బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉపరితల బొగ్గు/ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంలో పూర్తయిన మొదటి దశ: ప్రధాన పరిశ్రమలు, పీఎస్‌యూల నుంచి ఏడు దరఖాస్తులు


అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌టీపీసీ, తాల్చేర్ ఫెర్టిలైజర్స్, గాల్లాంట్ ఇస్పాత్, శ్యామ్ సెల్ అండ్ పవర్ లిమిటెడ్ తదితర సంస్థల నుంచి అందిన దరఖాస్తులు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న బొగ్గు గ్యాసిఫికేషన్‌ కార్యక్రమానికి మరింత ఊపు

నాడు పోస్టు చేయడమైనది: 08 SEP 2026 11:39AM by PIB Hyderabad

పరిశ్రమల నుంచి అద్భుతమైన స్పందనతో రూ.37,500 కోట్ల విలువైన ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకం మొదటి దశ విజయవంతంగా పూర్తయింది. భారత్‌లోని కొన్ని అతి పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏడు (7) దరఖాస్తులు అందాయి. ఇది ఈ పథకంపై బొగ్గు మంత్రిత్వ శాఖకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది భారతదేశ ఇంధన భద్రత, దిగుమతి ప్రత్యామ్నాయం, పారిశ్రామిక అభివృద్ధి వ్యూహంలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రక్రియ ముఖ్యమైన అంశమనే విషయంపై పరిశ్రమల విశ్వాసం పెరుగుతోందనే విషయాన్ని ఈ స్పందన తెలియజేస్తోంది. 

మొదటి దశలో వచ్చిన దరఖాస్తులు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి:

 

క్రమ సంఖ్య

దరఖాస్తుదారు

తుది ఉత్పత్తులు

  1.  

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ – ప్రాజెక్టు 1

యూరియా

  1.  

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ – ప్రాజెక్టు 2

యూరియా

  1.  

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ – ప్రాజెక్టు 3

యూరియా

  1.  

గాల్లాంట్ ఇస్పాత్ లిమిటెడ్

డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్, సిన్‌గ్యాస్

  1.  

ఎన్‌టీపీసీ లిమిటెడ్

సింథటిక్ నేచురల్ గ్యాస్

  1.  

శ్యామ్ సెల్ అండ్ పవర్ లిమిటెడ్

సిన్‌గ్యాస్

  1.  

తాల్చేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్

యూరియా

‘‘ఎవరూ ముందుకు రావడం లేదు అనే నివేదికలు తొందరపాటు అంచనాలే అని మేము అప్పుడే చెప్పాం. ఆ సమయంలోనే పరిశ్రమ నుంచి స్పందన వస్తుందనే నమ్మకం మాకు ఉంది. పరిశ్రమ నిర్ణయాత్మకంగా స్పందించింది. భారతదేశంలోని కొన్ని అతి పెద్ద పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మొదటి దశలోనే ఏడు దరఖాస్తులు వచ్చాయి. ఇది ఈ పథకంపై, భారత బొగ్గు గ్యాసిఫికేషన్ కార్యక్రమంపై ఉన్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. మార్కెట్ తన స్పందనను తెలియజేసింది’’ అని బొగ్గు మంత్రిత్వశాఖకు  చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు విస్తృతమైనవి. వాటికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం, అలాగే సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక అధ్యయనాలు, సాంకేతికపరమైన అంచనాలు, పర్యావరణ పరిశీలనలు, సవివరమైన ఆర్థిక ప్రణాళికతో సహా విస్తృత స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు అవసరం. 2026, జులై 7న ప్రతిపాదనల కోసం అభ్యర్థన జారీ చేసినప్పటి నుంచి మొదటి దశలో ఏడు దరఖాస్తులు వచ్చాయి. ఇది ఈ పథకంపై పరిశ్రమకు ఎంత నమ్మకముందో తెలియజేస్తోంది. దేశీయ బొగ్గు గ్యాసిఫికేషన్ రంగాన్ని పటిష్టంగా మార్చేందుకు దోహదపడే సామర్థ్యం ఈ ప్రాజెక్టులకు ఉంది. గతంలో ప్రకటించిన రూ. 8,500 కోట్ల ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద ఇప్పటికే ఎనిమిది గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి.

పథకం నేపథ్యం

2026 మే 13న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ. 37,500 కోట్ల అంచనా వ్యయంతో ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకానికి ఆమోదం లభించింది. ఈ పథకం లక్ష్యాలు:

  • దేశీయ బొగ్గు, లిగ్నైట్‌‌ను సింగ్యాస్, మెథనాల్, అమ్మోనియా, యూరియా, హైడ్రోజన్ లాంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చడాన్ని ప్రోత్సహించడం. 

  • ఎల్ఎన్‌జీ, యూరియా, అమ్మోనియా, మెథనాల్ దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడం. ఆర్థిక సంవత్సరం 2024–25లో ఈ ఉత్పత్తుల దిగుమతి విలువ సుమారుగా రూ. 2.77 లక్షల కోట్లు.

  • ఈ పథకం పరిధిలో 75 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంతో సహా 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే జాతీయ లక్ష్యానికి తోడ్పాటును అందించడం.

  • రూ.2.5-3 లక్షల కోట్ల అంచనా పెట్టుబడులను ప్రోత్సహించడం, విలువ ఆధారిత వ్యవస్థ అంతటా గణనీయమైన స్థాయిలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించడం

జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్‌తో పాటు ప్రస్తుతం ఎనిమిది ప్రాజెక్టులు అమల్లో ఉన్న, 2024 జనవరిలో ఆమోదం పొందిన రూ. 8,500 కోట్ల పథకం ఆధారంగా ప్రస్తుత పథకాన్ని రూపొందించారు.

భవిష్యత్తు మార్గం

పథకం మార్గదర్శకాలు, ఆర్ఎఫ్‌పీకి అనుగుణంగా మొదటి దశలో స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో మూల్యాంకనం చేస్తారు.

2026, సెప్టెంబర్ 8 నుంచి ఈ పథకం రెండో దశ మొదలవుతుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆర్ఎఫ్‌పీకి అనుగుణంగా... అర్హత కలిగిన సంస్థలకు ఈ పథకంలో పాల్గొనేందుకు వీలుగా క్రమం తప్పకుండా అవకాశాలను కల్పించేందుకు గాను ప్రతి రెండు నెలలకు ఓసారి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు సన్నాహకాల తుది దశలో పలువురు దరఖాస్తుదారులు ఉన్నారు. భవిష్యత్తులో చేపట్టే విడతల్లో వీరు తమ ప్రతిపాదనలను సమర్పిస్తారని అంచనా.

ఈ పథకంపై దరఖాస్తుదారుల విశ్వాసాన్ని, ఈ పథకంలో వారి భాగస్వామ్యాన్ని మంత్రిత్వ శాఖ అభినందించింది. భారతదేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి, ఇంధన భద్రతను, దిగుమతి ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయడానికి, క్లీన్ కోల్ సాంకేతిక పరిజ్ఞానాల్లో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఈ పథకం కట్టుబడి ఉంది.

 

****


(రిలీజ్ ఐడి: 2307840) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil