైన, పరస్పర చర్యకు అనుకూలమైన రీతిలో ఐసీటీల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని.. దాని అనువర్తనాలు ప్రజా కేంద్రంగా ఉండేలా చూడటాన్ని మేం చెబుతున్నాం. ఐసీటీల వినియోగంలో భద్రతా ముప్పులు, మాలిసియస్ సాఫ్ట్వేర్, డేటా భద్రత, సైబర్ నేరాలు, తప్పుడు సమాచారం, విద్వేశపూరిత ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు, డీప్‌ఫేక్‌లతో సహా సాంకేతికతల దుర్వినియోగం వంటి డిజిటల్ రంగం నుంచి వస్తున్న, దానిలో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సమష్టి, సమ్మిళిత ప్రయత్నాలు చేయాలని మేం పిలుపునిస్తున్నాం. ఐసీటీ ఉత్పత్తులు, వ్యవస్థల అభివృద్ధి, భద్రత కోసం ఒక సమగ్రమైన, సమతుల్యమైన, నిష్పాక్షికమైన విధానాన్ని అలాగే సరఫరా గొలుసు భద్రత కోసం ప్రపంచవ్యాప్తంగా పరస్పరం అనుసంధానించదగిన సాధారణ నిబంధనలు- ప్రమాణాల అభివృద్ధి, అమలును మేం కోరుతున్నాం. శాంతి పరిరక్షణ, ఆర్థిక-సామాజిక అభివృద్ధికి పెరుగుతున్న టెలికమ్యూనికేషన్స్ ప్రాముఖ్యతను మేం చెబుతున్నాం. ఇది సుస్థిరమైన, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది.
-
ప్రస్తుత ప్రపంచ సవాళ్లు సంక్లిష్టంగా, ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని.. ఇవి దేశాల ఆర్థిక వృద్ధికి, సుస్థిర అభివృద్ధికి అడ్డుపడటంతో పాటు వివిధ దేశాలు, ప్రాంతాల మధ్య నిరంతరం కొనసాగుతున్న అభివృద్ధి అంతరాలను మరింత తీవ్రతరం చేస్తున్నాయని మేం గమనించాం. జాతీయ ప్రాధాన్యతలు, జాతీయ యాజమాన్యం, వివిధ అభివృద్ధి దశలను దృష్టిలో ఉంచుకొని ఆచరణాత్మకమైన, అమలు చేయదగిన ప్రతిస్పందనలే ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కీలకం అని మేం అంగీకరిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి అజెండాలో సుస్థిరాభివృద్ధి, సమ్మిళిత వృద్ధికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఈ నేపథ్యంలో సాధారణ సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడంలో చర్చలు, దౌత్యం, సహకారానికి బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని మేం పునరుద్ఘాటిస్తున్నాం.
-
ప్రపంచ ఆరోగ్య రంగ కార్యక్రమాల్లో సహకారాన్ని మరింతగా లోతుగా చేయటాన్ని మేం స్వాగతిస్తున్నాం. సుస్థిర, సమ్మిళిత, ప్రజలే కేంద్రంగా ఉండే విధానాల ద్వారా సార్వత్రిక ఆరోగ్య రక్షణను ముందుకు తీసుకెళ్లడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. బ్రిక్స్ దేశాల మధ్య ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి నిరంతర సహకారం, విలువైన అనుభవాలు, ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులను పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేం భావిస్తున్నాం. ఆరోగ్య రంగంలో బహుపాక్షిక సహకారం సంరక్షణ, బలోపేతం కావాలని మాలో ఉన్న ఉమ్మడి విశ్వాసాన్ని మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచ్‌ఓ) ఉన్న అత్యవసర సమన్వయ పాత్రను మేం చెబుతున్నాం. ఈ నేపథ్యంలో జీవసంబంధ వనరులపై దేశాల సార్వభౌమ హక్కులను, జాతీయ యాక్సెస్- బెనిఫిట్ షేరింగ్ చట్టాలతో సహా చట్టాలను రూపొందించే, అమలు చేసే సార్వభౌమ హక్కును పునరుద్ఘాటిస్తూనే సురక్షిత, సమాన, పారదర్శక, సమర్థవంతమైన బహుపాక్షిక ఫ్రేమ్‌వర్క్‌కు మద్దతుగా డబ్ల్యూహెచ్‌ఓ మహమ్మారి ఒప్పందానికి సంబంధించిన 'పాథోజెన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్' (పీఏబీఎస్) అనెక్స్ చర్చలలో నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని మేం కోరుతున్నాం.
-
చండీగఢ్‌లో జరిగిన 16వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఫలితాలను మేం స్వాగతిస్తున్నాం. క్షయవ్యాధిని (టీబీ) సమన్వయ చర్యలు, పరిశోధనలపై నిరంతర పెట్టుబడులు, పరస్పర అభ్యాసం, ఆవిష్కరణల కోసం సమర్థవంతమైన విధానాలు అవసరమయ్యే ఒక కీలకమైన ప్రపంచ ప్రజా ఆరోగ్య సవాలుగా మేం గుర్తిస్తున్నాం. టీబీని నిర్మూలించే మార్గంలో దేశాలు, సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని.. పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, టీబీ పరిశోధనలను ప్రోత్సహించే ఒక సమైక్య వేదిక ద్వారా ఇది సాధ్యమౌతుందని మేం పునరుద్ఘాటిస్తున్నాం. అంటువ్యాధుల వ్యాప్తి, జూనోటిక్ ముప్పులు, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్), ఇతర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు జాతీయ సరిహద్దులను దాటి ప్రభావం చూపుతాయని.. దీనికి బలమైన అంతర్జాతీయ సహకారం, సమయానుకులంగా సమాచారాన్ని పంచుకోవడం, సమన్వయంతో కూడిన సమష్టి చర్యలు అవసరమని గుర్తిస్తూ సుస్థిర నిఘా వ్యవస్థలు, సమర్థవంతమైన ముందస్తు హెచ్చరిక యంత్రాంగాలు, బలోపేతమైన సన్నద్ధత-ప్రతిస్పందన సామర్థ్యాల ద్వారా ప్రపంచ ఆరోగ్య భద్రతను పెంపొందించాల్సిన ప్రాముఖ్యతను మేం ప్రముఖంగా చెబుతున్నాం. కేంద్ర బిందువుగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్రను, సవరించిన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలను (2005) గుర్తిస్తూ బలమైన నిఘా, ముందస్తు హెచ్చరిక, వేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థలు, సమన్వయం ద్వారా ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన ప్రాముఖ్యతను మేం చెబుతున్నాం. ఈ నేపథ్యంలో సామూహిక అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం 'బ్రిక్స్ సమీకృత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ'ను ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రత్యేక సబ్-వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును, దాని విధివిధానాలను మేం స్వాగతిస్తున్నాం.
-
వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారంపై ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పరిధిని అన్ని బ్రిక్స్ సభ్య దేశాల నియంత్రణ అధికారులకు విస్తరించడం ద్వారా బ్రిక్స్ వైద్య ఉత్పత్తుల నియంత్రణ అధికారుల మధ్య మెరుగైన సహకారాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం. నాణ్యమైన, సురక్షితమైన, సమర్థవంతమైన వైద్య ఉత్పత్తులు నిరంతరం అందుబాటులో ఉండేలా, సులభంగా లభించేలా చూడటానికి సహకార నియంత్రణ విధానాలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఈ నేపథ్యంలో నియంత్రణ అనుభవాలు, సాంకేతిక విధానాలకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను క్రోడీకరిస్తూ 'బ్రిక్స్ జీఎక్స్‌పీ వైట్ పేపర్'ను తయారుచేయటంలో బ్రిక్స్ నియంత్రణ అధికారుల సమష్టి కృషిని మేం స్వాగతిస్తున్నాం.
-
ప్రజలే కేంద్రంగా ఉండే డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై సహకారాన్ని బలోపేతం చేయడానికి మా నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందుబాటులో ఉంచడంతో సహా నిరంతర సంరక్షణ కోసం 'డిజిటల్ హెల్త్ ఆర్కిటెక్చర్'పై రూపొందించిన బ్రిక్స్ సంకలనాన్ని ఒక విలువైన విజ్ఞాన వనరుగా మేం స్వాగతిస్తున్నాం.
-
స్థూలకాయం, అసంక్రమిత వ్యాధులు (ఎన్సీడీ) ప్రధాన ప్రపంచ ప్రజా ఆరోగ్య సవాళ్లుగా ఉద్భవించాయని మేం గుర్తిస్తున్నాం. ఏకోన్ముఖ ప్రభుత్వం, ఏకోన్ముఖ సమాజం భాగస్వామ్యంతో నివారణ, ఆరోగ్య పరిరక్షణ సంరక్షణను బలోపేతం చేయడానికి మా నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఈ నేపథ్యంలో 'బ్రిక్స్ మిషన్ ఫర్ హెల్తీ లైఫ్‌స్టైల్', 'బ్రిక్స్ రోడ్‌మ్యాప్ ఫర్ ది జాయింట్ ఇనిషియేటివ్ ఆన్ హెల్తీ లైఫ్‌స్టైల్ ప్రమోషన్ (2026–2029)' ప్రారంభాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఆరోగ్యకరమైన జీవనశైలిపై పునరావృతం చేయదగిన ఉత్తమ పద్ధతుల సంకలనాన్ని కూడా మేం స్వాగతిస్తున్నాం. మానసిక ఆరోగ్య శ్రేయస్సును ప్రోత్సహించటాన్ని ఆరోగ్యం, సుస్థిరాభివృద్ధిలో ఒక కీలకమైన ఆధారంగా మేం గుర్తిస్తున్నాం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) సమన్వయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా (సీఓఈ) వ్యవహరిస్తూ 'బ్రిక్స్ ట్రైనింగ్ హబ్ నెట్‌వర్క్', 'బ్రిక్స్ నెట్‌వర్క్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)' ఏర్పాటుకు మేం మద్దుతునిస్తున్నాం. బ్రిక్స్ దేశాలవ్యాప్తంగా సహకార పరిశోధనలు, విధాన చర్చలు, ఉత్తమ పద్ధతుల మార్పిడి, ఫలితాల ఆధారిత మానసిక ఆరోగ్య ప్రోత్సాహక వ్యూహాల సహాభివృద్ధిని సులభతరం చేయడానికి ఈ 'నెట్‌వర్క్ ఆఫ్ సీఓఈ' ఒక వేదికగా పనిచేస్తుంది. ప్రతి బ్రిక్స్ సభ్య దేశం నుంచి నియామకమైన ప్రతినిధుల బృందం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా నెట్‌వర్క్ ఆఫ్ సీఓఈ' సమన్వయాన్ని సంయుక్తంగా పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా సమతుల్య నిర్ణయాధికారం, ఉమ్మడి జవాబుదారీతనం సాధించడంతో పాటు లోతైన శాస్త్రీయ, సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో మానసిక శ్రేయస్సును సుస్థిరంగా, సమర్థవంతంగా అనుసంధానించొచ్చు. మానసిక ఆరోగ్య పరిరక్షణను ప్రోత్సహించడంపై రూపొందించిన ఉత్తమ పద్ధతుల సంకలనాన్ని కూడా మేం స్వాగతిస్తున్నాం.
-
సంక్షోభాల వల్ల మానసిక ఆరోగ్యంపై పడే దుష్ప్రభావ సమస్యను పరిష్కరించాల్సిన ప్రాముఖ్యతను మేం చెబుతున్నాం. ప్రభావిత జనాభాకు ముఖ్యంగా పిల్లలు, కిశోరప్రాయాలతో సహా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు సకాలంలో, సులభంగా అందుబాటులో ఉండే సుస్థిర మానసిక ఆరోగ్య, సైకో-సోషల్ (ఎంహెచ్పీఎస్ఎస్) జోక్యాలను అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం.
-
ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో, సార్వత్రిక ఆరోగ్య రక్షణకు (యూహెచ్‌సీ) తోడ్పడటంలో సంప్రదాయ, పరిపూరకరమైన, సమగ్ర వైద్యానికి (టీసీఐఎం) పెరుగుతున్న ప్రాముఖ్యతను మేం గుర్తిస్తున్నాం. సభ్య దేశాల మధ్య చర్చలు, సహకారం, మార్పిడికి ఒక వేదికగా బ్రిక్స్ ఆరోగ్య రంగం కింద 'టీసీఐఎంపై బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్' ఏర్పాటును మేం స్వాగతిస్తున్నాం. చికిత్స, నివారణ ప్రయోజనాలు కలిగిన ఔషధ మొక్కలు, మూలికా తయారీలపై సమన్వయ పరిశోధనకు ఉన్న ప్రాముఖ్యతను మేం చెబుతున్నాం. తద్వారా సభ్య దేశాల ఉమ్మడి సంప్రదాయ ఫార్మకోపియాస్ సురక్షితమైన, ప్రభావవంతమైన, సరసమైన చికిత్సా ఉత్పత్తుల అభివృద్ధికి పునాదిగా ఉపయోగపడతాయి. జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఫలితాల ఆధారిత విధానాలు, తగిన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ల ద్వారా టీసీఐఎం పద్ధతులు, ఉత్పత్తుల నాణ్యత, భద్రత, సమర్థతను నిర్ధారించవలసిన ప్రాముఖ్యతను మేం పునరుద్ఘాటిస్తున్నాం.
-
అభివృద్ధి చెందుతున్న దేశాలు, అల్పాభివద్ధి దేశాలలో సుస్థిర, అధునాతనమైన ఆరోగ్య వ్యవస్థను నిర్ధారించడానికి ఆరోగ్య సిబ్బందిని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను మేం చెబుతున్నాం. ఈ నేపథ్యంలో సామర్థ్య పెంపు, శిక్షణ, పరిశోధన తదితర రంగాల్లో బ్రిక్స్ సహకారాన్ని మరింత విస్తరించాలని మేం పిలుపునిస్తున్నాం.
-
విధాన మార్గదర్శకత్వం, ఆరోగ్య సిబ్బంది అభివృద్ధి, వ్యాధి నిఘా, అత్యవసర సన్నద్ధత-ప్రతిస్పందన, ప్రజారోగ్య ల్యాబోరేటరీల వ్యవస్థలు, అనువర్తిత పరిశోధనల ద్వారా ప్రజా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో 'జాతీయ ప్రజా ఆరోగ్య సంస్థల' (ఎన్పీహెచ్ఐల) కీలక పాత్రను మేం గుర్తిస్తున్నాం. ఆరోగ్య ఫలితాలలో అసమానతలను తగ్గించే విషయంలో పురోగతిని వేగవంతం చేయడానికి, సమష్టి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి బహుళ రంగాల సహకారం, ఉత్తమ పద్ధతుల మార్పిడి, డిజిటల్ ఆరోగ్యంతో సహా వినూత్న ఆరోగ్య సాంకేతికతల ద్వారా సామాజిక ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా వచ్చే వ్యాధులను (డీడీ-ఎస్డీహెచ్) పరిష్కరించాల్సిన ప్రాముఖ్యతను మేం అంగీకరిస్తున్నాం. అందువల్ల బ్రిక్స్ సభ్య దేశాల సమష్టి చర్యలను బలోపేతం చేయడానికి జాతీయ పరిస్థితులకు అనుగుణంగా సహకార వేదికలుగా ‘ఎన్పీహెచ్ఐలు, డీడీ-ఎస్‌డీహెచ్‌పై కార్యాచరణ ఫ్రేమ్‌వర్క్‌లను’ మేం ఆమోదిస్తున్నాం. 'బ్రిక్స్ వ్యాక్సిన్ ఆర్-డీ సెంటర్' కార్యకలాపాలకు మేం మద్దతునిస్తున్నాం. అణు వైద్యంలో సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాం. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఈ రంగంలో నిరంతర సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి 'బ్రిక్స్ అణు వైద్య వర్కింగ్ గ్రూప్' కార్యకలాపాలను మేం స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ ఫ్రేమ్‌వర్క్‌లో పరిశోధనా ఫలితాలను ప్రచారం చేసేందుకు, శాస్త్రీయ సహకారాన్ని ప్రోత్సహించడంలో 'బ్రిక్స్ హెల్త్ జర్నల్' ప్రాముఖ్యతను మేం గమనిస్తున్నాం. దాని అభివృద్ధిలో బ్రిక్స్ దేశాలు నిరంతరం భాగస్వామ్యం వహించాలని కోరుతున్నాం.
-
భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మెరుగైన నిఘా వ్యవస్థలు, ల్యాబ్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ ఆరోగ్య సాంకేతికత, కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడం, ఆరోగ్య వ్యవస్థల్లో సంప్రదాయ వైద్యాన్ని కలపటం ద్వారా ఆరోగ్య మౌలిక సదుపాయాలను, వైద్య ఉత్పత్తుల స్థానిక ఉత్పత్తిని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను మేం చెబుతున్నాం. ప్రజా ఆరోగ్య సంస్థల మధ్య సాంకేతిక సహకారం, పటిష్ఠమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ల అభివృద్ధి, నైపుణ్యం కలిగిన ఆరోగ్య కార్యకర్తలు, సహకార పరిశోధన-అభివృద్ధిని పెంపొందించాలి. అలాగే ఆరోగ్య సంరక్షణ సేవలు, టీకాలు, చికిత్సా విధానాలు, రోగ నిర్ధారణ పరీక్షలు సకాలంలో, అందుబాటు ధరలకు, సమానంగా అందేలా చూడటానికి సామర్థ్య పెంపు, శిక్షణ ఎంతో అవసరమని మేం భావిస్తున్నాం.
