ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ పరిధిలో 17 జిల్లాల మీదుగా అయిదు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేబినెట్
సుమారు 540 కిమీ మేర భారత రైల్వే పరిధి పెంపు
ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.10,021 కోట్లు… 2029-30 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికల రూపకల్పన
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 3:33PM by PIB Hyderabad
సుమారు రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించి అయిదు నూతన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టుల వివరాలు:
ఎ) అరక్కోణం- రేణిగుంట 3, 4వ లైన్ - 77 కిలోమీటర్లు
బి) వైట్ ఫీల్డ్- బంగారుపేట 3, 4వ లైన్ - 47 కిలోమీటర్లు
సీ) హోసూర్- ఒమలూర్ డబ్లింగ్ (రెండు లైన్ల నిర్మాణం) - 147 కిలోమీటర్లు
డీ) సేలం- కరూర్- దిండిగల్ డబ్లింగ్ - 159 కిలోమీటర్లు
ఈ) సికింద్రాబాద్ మల్టీ ట్రాకింగ్ (ఘటకేసర్) - కాజీపేట్ -110 కిలోమీటర్లు
రైలు మార్గాల సామర్థ్యం పెరగటం వల్ల రవాణా సౌలభ్యం మెరుగవుతుంది. దీనివల్ల భారత రైల్వేల నిర్వహణ సామర్థ్యం, సేవలపై విశ్వాసం పెరుగుతాయి. కార్యకలాపాల క్రమబద్ధీకరణకు, రద్దీని తగ్గించేందుకు ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు సహాయపడతాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలలుగన్న న్యూ ఇండియాకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులున్నాయి. సమగ్రాభివృద్ధి ద్వారా ఆ ప్రాంత ప్రజలు "ఆత్మనిర్భర్" ను సాధించటంతో పాటు స్థానికంగా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా మల్టీ మోడల్ అనుసంధానతను, రవాణా సామర్థ్యాన్ని పెంపొందించటం ఈ ప్రాజెక్టుల ఉద్దేశం. ప్రజలు, సరకులు, సేవల రవాణాకు అంతరాయం లేని అనుసంధానతను ఇవి అందిస్తాయి.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని 17 జిల్లాల మీదుగా వెళ్లే ఈ అయిదు ప్రాజెక్టులు భారత రైల్వే పరిధిని దాదాపు 540 కిలోమీటర్ల మేర పెంచుతాయి. ఆమోదం పొందిన ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 52 లక్షల జనాభా గల దాదాపు 2,121 గ్రామాలకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి.
ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టుల సామర్థ్యం ద్వారా తిరుపతి, సుబ్రమణ్యస్వామి ఆలయం (తిరుత్తణి), శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (తిరుచానూరు), కోటిలింగేశ్వర దేవాలయం, శ్రీ సీతి భైరవేశ్వర స్వామి ఆలయం, బంగారు తిరుపతి, కోలార్ బంగారు గనులు, హోగెనక్కల్ జలపాతం, హోసూర్ కోట, మెట్టూర్ డ్యామ్, కొడైకెనాల్ కొండలు, సత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యం, నమక్కల్ ఆంజనేయర్ ఆలయం, నమక్కల్ కోట, కళ్యాణ పశుపతేశ్వర ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, భువనగిరి కోట, సురేంద్రపురి, స్వర్ణగిరి ఆలయం వంటి దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు అనుసంధానం మెరుగవుతుంది.
బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు, కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహారధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టులు కీలక మార్గాలు. ఈ పెంపుదల ద్వారా ఏటా అదనంగా 47 ఎంటీపీఏ ( ఏడాదికి మిలియన్ టన్నుల) సరకు రవాణా సాధ్యమవుతుంది. పర్యావరణహిత, శక్తి సామర్థ్యాలు గల రవాణా వ్యవస్థ రైల్వేలు. దేశ వాతావరణ లక్ష్యాలను చేరుకోవటంలో, రవాణా ఖర్చులను తగ్గించటంలో ఇవి ఉపయోగపడతాయి. ఇవి చమురు దిగుమతి (సుమారు 8 కోట్ల లీటర్ల)ని తగ్గించి, కర్బన ఉద్గారాల (సుమారు 42 కోట్ల కిలోల) విడుదలను తగ్గిస్తాయి. ఇది సుమారు 2 కోట్ల మొక్కలు నాటటంతో సమానం.
***
(రిలీజ్ ఐడి: 2308327)
సందర్శకుల సూచీ సంఖ్య : : 47
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam