ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ఆధార్ ముఖ గుర్తింపు ఎస్‌డీకే, శాండ్‌బాక్స్‌ను ప్రారంభించిన యూఐడీఏఐ


రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా బహుళ అంశాల ధ్రువీకరణ కోసం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగానికి చెందిన సంస్థలు ఆధార్ ముఖ గుర్తింపు విధానాన్ని మరింత సులభంగా వినియోగించుకునే వీలు

ఆధార్ ముఖ గుర్తింపు కోసం వేర్వేరు యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా వినియోగదారులకు మరింత సౌలభ్యం

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 6:15PM by PIB Hyderabad

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ఆధార్ ముఖ గుర్తింపు ఎస్‌డీకే (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్), ఆధార్ ముఖ గుర్తింపు శాండ్‌బాక్స్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ రోజు ప్రారంభించింది. డిజిటల్ యాప్ లలో ఆధార్ ముఖ గుర్తింపు విధానాన్ని మరింత సులభంగా అనుసంధానించడం, పరీక్షించడం, అమలు చేయడం కోసం ఈ వ్యవస్థ భాగస్వాములకు వీలు కల్పిస్తుంది.

ఆధార్ ముఖ గుర్తింపు ఎస్‌డీకే ద్వారా యూఐడీఏఐ అందించే ముఖ గుర్తింపు సౌకర్యాన్ని నేరుగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ ల లోనే పొందుపరచుకోవచ్చు. దీనివల్ల వినియోగదారులు వివిధ యాప్ లకు మారాల్సిన అవసరం ఉండదు. ఒకే యాప్ లోనే సులభంగా, నిరంతరాయంగా గుర్తింపు ధ్రువీకరణను పూర్తి చేసుకునే అవకాశం కలుగుతుంది.

వెంటనే వినియోగించుకునేలా రూపొందించిన ఈ ఎస్‌డీకే ద్వారా భాగస్వామ్య సంస్థలకు అనుసంధాన ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. ఇందులో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్ నెస్, మోసపూరిత ప్రయత్నాలను నిరోధించే సాంకేతికతలు ఉన్నాయి. ధ్రువీకరణ సమాచారాన్ని సురక్షితంగా నిర్వహించడంతో పాటు, గోప్యతకు కూడా ఇది మద్దతు ఇస్తుంది. వినియోగదారుల స్మార్ట్‌ఫోన్లలో పనిచేసేలా ఈ ఎస్‌డీకేను రూపొందించారు. ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, ఆర్థిక సాంకేతిక సంస్థలు, ఇతర సంస్థలు ముఖ గుర్తింపు ఆధారిత సేవలను మరింత సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఎస్‌డీకే సహాయపడుతుందని భావిస్తున్నారు.

ఎస్‌డీకేతో పాటు, యూఐడీఏఐ ప్రారంభించిన ఆధార్ ముఖ గుర్తింపు శాండ్‌బాక్స్‌  భద్రమైన, నియంత్రిత వాతావరణాన్ని అందిస్తుంది. దీని ద్వారా సంస్థలు పూర్తిస్థాయి ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా (ప్రొడక్షన్ స్థాయిలో ) అందుబాటులోకి తీసుకురావడానికి ముందే దానిని అనుసంధానించుకుని, సమగ్రంగా పరీక్షించి, ధృవీకరించుకోవడానికి వీలవుతుంది. 

అదనపు బయోమెట్రిక్ పరికరాలు అవసరం లేకుండా వినియోగదారుల నమోదు, అనుమతి, ముఖ చిత్రీకరణ, లైవ్‌నెస్ తనిఖీలు, గుర్తింపు, లోపాల నిర్వహణ, ఫలితాల అంచనా సహా అన్ని కీలక దశలను పరీక్షించేందుకు డెవలపర్లు, నాణ్యత పరిశీలన బృందాలకు ఈ శాండ్‌బాక్స్ దోహదపడుతుంది. చెల్లని డిజిటల్ సంతకాలు, నెట్‌వర్క్ అంతరాయాలు, సమయ పరిమితి ముగింపు, మోస పూరిత యత్నాలు వంటి వైఫల్య పరిస్థితులను కూడా ముందస్తుగా పరీక్షించుకోవడానికి ఇది అనుమతిస్తుంది.