-
ప్రపంచ ఆహార ఉత్పత్తిలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్న అంశాన్ని మేం గుర్తిస్తున్నాం. అందువల్ల వ్యవసాయ ఉత్పాదకతను, సుస్థిరతను పెంపొందించడంలో.. ప్రపంచ ఆహార భద్రతను, పోషకాహారాన్ని నిర్ధారించడంలో ఇవి అత్యంత కీలకమైన పాత్రను కలిగి ఉన్నాయి. ఆహార భద్రత- పోషకాహారాన్ని నిర్ధారించడం, తీవ్రంగా ఉండే ఆహార ధరల అస్థిరత ప్రభావాలను తగ్గించడం, ఎరువుల కొరతతో సహా ఆకస్మిక సరఫరా సంక్షోభాలను నివారించటానికి ఉన్న ప్రాముఖ్యతను మేం ప్రధానంగా చెబుతున్నాం. ఈ నేపథ్యంలో బ్రిక్స్ పరిధిలో 'ధాన్యపు వాణిజ్య వేదిక'ను (బ్రిక్స్ గ్రైన్ ఎక్స్ఛేంజ్) ఏర్పాటు చేసే చొరవపై నిరంతరం పనిచేయాల్సిన ప్రాముఖ్యతను అంగీకరిస్తున్నాం. దీని పనితీరుకు సంబంధించిన విధివిధానాలు, తదుపరి అభివృద్ధి.. ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, వస్తువులకు దీనిని విస్తరించడంపై మరిన్ని చర్చలను మేం స్వాగతిస్తున్నాం. ఆహార లభ్యత, ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం, వినియోగం, స్థిరత్వం, అందుబాటు ధరలను పెంపొందించే జాతీయ విధానాలపై, అంతర్జాతీయ సమన్వయంపై మరిన్న చర్చలకు మేం మద్దతునిస్తున్నాం. బ్రిక్స్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయ ఆహార నిల్వ వ్యవస్థలు, కరువును తట్టుకునే- వాతావరణ అనుకూల విత్తన వ్యవస్థలు వంటి సరఫరా అంతరాయాలను ఎదుర్కొనే జాతీయ సామర్థ్యాలను బలోపేతం చేసే వ్యవసాయ, ఆహార ఉత్పత్తి వస్తువులకు కూడా ఇది వర్తిస్తుంది. ఆహార భద్రత, పోషకాహారంపై 'దక్కన్ ఉన్నత-స్థాయి సూత్రాల' ఆధారంగా అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి 'గ్లోబల్ అలయన్స్ ఎగైనెస్ట్ హంగర్ అండ్ పావర్టీ' ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మేం గుర్తిస్తున్నాం. సుస్థిర- వివక్షత లేని సరఫరా గొలుసులను ప్రోత్సహించడం, విలువ గొలుసులు- సుస్థిర వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడం ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ- ఆహార ఉత్పత్తి వస్తువుల బ్రిక్స్ దేశాల వాణిజ్యాన్ని సులభతరం చేయడంపై చర్చల కోసం మేం ఎదురుచూస్తున్నాం. జాతీయ చట్టాలకు అనుగుణంగా చిన్నకారు రైతులు, పశుపోషకులు, సంప్రదాయ- చిన్నతరహా మత్స్యకారులు, ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారులు, దేశీయ ప్రజలు, స్థానిక సమాజాలు, మహిళలు, యువకులు వ్యవసాయ, ఆహార వ్యవస్థలలో అత్యవసరమైన భాగస్వాములని మేం గుర్తిస్తున్నాం.
-
ఇండోర్‌లో జరిగిన 16వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం ఫలితాలను మేం స్వాగతిస్తున్నాం. సంబంధిత జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ పద్ధతుల ఆధారంగా సహకారపూరితమైన, కట్టుబాటు అవసరం లేని, రైతు కేంద్రంగా పనిచేసే 'బ్రిక్స్ అగ్రిన్' (అగ్రో-ఇన్పుట్స్, జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్) ఏర్పాటుకు మేం అంగీకరిస్తున్నాం. ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి, సమర్థవంతమైన విధానాలను ప్రోత్సహించడానికి, వ్యవసాయం- విత్తన వ్యవస్థలకు సంబంధించిన సంప్రదాయ విజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేయడం, పంచుకోవడాన్ని ప్రోత్సహించడానికి 'గ్లోబల్ ఫోరమ్ ఆన్ ఫార్మర్స్ రైట్స్ ఇన్ సీడ్ సిస్టమ్స్' ప్రారంభాన్ని కూడా మేం స్వాగతిస్తున్నాం.
-
అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తిని, ఉత్పాదకతను పెంపొందించడానికి 'ఆగ్రోఎకాలజీ, పునరుత్పత్తి వ్యవసాయంపై బ్రిక్స్ నెట్‌వర్క్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్'.. అటవీ వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్‌తో కూడిన 'డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ నెట్‌వర్క్' ఏర్పాటు ద్వారా వ్యవసాయంలో సహకారాన్ని బలోపేతం చేయడాన్ని మేం స్వాగతిస్తున్నాం. 'మత్స్య, ఆక్వాకల్చర్ అభివృద్ధిపై బ్రిక్స్ చర్చ' కింద మరింత సహకారాన్ని అందించాలని మేం కోరుకుంటున్నాం.
-
ప్రస్తుత మంత్రివర్గ ఆదేశాలు, డబ్ల్యూటీఓ వ్యవసాయ ఒప్పందానికి (ఏఓఏ) అనుగుణంగా ప్రపంచ వాణిజ్య సంస్థలో (డబ్ల్యూటీఓ) వ్యవసాయ చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మా నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆదేశిత అంశాలపై పురోగతి సాధించడం.. నిష్పక్షపాతమైన, సమతుల్యమైన, అభివృద్ధి-ఆధారిత వ్యవసాయ వాణిజ్య వ్యవస్థను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. మారుతున్న విధానపరమైన, నియంత్రణపరమైన పరిణామాలు వ్యవసాయ ఉత్పత్తి-వాణిజ్యంపై, ఆహార భద్రతపై.. చిన్నకారు రైతులు, కుటుంబ రైతుల జీవనోపాధిపై క్రమంగా ప్రభావం చూపుతున్నాయన్న విషయాన్ని మేం గుర్తిస్తున్నాం. ప్రపంచ సుస్థిర వంటనూనెల రంగంలో సుస్థిరత, సమ్మిళితత్వం, సమానమైన మార్కెట్ యాక్సెస్‌ను ప్రోత్సహించడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలను కూడా మేం స్వాగతిస్తున్నాం.
-
సామాజిక ఆర్థిక అభివృద్ధికి, జాతీయ భద్రతకు.. అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత అత్యంత కీలకమైన ఆధారమని మేం గుర్తిస్తున్నాం. ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని నిర్ధారించడం ద్వారా, విభిన్న వనరుల నుంచి నిరంతర ఇంధన సరఫరాను కొనసాగించడం ద్వారా, విలువ గొలుసులను బలోపేతం చేయడం ద్వారా సరిహద్దు మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాల రక్షణను, సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరాన్ని మేం ప్రధానంగా చెబుతున్నాం. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ప్రపంచ ఇంధన మిశ్రమంలో శిలాజ ఇంధనాలు ఇప్పటికీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని మేం అంగీకరిస్తున్నాం. మా వాతావరణ లక్ష్యాలకు అనుగుణంగా గ్రీన్‌హౌస్ వాయు (జీహెచ్జీ) ఉద్గారాలను తగ్గించడం, ఎస్‌డీజీ-7 నిబంధనలను పాటించడం, సాంకేతిక తటస్థత సూత్రాలు, ఉమ్మడి బాధ్యతలు, జాతీయ పరిస్థితులు, అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని న్యాయమైన, క్రమబద్ధమైన, సమ్మిళిత ఇంధన మార్పులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని మేం గుర్తిస్తున్నాం. బ్రిక్స్ ఇంధన చర్చల్లో మహిళలు, యువకుల భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయడానికి 'బ్రిక్స్ ఎనర్జీ రీసెర్చ్ కోఆపరేషన్ ప్లాట్‌ఫామ్' (ఈఆర్‌సీపీ) చేస్తున్న కృషిని, 'బ్రిక్స్ యూత్ ఎనర్జీ సమ్మిట్' నిర్వహణను మేం స్వాగతిస్తున్నాం.
-
కృత్రిమ మేధస్సు, అధునాతన డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలతో సహా ఇంధన వ్యవస్థలలో పెరుగుతున్న డిజిటలైజేషన్ పాత్రను మేం ప్రముఖంగా చెబుతున్నాం. ఇవి సిస్టమ్ ప్లానింగ్, గ్రిడ్ మేనేజ్మెంట్, పునరుత్పాదక ఇంధన అనుసంధానం, నిర్వహణ సామర్థ్యం, సైబర్-సురక్షితమైన ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి గణనీయమైన అవకాశాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో 'స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వపై బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను' మేం స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ ఈఆర్‌సీపీ స్మార్ట్ గ్రిడ్స్ వర్క్‌స్ట్రీమ్ కింద 'స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ కోసం బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటుపై బ్రిక్స్ అధ్యక్ష దేశం తీసుకున్న చొరవను మేం గమనిస్తున్నాం. ఇది సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక స్వచ్ఛంద చర్చా యంత్రాంగంగా పనిచేస్తుంది.
-
జాతీయ పరిస్థితులను ప్రతిబింబించేలా సమతుల్య, వైవిధ్యమైన ఇంధన మిశ్రమాల ప్రాముఖ్యతను మేం ప్రధానంగా చెబుతున్నాం. ఎస్డీజీల సాధనలో, ఇంధన భద్రతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పునరుత్పాదక ఇంధనం, బయోఎనర్జీ, శిలాజ ఇంధనాలు, అణు శక్తి, జలవిద్యుత్, హైడ్రోజన్, తక్కువ కార్బన్ సాంకేతికతలు, ఇంధన నిల్వ సాంకేతికతలతో సహా అత్యంత విస్తృత శ్రేణి ఇంధన వనరులు, సాంకేతికతలు అవసరమని మేం గుర్తిస్తున్నాం. ఇంధన రంగ చర్చల ద్వారా అందుబాటులో ఉన్న అన్ని ఇంధన వనరుల పాత్రను, సుస్థిరమైన ఇంధన సరఫరా గొలుసులను, బ్రిక్స్ దేశాల మధ్య మెరుగైన సహకారాన్ని మేం చెబుతున్నాం. ఈ నేపథ్యంలో సున్నా లేదా తక్కువ-ఉద్గారాల హైడ్రోజన్ కోసం పరస్పరం అనుకూలమైన ప్రమాణాలు, ధ్రువీకరణ ఫ్రేమ్‌వర్క్‌లపై బ్రిక్స్ సహకారాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం. అలాగే ఈ అంశానికి సంబంధించి 'బ్రిక్స్ జాయింట్ రిపోర్ట్ ఆన్ హైడ్రోజన్ వాల్యూ చైన్స్'పై జరుగుతున్న నిరంతర కృషిని అభినందిస్తున్నాం.
-
ఖనిజ వనరులపై తమ సార్వభౌమ హక్కులను పూర్తిగా కాపాడుకుంటూనే వనరులు సమృద్ధిగా ఉన్న దేశాల్లో ప్రయోజనాల పంపిణీ, విలువ జోడింపు, ఆర్థిక వైవిధ్యీకరణను హామీ ఇవ్వడానికి అవసరమైన కీలక ఖనిజాల నమ్మకమైన, బాధ్యతాయుతమైన, వైవిధ్యమైన, సుస్థిరమైన, న్యాయమైన సరఫరా గొలుసులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని మేం ధ్రువీకరిస్తున్నాం. అలాగే చట్టబద్ధమైన ప్రజా విధాన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన చర్యలను ఆమోదించే, నిర్వహించే, అమలు చేసే వారి హక్కును మేం గౌరవిస్తాం. శూన్య- తక్కువ ఉద్గారాల ఇంధన సాంకేతికతల అభివృద్ధికి, ఇంధన భద్రతకు, ఇంధన సరఫరా గొలుసుల స్థిరత్వానికి కీలక ఖనిజాలు పోషించే కీలక పాత్రను మేం గుర్తిస్తున్నాం.
-
వేగంగా మారుతున్న పారిశ్రామిక రంగంలో ఆసక్తులు, సవాళ్లు, అవకాశాలను గుర్తించడానికి ఒక మార్గదర్శక వేదికగా పనిచేస్తున్న 'కొత్త పారిశ్రామిక విప్లవంపై భాగస్వామ్యం' (పార్ట్‌నిర్) కింద సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఆవిష్కరణలను పెంపొందించడంలో, ఇండస్ట్రీ 4.0తో ముడిపడి ఉన్న రంగాలతో సహా సాంకేతిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, బ్రిక్స్ అంతర్గత వేదికలు-మార్పిడుల ద్వారా అంకురాలు- ఎస్ఎంఈల మధ్య మరింత లోతైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థల ముఖ్యమైన పాత్రను మేం ప్రధానంగా చెబుతున్నాం. పార్ట్‌నిర్ ఫ్రేమ్‌వర్క్ కింద కొనసాగుతున్న రంగాల వారీ వర్కింగ్ గ్రూప్‌ల ప్రయత్నాలకు మా మద్దతును మేం పునరుద్ఘాటిస్తున్నాం. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏర్పాటైన యంత్రాంగాలను ఉపయోగించుకోవాలని మేం బ్రిక్స్ సభ్య దేశాలను కోరుతున్నాం. 2026లో 'బ్రిక్స్ ఫోరమ్ ఆన్ పార్ట్‌ని'తో సహా పలు కార్యక్రమాలను నిర్వహించడంలో 'బ్రిక్స్ పార్ట్‌నిర్ ఇన్నోవేషన్ సెంటర్' (బీపీఐసీ) చేస్తున్న కృషిని మేం అభినందిస్తున్నాం. ఆవిష్కరణ ఆధారిత వృద్ధి కోసం అంకురాలను ప్రోత్సహించే సంభావ్య యంత్రాగంగా 'బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్' ఏర్పాటును, 'బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్' ఏర్పాటుపై మరింత పరిశీలనను మేం స్వాగతిస్తున్నాం. 'బ్రిక్స్ స్టార్టప్ నాలెడ్జ్ హబ్', 'బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్'లను బలపరిచే ప్రయత్నాలను కూడా మేం అభినందిస్తున్నాం.
-
ఆర్థిక వృద్ధి, నిర్మాణపరమైన పరివర్తనను సాధించడంలో పారిశ్రామిక రంగం పోషించే కీలక పాత్రను గుర్తిస్తున్నాం. ఇన్పుట్ల అనుసంధానాన్ని సులభతరం చేయడానికి, తయారీ పరిశ్రమ ఎగుమతులు, ఎంఎస్ఎంఈల మార్కెట్ యాక్సెస్‌ను పెంచడానికి, సాంకేతిక బదిలీ-సహకారానికి, ఉత్పాదకతను పెంపొందించడానికి, పర్యావరణ సుస్థిరతను నిర్ధారించడానికి, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, పారిశ్రామికీకరణ కోసం ఇతర జాతీయ కార్యక్రమాల ద్వారా పారిశ్రామికవేత్తలను, అంకుర ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మేం అంగీకరిస్తున్నాం.
-
బ్రిక్స్ పారిశ్రామిక సహకారానికి సంబంధించిన ఏడు ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ల కృషిని మేం గుర్తిస్తున్నాం. వాటి విజయాలను అభినందిస్తున్నాం. 'ఫోటోవోల్టాయిక్ ఇండస్ట్రీ వర్కింగ్ గ్రూప్' నిబంధనలు, యాక్షన్ ప్లాన్ ఆమోదాన్ని మేం స్వాగతిస్తున్నాం. విధానపరమైన అప్డేట్లు, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ప్రతి బ్రిక్స్ సభ్య దేశం తన సొంత నాలెడ్జ్ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని.. సాంకేతిక సహకారం, ఫైనాన్సింగ్, సామర్థ్య పెంపు కోసం ప్రాధాన్యతా రంగాలను గుర్తించడానికి 'బ్రిక్స్ సోలార్ ఫోటోవోల్టాయిక్ కోఆపరేషన్ రోడ్‌మ్యాప్' అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని మేం కోరుతున్నాం. స్మార్ట్ ఫ్యాక్టరీ 69. అభివృద్ధి, పరిష్కారాల భాగస్వామ్యం, ప్రమాణాల సహకారం, ప్రతిభావంతులను ప్రోత్సహించటంపై కార్యక్రమాలను రూపొందించడానికి 'ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రోబోటిక్స్ వర్కింగ్ గ్రూప్' చేపట్టిన ప్రయత్నాలను మేం గుర్తిస్తున్నాం. బ్రిక్స్ దేశాల ప్రయోజనం కోసం 'కెమికల్ ఇండస్ట్రీ వర్కింగ్ గ్రూప్' పరిధిలో రసాయన ఉత్పత్తి రంగంలో డిజిటలైజేషన్, సుస్థిరత, ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను మేం గుర్తిస్తున్నాం.
70.బ్రిక్స్ పారిశ్రామిక సహకారానికి సంబంధించిన ఏడు ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ల కృషిని మేం గుర్తిస్తున్నాం. వాటి విజయాలను అభినందిస్తున్నాం. 'ఫోటోవోల్టాయిక్ ఇండస్ట్రీ వర్కింగ్ గ్రూప్' నిబంధనలు, యాక్షన్ ప్లాన్ ఆమోదాన్ని మేం స్వాగతిస్తున్నాం. విధానపరమైన అప్డేట్లు, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ప్రతి బ్రిక్స్ సభ్య దేశం తన సొంత నాలెడ్జ్ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని.. సాంకేతిక సహకారం, ఫైనాన్సింగ్, సామర్థ్య పెంపు కోసం ప్రాధాన్యతా రంగాలను గుర్తించడానికి 'బ్రిక్స్ సోలార్ ఫోటోవోల్టాయిక్ కోఆపరేషన్ రోడ్‌మ్యాప్' అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని మేం కోరుతున్నాం. స్మార్ట్ ఫ్యాక్టరీ అభివృద్ధి, పరిష్కారాల భాగస్వామ్యం, ప్రమాణాల సహకారం, ప్రతిభావంతులను ప్రోత్సహించటంపై కార్యక్రమాలను రూపొందించడానికి 'ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రోబోటిక్స్ వర్కింగ్ గ్రూప్' చేపట్టిన ప్రయత్నాలను మేం గుర్తిస్తున్నాం. బ్రిక్స్ దేశాల ప్రయోజనం కోసం 'కెమికల్ ఇండస్ట్రీ వర్కింగ్ గ్రూప్' పరిధిలో రసాయన ఉత్పత్తి రంగంలో డిజిటలైజేషన్, సుస్థిరత, ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను మేం గుర్తిస్తున్నాం.
