మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా
సెప్టెంబర్ 11-12 తేదీలలో 'బ్రిక్స్ భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్‌పోజిషన్'ను నిర్వహిస్తున్న విద్యా శాఖ
ఈ ప్రదర్శనను సందర్శించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, బ్రిక్స్ ప్రతినిధి బృందాల సారథులు
పాల్గొంటున్న 37 మంది భారతీయ డీప్ టెక్ ఆవిష్కర్తలు
నాడు పోస్టు చేయడమైనది:
11 SEP 2026 12:58PM by PIB Hyderabad
భారతదేశ అధ్యక్షతన సెప్టెంబర్ 12, 13 తేదీలలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత డీప్-టెక్ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 11-12 తేదీలలో ఢిల్లీలోని భారత్ మంటపంలో 'భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్‌పోజిషన్'ను నిర్వహిస్తోంది.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఒక జాతీయ కార్యక్రమమే ఈ 'భారత్ ఇన్నోవేట్స్'. భారతీయ ఉన్నత విద్యా వ్యవస్థలోని ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై వేగంగా ముందుకు తీసుకెళ్లే గ్లోబల్ యాక్సిలరేటర్‌గా దీనిని రూపొందించారు. భారతదేశ ఆవిష్కరణల వ్యవస్థ (అంకురాలు, ఉన్నత విద్యా సంస్థలు, ల్యాబ్‌లు, రీసెర్చ్ పార్కులు), ప్రపంచ స్థాయి భాగస్వాములు (కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు లేదా యాక్సిలరేటర్లు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వాలు, విదేశీ పూర్వ విద్యార్థులు) మధ్య దీర్ఘకాలిక సహకారాన్ని ఇది పెంపొందిస్తుంది.
భారత్ మండపంలో జరుగుతున్న 'బ్రిక్స్ భారత్ ఇన్నోవేట్స్ (బీబీఐ) ఎక్స్‌పోజిషన్'.. 2026 సంవత్సరంలో భారతీయ డీప్-టెక్ అంకురాల రెండో ప్రధాన ప్రదర్శన. దీనికంటే ముందు మొదటి ఎడిషన్ 2026 జూన్ 14-16 తేదీలలో ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో ఘనంగా జరిగింది.
ఫ్రాన్స్‌లోని నైస్‌లో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ (బీఐ2026)లో పాల్గొన్న అసలు 120 అంకురాలు, వెంచర్‌ల నుంచి ఎంపిక చేసిన 37 భారతదేశపు డీప్-టెక్ అంకురాలు, వెంచర్‌లను బీబీఐ ప్రదర్శిస్తోంది. ఇది ‘దృఢత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ అనే భారతదేశ బ్రిక్స్ అధ్యక్ష ఇతివృత్తానికి అనుగుణంగా ఉంది.
ఈ ప్రదర్శన 2026 సెప్టెంబర్ 11న బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌తో పాటు నిర్వహిస్తున్నారు. ఇది పాల్గొనే ఆవిష్కర్తలకు బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన సీఈఓలు, పెట్టుబడిదారులు, వ్యాపార నాయకులు, పారిశ్రామిక ప్రతినిధులతో నెట్‌వర్క్ చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది బీటూబీ చర్చలు, సాంకేతికత భాగస్వామ్యాలు, పెట్టుబడి చర్చలు, వ్యాపార సంబంధాలు, అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశాలను సులభతరం చేస్తుంది. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత 2026లో గుర్తించిన ఐదు ప్రాధాన్యతా రంగాలలో భాగం అయిన ‘పరిశోధన, ఆవిష్కరణ, అంకుర వ్యవస్థలను మెరుగుపరచడం’ అనే బ్రిక్స్ విద్య రంగ ప్రాధాన్యతను కూడా ఈ ఎక్స్‌పోజిషన్ ముందుకు తీసుకెళ్తుంది.
బీబీఐ ఎక్స్‌పోజిషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, బ్రిక్స్ నాయకులు సందర్శించనున్నారు. 2026 సెప్టెంబర్ 11-12 తేదీలలో జరుగుతున్న ఈ ప్రదర్శనను బ్రిక్స్ నాయకుల అధికారిక కార్యక్రమాలతో ముడిపడి ఉన్న సీనియర్ భారతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన సీఈఓలు, పెట్టుబడిదారులు, సీనియర్ వాణిజ్య నేతలు కూడా సందర్శించనున్నారు.
పాల్గొంటున్న అంకురాలు, ఆవిష్కర్తల కోసం దేశీయ ఆవిష్కరణలను అంతర్జాతీయ వాణిజ్య, దౌత్యపరమైన ఫలితాలుగా మార్చడానికి బీబీఐ ఎక్స్‌పోజిషన్ అత్యున్నత స్థాయి వేదికను అందిస్తోంది. దీని ద్వారా బ్రిక్స్ సీఈఓలు, పెట్టుబడిదారులకు ప్రత్యక్ష యాక్సెస్, దేశాధినేతలు లేదా ప్రభుత్వ అధినేతల దృష్టిని ఆకర్షించే అవకాశం లభిస్తుంది. ఫిక్కీ, సీఐఐ, అసోచామ్ సహకారంతో బీటూబీ సమావేశాలు, ప్రత్యేక మ్యాచ్‌మేకింగ్ ఏర్పాట్లు జరగడంతో పాటు బ్రాండ్, దౌత్యపరమైన విశ్వసనీయత కూడా చేకూరుతుంది.
'ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026' కింద 'భారత్ ఇన్నోవేట్స్ 2026' మొదటి ఎడిషన్ జరిగింది. దీనిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 13 విభాగాలకు చెందిన భారత్‌లోని టాప్ 120 డీప్-టెక్ అంకురాలు లేదా వెంచర్‌లు, 15 సంస్థలు (ఐఐటీలు, ఐఐఎస్‌సీ, బైరాక్- ఐడెక్స్) ప్రదర్శనకు ఉన్నాయి. 29 దేశాల నుంచి 2,000 మందికి పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 30కి పైగా అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు), భాగస్వామ్యాలు కుదిరాయి. 1,350 బీటూబీ సమావేశాల ఫలితంగా భారతీయ అంకురాలు, వెంచర్‌లు 254.5 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల హామీ పొందాయి.
భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత 2026 కింద విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాల కొనసాగింపుగానే 'బ్రిక్స్ భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్‌పోజిషన్' రూపొందించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో 2026 ఆగస్టు 7న 13వ బ్రిక్స్ విద్యా మంత్రుల సమావేశాన్ని, 2026 ఆగస్టు 5న 3వ బ్రిక్స్ విద్యపై సీనియర్ అధికారుల సమావేశాన్ని మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ విద్యా మంత్రుల సమావేశం ముగింపులో 13వ బ్రిక్స్ విద్యా మంత్రుల ప్రకటనను ఆమోదించారు. ‘బాల్యం తొలినాళ్లలో సంరక్షణ, విద్య, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా శాస్త్ర పరిజ్ఞానాన్ని బలోపేతం చేయటం’.. ‘నైపుణ్యాభివృద్ధి, టీవీఈటీ’.. ‘పరిశోధన, నూతన ఆవిష్కరణలు, అంకుర వ్యవస్థలను మెరుగుపరచడం’.. ‘విద్యార్హతల పరస్పర గుర్తింపు’.. ‘విద్యాపరమైన నాయకత్వం, సంస్థాగత అభివృద్ధి కోసం సామర్థ్య పెంపు’ వంటి అయిదు ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని నిర్దేశించింది.
(రిలీజ్ ఐడి: 2309185)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10