ఎస్‌డీకే, శాండ్‌బాక్స్‌ ప్రారంభంతో ఆర్థిక సాంకేతిక, బ్యాంకింగ్ రంగాల చిరకాల డిమాండ్‌ నెరవేరింది. వినియోగదారుకు బ్యాంకు లేదా ఆర్థిక సాంకేతిక సంస్థ మొబైల్ యాప్ లోనే సులభమైన, సురక్షితమైన నమోదు ప్రక్రియను అందించేందుకు ఇవి వీలు కల్పిస్తాయి.

ఇది వినియోగదారుల నమోదు ప్రక్రియను మరింత సరళతరం చేస్తుంది. ఉదాహరణకు, వినియోగదారు బ్యాంకింగ్, బీమా లేదా బ్రోకింగ్ యాప్ లో ఏదైనా ఒకదాన్ని మాత్రమే డౌన్‌లోడ్ చేసుకుని, ఆ యాప్ నుంచే ఆధార్ ధ్రువీకరణను పూర్తి చేయవచ్చు. గతంలో ఇదే విధమైన ప్రక్రియ కోసం నేపథ్యంలో పనిచేసే ఫేస్ఆర్‌డీ యాప్ అవసరమయ్యేది. దీంతో వినియోగదారుల నమోదు ప్రక్రియ సుదీర్ఘంగా మారడంతో పాటు, ఆధార్ ఫేస్ఆర్‌డీ యాప్ అందుబాటులో ఉండటంపై ఆధారపడాల్సి వచ్చేది. తాజా ప్రారంభంతో ఆధార్ ముఖ గుర్తింపు ధ్రువీకరణ కోసం పలు యాప్ ల అవసరం తగ్గుతుంది.

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస, యంత్ర అభ్యసన ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని యూఐడీఏఐ 2021లో ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా 500 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, టెలికాం సంస్థలు, బ్రోకరేజ్ సంస్థలు, ధ్రువీకరణ సంస్థలు తదితరాలతో కలిపి దాదాపు 200 సంస్థలు దీనిని స్వీకరించాయి. ఈ సాంకేతికత 2023 సంవత్సరానికి ఆవిష్కరణ విభాగం కింద ప్రధానమంత్రి అత్యుత్తమ పరిపాలన ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది.

పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్) సమర్పించడం, ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల నమోదు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాలు, ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఈ-కేవైసీ ద్వారా సిమ్ కార్డుల క్రియాశీలీకరణ, పీఎం ఈ-డ్రైవ్, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్ వంటి పథకాల లబ్ధిదారుల ధ్రువీకరణ తదితర సేవల్లో ముఖ గుర్తింపు విధానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.

గుర్తింపు (అథెంటికేషన్) వ్యవస్థలో సులభంగా చేరేందుకు మార్గదర్శకంగా పనిచేసే ‘ప్లేబుక్ ఆన్ ఈజ్ ఆఫ్ ఆన్‌బోర్డింగ్’ మార్గదర్శక పుస్తకాన్ని కూడా యుఐడిఎఐ ఆవిష్కరించింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగ సంస్థలు (బిఎఫ్ఎస్ఐ)  ( తమ వినియోగదారులు, సిబ్బంది, ఇతర వ్యాపార భాగస్వాముల గుర్తింపు ధ్రువీకరణ కోసం ఇది ఉపయోగపడుతుంది. 

 

****


(రిలీజ్ ఐడి: 2308512) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , Urdu , Marathi , हिन्दी , Assamese , Kannada