71. ఎస్ఎంఈ వర్కింగ్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమాలను మేం గుర్తించాం. అధ్యక్ష హోదాలో ఆగ్రా వేదికగా తొలి బ్రిక్స్ ఎస్ఎంఈ ఫోరంను నిర్వహించిన, "బ్రిక్స్‌లో ఎంఎస్ఎంఈ పోటీతత్వాన్ని పెంపొందించడం: ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానానికి యాక్సెస్‌ను బలోపేతం చేయడం, సుస్థిర వృద్ధి" అనే శీర్షికతో నివేదికను సమర్పించిన భారత్‌ను అభినందిస్తున్నాం. బ్రిక్స్ దేశాల్లోని ఎంఎస్ఎంఈల మధ్య సహకారాన్ని పెంపొందించడం, ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం, సమ్మిళిత వృద్ధికి సంబంధించి దీని పరిధిని గుర్తిస్తూ... రెండో ఎస్ఎంఈ పోరం నిర్వహణకూ మేం మద్దతునిస్తున్నాం. ఈ విషయంలో, ఎస్ఎంఈ వర్కింగ్ గ్రూప్‌లోని సహకార విధాన ప్రణాళికనూ మేం స్వాగతిస్తున్నాం.
72. యూఎన్ఐడీవో సహకారంతో స్థాపించిన బ్రిక్స్ పారిశ్రామిక సామర్థ్యాల కేంద్రం కార్యాచరణను... బ్రిక్స్ దేశాల్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ఎంఈలు) సహా తయారీ రంగ కంపెనీలకు ఇండస్ట్రీ 4.0, అధునాతన డిజిటల్ ఉత్పత్తి సాంకేతికతల వినియోగంలో మద్దతునివ్వడానికి జరుగుతున్న కృషిని మేం అభినందిస్తున్నాం. ప్రతి సభ్య దేశ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా, సముచితంగా, కృత్రిమ మేధ సహా అభివృద్ధి చెందుతున్న సరికొత్త సాంకేతికతల ద్వారా నూతన పారిశ్రామికీకరణకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవడాన్ని ఈ వేదిక సులభతరం చేస్తుందని మేం గమనిస్తున్నాం. బ్రిక్స్ పారిశ్రామిక సహకారంపై ఒక సంకలనాన్ని విడుదల చేయడానికి చైనా బ్రిక్స్ పారిశ్రామిక సామర్థ్యాల కేంద్రం (సీసీబీఐసీ) తీసుకున్న చొరవనూ మేం గమనిస్తున్నాం. భారత బ్రిక్స్ పారిశ్రామిక సామర్థ్యాల కేంద్రం (ఐసీబీఐసీ) ఏర్పాటునూ స్వాగతిస్తున్నాం. అన్ని బ్రిక్స్ దేశాలతో తన సంబంధాలను బలోపేతం చేసుకునేలా మేం బీసీబీఐసీని ప్రోత్సహిస్తున్నాం.
73. సుస్థిర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కీలక చోదకంగా విజ్ఞాన, సాంకేతిక, ఆవిష్కరణల (ఎస్‌టీఐ) రంగాల్లో సహకారం ప్రాముఖ్యతను మేం స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంగా 14 థీమాటిక్ బ్రిక్స్ ఎస్‌టీఐ వర్కింగ్ గ్రూపులు, బ్రిక్స్ ఎస్‌టీఐ స్టీరింగ్ కమిటీ కృషినీ ప్రశంసిస్తున్నాం. సుస్థిర అభివృద్ధికి, నాణ్యమైన కొత్త ఉత్పాదక శక్తులను అభివృద్ధి చేయడానికి, మరింత సమర్థమైన, అధిక-నాణ్యతతో కూడిన వృద్ధిని పెంపొందించడానికి, సామాజిక సమ్మిళితత్వానికి, బ్రిక్స్ దేశాల ప్రజల సంక్షేమం, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉత్ప్రేరకాలుగా... ఆవిష్కరణలు, సాంకేతికతను ప్రోత్సహించడం పట్ల మా నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. మా ఎస్‌టీఐ మంత్రుల సమావేశం తీర్మానించిన చెన్నై ఏకాభిప్రాయ ఉమ్మడి ప్రకటననూ మేం స్వాగతిస్తున్నాం. డేటా భద్రత, మేధో సంపత్తి హక్కులు, సంబంధిత జాతీయ విధానాలను గౌరవిస్తూ... జాతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా, స్వచ్ఛంద ప్రాతిపదికన బ్రిక్స్ దేశాల మధ్య జ్ఞానాన్ని నిల్వ చేయడానికి, పంచుకోవడానికి ఒక నిర్మాణాత్మక వేదికగా భావిస్తున్న బ్రిక్స్ సైన్స్-రీసెర్చ్ రిపోజిటరీనీ మేం గుర్తిస్తున్నాం. దాని ముసాయిదా విధాన ప్రణాళిక పత్రాన్ని గమనిస్తున్నాం. క్వాంటం టెక్నాలజీల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సహకారాన్నీ మేం అభినందిస్తున్నాం. పరిశోధన మౌలిక సదుపాయాలు, మెగాసైన్స్ ప్రాజెక్టుల కార్యాచరణ ప్రణాళికపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఆమోదాన్నీ, బ్రిక్స్ గ్లోబల్ రీసెర్చ్ అడ్వాన్స్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్ (గ్రెయిన్) కేంద్రాలు, సంయుక్త సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదననూ మేం స్వాగతిస్తున్నాం.
74. బ్రిక్స్ దేశాలకు సముద్రగర్భ కేబుల్ మౌలిక సదుపాయాలను... అంతర్జాతీయ డిజిటల్ అనుసంధానానికి, నెట్‌వర్క్ పటిష్ఠతకూ ముఖ్యమైన పునాదిగా మేం గుర్తిస్తున్నాం. బ్రిక్స్ దేశాల మధ్య సముద్రగర్భ కేబుళ్ల ద్వారా ఒక హై-స్పీడ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి "సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం" చేపట్టాలనే చర్చను స్వాగతించిన 2025 రియో డి జనీరో ప్రకటనను అనుసరించి... "బ్రిక్స్ కేబుల్ అవసరాలు: డైరెక్టివ్ బ్రీఫ్" అనే పత్రాన్ని రూపొందించిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సమన్వయాన్ని మేం అభినందిస్తున్నాం. ఈ విషయంగా జాతీయ పరిస్థితులు, ప్రాధాన్యాలకు అనుగుణంగా... బ్రిక్స్ దేశాల మధ్య స్వచ్ఛంద ప్రాతిపదికన చర్చలు, సహకారం కొనసాగించేందుకు మేం మద్దతునిస్తున్నాం. జాతీయ ప్రాధాన్యాలు, నిబంధనలను గౌరవిస్తూ... సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం తదుపరి దశలను ప్రతిపాదించడానికి, ఈ చర్చలను టాస్క్‌ఫోర్స్‌లోనే కొనసాగించేలా మేం బ్రిక్స్ ఎస్‌టీఐ స్టీరింగ్ కమిటీని ప్రోత్సహిస్తున్నాం. మరింత పురోగతి కోసం బ్రిక్స్ ఐసీటీ ట్రాక్, ఎస్‌టీఐ ట్రాక్ మధ్య సమన్వయం మెరుగుపడాలని, జరిగిన పని పునరావృతం కాకుండా నివారించాలని ఆశిస్తున్నాం.
75. ఉమ్మడి శాస్త్రీయ పరిశోధనలకు నిధులు సమకూర్చే ప్రధాన యంత్రాంగంగా పనిచేస్తున్న బ్రిక్స్ ఎస్‌టీఐ విధాన ప్రణాళిక కార్యక్రమం పదేళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భాన్ని మేం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 2026 అక్టోబర్‌లో రష్యాలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాన్నీ మేం గమనిస్తున్నాం. మొదటి ఇన్నోవేషన్ కాల్, పైలట్ ఫ్లాగ్‌షిప్ కాల్, పరిశోధన ప్రాజెక్టుల కోసం 7వ రెగ్యులర్ కాల్ ప్రారంభాన్నీ మేం స్వాగతిస్తున్నాం. వాటి ఫలితాల కోసం మేం ఎదురుచూస్తున్నాం.
76. ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో... మన సమష్టి శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి, భవిష్యత్ పోటీతత్వానికి దోహదపడటంలో యువత కీలక పాత్రను గుర్తిస్తున్నాం. యువ శాస్త్రవేత్తల ఫోరం, యువ ఆవిష్కర్తల పురస్కారం వంటి సుస్థిర యంత్రాంగాల ద్వారా యువ పరిశోధకులు, అంకురసంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని మేం బ్రిక్స్ సభ్యులను కోరుతున్నాం. బ్రిక్స్ యువ శాస్త్రవేత్తలు, యువ ఆవిష్కర్తలు, పూర్వ విద్యార్థుల మధ్య పరస్పర సహకారం, నెట్‌వర్కింగ్‌ను ప్రారంభించడానికి... వారి మధ్య చర్చలు, నెట్వర్కింగ్, స్వచ్ఛంద సమాచార పంపిణీని సులభతరం చేయడానికి... ప్రతిపాదిత బ్రిక్స్ యూత్ స్టార్టప్స్ కోసం వర్చువల్ వేదిక సహా, ఆవిష్కరణల వ్యవస్థలను బలోపేతం చేయడానికి... సుస్థిరమైన, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలనూ మేం గుర్తిస్తున్నాం.
77. ఆర్థికాభివృద్ధి, సామాజిక సమ్మిళితత్వం, మెరుగైన సేవల పంపిణీ, సుస్థిర వృద్ధి, అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యం, ఆవిష్కరణల కోసం డిజిటల్, ఐసీటీ వ్యవస్థలను కీలక పునాదిగా మేం గుర్తిస్తున్నాం. సాధికారత గల, స్వయం సమృద్ధ డిజిటల్ వ్యవస్థ దిశగా బ్రిక్స్ సహకారాన్ని మరింతగా పెంపొందించాలని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాం. ఈ విషయంలో, డిజిటల్ వ్యవస్థల బలోపేతం కోసం... పెద్ద ఎత్తున సేవలను అందించడం కోసం... అందరికీ సామాజిక, ఆర్థిక అవకాశాలను పెంచడం కోసం... జాతీయ ప్రాధాన్యాలు, పరిస్థితుల ఆధారంగా అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల, సురక్షితమైన, భద్రమైన, సమ్మిళితమైన, పరస్పర అనుసంధానమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, డిజిటల్ ప్రజా వస్తువుల పరివర్తన సామర్థ్యాన్నీ మేం ప్రధానంగా ప్రస్తావిస్తున్నాం. బ్రిక్స్ దేశాల కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రిపోజిటరీని ప్రారంభించే ప్రతిపాదనను, బ్రిక్స్ దేశాల డిజిటల్ పరివర్తన కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల పరిష్కారాలకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టులనూ మేం గమనించాం.
78. బ్రిక్స్ దేశాల మధ్య డిజిటల్ పరివర్తన, అనుసంధానాన్ని ప్రోత్సహించడంలో భవిష్యత్ నెట్‌వర్క్‌ల పరిశోధనాభివృద్ధికి గొప్ప ప్రాముఖ్యత ఉందని మేం గుర్తిస్తున్నాం. బీఐఎఫ్ఎన్ కోసం ఒక జాతీయ శాఖను నామినేట్ చేయమని బ్రిక్స్ సభ్యులందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఈ విషయంలో, సంబంధిత సమాచార పోర్టల్‌పై ప్రతిపాదనతో సహా, బ్రిక్స్ దేశాల కోసం ఒక డిజిటల్ ఎకోసిస్టమ్ సహకార నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదననూ మేం గమనించాం.
79. విస్తరించగల, సందర్భోచితమైన, సహకార పద్ధతుల ద్వారా డిజిటల్ నైపుణ్యాభివృద్ధి, పరిశోధన సహకారం, సామర్థ్య నిర్మాణంలో సహకారాన్ని పెంపొందించడాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం. ఈ విషయంలో, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని అబివృద్ధి చేసే దిశగా బ్రిక్స్ సభ్య దేశాల కోసం సామర్థ్యాలను పెంపొందించే కేంద్రాల ప్రతిపాదనను ఒక ప్రశంసనీయ ప్రయత్నంగా మేం గమనిస్తున్నాం. బ్రిక్స్ దేశాలతో విధానపరమైన అనుభవాలను పంచుకోవడానికి 'సార్వత్రిక, అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల డిజిటల్ కనెక్టివిటీపై ఒక సంకలనాన్ని' అభివృద్ధి చేయడంలో జరుగుతున్న ప్రయత్నాలనూ మేం అభినందిస్తున్నాం. డిజిటల్ బ్రిక్స్ ఫోరమ్-2026 సమావేశాన్నీ మేం స్వాగతిస్తున్నాం. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఫోకస్ గ్రూప్ సమావేశం నిర్వహణనూ మేం గమనిస్తున్నాం.
80. ముందస్తు చర్యలు, అవగాహన కల్పించడం, నివారణ, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, సామర్థ్యాలను పెంపొందించడం, వినియోగదారు-కేంద్రిత భద్రత సహా... పిల్లల కోసం సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని నిర్ధారించడం పట్ల మా నిబద్ధతనూ మేం స్పష్టం చేస్తున్నాం. వృద్ధులకు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం పట్ల మా నిబద్ధతను స్పష్టం చేస్తున్నాం. వీరి కోసం నిర్ధిష్ట నివారణ చర్యలు, అవగాహన కల్పించడం అవసరం.
81. కృత్రిమ మేధ అందరికీ ఆర్థిక వృద్ధిని, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి అపారమైన అవకాశాన్ని అందిస్తుందని మేం గుర్తిస్తున్నాం. ఏఐ వనరుల లభ్యతను పెంచుతూనే... దాని భద్రత, సురక్షితత్వం, సమ్మిళితత్వం, విశ్వసనీయతను నిర్ధారించడం... ఏఐ వ్యవస్థల శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించడం... ఏఐ పరిజ్ఞానం, ఆవిష్కరణలను పెంపొందించడం... విశ్వసనీయమైన ఏఐ సాంకేతికతలను అభివృద్ధి చేయడం... ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐని వినియోగించుకోవడం... సంభావ్య నష్టాలను తగ్గించడం వంటి అంశాల్లో అంతర్జాతీయ సహకారం అన్ని దేశాల, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల న్యాయమైన, నిష్పక్షపాతమైన, సమానమైన, సంపన్నమైన భవిష్యత్తును ప్రోత్సహించడానికి అత్యవసరం అని మేం గమనిస్తున్నాం. ఫిబ్రవరి-2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిన భారత్‌ను మేం అభినందిస్తున్నాం. ఉమ్మడి ప్రాధాన్యాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో ఈ సమ్మిట్ దోహదపడుతుందని మేం గుర్తిస్తున్నాం. షాంఘైలో జరిగిన వరల్డ్ ఏఐ కాన్ఫరెన్స్ - గ్లోబల్ ఏఐ గవర్నెన్స్‌పై ఉన్నత స్థాయి సమావేశాన్నీ, అందరి మంచి కోసం ఏఐ అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో దాని సహకారాన్నీ మేం గుర్తిస్తున్నాం. గ్లోబల్ గవర్నెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై బ్రిక్స్ నాయకుల ప్రకటన అమలుకు మేం కట్టుబడి ఉన్నాం.
82. ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌కు సంబంధించి వాతావరణ మార్పులు సహా, విపత్తు ప్రమాదాల సంక్లిష్టత పెరుగుతున్నప్పటికీ... విపత్తు సంబంధిత నష్టాన్ని తగ్గించడానికి... మౌలిక సదుపాయాలు, మానవ ప్రాణాలు, జీవనోపాధిని రక్షించడానికి... జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు వ్యవస్థలు, సామర్థ్యాలను మెరుగుపరచడానికి... సంసిద్ధత, సాధికారతను నిర్ధారించడానికి సాంప్రదాయ, దేశీయ, స్థానిక విజ్ఞానం, సమాజ ఆధారిత విధానాలను పంచుకోవడానికి... సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు సహా తగిన, అంచనా వేయదగిన, అందుబాటులో ఉండే నిధులను సమీకరించడం కోసం బ్రిక్స్ సహకారం పట్ల మా నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఈ నేపథ్యంలో, విపత్తు నిర్వహణ ముందస్తు హెచ్చరిక డేటా ఏకీకరణ కొరకు బ్రిక్స్ మార్గదర్శకాలను, వాతావరణ మార్పులను తట్టుకోగల పట్టణ మౌలిక సదుపాయాల కొరకు బ్రిక్స్ స్వచ్ఛంద సూత్రాలనూ మేం స్వాగతిస్తున్నాం.
83. వాతావరణ, విపత్తు ప్రమాదాలను తట్టుకునేలా మౌలిక సదుపాయాల వ్యవస్థల సామర్థ్యాలను బలోపేతం చేయడం సుస్థిర అభివృద్ధిని సాధించడంలో అత్యంత కీలకమని మేం స్పష్టం చేస్తున్నాం. సాంకేతిక సహాయం, విజ్ఞానాన్ని పంచుకోవడం, అనుకూల విధానాలు, ఆర్థిక పద్ధతుల ద్వారా మౌలిక సదుపాయాల వ్యవస్థల్లో అన్ని పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యాలను ఏకీకృతం చేయడంలో... సభ్య, భాగస్వామ్య దేశాలకు మద్దతునిచ్చే అంతర్జాతీయ భాగస్వామ్యంగా విపత్తులను ఎదుర్కోగల మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) పాత్రనూ మేం గుర్తిస్తున్నాం. ఆధారాల ఆధారితమైన విధాన రూపకల్పనతో ముడిపడిన అన్ని పరిస్థితులను తట్టుకోగల సుస్థిర వ్యవస్థను నిర్మించడంలో పెట్టుబడి పెట్టడం, నివారణకు ప్రాధాన్యమివ్వడం, ముందుచూపుతో కూడిన చర్యలు తీసుకోవడం వంటి చర్యల ప్రాముఖ్యతనూ మేం స్పష్టం చేస్తున్నాం. సంసిద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, ప్రమాద-ఆధారిత ప్రణాళికను మెరుగుపరచాల్సిన ప్రాముఖ్యతనూ మేం ప్రధానంగా ప్రస్తావిస్తున్నాం.
