వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా ఈ - కామర్స్ నిబంధనలను సవరించిన కేంద్ర ప్రభుత్వం

సవరించిన నిబంధనల ద్వారా వినియోగదారుల ఫిర్యాదులు, శోధన ఫలితాలు, ప్రాయోజిత జాబితాలు, ధరల తగ్గింపులు, మోసపూరిత పద్ధతులు, విక్రేతల వివరాల వెల్లడికి సంబంధించిన నిబంధనలు మరింత పటిష్టం

2027, జనవరి 1వ తేదీ నుంచి నూతన నిబంధనల అమలు

నాడు పోస్టు చేయడమైనది: 10 SEP 2026 5:14PM by PIB Hyderabad

ఈ-కామర్స్ రంగంలో పారదర్శకతను, సమతుల్య నియంత్రణ వ్యవస్థను కల్పించడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) (సవరణ) నిబంధనలు, 2026 ద్వారా వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు, 2020 ని సవరించింది.

ఈ-కామర్స్ సంస్థలపై ఎలాంటి అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా, డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లో ఉద్భవిస్తున్న వినియోగదారుల ఆందోళనలను పరిష్కరించడం, సులభతర వాణిజ్యం,  వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే సమతుల్య విధానాన్ని అవలంబించడం లక్ష్యంగా నిబంధనలను సవరించారు. 

ప్రతీ ఈ - కామర్స్ సంస్థ తప్పనిసరిగా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్) అనుసంధాన  ప్రక్రియలో భాగస్వామి కావాలని ఈ సవరణలలోని ఒక ముఖ్యమైన నిబంధన స్పష్టం చేస్తోంది. ఇది జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థతో ఈ -కామర్స్ వేదికల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

2025లో నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ మొత్తం 17,71,622 ఫిర్యాదులను స్వీకరించగా అందులో 5,11,196 ఫిర్యాదులు (సుమారు 29 శాతం) కేవలం ఈ-కామర్స్ రంగానికి సంబంధించినవే కావడం గమనార్హం.

కీలక సవరణలు

సవరించిన నిబంధనలు క్రింది అంశాలకు వీలు కల్పిస్తాయి:

  • వినియోగదారుల ఫిర్యాదులు: ప్రతి ఈ - కామర్స్ సంస్థ తన ఫిర్యాదుల పరిష్కార అధికారి నమోదు చేసిన ఫిర్యాదు ప్రతిని ఫిర్యాదుదారుడికి అందించాలి.

  • శోధన ఫలితాలు: వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా లేదా వారు చేసిన శోధనలో వచ్చే ఫలితాల ఔచిత్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే విధంగా ఈ - కామర్స్ సంస్థలు శోధన ఫలితాలను మార్చకూడదు.

  • ప్రాయోజిత జాబితాలు: ప్రాయోజిత జాబితాలను స్పష్టంగా, ప్రముఖంగా కనిపించే విధంగా వెల్లడించి గుర్తించాలి.

  • ధరల తగ్గింపు: ఉత్పత్తి లేదా సేవపై ధరల తగ్గింపును ప్రకటించినప్పుడు, తగ్గింపు అనంతర ధరతో పాటు దానికి సంబంధించిన ‘మునుపటి ధర’ను కూడా స్పష్టంగా ప్రదర్శించాలి. ప్రకటనకు ముందు 30 రోజుల వ్యవధిలో సదరు వస్తువు లేదా సేవ అందుబాటులో ఉన్న అతి తక్కువ ధరనే ‘మునుపటి ధర’గా పరిగణించాలి.

  • మోసపూరిత పద్ధతులు: ఈ - కామర్స్ సంస్థలు 2023 నాటి మోసపూరిత పద్ధతుల (డార్క్ ప్యాటర్న్స్‌) నివారణ, నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఏడాది స్వీయ తనిఖీ నిర్వహించి, నిబంధనలను పాటిస్తున్నట్లు ధ్రువీకరించే ధ్రువపత్రాన్ని ప్రముఖంగా ప్రదర్శించాలి.

  • విక్రేత, ఉత్పత్తి వివరాలు: మార్కెట్‌ప్లేస్ ఈ - కామర్స్ సంస్థలు వినియోగదారులు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఉత్పత్తి వినియోగానికి అనుకూలమైన చివరి తేదీ, తిరిగి ఇవ్వడం లేదా నగదు వాపసు, హామీ, సరఫరా, చెల్లింపు తదితర కీలక వివరాలను తప్పనిసరిగా అందించాలి.

  • వినియోగదారులు సరైన సమాచారంతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా మార్కెట్‌ప్లేస్ ఈ-కామర్స్ సంస్థలు వస్తువుల వినియోగ గడువు, రిటర్న్/రిఫండ్, వారంటీ, డెలివరీ, చెల్లింపు వివరాల వంటి కీలక సమాచారాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలి.

  • వినియోగదారుల సమాచారం: మార్కెట్‌ప్లేస్ ఈ - కామర్స్ సంస్థలు వినియోగదారుల ముందస్తు, స్పష్టమైన అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని నిర్దిష్ట అవసరాల కోసం ఉపయోగించకూడదు.

  • సమ్మిళిత రుసుములు: మార్కెట్‌ప్లేస్ ఈ - కామర్స్ సంస్థలు, సదరు ఈ - కామర్స్ వేదికకు సంబంధం లేని సేవల కోసం సమ్మిళిత రుసుములను (బండిల్డ్ ఫీజులను) వసూలు చేయకూడదు. అయితే, లాయల్టీ లేదా సభ్యత్వ ప్రోగ్రామ్‌లకు సంబంధించి నిర్దేశించిన మినహాయింపులకు ఇది లోబడి ఉంటుంది.

  • దిగుమతి చేసిన వస్తువులు: దిగుమతి చేసిన వస్తువులకు సంబంధించి దిగుమతిదారుడి వివరాలు, తయారైన దేశం వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి.

ఈ-కామర్స్ వ్యవస్థ బలోపేతం 

2019 నాటి వినియోగదారుల రక్షణ చట్టం కింద నోటిఫై చేసిన 2020 నాటి వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు, ఈ-కామర్స్ రంగంలో అన్యాయ వాణిజ్య విధానాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు అవసరమైన నియమావళిని అందిస్తున్నాయి. మారుతున్న వ్యాపార నమూనాలు, డిజిటల్ విధానాలు, వినియోగదారుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని సవరించిన నిబంధనలు ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి.

ఈ సవరణల ద్వారా మరింత పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన, వినియోగదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే ఈ - కామర్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో, ఈ-కామర్స్ సంస్థలు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై స్పష్టత కల్పించడంతో పాటు, డిజిటల్ మార్కెట్‌లో కార్యకలాపాలు నిర్వహించే వ్యాపార సంస్థలన్నింటికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ సవరణలు దోహదపడతాయి.

భారత ఈ - కామర్స్ రంగంలో అభివృద్ధి, నూతన ఆవిష్కరణలతో పాటు సమర్థవంతమైన వినియోగదారుల రక్షణ, పారదర్శకత, న్యాయబద్ధమైన వ్యాపార విధానాలు, వ్యాపార సౌలభ్యం ఉండేలా చూడటానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ కట్టుబడి ఉంది. అదే సమయంలో వినియోగదారులు, ఈ-కామర్స్ సంస్థల ప్రయోజనాల మధ్య తగిన సమతుల్యతను కొనసాగించేందుకు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది.

2026 నాటి వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) (సవరణ) నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2308959) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Gujarati , Kannada , Malayalam