రక్షణ మంత్రిత్వ శాఖ
శ్రీలంక అధ్యక్షునితో కొలంబోలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మర్యాద పూర్వక భేటీ
ప్రాంతీయ భద్రతనీ, హితాన్ని పరిరక్షిస్తూ ఉమ్మడి ప్రగతికీ, ప్రజాసంక్షేమానికీ కట్టుబడి ఉంటామని భారత్, శ్రీలంక పునరుద్ఘాటన
సన్నిహిత మిత్రదేశం, పొరుగుదేశం కావడం వల్ల భారత్ ప్రథమ ప్రతిస్పందనదారుగా సాయాన్నందించే బాధ్యతను గుర్తించి నిర్వర్తిస్తుందన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్
భారత్ భద్రత ప్రయోజనాలకు విఘాతం కలిగించే పనులకు శ్రీలంక భూభాగాన్ని ఎప్పటికీ ఉపయోగించనీయం: శ్రీ అనురా కుమార దిసనాయకే
శ్రీలంక వైమానిక దళానికిచ్చిన ఎల్70 శతఘ్నుల ఆధునికీకరణతో పాటు రెండు దేశాల నేషనల్ కేడెట్ కోర్, నేషనల్ డిఫెన్స్ కాలేజీల సహకారంపై ఒప్పందాలు
వర్చువల్ గా భారతీయ రక్షణ దళాలు నిర్మించిన మూడు బెయిలీ వంతెనలకు ప్రారంభోత్సవం
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 2:39PM by PIB Hyderabad
శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనురా కుమారా దిసానాయకేతో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కొలంబోలో ఈ రోజు సమావేశమయ్యారు. నేతలిద్దరూ రెండు దేశాల సాంప్రదాయిక సౌహార్దపూర్వక సంబంధాలతో పాటు పరస్పర విశ్వాసం పెనవేసుకున్న బహుముఖీన భాగస్వామ్య అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ ఫలప్రద చర్చల్లో పాల్గొన్నారు.

నాగరికత పరంగా కవలలు, సన్నిహితమైన ఇరుగుపొరుగుదేశాలు, సముద్ర వాణిజ్య భాగస్వాములైన భారత్, శ్రీలంక.. ఈ ప్రాంత భద్రత, స్థిరత్వం, శాంతి, సౌభాగ్యాల్ని నిర్ధారించడంతో పాటే ప్రజల పురోభివృద్ధినీ, సంక్షేమాన్నీ దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేయడాన్ని కొనసాగించనున్నట్లు మరోసారి స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరఫున రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలను తెలియజేశారు. రెండు దేశాల ప్రజలూ బలమైన చరిత్రాత్మక, నాగరికతపరమైన సంబంధాలతో పాటు పరస్పర సంబంధాలపై ఆధారపడిన ప్రగాఢ మైత్రిని పంచుకుంటున్నారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
అధ్యక్షుడు శ్రీ దిసనాయకే రక్షణ మంత్రికి సాదరంగా స్వాగతం పలుకుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తాను జరిపిన చర్చలను గుర్తుకు తెచ్చుకున్నారు. భారత్ భద్రతకు హాని చేసే కార్యకలాపాలకు శ్రీలంక తన భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి ఎన్నడూ అనుమతించదని శ్రీ దిసనాయకే పునరుద్ఘాటించారు.

దిత్వా పెనుతుపాను సమయంలో ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరిట భారత్ అందించిన ఉపశమన ప్రధాన సహాయానికీ, ద్వీపంలో వివిధ ప్రాంతాల్లో పునర్నిర్మాణ, పునరావాస పనులకు మార్గాన్ని సుగమం చేయడానికి న్యూఢిల్లీ విస్తృత స్థాయిలో సమకూర్చిన పునరావాసపూర్వక సాయానికీ అధ్యక్షుడు శ్రీ దిసనాయకే కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు ఓ సన్నిహిత మిత్రదేశంగానూ, పొరుగుదేశంగానూ ఉన్న భారత్ దీనిని తాను దయచూపుతున్నట్లు భావించకుండా ప్రాథమిక సహయాన్ని అందించాల్సిన బాధ్యత కలిగిన దేశంగా భావిస్తుందనీ, రాబోయే కాలంలో ఇదే మాదిరి సాయపడుతుంటుందనీ రక్షణ మంత్రి స్పష్టం చేశారు.

భారతీయ రక్షణ బలగాలు నిర్మించిన మూడు బెయిలీ వంతెనలను దృశ్య మాధ్యమం సాయంతో నేతలిద్దరూ ప్రారంభించారు. శ్రీలంక వైమానిక దళానికి ఎల్70 శతఘ్నుల ఆధునికీకరణ, ఇరు దేశాల నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సీసీ), నేషనల్ డిఫెన్స్ కాలేజీ (ఎన్‌డీసీ)ల మధ్య సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలను (ఎంఓయూ) ఉభయ దేశాలూ ఇచ్చి పుచ్చుకున్నాయి. శ్రీలంక వైమానిక దళానికి ఎల్70 రకం శతఘ్నులు ఆరింటిని ఆధునికీకరించి అందజేయడానికి సంబంధించిన ఎంఓయూలో భారత ప్రభుత్వ గ్రాంటు ముఖ్యాంశంగా ఉంది. గగనతల రక్షణకు తోడ్పడే ఈ శతఘ్నుల ఆధునికీకరణతో, శ్రీలంకలో ప్రముఖ కట్టడాలను ఆకాశమార్గం నుంచి రక్షించే వ్యవస్థ చెప్పుకోదగినంతగా పటిష్ఠమవుతుంది. ఈ వాయు రక్షణ శతఘ్నులను శ్రీలంక వైమానిక దళానికి భారత్ యే ఇదివరకు అందజేసింది.

ఎన్‌డీసీ, ఇండియాతో పాటు ఎన్‌డీసీ, శ్రీలంక ల మధ్య విద్యారంగ సహకార అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జ్ఞాన పంపిణీకి మార్గం సుగమం అవుతుంది. ఈ రెండు సహకార సంస్థల మధ్యా విద్యారంగ సంబంధాల్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక చొరవ తీసుకున్నట్లవుతోంది. ప్రతి సంవత్సరం న్యూఢిల్లీకి వచ్చి ఎన్‌సీసీ కార్యక్రమాల్లో పాలుపంచుకొనేందుకు ఓ అమూల్యావకాశాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఈ మార్పిడి కార్యక్రమం అందిస్తోంది.

***
(రిలీజ్ ఐడి: 2308314)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8