84. డబ్ల్యూటీవో నిబంధనలకు విరుద్ధంగా ఉండే అన్యాయమైన ఏకపక్ష సంరక్షణవాద చర్యల వల్ల ప్రతికూలంగా ప్రభావితమయ్యే విస్తృత వైవిధ్యభరితమైన సమాజాలు, నాగరికతలకు బ్రిక్స్ సభ్య దేశాలు ప్రాతినిధ్యం వహిస్తాయని మేం గుర్తిస్తున్నాం. పరస్పర ప్రయోజనకరమైన సుస్థిర అభివృద్ధి కోసం న్యాయమైన, నిష్పక్షపాతమైన, స్థిరమైన, అంచనావేయదగిన వాతావరణాన్ని ప్రోత్సహించడంపై బ్రిక్స్ మరింత దృష్టి సారించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆధునికీకరణ ప్రయత్నాల అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ... మరింత పటిష్ఠమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన ప్రాముఖ్యతనూ మేం ప్రధానంగా ప్రస్తావిస్తున్నాం. గ్లోబల్ తయారీ, ఉత్పత్తి రంగాల్లోని అత్యున్నత విభాగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎదుగుతున్న మార్కెట్లకు మరింత సమానమైన, విస్తృతమైన అవకాశాలు దక్కేలా బ్రిక్స్ కూటమి కృషి చేయాలని అంగీకరించాం. ఇందుకోసం వ్యాపార, పెట్టుబడి అవకాశాలను పెంచడం, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం, ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపరచడం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీని ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ అంతా ఆయా సభ్య దేశాల సొంత చట్టాలు, నిబంధనలు, విధానాలకు లోబడి జరుగుతుందని స్పష్టం చేస్తున్నాం.
85. ఆర్థిక వృద్ధి, శ్రేయస్సుకు చోదకంగా సూక్ష్మ- చిన్న- మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈల) అంతర్జాతీయీకరణ బలోపేతం పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. సరసమైన ఆర్థిక సహాయం అందుబాటులో లేకపోవడం ప్రధాన అవరోధంగా, నిర్మాణాత్మక పరిమితిగా మిగిలి ఉంది. ఇది వాణిజ్యంలో ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని, గ్లోబల్ వాల్యూ చెయిన్లలో (జీవీసీలలో) వాటి ఏకీకరణను పరిమితం చేస్తుందని మేం అంగీకరిస్తున్నాం. సమాచార అసమానతలను తగ్గించడానికి... రిస్క్ అంచనాను మెరుగుపరచడానికి... తక్కువ సేవలు పొందుతున్న ఎంఎస్ఎంఈలకు అధికారిక ఆర్థిక సహాయం అందుబాటును విస్తరించడానికి... విభిన్నమైన, సంబంధిత డేటా వనరులను ఉపయోగించుకునే ఎగుమతి ఆధారిత ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ అసెస్‌మెంట్ విధాన ప్రణాళికలను రూపొందించుటకు బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను మేం స్వాగతిస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు వాణిజ్య ఆర్థిక సహాయాన్ని సులభంగా పొందేందుకు వీలుగా... డిజిటల్, ప్లాట్‌ఫారమ్ ఆధారిత బహుళ వాటాదారుల పరిష్కారాలు సహా వినూత్న ఆర్థిక విధానాలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతనూ మేం అర్థం చేసుకున్నాం. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్‌ను సులభతరం చేయడం... ఎంఎస్ఎంఈలు తమ వర్కింగ్ క్యాపిటల్‌ను వినియోగించుకోవడానికి, అంతర్జాతీయ వాణిజ్యంలో తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి వీలు కల్పించడం లక్ష్యంగా బ్రిక్స్ సభ్యుల కోసం ఒక ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ విధానాన్ని ఏర్పాటు చేసేందుకు కుదిరిన జైపూర్ ఏకాభిప్రాయాన్నీ మేం స్వాగతిస్తున్నాం.
86. గ్లోబల్ వాల్యూ చెయిన్స్ (జీవీసీలు) భవిష్యత్ సవాళ్లను తట్టుకుంటూ, సమర్థంగా, అంచనా వేయదగినవిగా, ఉత్పాదకంగా, పారదర్శకంగా, సురక్షితంగా, న్యాయంగా, స్థిరంగా, సమ్మిళితంగా ఉండేలా చూడటానికి ఈ సహకారం ప్రాముఖ్యతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. జీవీసీలలో డిజిటలైజేషన్ దిశగా జరుగుతున్న ప్రయత్నాలనూ మేం స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో... దేశీయ ప్రాధాన్యాలు, జాతీయ చట్టాలు, ప్రతి సభ్య దేశం కోసం వర్తించే అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా సుస్థిర వృద్ధికి దోహదపడే రీతిలో వాణిజ్య సౌలభ్యం, సామర్థ్య నిర్మాణం, కీలక మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక సామర్థ్యాలు, మెరుగైన అనుసంధానం, మేధో సంపత్తి పరిరక్షణ... సురక్షితమైన, భద్రమైన, సరసమైన రీతిలో సాంకేతికతను అందుబాటులో ఉంచుటను ప్రోత్సహించడం, వేగవంతం చేయడం వంటి అవకాశాలను పెంపొందించడానికి సాంకేతిక సహకారాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం కోసం పరస్పరం బలోపేతం చేసుకునే విధానపరమైన సాధనాల సామర్థ్యాన్ని అన్వేషించాలని మేం భావిస్తున్నాం. జీవీసీల విషయంలో బ్రిక్స్ ఉమ్మడి అవగాహన కార్య ప్రణాళిక అమలుకు మేం మద్దతునిస్తున్నాం. బ్రిక్స్ జీవీసీ కార్యాచరణ ప్రణాళిక 2026-2030 తదుపరి అభివృద్ధిని, అందులో పేర్కొన్న అన్ని కార్యక్రమాలనూ స్వాగతిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎదుగుతున్న మార్కెట్లు (ఈఎండీసీలు) గ్లోబల్ వాల్యూ చెయిన్లలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ యాక్షన్ ప్లాన్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మేం స్పష్టం చేస్తున్నాం.
87. వాణిజ్యం, పెట్టుబడి, పారిశ్రామిక సహకారం, ఆవిష్కరణలు, అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యాలు, సుస్థిర గ్లోబల్ వాల్యూ చెయిన్లలో (జీవీసీల) ఏకీకరణను ప్రోత్సహించడానికి సుస్థిరమైన యంత్రాంగాలుగా ఉన్న బ్రిక్స్ సభ్య దేశాల ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌ల) సామర్థ్యాన్ని వినియోగించుకోవాలనే సంకల్పాన్నీ మేం పంచుకుంటున్నాం. ఇందుకోసం, సంస్థలకు అనుకూలమైన వ్యాపార వాతావరణం, సమర్థమైన మౌలిక సదుపాయాలు, సరళీకృత నియంత్రణ విధానాలు, వ్యాపార సౌలభ్యాన్ని పెంచే ఇతర సహాయక చర్యలను అందించడం ద్వారా దీనిని సాధిస్తాం. బ్రిక్స్ సభ్య దేశాల విభిన్న సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటూ... భాగస్వాములు మరింత సమర్థమైన, పారదర్శకమైన, అవాంతరాలు లేని వాతావరణంలో పనిచేయడానికి వీలుగా... కనెక్టివిటీ, వాణిజ్య సౌలభ్యంలో సహకారాన్ని పెంపొందించడం, ముఖ్యంగా వాణిజ్య పత్రాల డిజిటలైజేషన్ లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
88. ముడి వజ్రాల వాణిజ్యాన్ని నియంత్రించే ఏకైక ప్రపంచ అంతర్-ప్రభుత్వ ధ్రువీకరణ పథకంగా ఉన్న కింబర్లీ ప్రక్రియకు మా మద్దతును మేం పునరుద్ఘాటిస్తున్నాం. అక్రమ వజ్రాలు మార్కెట్లలోకి ప్రవేశించకుండా నిరోధించడం పట్ల మా నిబద్ధతను స్పష్టం చేస్తున్నాం. 2026లో కింబర్లీ ప్రక్రియకు భారత్ అధ్యక్షత వహించడాన్నీ మేం స్వాగతిస్తున్నాం. ముడి వజ్రాల్లో స్వేచ్ఛా వాణిజ్యాన్ని, ప్రపంచ వజ్రాల పరిశ్రమ సుస్థిర అభివృద్ధిని నిర్ధారించడానికి... వజ్రాల తవ్వకం జరిగే ఆఫ్రికన్ దేశాల భాగస్వామ్యంతో ఏర్పడిన అనధికారిక బ్రిక్స్ సహకార వేదికనూ మేం గమనిస్తున్నాం. బ్రిక్స్ దేశాల్లోని ప్రపంచస్థాయి మార్కెట్లో వజ్రాలు, విలువైన లోహాల వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఆచరణీయ యంత్రాంగాలను పరిశీలించడం కొనసాగిస్తాం.
89. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఆచరణాత్మక ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి, సన్నిహిత ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహం మా సహకారానికి మార్గనిర్దేశం చేసే ఒక ప్రధాన విధాన ప్రణాళికగా కొనసాగుతుందనీ... సభ్య దేశాల ఆధ్వర్యంలో రంగాల వారీ వ్యూహాలు, కార్యక్రమాలు, రోడ్‌మ్యాప్‌లను మరింత అభివృద్ధి చేయడానికి ఇది ఆధారాన్ని అందిస్తుందని మేం గుర్తిస్తున్నాం. బ్రెజిల్ అధ్యక్షత వహించిన 2025 కాలంలో బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహం రూపకల్పనను పూర్తి చేసే దిశగా సాధించిన పురోగతిని గుర్తిస్తూ... 2025లో నాయకులు ఇచ్చిన ఆదేశాన్ని నెరవేర్చడంలో, 2030 బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహం పురోగతిని విజయవంతంగా ముందుకు నడిపించడంలో 2026లో భారత్ ప్రదర్శించిన నాయకత్వ పటిమనూ మేం ప్రశంసిస్తున్నాం.
90. బ్రిక్స్ క్రాస్-బోర్డర్ పేమెంట్స్ ఇనిషియేటివ్‌పై కజాన్, రియో డిక్లరేషన్లలో మేం అందించిన మార్గదర్శనాన్ని ఆధారంగా చేసుకుని... సమర్థమైన క్రాస్-బోర్డర్ చెల్లింపు యంత్రాంగాల కోసం ఆచరణాత్మక పరిష్కారాలను అన్వేషించే దిశగా బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ (బీపీటీఎఫ్) చేస్తున్న ప్రయత్నాలను మేం అభినందిస్తున్నాం. ఈ విషయంగా జాతీయ ప్రాధాన్యతలను గౌరవిస్తూ, అందరికీ సరిపోయే ఒకే విధానం ఉండదని గుర్తిస్తూనే... చెల్లింపు, సందేశ మార్గాల సరిహద్దుల మధ్య అనుసంధానతను అధ్యయనం చేయడానికి చేసిన కృషిని... బ్రిక్స్ స్థానిక కరెన్సీలను ఉపయోగించి వాణిజ్య పరిష్కారాలు, పెట్టుబడులను ప్రోత్సహించడంపై జరిగిన చర్చలనూ మేం అభినందిస్తున్నాం. బ్రిక్స్ దేశాల మధ్య సరిహద్దు చెల్లింపుల కోసం వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన, మరింత అందుబాటులో ఉండే, సమర్థమైన, పారదర్శకమైన, సురక్షితమైన ఆచరణాత్మక పరిష్కారాలను సులభతరం చేయడానికి, కొనసాగుతున్న కృషిని ఆధారంగా చేసుకుని చర్చలను కొనసాగించేలా మేం బీపీటీఎఫ్‌ని ప్రోత్సహిస్తున్నాం.
91. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు (పీపీపీ), మౌలిక సదుపాయాలపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కృషిని మేం స్వాగతిస్తున్నాం. పీపీపీ నమూనాలు, పద్ధతులు, నష్ట నివారణ యంత్రాంగాలపై టాస్క్ ఫోర్స్ సమర్పించిన సాంకేతిక నివేదికనూ మేం స్వాగతిస్తున్నాం. ఈ నివేదిక, సభ్య దేశాలు తమ పీపీపీ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి, నష్ట కేటాయింపు విధానాలను మెరుగుపరచుకోవడానికి ఒక విలువైన విజ్ఞాన వనరుగా ఉపయోగపడుతుంది.
92. సభ్య దేశాల మధ్య వాణిజ్యానికి మద్దతుగా... మరింత స్వయం సమృద్ధిగల బ్రిక్స్ ఇన్సూరెన్స్ వ్యవస్థను నిర్మించడానికి బ్రిక్స్ సమష్టి సామర్థ్యాన్ని వినియోగించుకోవాల్సిన అవసరాన్ని... రీఇన్సూరెన్స్ సామర్థ్యాలను పెంపొందించడంపై తదుపరి చర్చలను మేం గుర్తిస్తున్నాం. గతంలో అధ్యక్షత వహించిన దేశాల కృషిని కొనసాగిస్తూ... ఉమ్మడి రిస్క్ నమూనాలను అభివృద్ధి చేయడానికి, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, నిపుణుల సామర్థ్యాలను పెంపొందించడానికి ఒక స్వచ్ఛంద ఉమ్మడి సామర్థ్య వేదికగా బ్రిక్స్ ఇన్సూరెన్స్ రెసిలియెన్స్ సెంటర్ (బీఐఆర్సీ) భావనను అన్వేషించడం పట్ల ఆసక్తిగల సభ్యుల మధ్య కొనసాగుతున్న చర్చలనూ మేం స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో, గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్‌సీ)లో ఆసక్తిగల సభ్యుల భాగస్వామ్యానికి అవకాశం కల్పించే బ్రిక్స్ రిస్క్ ల్యాబ్‌ను నిర్వహించాలన్న భారత్ ప్రతిపాదనపై చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి సభ్యులు ఆసక్తి వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాల నియంత్రణ సంస్థలు, రీఇన్సూరెన్స్ కంపెనీలతో కూడిన సంబంధిత భాగస్వాముల స్వచ్ఛంద భాగస్వామ్యంతో... బ్రిక్స్ సభ్య దేశాల (రీ)ఇన్సూరెన్స్ సామర్థ్యాన్ని పెంపొందించడంపై తదుపరి చర్చల కోసం మేం ఎదురుచూస్తున్నాం.
93. బ్రెజిల్ అధ్యక్షతన ఖరారు చేసిన మార్గదర్శకాల ఆధారంగా, నూతన పెట్టుబడి వేదిక (ఎన్ఐపీ)పై సాంకేతిక స్థాయి ప్రయత్నాలను కొనసాగించాలని మేం మరోసారి ప్రోత్సహిస్తున్నాం. ఎన్ఐపీపై చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో భారత్ అధ్యక్షతన సాధించిన పురోగతినీ మేం స్వాగతిస్తున్నాం. సాంకేతిక చర్చలు, విజ్ఞాన భాగస్వామ్యానికి ఒక వేదికగా... బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్ కింద ఒక ప్రత్యేక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయడంపై సభ్యుల మధ్య జరిగిన నిర్మాణాత్మక సాంకేతిక చర్చలను మేం గమనించాం. జాతీయ సార్వభౌమత్వాన్ని, విభిన్న నియంత్రణ విధానాలను, ఇప్పటికే ఉన్న సంస్థాగత ఆదేశాలను గౌరవిస్తూ... ఏకాభిప్రాయ-ఆధారిత, దశలవారీ, సభ్య-ఆధారిత విధానంలో పనిని కొనసాగించడంలో సభ్యుల విస్తృత మద్దతును మేం గుర్తించాం. కార్యాచరణ పద్ధతులు, సంబంధిత బ్రిక్స్ సంస్థల పాత్రపై ఉమ్మడి అవగాహనను పెంపొందించడం కోసం... అధ్యయన బృంద విధివిధానాలను మరింత మెరుగుపరచడంతో సహా, సాంకేతిక భాగస్వామ్యాన్నీ కొనసాగించాలని మేం ప్రోత్సహిస్తున్నాం.
94. సెటిల్మెంట్, డిపాజిటరీ మౌలిక సదుపాయాలపై చర్చల కోసం అవకాశం ఉన్న తగిన ఫార్మాట్‌లను అన్వేషించడం పట్ల మా ప్రోత్సాహాన్ని పునరుద్ఘాటిస్తూ... సభ్య దేశాల వ్యాప్తంగా సెటిల్మెంట్, డిపాజిటరీ వ్యవస్థల విభిన్న చట్టపరమైన, సంస్థాగత, నియంత్రణ, సాంకేతిక కోణాలను అన్వేషించిన సాంకేతిక కార్యశాలనూ మేం గమనించాం. ఇది బ్రిక్స్ అధికార పరిధుల గురించిన అవగాహనను పెంపొందిస్తుంది. ఆసక్తిగల భాగస్వాముల మధ్య జ్ఞానం, అనుభవాలు, సాంకేతిక చర్చలు, సహకారంలను నిరంతరం స్వచ్ఛందంగా పంచుకోవడానికి ఒక ఆధారాన్ని అందిస్తుంది.
95. సైబర్ సెక్యూరిటీ పరిణామాలు, ధోరణులు, కృత్రిమ మేధ, ఆర్థిక రంగానికి సంబంధించిన క్వాంటం కంప్యూటింగ్ వంటి వర్ధమాన సాంకేతికతల రంగాల్లో అనుభవాలను పంచుకోవడాన్ని మేం స్వాగతిస్తున్నాం. నూతన సాంకేతికతల వల్ల కలిగే అవకాశాలు, నష్టాలను అంచనా వేయడం కోసం వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల (ఈఎండీఈల) కేంద్రీకృత విధానాన్ని అవలంబించడంలో బ్రిక్స్ రాపిడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఛానల్ (బ్రిస్క్), బ్రిక్స్ ఫిన్‌టెక్ వర్కింగ్ గ్రూప్ ద్వారా జరిగిన కృషిని మేం గుర్తిస్తున్నాం. ఆర్థిక రంగంలో సైబర్ ముప్పులను ఎదుర్కోగల సామర్థ్యాలను బలోపేతం చేయడంలో సామూహిక, సమన్వయ విధానాలు, పరస్పర అభ్యసనం, ఆచరణాత్మక సహకారం ప్రాముఖ్యతను స్పష్టం చేసే బ్రిక్స్ సైబర్ ఎక్సర్సైజెస్, డ్రిల్స్‌ను వార్షిక ప్రాతిపదికన నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను మేం గుర్తిస్తున్నాం. సెంట్రల్ బ్యాంకింగ్‌లోని వర్ధమాన రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బ్రిక్స్ సెంట్రల్ బ్యాంక్ హబ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్‌నూ మేం స్వాగతిస్తున్నాం.
96. వాతావరణ మార్పుల వల్ల దేశాలపై పడుతున్న అసమాన భారాన్ని మేం గుర్తిస్తున్నాం. వాతావరణ సంబంధిత నష్టాలు, బలహీనతలను పరిష్కరించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు (ఈఎండీఈలు) ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అనుసరణ చర్యల కోసం నిధుల అవసరాల్లో గణనీయ అంతరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, "అనుసరణతో సహా సుస్థిర, హరిత ఆర్థిక వ్యవస్థను మరింత పెంపొందించడంలో కేంద్ర బ్యాంకుల పాత్ర"పై అందించిన నివేదికనూ మేం స్వాగతిస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా, బ్రిక్స్ దేశాల్లో సెంట్రల్ బ్యాంక్ చర్యలు, సుస్థిర ఆర్థిక ధోరణులను పరిశీలిస్తుంది. వాతావరణ ఆర్థిక ప్రాజెక్టులను బ్యాంకులకు మరింత అనుకూలంగా మార్చే అవకాశాన్ని అన్వేషించే ప్రయత్నాలూ ఇందులో భాగంగా ఉన్నాయి.
97. సంక్షోభ సమయాల్లో కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సీఆర్ఏ) కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించడానికి, దానిని మరింత ప్రతిస్పందించేలా చేయడానికి బ్రిక్స్ సీఆర్ఏ సాంకేతిక బృందం చేస్తున్న ప్రయత్నాలనూ మేం అభినందిస్తున్నాం. సీఆర్ఏ ఒప్పందానికి చేసే సవరణలు... బ్రిక్స్ ఆర్థిక భద్రతా వలయంగా సీఆర్ఏ మరింత సౌకర్యవంతంగా, వేగంగా పనిచేయడానికి సహాయపడతాయి. తొమ్మిదో సీఆర్ఏ టెస్ట్ రన్ సకాలంలో పూర్తి కావాలని, “ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, బ్రిక్స్‌పై వాటి ప్రభావాలు” అనే అంశంపై బ్రిక్స్ ఎకనామిక్ బులెటిన్ ఏడో సంచిక విడుదల కావాలని మేం ఆశిస్తున్నాం. సీఆర్ఏలో చేరడానికి ఆసక్తి చూపిన కొత్త బ్రిక్స్ సభ్యుల భాగస్వామ్యాన్ని మేం గౌరవిస్తాం. వారిని స్వచ్ఛంద ప్రాతిపదికన, దేశాల నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా చేర్చుకోవడంపై చర్చలు సకాలంలో పూర్తి కావాలని ఆశిస్తున్నాం.
98. న్యాయమైన, సమ్మిళితమైన, స్థిరమైన, సమర్థమైన అంతర్జాతీయ పన్నుల వ్యవస్థ పట్ల... అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ పన్ను సవాళ్లను పరిష్కరించడంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పన్ను సహకార విధాన ప్రణాళిక సదస్సు, దాని ప్రోటోకాల్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో విజ్ఞాన భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం, నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ... అన్ని పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యాలు, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత ద్వారా బ్రిక్స్ పన్ను సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. అంతర్జాతీయ పన్నులు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ నిర్ణయం, ఆదాయ గణాంకాలపై వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు సహా... బ్రిక్స్ పన్ను విభాగాల మధ్య సంస్థాగత సహకారాన్ని పెంపొందించడానికి భారత్ అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమాలను మేం స్వాగతిస్తున్నాం. యువ పన్ను నిపుణుల కోసం వ్యక్తిగత సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని, బ్రిక్స్ పన్నుల నెట్‌వర్క్‌లో మహిళా నిపుణుల బాగస్వామ్య పురోగతిని మేం స్వాగతిస్తున్నాం. ప్రస్తుత, నూతన యంత్రాంగాల ద్వారా ఆవిష్కరణలు, జ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలను మేం మరింతగా అభినందిస్తున్నాం. బ్రిక్స్ పన్ను మద్దతు నెట్‌వర్క్ ఏర్పాటు, బ్రిక్స్ పన్ను క్రాస్-లెర్నింగ్ ల్యాబ్ ప్రారంభం, బ్రిక్స్ పన్నుల సహకార సాధనం మరింత అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలనూ స్వాగతిస్తున్నాం.
99. 2012లో ప్రారంభమైనప్పటి నుంచి బ్రిక్స్ దేశాల మధ్య కస్టమ్స్ సహకారం మరింతగా బలపడటాన్ని మేం గుర్తిస్తున్నాం. సభ్య దేశాల అవసరాలకు అనుగుణంగా నిర్దేశిత శిక్షణ, సాంకేతిక సహకార కార్యక్రమాలను చేపట్టేలా మేం బ్రిక్స్ కస్టమ్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. కస్టమ్స్ విషయాల్లో సహకారం, పరస్పర పరిపాలనా సహాయంపై బ్రిక్స్ ఒప్పందం ద్వారా సాధించిన ఏకాభిప్రాయాన్ని... అవసరమైన జాతీయ ప్రక్రియలు పూర్తయిన తర్వాత దానిపై సంతకం చేయడానికి సభ్యుల సంసిద్ధతను... అన్ని బ్రిక్స్ దేశాల భాగస్వామ్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలనూ మేం స్వాగతిస్తున్నాం. జాతీయ ప్రాధాన్యాలు, చట్టపరమైన నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటూ... 'బ్రిక్స్ ఏఈఓ యాక్షన్ ప్లాన్-2026' ను స్వచ్ఛందంగా అమలు చేయడం, సమాచార మార్పిడి, నైపుణ్యాల పెంపు (కెపాసిటీ బిల్డింగ్), అత్యుత్తమ పద్ధతుల భాగస్వామ్యం, పరస్పర గుర్తింపు ద్వారా 'ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్' (ఏఈవో) ప్రోగ్రామ్‌లపై సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలనూ మేం గుర్తిస్తున్నాం. పరస్పరం గుర్తించిన అంతర్జాతీయ స్మగ్లింగ్ ధోరణులు, ఉమ్మడి ప్రాధాన్యాలు, కార్యాచరణ సాధ్యత ఆధారంగా... సభ్య దేశాల సంప్రదింపులతో, ఆయా సంవత్సరాల బ్రిక్స్ అధ్యక్ష దేశాల సమన్వయంతో—సముచితమైన చోట—వార్షిక చొరవగా 'బ్రిక్స్ జాయింట్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్' నిర్వహించే దిశగా పని చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. మొదటి జాయింట్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్ ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా... క్షేత్రస్థాయి సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఉమ్మడిగా గుర్తించిన, కొత్తగా అబివృద్ధి చెందుతున్న కస్టమ్స్ ముప్పులను ఎదుర్కోవడానికీ మేం కృషి చేస్తాం.
100. బ్రిక్స్, ఇతర వర్ధమాన అభివృద్ధి చెందుతున్న దేశాలకు (ఈఎమ్డీఈలకు) సంబంధించిన ఉమ్మడి వృద్ధి, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక వేదికగా... వృద్ధి, అభివృద్ధిపై బ్రిక్స్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్న భారత అధ్యక్షత చొరవను మేం స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ దేశాలు తమ సొంత జాతీయ పరిస్థితులకు, అభివృద్ధి ప్రాధాన్యతలకు అనువైన వృద్ధి నమూనాలపై చర్చించుకోవడానికి ఒక వేదికను అందించేదిగా ఈ టాస్క్‌ఫోర్స్‌ను మేం గుర్తిస్తున్నాం. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యాలు, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే కీల అంశాలను కవర్ చేస్తూ... టాస్క్‌ఫోర్స్ రెండు కార్యవిధానాల కింద జరిగిన కృషిని మేం ప్రశంసలతో గమనిస్తున్నాం. అభివృద్ధి ఆర్థిక నిర్మాణ సంస్కరణల అజెండాపై ఏకాభిప్రాయ రంగాలను గుర్తించడం... డిజిటల్ పరివర్తన, ఏఐ, నిర్మాణాత్మక సంస్కరణల స్థూల ఆర్థిక, ద్రవ్యపరమైన చిక్కుల విషయంగా ఉమ్మడి అవగాహనను సులభతరం చేయడం... సంబంధిత బహుపాక్షిక వేదికల్లో బ్రిక్స్ సభ్యుల భాగస్వామ్యానికి సమాచారం అందించడం వంటి అంశాలను తెలియజేసే టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడి సారాంశాన్ని, సాంకేతిక పత్రాలనూ మేం స్వాగతిస్తున్నాం. యూఎన్ఎఫ్సీసీసీ, దాని పారిస్ ఒప్పంద సూత్రాల ఆధారంగా... వాతావరణ ఆర్థిక వ్యవస్థపై ఉమ్మడి దృక్కోణాలను ప్రతిబింబించే చర్చా పత్రాన్నీ మేం గుర్తించాం. ఆర్థిక మంత్రిత్వ శాఖలు, కేంద్ర బ్యాంకుల కార్యవిధానాలకు అనుగుణంగా టాస్క్‌ఫోర్స్ తన పనిని కొనసాగించేలా మేం ప్రోత్సహిస్తున్నాం. సుస్థిర అభివృద్ధి కోసం జీవనశైలికి సంబంధించిన ఆర్థిక సహాయ యంత్రాంగాలపై సంకలనం... సుస్థిర అభివృద్ధి కోసం ఆర్థిక సహాయాన్ని సమీకరించడంలో బ్రిక్స్ దేశాల విధానాలను స్పష్టం చేసే వాతావరణ సంబంధిత ముప్పులపై సమీక్షనూ మేం గమనించాం. సుస్థిర వృద్ధి కోసం ఏఐని ఉపయోగించుకునే అవకాశాలను హైలైట్ చేసే కృత్రిమ మేధ, గ్రీన్ ఎకానమీపై చర్చా పత్రాన్నీ మేం స్వాగతిస్తున్నాం.
101. జనాభాలో వృద్ధులు, భారీ సంఖ్యలో అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తిస్తూ, పింఛను నియంత్రణ, పర్యవేక్షణ రంగంలో బ్రిక్స్ వేదికగా భారత్ అధ్యక్షతన నిర్వహించిన వర్క్‌షాప్‌లను స్వాగతిస్తున్నాం. పింఛను వ్యవస్థ నియంత్రణ, పదవీ విరమణ అనంతర ఆదాయ భద్రతకు సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఇవి దోహదపడతాయి.
102. 2025లో రియో డిక్లరేషన్‌లో అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా బ్రిక్స్ బహుపాక్షిక హామీల (బీఎంజీ) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన పురోగతిని స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ దేశాలు, గ్లోబల్ సౌత్ దేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రైవేట్ పెట్టుబడులను సమీకరించడం, రుణ విశ్వసనీయతను మెరుగుపరచడం, ఆర్థిక సమీకరణ వ్యయాన్ని తగ్గించడంలో ఈ కార్యక్రమానికి ఉన్న సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాం. సాంకేతికపరమైన కృషిని కొనసాగించడంతో పాటు, పైలట్ లావాదేవీల రూపకల్పనకు ప్రోత్సాహం ఇస్తున్నాం.
103. విధానపరమైన పరిశోధన, మేధో వనరుల పరస్పర భాగస్వామ్యంలో బ్రిక్స్ థింక్ ట్యాంక్ నెట్‌వర్క్ ఫర్ ఫైనాన్స్ పోషిస్తున్న పాత్రను గుర్తిస్తూ, భారత్ అధ్యక్షతన ఈ నెట్‌వర్క్ కొనసాగిస్తున్న కృషిని స్వాగతిస్తున్నాం. సమ్మిళిత అభివృద్ధి, విపత్తులను తట్టుకునే మౌలిక వసతులకు ఆర్థిక సహకారం అందించేందుకు ఫిన్‌టెక్‌ను వినియోగించడంలో ఈ కృషి కీలకంగా నిలుస్తోంది. పరిశోధనా ఫలితాలను మరింత విస్తరించడంతో పాటు వాటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నాం.
104. నాగ్‌పూర్‌లో జరిగిన బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఫలితాలను స్వాగతిస్తున్నాం. భాగస్వాములందరి అవసరాలను తీర్చడంతో పాటు, బ్రిక్స్ దేశాల రవాణా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పౌర విమానయాన రంగంతో సహా రవాణా అంశాలపై చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం. రవాణాలో సహకారం కొనసాగిస్తున్న సమయంలో అన్ని సభ్య దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నాం. బ్రిక్స్ దేశాలు రవాణా విధానం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్య పెంపు వంటి రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి, అనుసంధానత, పర్యావరణ సుస్థిరతలో రవాణా రంగం కీలక పాత్రను గుర్తిస్తూ, సుస్థిర, ప్రతికూలతలను ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన రవాణా మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా ఈ సహకారాన్ని సంబం తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి బ్రిక్స్ దేశాల్లో రవాణా మౌలిక వసతుల అభివృద్ధి, నిర్వహణలో చక్రభ్రమణ ఆర్థిక వ్యవస్థ సూత్రాలను అంతర్భాగం చేయవలసిన ప్రాధాన్యతను గుర్తిస్తున్నాం. అంతర్జాతీయ విమానయానంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించే మార్గాలుగా సుస్థిర విమాన ఇంధనాలు, తక్కువ కార్బన్ విమాన ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నాం. సుస్థిర విమాన ఇంధనాలపై బ్రిక్స్ వేదికను, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను వినియోగించుకుంటూ రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విజ్ఞాన మార్పిడికి ఉద్దేశించిన బ్రిక్స్ సహకార వ్యవస్థను స్వాగతిస్తున్నాం. అందుబాటులో ఉండే, అందరికీ అందుబాటులోకి వచ్చే, సమ్మిళిత, స్మార్ట్ పట్టణ రవాణా పరిష్కారాలపై విజ్ఞాన మార్పిడి, భాగస్వామ్యం కోసం బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ ఏర్పాటు చేయడాన్ని కూడా స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ లాజిస్టిక్స్ సరఫరా శ్రేణి సహకార యంత్రాంగం ఏర్పాటును స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ రైల్వే పరిశోధనా నెట్‌వర్క్ ప్రతిపాదనపై చర్చలను ప్రోత్సహిస్తున్నాం.
105. అంతర్జాతీయ పౌర విమానయాన సదస్సుపై 2016లో చేసిన సవరణ అమల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్టికల్ 50(ఎ)కు చేసిన ఈ సవరణతో ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ సహా తగిన ప్రాతినిధ్యం లేని ప్రాంతాలకు మరో నాలుగు స్థానాలను కేటాయించడం ద్వారా ఐసీఏఓ కౌన్సిల్ సభ్యత్వాన్ని విస్తరించారు. ఐసీఏఓ 43వ సర్వ సభ్య సమావేశంలో జరగనున్న తదుపరి ఎన్నికల్లో కౌన్సిల్‌లో అదనంగా ఏర్పడిన స్థానాలకు ఆఫ్రికన్ యూనియన్ ఏకైక ఆఫ్రికన్ అభ్యర్థిగా ఆమోదించిన ఇథియోపియా, ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి ఇండోనేషియా ఇండోనేషియా అభ్యర్థిత్వాలను స్వాగతిస్తున్నాం.
106. న్యూఢిల్లీలో బ్రిక్స్ పట్టణీకరణ వేదిక సమావేశం నిర్వహించడం, మంత్రుల ప్రకటనను ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రజలే ప్రాధాన్యంగా పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు సమ్మిళిత, సురక్షితమైన, అందుబాటు ధరల్లో గృహ వసతి, నీరు, పారిశుద్ధ్యం, సుస్థిర రవాణా, సమన్వయంతో కూడిన సమర్థవంతమైన చలనశీలత, వ్యర్థాల నిర్వహణ, ఇతర కీలక పట్టణ సేవలపై సహకారాన్ని బలోపేతం చేసి సమ్మిళిత, సుస్థిర, ప్రతిఘటన సామర్థ్యం కలిగిన, నివాసయోగ్యమైన నగరాల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. ప్రతిఘటనా సామర్థ్యం కలిగిన, సుస్థిర పట్టణాభివృద్ధికి తోడ్పడేలా ఆచరణాత్మక పరిశోధన, విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపునకు వేదికగా బ్రిక్స్ అర్బన్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నాం.
107. వాతావరణ మార్పుల వంటి మన ఉమ్మడి భూమి, భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బహుపాక్షిక విధానం అవసరమని పునరుద్ఘాటిస్తున్నాం. యూఎన్ఎఫ్సీసీసీ, పారిస్ ఒప్పందం లక్ష్యాలను, సూత్రాలను, ఉద్దేశాలను సాధించేందుకు ఐక్యంగా కృషి చేయాలని సంకల్పిస్తున్నాం. ఈ ఒప్పందాల్లో భాగస్వాములుగా ఇప్పటికే ప్రకటించిన కట్టుబాట్లను అన్ని దేశాలు కొనసాగించాలని, వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రయత్నాలను మరింత విస్తరించి వేగవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. యూఎన్ఎఫ్సీసీసీ లక్ష్య సాధనలో భాగంగా, పారిస్ ఒప్పందాన్ని సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు మా దృఢ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. ఇందులో ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు, నష్టం - నష్టపరిహారం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమలు సాధనాల సమకూర్పు వంటి అంశాలు ఉన్నాయి. వివిధ దేశాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ సమానత్వం, ఉమ్మడి అయినా విభిన్నమైన బాధ్యతలు, సామర్థ్యాల సూత్రాలకు అనుగుణంగా ఈ చర్యలను చేపట్టాలని స్పష్టం చేస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లో అధిక రుణభారం వాతావరణ పరిరక్షణ, అభివృద్ధి పెట్టుబడులకు మరింత అడ్డంకిగా మారుతోందని గుర్తించాం. రుణ సుస్థిరతను మెరుగుపరచడం, ఆర్థిక వెసులుబాటును పెంచడం, సుస్థిర అభివృద్ధి, వాతావరణ ఆర్థిక సహకారానికి మద్దతు ఇవ్వడం కోసం సమన్వయంతో కూడిన అంతర్జాతీయ చర్యలు అవసరమని పిలుపునిస్తున్నాం. ఈ విషయంలో వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధిపై బ్రిక్స్ సంప్రదింపుల బృందంలో సహకారాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తున్నాం. బ్రెజిల్ అధ్యక్షతన జరిగిన సీఓపీ 30 విజయవంతంగా ముగియడాన్ని ప్రశంసిస్తూ, యూఎన్ఎఫ్సీసీసీ సీఓపీ32 అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ఇథియోపియాకు మద్దతు ప్రకటిస్తున్నాం.
108. కార్బన్ పరిమితి సర్దుబాటు విధానాల వంటి అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా లేని ఏకపక్ష, శిక్షాత్మక, వివక్షపూరిత, రక్షణాత్మక చర్యలను వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి చర్యలు వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు, తట్టుకునే సామర్థ్యాన్ని, సుస్థిరతను పెంచుకోవడానికి దేశాలు - ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు చేస్తున్న ప్రయత్నాలను బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.
109. బ్రిక్స్ సభ్య దేశాల్లో వాతావరణ పరిరక్షణ చర్యలను ప్రోత్సహించడం, ప్రతిఘటన సామర్థ్యాన్ని పెంపొందించడంలో బ్రిక్స్ క్లైమేట్ రీసెర్చ్ ప్లాట్‌ఫారమ్, బ్రిక్స్ ల్యాబొరేటరీ ఫర్ ట్రేడ్, క్లైమేట్ చేంజ్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్‌కు ఉన్న సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాం. వీటి కార్యకలాపాలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాం.
2025 లీడర్స్ ఫ్రేమ్‌వర్క్ డిక్లరేషన్‌లోని వాతావరణ ఆర్థిక అంశాలను గుర్తుచేసుకుంటూ, కార్బన్ మార్కెట్ల రంగంలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు మద్దతు ఇస్తున్నాం. ముఖ్యంగా సామర్థ్య పెంపు, అనుభవాల పరస్పర మార్పిడిపై దృష్టి సారించాలని భావిస్తున్నాం. సభ్య దేశాల వాతావరణ వ్యూహాలకు సహకరించే విధానంగాఉద్గారాల తగ్గింపు చర్యలకు తోడ్పడటంతో పాటు అవసరమైన వనరులను సమీకరించేందుకు బ్రిక్స్ కార్బన్ మార్కెట్లే భాగస్వామ్యంపై కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమలు చేయాలని ఆశిస్తున్నాం. ప్రజా కేంద్రీత, సమాజ ఆధారిత వాతావరణ అనుకూలత విధానాలపై నిర్వహించిన బ్రిక్స్ ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమం, వాతావరణ అనుకూలత లక్ష్యాలతో కార్బన్ మార్కెట్‌లను అనుసంధానించడంపై జరిగిన సంభాషణల ద్వారా జరిగిన విజ్ఞాన మార్పిడిని అభినందిస్తున్నాం.
110. వాతావావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని, సుస్థిర అభివృద్ధిని బలోపేతం చేసే కీలక మార్గంగా ప్రజా కేంద్రిత, సమాజ ఆధారిత అనుకూల చర్యలపై బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందిస్తాం. అనుకూల చర్యల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు అదనపు, తగిన, అంచనా వేయగల, సులభంగా అందుబాటులో ఉండే ఆర్థిక వనరులను, సామర్థ్య పెంపు సహకారాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందిన దేశాలు అందించాలి. వాతావరణ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడంలోనూ, పర్యావరణ సవాళ్లను ఎదుర్కొవడంలోనూ సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలు, స్థానిక, గిరిజన సముదాయాల ఆచారాలు, స్థానిక ఆవిష్కరణలు, సమాజ అనుభవాల విలువను గుర్తిస్తున్నాం. సాంప్రదాయ విజ్ఞానాన్ని శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతిక ఆవిష్కరణలతో అనుసంధానించడంతో సహా అనుభవాలు, విజ్ఞానం, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడిని ప్రోత్సహిస్తున్నాం. ఈ విషయంలో, సంప్రదాయ విజ్ఞాన ఆధారంగా ప్రజా కేంద్రిత, సమాజ ఆధారిత వాతావరణ ప్రతిఘటన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రూపొందించిన బ్రిక్స్ సూత్రాలను స్వాగతిస్తున్నాం. దేశాల పరిస్థితులకు అనుగుణంగా న్యాయబద్ధమైన మార్పులకు, ఉద్గారాల తగ్గింపు చర్యలు, అనుకూల చర్యల మధ్య సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తున్నాం.ఉద్గారాల తగ్గింపునకు దోహదపడే, సామర్థ్యాన్ని పెంపొందించే అందుబాటులో ఉన్న, అందరికీ అందుబాటులోకి తీసుకురాగల పరిష్కారాలు, సాంకేతిక పరిజ్ఞానాలన్నింటి ప్రాధాన్యాన్ని కూడా గుర్తిస్తున్నాం. కార్బన్ నిల్వలు, కార్బన్‌ను గ్రహించే వనరులుగా పర్యావరణ వ్యవస్థలు పోషించే కీలక పాత్రతో పాటు పర్యావరణ సేవలను అందించడం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంలో వాటి పాత్రను కూడా గుర్తిస్తున్నాం.
111. జీవ వైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగం, జన్యు వనరుల వినియోగం ద్వారా లభించే ప్రయోజనాలను న్యాయబద్ధంగా, సమానంగా పంచుకోవడం, జీవ వైవిధ్యంపై సదస్సు, దాని ప్రోటోకాల్‌లు, కున్మింగ్ - మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాం. కున్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్ ఏర్పాటు, అందుకు చైనా అందించిన సహకారాన్ని ప్రశంసిస్తున్నాం. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు అందించడంలో ఈ నిధి పోషిస్తున్న కీలక పాత్రను గుర్తిస్తున్నాం. కున్మింగ్ - మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ (కేఎంజీబీఎఫ్) కోసం కార్యాచరణ కార్యక్రమం సహా బ్రిక్స్ దేశాలు చేపడుతున్న కార్యక్రమాలను కూడా గుర్తిస్తున్నాం. జీవ వైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగం, దాని వినియోగం ద్వారా లభించే ప్రయోజనాలను న్యాయబద్ధంగా, సమానంగా పంచుకోవడం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన, సమర్థవంతమైన, అంచనా వేయగల, సకాలంలో అందుబాటులో ఉండే ఆర్థిక వనరులను అందించాలని అభివృద్ధి చెందిన దేశాలను కోరుతున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సామర్థ్య పెంపు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, బదిలీని కూడా మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. అరుదైన జాతుల పరిరక్షణకు మన దేశాలు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, పెద్ద పిల్లిజాతి వన్యప్రాణులు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తిస్తున్నాం. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఏర్పాటు చేయాలన్న భారత్ చొరవను స్వాగతిస్తూ, పెద్ద పిల్లిజాతి వన్యప్రాణుల పరిరక్షణకు బ్రిక్స్ దేశాలు సమష్టిగా కృషి చేయాలని ప్రోత్సహిస్తున్నాం.
112. బోరియల్, ఉష్ణమండల అడవులు సహా అన్ని రకాల అడవులు జీవ వైవిధ్యం, జల వనరుల పరిరక్షణ, నేల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తిస్తున్నాం. ఆర్థిక రంగాలకు అధిక విలువ కలిగిన కలప, కలపేతర అటవీ ఉత్పత్తులను అందించడంతో పాటు, జలచక్రాలను నియంత్రించడంలో, ఎడారీకరణ, భూమి క్షీణత, కరువును ఎదుర్కోవడంలో, కీలకమైన కార్బన్ శోషకాలుగా పనిచేయడంలో అడవుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాం. సుస్థిర అటవీ నిర్వహణ, పునరుద్ధరణకు తోడ్పడే ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నాం. సుస్థిర వినియోగం ద్వారా స్థానిక సముదాయాలు, గిరిజన ప్రజల జీవనోపాధులకు తోడ్పాటునందించడంలో వీటి పాత్రను మరింతగా స్పష్టం చేస్తున్నాం. దీనితో పాటు, సమగ్ర ల్యాండ్‌స్కేప్ ఆధారిత హరితహారం, భూమి పునరుద్ధరణ కోసం బ్రిక్స్ సూత్రాల ఆమోదాన్ని, బ్రిక్స్ దేశాల మధ్య అడవి కార్చిచ్చులను ఎదుర్కొనే సన్నద్ధత, ప్రతిస్పందనపై కుదిరిన ఉమ్మడి అవగాహనను కూడా స్వాగతిస్తున్నాం. బెలెం క్లైమేట్ సమ్మిట్‌లో ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ ప్రారంభాన్ని స్వాగతిస్తున్నాం. ఉష్ణమండల అడవుల పరిరక్షణకు దీర్ఘకాలిక, ఫలితాల ఆధారిత ఆర్థిక వనరులను సమీకరించే వినూత్న వ్యవస్థగా దీనిని గుర్తిస్తున్నాం. ఈ వ్యవస్థకు అవసరమైన నిధులు సమకూరడంతో పాటు, సకాలంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా సంభావ్య పెట్టుబడి దేశాలు ప్రతిష్ఠాత్మక ఆర్థిక సహకారాన్ని ప్రకటించాలని ఆశిస్తున్నాం. “యునైటెడ్ ఫర్ అవర్ ఫారెస్ట్స్” కార్యక్రమాన్ని కూడా గుర్తిస్తున్నాం. కీలకమైన ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, సుస్థిర నిర్వహణ, పునరుద్ధరణను ప్రోత్సహించే జాతీయ స్థాయి భారీ హరితీకరణ కార్యక్రమాలను గుర్తిస్తున్నాం. యూఏఈ, ఇండోనేషియా సంయుక్త నాయకత్వంలో పనిచేస్తున్న మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్‌ను అంతర్జాతీయ సహకార వేదికగా గుర్తిస్తున్నాం.
113. నీటి లభ్యత, ఎడారీకరణ, కరువు, భూక్షీణత, ఇసుక, దుమ్ము తుపానులు, అటవీ దావానలాలు వంటి కీలక పర్యావరణ సవాళ్లను గుర్తిస్తున్నాం. ఇవి పర్యావరణ వ్యవస్థలు, వ్యవసాయం, సున్నిత పరిస్థితుల్లో ఉన్న ప్రజల జీవనోపాధి, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై గణనీయ ప్రభావం చూపుతున్నాయి. సమగ్ర పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం పర్వతాలు, జల వనరులు, అడవులు, తడి (పీట్) భూములు, మడ అడవులు, వ్యవసాయ భూములు, గడ్డి భూములు, ఎడారుల సమగ్ర పరిరక్షణ, క్రమబద్ధమైన నిర్వహణకు కట్టుబడి ఉన్నాం. 2026 ఐక్యరాజ్యసమితి జల సదస్సు పాత్రను గుర్తిస్తున్నాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెనెగల్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ సదస్సు 2026 డిసెంబర్ 8 నుంచి 10 వరకు అబుదాబీలో జరగనుంది. స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యానికి సంబంధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యం - 6ను (అందరికీ నీరు, పారిశుద్ధ్యం లభ్యత, సుస్థిర నిర్వహణ) వేగంగా అమలు చేసేందుకు పురోగతి, చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం.
114. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, మారుతున్న వినియోగ విధానాల కారణంగా వ్యర్థాల ఉత్పత్తి పరిమాణం, సంక్లిష్టత పెరుగుతున్న విషయాన్ని గుర్తిస్తున్నాం. జాతీయ ప్రాధాన్యతలు, సామర్థ్యాలకు అనుగుణంగా వనరుల సమర్థ వినియోగం, పదార్థాల పునర్వినియోగ చక్రాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం ప్రాధాన్యమని స్పష్టం చేస్తున్నాం. ఇందుకు ఉత్పత్తిదారుల విస్తృత బాధ్యత, పర్యావరణహిత రూపకల్పన, సుస్థిర ప్రభుత్వ కొనుగోళ్లు వంటి జాతీయ విధాన సాధనాలతో పాటు మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థలు, రీసైక్లింగ్, పునరుద్ధరణ మౌలిక వసతుల్లో పెట్టుబడులు అవసరమని గుర్తిస్తున్నాం. సుస్థిర జీవన విధానాల్లో విజ్ఞాన మార్పిడి, పరిశోధన, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు బ్రిక్స్ సంస్థల నెట్‌వర్క్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం. 2026లో బ్రిక్స్ సుస్థిర జీవన విధానాల వారోత్సవం నిర్వహించే అవకాశాన్ని కూడా స్వాగతిస్తున్నాం.
115. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉన్నత ప్రమాణాలతో కూడిన అభివృద్ధిలో తన రెండో స్వర్ణ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, అన్ని వాటాదారు దేశాల్లోనూ, , గ్లోబల్ సౌత్‌లోనూ అభివృద్ధి, ఆధునికీకరణకు బలమైన, వ్యూహాత్మక భాగస్వామిగా బ్యాంక్ పోషిస్తున్న, విస్తరిస్తున్న పాత్రను గుర్తించి మద్దతు ఇస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి ప్రాధాన్యతలు, మౌలిక వసతుల అవసరాలను తీర్చడంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) పాత్ర క్రమంగా పెరుగుతున్న విషయాన్ని కూడా.గుర్తిస్తున్నాం. సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం, అసమానతలను తగ్గించడం, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ప్రతిఘటన సామర్థ్యాన్ని పెంపొందించడంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకును కీలకమైన బ్రిక్స్ సంస్థగా గుర్తిస్తున్నాం. సభ్య దేశాల ఆధ్వర్యంలో, అవసరాల ఆధారంగా పనిచేసే సూత్రాన్ని ఈ బ్యాంక్ అనుసరించాలని ప్రోత్సహిస్తున్నాం. బ్యాంక్ సంస్థాగత ప్రతిఘటన సామర్థ్యం, కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేలా పాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రక్రియను కొనసాగించాలని కోరుతున్నాం. తన లక్ష్యాలు, విధులను న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాం. ఎన్డీబీ సభ్యత్వాన్ని మరింత విస్తరించేందుకు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. ఎన్డీబీ సాధారణ వ్యూహం, సంబంధిత విధానాలకు అనుగుణంగా బ్రిక్స్ దేశాల నుంచి ఆసక్తి వ్యక్తం చేసిన దేశాల సభ్యత్వ దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని కోరుతున్నాం. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ గవర్నర్ల బోర్డు అధ్యక్ష దేశంగా 2026 మే 14, 15 తేదీల్లో మాస్కోలో 11వ ఎన్డీబీ వార్షిక సమావేశాన్ని నిర్వహించిన రష్యాను అభినందిస్తున్నాం. భారత్ అధ్యక్షతన.ఎన్డీబీ సహకారంతో రూపొందించిన బ్రిక్స్ - ఎన్డీబీ నాలెడ్జ్ పోర్టల్‌ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ పోర్టల్ బ్రిక్స్ సభ్య దేశాల్లో అమలైన అభివృద్ధి కార్యక్రమాలు, ఉత్తమ విధానాలు, విధానపరమైన ఆవిష్కరణలు, దేశాల కార్యక్రమాలు, ఎన్డీబీ ఆర్థిక సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల అనుభవాలు, పాఠాలను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్‌లోని వివిధ కార్యాచరణ బృందాల పనితీరు ఫలితాలను భద్రపరిచే వేదికగా ఈ పోర్టల్ రూపొందింది. తద్వారా వరుసగా చేపట్టే అధ్యక్ష బాధ్యతల మధ్య కార్యక్రమాల కొనసాగింపు, విజ్ఞాన మార్పిడికి ఇది తోడ్పడుతుంది. బ్రిక్స్ దేశాలకు ఆచరణాత్మకంగా, సులభంగా అందుబాటులో ఉండే సాధనంగా పోర్టల్‌ను మరింత అభివృద్ధి చేయాలని ప్రోత్సహిస్తున్నాం.
116. ప్రపంచ ఆర్థిక నిర్వహణలో నిరంతర సంస్కరణల అవసరాన్ని ప్రముఖంగా పేర్కొంటూ, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు మరింత సమర్థవంతమైన, సమానమైన, ప్రాతినిధ్యంతో కూడిన భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి అత్యున్నత ప్రపంచ వేదికగా జీ20 పోషిస్తున్న కీలక పాత్రను ఉద్ఘాటిస్తున్నాం. వర్ధమాన, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు సమాన స్థాయిలో, పరస్పర ప్రయోజనకర రీతిలో సంభాషించేందుకు జీ20 వేదిక కల్పిస్తోంది. ప్రపంచ సవాళ్లకు ఉమ్మడి పరిష్కారాలను అన్వేషించడం, బహుళ ధ్రువ ప్రపంచాన్ని ప్రోత్సహించడం, స్వేచ్ఛాయుత, వివక్ష రహిత, న్యాయబద్ధ, సమ్మిళిత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, విలువ వ్యవస్థలను నిర్ధారించడంలో జీ20 కీలకంగా నిలుస్తోంది. జీ220 దేశాల వరుస అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఇండోనేషియా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా 2022 - 2025 మధ్యకాలంలో అందించిన వారసత్వాన్ని పరిరక్షించేందుకు సమష్టిగా కృషి చేయాలన్న మా సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ప్రపంచ ఆర్థిక పాలనా వ్యవస్థలో గ్లోబల్ సౌత్ గళాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నాం. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల పెరుగుతున్న ప్రాధాన్యాన్ని జీ20 సముచితంగా ప్రతిబింబించడంతో పాటు, వాటి ప్రాధాన్యతలను తన అజెండాలో సమగ్రపరచేలా చూడాలని కోరుతున్నాం. 2023లో భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు సమయంలో ఆఫ్రికన్ యూనియన్ జీ20లో చేరడం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధ్యక్ష బాధ్యతల సమయంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ను ఆహ్వానించడం ద్వారా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల గళం జీ20లో మరింత బలోపేతం కావడాన్ని స్వాగతిస్తున్నాం. వీటి మధ్య సన్నిహిత పరస్పర సంబంధాలు, సమన్వయం కూడా ఇందుకు దోహదపడ్డాయని గుర్తిస్తున్నాం. జీ20 ఆర్థిక అంశాలపై తన ప్రధాన బాధ్యతకు అనుగుణంగా నిరంతరం సమర్థవంతంగా పనిచేయడం, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయాలకు అతీతమైన ప్రక్రియలను అనుసరించడం, సంస్థాగత సమగ్రతను కాపాడటం, సభ్యత్వాన్ని ఏకపక్షంగా మార్చడానికి వీలులేకపోవడం వంటి సూత్రాల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాం. ఈ నేపథ్యంలో, జీ20 వ్యవస్థాపక దేశంగా, పూర్తిస్థాయి సభ్య దేశంగా దక్షిణాఫ్రికాకు ఉన్న హోదాను ఉద్ఘాటిస్తున్నాం. జీ20 సభ్యత్వంలో ఏదైనా మార్పు చేయాల్సి వస్తేఅది సభ్య దేశాలన్నింటి ఏకాభిప్రాయం ఆధారంగా ఉండాలని స్పష్టం చేస్తున్నాం. అలాగే, సభ్యత్వ మార్పులు భౌగోళిక సమతుల్యతను ప్రతిబింబించడంతో పాటు, ప్రపంచ ఉత్పత్తిలో గ్లోబల్ సౌత్ దేశాల పెరుగుతున్న వాటాకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా ఉండాలని స్పష్టం చేస్తున్నాం.
117. సుస్థిర, పోటీతో కూడిన, ప్రతిఘటన సామర్థ్యం కలిగిన మార్కెట్ వాతావరణాలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ దేశాల మధ్య పోటీ చట్టం, విధానాల రంగంలో సహకారాన్ని మరింతగా బలోపేతం చేయాలన్న మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. కీలక, వర్ధమాన రంగాలతో సహా వివిధ రంగాల్లో ఈ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తూ, ప్రతి దేశ జాతీయ ప్రాధాన్యతలు, చట్టాలు, నిబంధనలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నాం. సుస్థిర ఇంధన మార్పిడికి తోడ్పడే లక్ష్యంతో ‘పునరుత్పాదక ఇంధన మార్కెట్లలో సహా న్యాయబద్ధమైన పోటీని ప్రోత్సహించేందుకు సహకారాన్ని బలోపేతం చేయడం’ అనే అంశంపై జరిగిన చర్చను కూడా గుర్తిస్తున్నాం. వర్ధమానమాన పోటీ సవాళ్లను గుర్తించి, వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు బ్రిక్స్ దేశాల పోటీ నియంత్రణ సంస్థల మధ్య నిరంతర సహకారాన్ని మరింత ప్రోత్సహిస్తున్నాం. ఆవిష్కరణలకు తోడ్పడే, వినియోగదారుల సంక్షేమాన్ని ప్రోత్సహించే పోటీకి అవకాశం ఉన్న సమర్థవంతంగా పనిచేసే మార్కెట్లను పరిరక్షించడమే దీనికి లక్ష్యం.
118. బ్రిక్స్ దేశాల జాతీయ ప్రమాణాల సంస్థల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని గుర్తిస్తున్నాం. ప్రామాణీకరణ రంగంలో సహకారానికి సంబంధించి బ్రిక్స్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసేందుకు జరుగుతున్న పురోగతిని స్వాగతిస్తున్నాం. వివిధ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రామాణీకరణ ప్రక్రియల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, సమాచార మార్పిడిని పెంపొందించడం, క్రమం తప్పకుండా చర్చలు, సంయుక్త కార్యకలాపాల కోసం వ్యవస్థలను ఏర్పాటు చేయడం, సమన్వయంతో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో ఈ ఒప్పందం కీలక ముందడుగుగా నిలుస్తుంది. ప్రామాణీకరణలో వర్ధమాన రంగాలు, సామర్థ్య పెంపుపై సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చేపడుతున్న కార్యక్రమాలను కూడా స్వాగతిస్తున్నాం. ఇందులో కృత్రిమ మేధ ప్రామాణీకరణలో వర్ధమాన ధోరణులపై బ్రిక్స్ సాంకేతిక సమావేశం, సామర్థ్య పెంపు కోసం బ్రిక్స్ విజ్ఞాన మార్పిడి సమావేశం, వాణిజ్య అభివృద్ధి, ప్రామాణీకరణ సహకారంపై ప్రధానంగా దృష్టి సారించిన బ్రిక్స్ ఆర్థిక, వాణిజ్య వేదిక ఉన్నాయి. ప్రమాణాల రూపకల్పన, ఆమోదం, అమలులో జాతీయ అనుభవాలు, ఉత్తమ విధానాలు, వినూత్న విధానాలపై బ్రిక్స్ జాతీయ ప్రమాణాల సంస్థల మధ్య నిరంతర పరస్పర మార్పిడిని ప్రోత్సహిస్తున్నాం. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించేందుకు సాంకేతిక నైపుణ్యం, వనరుల పరస్పర భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం.
119. మారుతున్న డేటా వ్యవస్థలో విధాన రూపకల్పనకు సంబంధించిన గణాంక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం ప్రాధాన్యమని పునరుద్ఘాటిస్తున్నాం. గణాంక వ్యవస్థల ఆధునికీకరణ, వినూత్న పద్ధతులు, డేటా వనరుల స్వీకరణ సహా ఉమ్మడి ఆసక్తి ఉన్న రంగాల్లో నిరంతర సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాం.సభ్య దేశాల మధ్య విజ్ఞాన మార్పిడి, సహకారానికి తోడ్పడేలా జాతీయ గణాంక సంస్కరణలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, ఎప్పటికప్పుడు నవీకరించాల్సిన అవసరాన్ని కూడా గుర్తిస్తున్నాం. ఇందులో పరిపాలనా, ప్రత్యామ్నాయ డేటా వనరుల వినియోగం, కృత్రిమ మేధ, సామర్థ్య పెంపు కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా చేర్చాలని సూచిస్తున్నాం. బ్రిక్స్ దేశాల మధ్య విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపును మరింత బలోపేతం చేయాలని ప్రోత్సహిస్తున్నాం. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పారదర్శకత, పరస్పర అభ్యసనం, సహకారానికి విలువైన సాధనంగా నిలుస్తున్న వార్షిక బ్రిక్స్ సంయుక్త గణాంక ప్రచురణ, బ్రిక్స్ సంయుక్త గణాంక ప్రచురణ సంక్షిప్త నివేదిక కొనసాగింపునకు మద్దతు ఇస్తున్నాం.
120. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆర్థిక అభివృద్ధికి మేధో సంపత్తి కీలక ఆధారంగా నిలుస్తున్న విషయాన్ని ఉద్ఘాటిస్తున్నాం. బ్రిక్స్ మేధో సంపత్తి కార్యాలయాల మధ్య విస్తృత సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాం. సహకార కార్యక్రమాల అమలుకు మరింత మెరుగైన మార్గదర్శకత్వం అందించేందుకు 2026లో కార్యాచరణ మార్గదర్శక యంత్రాంగాన్ని నవీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. పరస్పర అంగీకార నిబంధనల మేరకు బ్రిక్స్ మేధో సంపత్తి కార్యాలయాల మధ్య మేధో సంపత్తిపై అవగాహన పెంపు, సామర్థ్య నిర్మాణం, మేధో సంపత్తి వాణిజ్యీకరణ, పేటెంట్ పరిశీలన ప్రక్రియ, సంప్రదాయ విజ్ఞానం, మూలాధార సూచికలు, భౌగోళిక సూచికలు, కృత్రిమ మేధ వినియోగం వంటి రంగాల్లో పరస్పర మార్పిడి, సహకారాన్ని మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాం. కృత్రిమ మేధ శిక్షణ అవసరాలకు సహా డిజిటల్ వాతావరణంలో వినియోగించే మేధో సంపత్తి హక్కుల పట్ల గౌరవాన్ని పెంపొందించడం, హక్కుదారులకు న్యాయబద్ధమైన పారితోషికం అందేలా చూడడంలో సహకారం ప్రాధాన్యమని గుర్తిస్తున్నాం. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలు, ప్రాధాన్యతలను గౌరవించాల్సిన అవసరాన్ని కూడా గుర్తిస్తున్నాం.కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా సముదాయాలు, కృత్రిమ మేధ నమూనాల్లో తగిన ప్రాతినిధ్యం లేని విజ్ఞానం, వారసత్వం, సాంస్కృతిక విలువలను అనధికారికంగా స్వాధీనం చేసుకోవడం, వాటిని వక్రీకరించి చూపడం వంటి ప్రమాదాలు ఉన్నాయని గుర్తిస్తున్నాం.
121. ప్రజా పరిపాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, సమర్థత, సుపరిపాలనను ప్రోత్సహించడంలో అత్యున్నత ఆడిట్ సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ఉద్ఘాటిస్తున్నాం. ఆర్థిక నిబంధనల ఆడిటింగ్‌కు తోడు ఫలిత ఆధారిత, డేటా ఆధారిత, ప్రభావవంతమైన విధానాలను అవలంబించడం ద్వారా ఈ అత్యున్నత ఆడిట్ సంస్థలు సాధిస్తున్న ప్రగతిని గుర్తించి అభినందిస్తున్నాం. బ్రిక్స్ దేశాల అత్యున్నత ఆడిట్ సంస్థల మధ్య విజ్ఞానం, అనుభవం, ఉత్తమ విధానాల నిరంతర మార్పిడిని స్వాగతిస్తున్నాం. పట్టణ రవాణా వ్యవస్థల ఆడిట్‌లో కూడా సహకారాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాం. ఐదవ బ్రిక్స్ అత్యున్నత ఆడిట్ సంస్థల అధిపతుల సమావేశంలో ఆమోదించిన బెంగళూరు ప్రకటనను గుర్తుచేసుకుంటూ, మెరుగైన పాలనకు దోహదపడడంతో పాటు బ్రిక్స్ దేశాల్లో పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో అత్యున్నత ఆడిట్ సంస్థల ప్రాసంగికత, ప్రభావం, విశ్వసనీయతను పెంపొందించేందుకు చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నాం. ఇందులో బ్రిక్స్ అత్యున్నత ఆడిట్ సంస్థల 2027 - 2028 కార్యాచరణ ప్రణాళిక అమలు కూడా ఉంది.
సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాల బలోపేతం
122. మన దేశాలు, , ప్రజల మధ్య పరస్పర అవగాహన, స్నేహం, సహకారాన్ని పెంపొందించడంలో బ్రిక్స్ ప్రజల మధ్య పరస్పర మార్పిడులు, కార్యక్రమాల ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వేదిక, బ్రిక్స్ పర్యాటక మంత్రుల సమావేశం, బిజినెస్ కౌన్సిల్, బిజినెస్ ఫోరం, మహిళా వ్యాపార కూటమి, యువజన మండలి, యువజన సదస్సు, దౌత్య అకాడమీల డీన్ల సమావేశం, థింక్ ట్యాంక్ కౌన్సిల్, అకడమిక్ ఫోరం, సివిల్ కౌన్సిల్, సివిల్ ఫోరం వంటి కీలక కార్యక్రమాల నిర్వహణను స్వాగతిస్తున్నాం. సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. వారసత్వ సంపద, ఆవిష్కరణలు, సృజనాత్మకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అంతర్జాతీయ స్థాయిలో ప్రజల మధ్య పరస్పర మార్పిడులు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి సమష్టిగా కృషి చేయాలని కోరుతున్నాం. “నాగరికతల మధ్య సంభాషణ కోసం అంతర్జాతీయ దినోత్సవం” పేరుతో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమోదించినఏ/ఆర్ఈఎస్/78/286 తీర్మానాన్ని గుర్తుచేసుకుంటున్నాం.
123. కొచ్చిలో జరిగిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం ఫలితాలను స్వాగతిస్తున్నాం. మహిళల నాయకత్వంలో అభివృద్ధి, మహిళల సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా ఈ సమావేశం జరిగింది. మహిళలను నాయకులుగా, నిర్ణయాధికారులుగా, ఆర్థిక వృద్ధి, సామాజిక మార్పునకు చోదక శక్తులుగా గుర్తిస్తున్నాం. పాలనలో మహిళల భాగస్వామ్యం, ఆర్థిక, డిజిటల్ సమ్మిళితం, సామర్థ్య పెంపు, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార అవకాశాల లభ్యత , వ్యాపారారంభానికి మద్దతు, ఉత్పాదక, సామాజిక సేవల లభ్యతతో పాటు పరస్పరం అనుసంధానమైన వాతావరణ చర్యలు, ఆహార భద్రత, పోషణ రంగాల్లో మహిళల కీలక పాత్ర సుస్థిర అభివృద్ధికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేస్తున్నాం. ప్రపంచ మహిళలు, శాంతి, భద్రత కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా శాంతి స్థాపన ప్రక్రియలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రను మేం గుర్తిస్తున్నాం. 'బ్రిక్స్ ఉమెన్స్ డిజిటల్ కెపాసిటీ బిల్డింగ్ గైడ్‌లైన్స్' రూపుదిద్దుకోవడాన్ని స్వాగతిస్తున్నాము.ఉత్తమ విధానాలతో కూడిన స్వచ్ఛంద, నాన్ బైండింగ్ డిజిటల్ రిపోజిటరీ తయారీకి భారత అధ్యక్షతన చేపట్టిన చొరవను పరిగణనలోకి తీసుకుంటున్నాం. దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తగిన సంరక్షణ విధానాలతో సహా ఆర్థిక వ్యవస్థలో మహిళల సంపూర్ణ భాగస్వామ్యానికి మద్దతు ఇచ్చే విధానాల ప్రాముఖ్యతను సైతం గుర్తిస్తున్నాం.
124. భువనేనేశ్వర్‌లో జరిగిన 13వ బ్రిక్స్ విద్యా మంత్రుల సమావేశం ఫలితాలను స్వాగతిస్తున్నాం. సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, ప్రజల మధ్య పరస్పర మార్పిడులకు విద్య కీలక చోదక శక్తిగా నిలుస్తున్న నేపథ్యంలో విద్యా రంగంలో సహకారాన్ని బలోపేతం చేయాలన్న మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ప్రాజెక్టుల సహకారానికి బహుపాక్షిక వేదికను ఏర్పాటు చేయడం, సమాచార మార్పిడి, వనరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, సభ్య దేశాల మధ్య సాంకేతిక, వృత్తి విద్య, శిక్షణ రంగంలో సమష్టిగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సహకార కూటమి పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసిస్తున్నాం. బ్రిక్స్ - టీసీఏ ద్వైవార్షిక పురోగతి నివేదిక, సుస్థిర నైపుణ్య కార్యక్రమాలపై బ్రిక్స్ - టీసీఏ సంకలనాన్ని ఆశిస్తున్నాం.బ్రిక్స్ దేశాల్లో నైపుణ్యాభివృద్ధి వ్యవస్థలను బలోపేతం చేయడం, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం, ఉద్యోగ శక్తి సన్నద్ధతను మెరుగుపరచడంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. మారుతున్న మార్కెట్ అవసరాలు, సుస్థిర అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను తీర్చిదిద్దేందుకు టీవీఈటీ సంస్థలకు పరిశ్రమలతో అనుసంధానాన్ని ప్రోత్సహించాలని ఆకాంక్షిస్తున్నాం.
125. బ్రిక్స్ నెట్‌వర్క్ యూనివర్సిటీ సహా ఇప్పటికే ఉన్న బ్రిక్స్ విద్యా సహకార వ్యవస్థల ద్వారా సహకారాన్ని కొనసాగించేందుకు మద్దతు ఇస్తున్నాం. సంప్రదాయ, ఆదివాసీ విజ్ఞాన వ్యవస్థలపై విద్యా సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ చొరవతో బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను సభ్య దేశాలకు పంపిణీ చేయడాన్ని ప్రశంసిస్తున్నాం. బ్రిక్స్ దేశాల జాతీయ చట్టాలు, విధానాలకు అనుగుణంగా అమలులో ఉన్న పాలనా విధానాలను అనుసరించి సంప్రదాయ, ఆదివాసీ, స్థానిక విజ్ఞాన వ్యవస్థలను అదనపు అంతర్జాతీయ అంశాల బృందంగా చేర్చే అవకాశాన్ని బ్రిక్స్ నెట్‌వర్క్ యూనివర్సిటీ పరిశీలించాలని ప్రోత్సహిస్తున్నాం. ఉత్తమ విధానాల పరస్పర భాగస్వామ్యం, ప్రాథమిక బాల్య సంరక్షణ, విద్య, ప్రారంభ అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం రంగాల్లో సహకారం, విద్యా అర్హతలకు పరస్పర గుర్తింపు, విద్యా, వృత్తిపరమైన చలనశీలత, డిజిటల్ అక్షరాస్యత, విద్యా రంగంలో కృత్రిమ మేధ సహా వర్ధమాన సాంకేతికతలను సురక్షితంగా, నైతికంగా, మానవకేంద్రితంగా వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నాం. సంస్థల మధ్య భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. సంస్థాగత పాలనను మెరుగుపరచడం, విద్యా నాణ్యత, అందుబాటును పెంపొందించడం, స్నాతక, స్నాతకోత్తర స్థాయిల్లో ముఖ్యంగా విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, ఇంజినీరింగ్, గణితశాస్త్ర రంగాల్లో మార్పిడి, స్కాలర్షిప్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు సమష్టి కృషిని కూడా ప్రోత్సహిస్తున్నాం. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలను విస్తరించడం కోసం టీవీఈటీ సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నాం. భవిష్యత్ అవకాశాలు, సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు, విద్యా సంస్థలను సన్నద్ధం చేసేలా ఆవిష్కరణలు, విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహించాలని సూచిస్తున్నాం. బ్రిక్స్ రెక్టార్ల వేదిక నిర్వహణను కొనసాగించడంతో పాటు, బ్రిక్స్ ఎడ్యుకేషన్ ఒలింపియాడ్‌పై చర్చలు నిర్వహించడాన్ని ప్రోత్సహిస్తున్నాం. బ్రిక్స్ యూనివర్సిటీ గ్లోబల్ ర్యాంకింగ్, మూల్యాంకన వ్యవస్థ అభివృద్ధి అవకాశాలను కూడా మరింతగా పరిశీలించాలని కోరుతున్నాం.
126. బ్రిక్స్ దేశాల కార్మిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రజల జీవనోపాధిని పరిరక్షించడం, మెరుగుపరచడం, నాణ్యమైన, సంపూర్ణ, ఉత్పాదక ఉపాధిని ప్రోత్సహించడం, మానవ వనరుల్లో పెట్టుబడులు పెంచడం, సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత, ప్రజా కేంద్రిత కార్మిక మార్కెట్ల ద్వారా నాణ్యమైన జనాభా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను వేగవంతం చేయాలని ప్రోత్సహిస్తున్నాం. ఈ విషయంలో, సామాజిక భద్రతా పరిధిని విస్తరించడం, కార్మికుల సంక్షేమంలో సమ్మిళితత్వం, అందుబాటును పెంపొందించడంలో డిజిటల్ సాంకేతికతలు పోషిస్తున్న మార్పుడాయక పాత్రను గుర్తిస్తున్నాం. గిగ్, ప్లాట్‌ఫారమ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రతను విస్తరించేందుకు ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణమైన వినూత్న విధానాలను అన్వేషించాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాం. డిజిటల్, హరిత, సంరక్షణ సేవలు, ఇతర ప్రాధాన్య రంగాల్లో కార్మిక మార్కెట్ ధోరణులను విశ్లేషించడం ద్వారా భవిష్యత్ నైపుణ్యాల అవసరాలను ముందుగానే అంచనా వేసే విషయంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం. సామర్థ్య నిర్మాణం, ఉపాధి సామర్థ్యం, నూతన నైపుణ్యాలు, సాంకేతికతల కోసం బ్రిక్స్ సహకార నెట్‌వర్క్ ‘బ్రిక్స్ కనెక్ట్’ ఏర్పాటును స్వాగతిస్తున్నాం. సామాజిక భద్రతలో సహకారం కోసం ఇప్పటికే ఉన్న బ్రిక్స్ వర్చువల్ లైజన్ ఆఫీస్ కు ఇది మరింత బలం చేకూరుస్తుంది.దేశాల సరిహద్దులు దాటి పనిచేస్తున్న కార్మికుల హక్కులను పరిరక్షించడం, వారికి లభించే ప్రయోజనాలు నిరంతరం కొనసాగేందుకు అవసరమైన వ్యవస్థలను కల్పించడం, సామాజిక భద్రతా విరాళాల విషయంలో ద్వంద్వ చెల్లింపులు లేకుండా చూడటం కీలకమని గుర్తిస్తున్నాం. ఎవరూ వెనుకబడకుండా, అధికారిక, సమ్మిళిత, మారుతున్న అవసరాలకు స్పందించే డిజిటల్ సామర్థ్యంతో కూడిన, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండే ప్రతిఘటన సామర్థ్యం కలిగిన కార్మిక మార్కెట్ల నిర్మాణానికి మా సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. బ్రిక్స్ దేశాలలో "రిమోట్ ఎంప్లాయ్‌మెంట్” కోసం అంతర్జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ను ఏర్పాటు చేయడానికి చేపట్టిన చొరవను ను కూడా గుర్తించాం.
128. బ్రిక్స్ సాంస్కృతిక ఉత్సవం, వేవ్స్ బజార్ నిర్వహణను స్వాగతిస్తున్నాం. మన దేశాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు, సాంస్కృతిక, సృజనాత్మక రచనలు, కళారూపాల పరస్పర మార్పిడిని ప్రోత్సహించేందుకు, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు బ్రిక్స్ థియేటర్ ఫెస్టివల్, బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి వేదికల నిర్వహణను ప్రశంసిస్తున్నాం. ఇలాంటి వేదికలను మరింత విస్తరించడం ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, సహకారానికి మరిన్ని అవకాశాలను కల్పించాలని ప్రోత్సహిస్తున్నాం. బ్రిక్స్ దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడిని మరింత విస్తృతం చేసి, సుసంపన్నం చేసే లక్ష్యంతో బ్రిక్స్ అలయన్స్‌లను నిరంతరం అభివృద్ధి చేసి, బలోపేతం చేయడాన్ని స్వాగతిస్తున్నాం.
129. పర్యాటక రంగం ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, విదేశీ మారకద్రవ్య ఆర్జన, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి, స్థానిక జీవనోపాధులు, ఆర్థిక వైవిధ్యీకరణ, వారసత్వ పరిరక్షణ, దేశ ప్రతిష్ఠను పెంపొందించడం, సాంస్కృతిక అవగాహన, ప్రజల మధ్య పరస్పర సంబంధాల పెంపునకు ముఖ్యమైన చోదక శక్తిగా ఉన్న విషయాన్ని గుర్తిస్తున్నాం. బ్రిక్స్ దేశాలకు పర్యాటక రంగంలో అపారమైన సామర్థ్యం ఉందని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా, ముఖ్యంగా పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా సుస్థిర, ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల పర్యాటక రంగం వృద్ధి, అభివృద్ధికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని కూడా అంగీకరిస్తున్నాం. బాధ్యతాయుతమైన, సుస్థిరమైన, పునరుత్పాదక పర్యాటక నమూనాలపై విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహిస్తున్నాం. పర్యాటక వ్యవస్థలను మరింత స్మార్ట్‌గా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కృత్రిమ మేధ, డిజిటల్ సాధనాలను వినియోగించే కార్యక్రమాలను స్వాగతిస్తున్నాం. పర్యావరణహిత, సమాజ ఆధారిత, సుస్థిర, వాతావరణ మార్పులను తట్టుకోగల పర్యాటక నమూనాలను ప్రోత్సహించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థలతో పాటు, ఈ రంగంలో మానవ వనరుల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, శిక్షణ, పెట్టుబడులను ప్రోత్సహించడం, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, పర్యాటకుల సులభ రాకపోకలకు వీలు కల్పించే చర్యలను కూడా స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ దేశాల మధ్య సుస్థిర, సమ్మిళిత, స్మార్ట్, ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు, అంతర్జాతీయ పర్యాటక పోటీతత్వాన్ని పెంపొందించేందుకు బ్రిక్స్ అంతర్గత సహకారాన్ని బలోపేతం చేయడంపై జైపూర్‌లో జరిగిన పర్యాటక మంత్రుల సమావేశం విడుదల చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం..చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి ఆధారిత, వంటకాల ఆధారిత, ఆరోగ్య పర్యాటకం తదితర విభిన్న పర్యాటక ఉత్పత్తులను సభ్య దేశాల మధ్య అభివృద్ధి చేసి ప్రోత్సహించేందుకు కూడా మద్దతు ఇస్తున్నాం.
130. సామాజిక అభివృద్ధి, ప్రజల రాకపోకలు, ఆరోగ్యకరమైన, చురుకైన సమాజాల ప్రోత్సాహానికి ఒక సాధనంగా క్రీడల ప్రాముఖ్యతను గుర్తించాం. సంస్కృతి, క్రీడల రంగంలో సహకారంపై కుదిరిన అవగాహన ఒప్పందం అమలుతో సహా బ్రిక్స్ క్రీడల వర్కింగ్ గ్రూప్ సాధించిన పురోగతిని అభినందిస్తున్నాం. ఈ నేపథ్యంలో, అత్యున్నత ప్రదర్శన క్రీడలు, అందరికీ క్రీడలు, వినోద క్రీడల రంగాల్లో సహకారానికి వేదికగా బ్రిక్స్ క్రీడలను నిర్వహించడాన్ని, అలాగే మన ఉమ్మడి వైవిధ్యాన్ని చాటిచెప్పేందుకు బ్రిక్స్ దేశాల జాతీయ, సంప్రదాయ, స్వదేశీ, ఒలింపికేతర క్రీడల అభివృద్ధిని ప్రశంసిస్తున్నాం. యువత, విద్యార్థుల్లో ప్రజాదరణ పొందిన క్రీడలతో పాటు జాతీయ, సంప్రదాయ, స్వదేశీ క్రీడలను అభివృద్ధి చేసేందుకు సహకారాన్ని మరింత విస్తరించాలని ప్రోత్సహిస్తున్నాం. మంచి పద్ధతులు, సంస్థాగత అనుభవాలు, సాంకేతిక సమాచారం, పరిశోధనా ఫలితాల మార్పిడి రూపంలో క్రీడా సాంకేతికత రంగంలో సహకారాన్ని సులభతరం చేయాలని బ్రిక్స్ సభ్య దేశాలను ప్రోత్సహిస్తున్నాం. క్రీడా వస్తువుల తయారీ, పరిశోధన, ఆవిష్కరణల్లో సహకారాన్ని ప్రోత్సహించేందుకు బ్రిక్స్ క్రీడా వస్తువుల తయారీ సదస్సు నిర్వహించాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. క్రీడల్లో ప్రదర్శన నాణ్యత, సంక్షేమం, పాలన, సమ్మిళితత్వాన్ని మెరుగుపరచడంలో సాంకేతికత పోషిస్తున్న, పెరుగుతున్న పాత్రను కూడా గుర్తిస్తున్నాం. క్రీడా సాంకేతికతపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు అంశంపై చర్చలను ప్రోత్సహిస్తున్నాం. బ్రిక్స్ క్రీడా సహకార చట్రంపై సంభాషణను స్వాగతిస్తూ సభ్య దేశాల మధ్య ఏర్పాటు చేసిన సంప్రదింపుల ప్రక్రియ ద్వారా, ఆయా దేశాల అంతర్గత విధానాలకు అనుగుణంగా ఈ అంశాన్ని మరింతగా పరిశీలించేందుకు ఎదురుచూస్తున్నాం.
131. యువతలో ప్రతిఘటన సామర్థ్యం, ఆవిష్కరణ, సమ్మిళితత్వం, సుస్థిర అభివృద్ధికి చోదక శక్తిగా పోషిస్తున్న కీలక పాత్రను పునరుద్ఘాటిస్తున్నాం. బ్రిక్స్ యువజన వ్యవహారాల మంత్రుల సమావేశంలో జరిగిన చర్చలను స్వాగతిస్తూ బ్రిక్స్ సహకారాన్ని, యువత అర్థవంతమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో బ్రిక్స్ యువజన మండలి, బ్రిక్స్ యువజన సదస్సు పోషిస్తున్న పాత్రను అభినందిస్తున్నాం. విద్య, శిక్షణ, నైపుణ్యాలు, యువత పారిశ్రామికత, విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణలు, సామాజిక, సాంస్కృతిక భాగస్వామ్యం, సామాజిక సేవ, స్వచ్ఛంద సేవ, అభివృద్ధి, పేదరికం, ఆకలి, అసమానతల నిర్మూలన, ఆరోగ్యం, యువత, క్రీడలు, యువత, పర్యావరణం, సుస్థిరత, యువజన సంభాషణ, యువత మార్పిడి, యువత సమ్మిళితత్వం వంటి రంగాల్లో బ్రిక్స్ దేశాల యువత మధ్య మరింత సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఈ నేపథ్యంలో, యువత సహకారానికి సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్య అంశాలపై బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేసే బ్రిక్స్ యువజన సహకార యంత్రాంగం రూపకల్పనలో సాధించిన పురోగతిని స్వాగతిస్తున్నాం.
132. న్యాయ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నాం. బ్రిక్స్ న్యాయశాఖ మంత్రుల సమావేశం, బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సమావేశం, బ్రిక్స్ ప్రాసిక్యూషన్ సేవల అధిపతుల సమావేశాలను గుర్తిస్తున్నాం. సరిహద్దులు దాటి ఉత్పన్నమయ్యే వాణిజ్య వివాదాల పరిష్కారంలో మరింత సహకారానికి మద్దతు ఇస్తున్నాం. న్యాయపరమైన స్పష్టతను నిర్ధారించడం, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులను సులభతరం చేయడంలో సమర్థవంతమైన, విశ్వసనీయమైన వివాద పరిష్కార వ్యవస్థల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాం. అధికారిక న్యాయ ప్రక్రియలకు సమర్థవంతమైన అనుబంధాలుగా మధ్యవర్తిత్వం సహా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఆర్) విధానాల పాత్ర పెరుగుతున్న విషయాన్ని కూడా గుర్తిస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండే, ప్రజాకేంద్రిత విధానంగా ఏడీఆర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు బ్రిక్స్ దేశాలను ప్రోత్సహిస్తున్నాం. సభ్య దేశాల్లో సంబంధిత భాగస్వాముల సామర్థ్య పెంపు కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నాం.
133. మన పార్లమెంట్ల మధ్య పరస్పర మార్పిడి, సహకారాన్ని బలోపేతం చేసే దిశగా మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం, అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుల సమావేశంతో పాటు 2026 అక్టోబర్‌లో జరగబోయే 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సమగ్ర, సుస్థిర, సమాన భవిష్యత్తు నిర్మాణానికి దేశాల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహించి, సంస్థాగత స్థైర్యాన్ని బలోపేతం చేసే ఉపయోగకరమైన వేదికలుగా ఈ సమావేశాల ప్రాధాన్యాన్ని అంచనా వేస్తున్నాం.
134. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య వ్యాపార సంస్థల ప్రత్యక్ష పరస్పర చర్చలకు వేదిక కల్పించిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 సమావేశాన్ని నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాం. బ్రిక్స్‌లో సుస్థిర అభివృద్ధి, సాంకేతిక పురోగతి, సమ్మిళిత వృద్ధి సాధనకు వినూత్న, విస్తరించదగిన, ప్రభావవంతమైన పరిష్కారాలను ప్రోత్సహించిన బ్రిక్స్ సొల్యూషన్స్ అవార్డ్స్ 2026, బ్రిక్స్ ఉమెన్స్ స్టార్టప్ అవార్డ్స్ 2026 వంటి కార్యక్రమాలను కూడా స్వాగతిస్తున్నాం.
135. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ కొనసాగిస్తున్న కృషిని ప్రశంసిస్తున్నాం. వాణిజ్యం, పెట్టుబడులు, ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత విస్తరించడం లక్ష్యంగా రూపొందించిన బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ వార్షిక నివేదిక, విధాన సిఫారసులను స్వాగతిస్తున్నాం. సుస్థిర అభివృద్ధి నెట్‌వర్క్ ప్రారంభాన్ని కూడా స్వాగతిస్తున్నాం.
136. బ్రిక్స్ దేశాల్లో వ్యాపారవేత్తలుగా మహిళల ఎదుగుదల, నాయకత్వం, ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో బ్రిక్స్ మహిళా వ్యాపార కూటమి (డబ్ల్యూబీఏ) పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసిస్తున్నాం. మహిళల నేతృత్వంలోని సంస్థలకు ఆర్థిక వనరులు, మార్కెట్లు, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అవకాశాలు అందుబాటులోకి వచ్చేలా రూపొందించిన మహిళా వ్యాపార కూటమి వార్షిక నివేదికలోని సిఫారసులను స్వాగతిస్తున్నాం. డబ్ల్యూబీఏ 2026 కార్యక్రమాల్లో బ్రిక్స్ దేశాల మధ్య ఇప్పటివరకు సాధించిన విస్తృత భాగస్వామ్యాన్ని గుర్తిస్తున్నాం. మహిళల ఆర్థిక భాగస్వామ్యంపై బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, ఇందులో విజ్ఞాన మార్పిడి, సంయుక్త కార్యక్రమాలను కూడా కొనసాగించాలని బ్రిక్స్ జాతీయ విభాగాలను ప్రోత్సహిస్తున్నాం.
137. బ్రిక్స్ థింక్ ట్యాంక్ కౌన్సిల్, బ్రిక్స్ సివిల్ కౌన్సిల్, బ్రిక్స్ అకడమిక్ ఫోరం, బ్రిక్స్ సివిల్ ఫోరం సమావేశాల ఫలితాలను, విద్యా వర్గాలు, పౌర సమాజ సంస్థల మధ్య సంభాషణ, పరస్పర మార్పిడిని బలోపేతం చేయడంలో సాధించిన పురోగతిని గుర్తిస్తున్నాం.
138. బ్రిక్స్ విస్తరణ సమ్మిళిత ప్రపంచ పాలనకు ఒక ముఖ్యమైన వేదికగా తన ప్రభావం, విశ్వసనీయత, ఆకర్షణను ప్రతిబింబిస్తోందని గుర్తిస్తున్నాం. ఫలితాలపై దృష్టి సారించిన మెరుగైన సమన్వయం, నిరంతరత, దీర్ఘకాలిక సంస్థాగత అభివృద్ధికి మద్దతు అవసరాన్నిస్పష్టంచేస్తున్నాం. . సంస్థాగత అభివృద్ధి నిరంతర, చైతన్యవంతమైన ప్రక్రియగా బ్రిక్స్ దేశాల అవసరాలు, ప్రాధాన్యాలను ప్రతిబింబించాలని పునరుద్ఘాటిస్తున్నాం. ఈ దిశగా బ్రిక్స్ ఆన్‌లైన్ ఆర్కైవల్ డేటాబేస్ ఏర్పాటులో సాధించిన పురోగతిని స్వాగతిస్తున్నాం. అది త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించేందుకు తదుపరి చర్చల కోసం ఎదురుచూస్తున్నాం. సంస్థాగత అభివృద్ధిని బలోపేతం చేయడంలో దోహదపడే చైర్ ప్రతిపాదించిన అవగాహన ఒప్పందాల సమీక్ష కార్యక్రమాన్ని కూడా పరిశీలించనున్నాం.
139. భారతదేశం 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడాన్ని ప్రశంసిస్తున్నాం. న్యూఢిల్లీలో 18 వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును నిర్వహించినందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
140. 2027లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు, చైనాలో 19 వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నిర్వహించనున్నందుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం.
***
(రిలీజ్ ఐడి: 2309907)
|