వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
తగిన భద్రతా చర్యలు లేకుండా పేలుడు పదార్థాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచినందుకు డయల్4ట్రేడ్ సంస్థకు సీసీపీఏ రూ.10 లక్షల జరిమానా
లైసెన్స్ తనిఖీలు, కొనుగోలుదారుల అర్హత, తప్పనిసరి భద్రతా వివరాలు లేకుండానే అమ్మోనియం నైట్రేట్ అమ్మకాలకు సహకరించిన వేదిక
ప్రమాదకర, పేలుడు పదార్థాల ఆన్‌లైన్ జాబితా, విక్రయాలపై దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ వేదికల పరిశీలనలో భాగంగా చర్యలు
నాడు పోస్టు చేయడమైనది:
02 SEP 2026 3:08PM by PIB Hyderabad
డయల్4ట్రేడ్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్‌పై కేంద్ర వినియోగదారుల పరిక్షణ సంస్థ (సీసీపీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది. చట్టం ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నియంత్రణ, భద్రతా చర్యలు లేకుండానే ఈ-కామర్స్ వేదికలో అమ్మోనియం నైట్రేట్‌ను ఆన్‌లైన్‌లో జాబితాలో చేర్చడం, హోస్ట్ చేయడం, ప్రకటనలు ఇవ్వడం, విక్రయానికి అవకాశం కల్పించడం వంటి చర్యలకు పాల్పడినందుకు గాను సీసీపీఏ ఈ జరిమానా విధించింది. వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్లు 10, 20, 21 కింద సీసీపీఏ ప్రధాన కమిషనర్ శ్రీమతి నిధి ఖరే, కమిషనర్ శ్రీ అనుపమ్ మిశ్రా నేతృత్వంలో తుది ఉత్తర్వులు జారీ చేశారు.
తమ వేదికలో అమ్మోనియం నైట్రేట్, పేలుడు పదార్థాల చట్టం 1884 ప్రకారం పేలుడు పదార్థంగా వర్గీకరించిన ఇతర పదార్థాల జాబితా, హోస్టింగ్, ప్రకటనలు, విక్రయానికి సదుపాయం కల్పించడం వంటి వాటిని వెంటనే నిలిపివేయాలని డయల్4ట్రేడ్ సంస్థను సీసీపీఏ ఆదేశించింది.
తప్పనిసరి వివరాలు, ధ్రువీకరణ లేకపోవడాన్ని గుర్తించిన సీసీపీఏ
ఆన్‌లైన్ వేదికను పరిశీలించిన సమయంలో తగిన భద్రతా చర్యలు లేకుండానే అమ్మోనియం నైట్రేట్‌ను జాబితాలో ఉంచి, కొనుగోలుకు అందుబాటులో ఉంచినట్లు సీసీపీఏ గుర్తించింది. ఇందులో తప్పనిసరి భద్రతా చర్యలు లేకపోవడం గుర్తించింది.
· విక్రేతకు ఉన్న చెల్లుబాటు అయ్యే పీఈఎస్ఓ (పెట్రోలియం, పేలుడు పదర్ధాల భద్రతా సంస్థ) లైసెన్స్ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి.
· కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారుడి గుర్తింపు, లైసెన్స్ ఉన్నదా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించాలి.
· అమ్మోనియం నైట్రేట్ నిబంధనలు 2012 ప్రకారం లావాదేవీలను గుర్తించేందుకు, వాటి వివరాలను ట్రాక్ చేసేందుకు తగిన వ్యవస్థలు ఉండాలి.
· ఈ పదార్థాన్ని కలిగి ఉండటం, ఉపయోగించడంపై ఉన్న చట్టపరమైన ఆంక్షలు, అనధికారికంగా కలిగి ఉంటే ఎదురయ్యే పరిణామాలపై హెచ్చరికలు ఇవ్వాలి.
వీటితోపాటు ఈ ఉత్పత్తికి సంబంధించిన ఆన్‌లైన్ జాబితాలో పేలుళ్లు, పేలుడు ప్రభావాలను చూపించే చిత్రాలను కూడా ఉపయోగించారు. ఈ చిత్రాలు పదార్థం ప్రమాదకరమైనది, నియంత్రితమైనదనే విషయాన్ని తెలియజేయడం కంటే, ఉత్పత్తిపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఉపయోగపడే అవకాశం ఉందని సీసీపీఏ పేర్కొంది.
ఆన్‌లైన్ వేదికలో ఉంచిన ఉత్పత్తి జాబితాను ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, వినియోగదారులకు తెలియజేయడం అనేది వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 2(1) ప్రకారం “ప్రకటన” పరిధిలోకి వస్తుందని సీసీపీఏ స్పష్టం చేసింది. నియంత్రిత పేలుడు పదార్థాన్ని సాధారణ వినియోగ వస్తువుల మాదిరిగా విక్రయానికి ఉంచి, దాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేయాలంటే నిర్దేశిత లైసెన్స్ అవసరమనే విషయాన్ని వినియోగదారులకు తెలియజేయకపోవడం తప్పుదోవ పట్టించే ప్రకటన, అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని తెలిపింది. ఇవి చట్టంలోని సెక్షన్లు 2(28), 2(47) పరిధిలోకి వస్తాయని తెలిపింది.
డయల్4ట్రేడ్ తాను బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) మార్కెట్‌ప్లేస్ మధ్యవర్తిగా మాత్రమే పనిచేస్తున్నామని, మూడో పక్ష విక్రేతలు అప్‌లోడ్ చేసిన ఉత్పత్తుల జాబితాలకు తమను బాధ్యులను చేయరాదని వాదించింది. అయితే ఈ వాదనను సీసీపీఏ తిరస్కరించింది. తమ వేదికను అమ్మోనియం నైట్రేట్‌ను ఒక్క యూనిట్ వంటి తక్కువ పరిణామంలో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉందని, సాధారణంగా బీ2బీ విధానంలో ఉండే కనీస ఆర్డర్ పరిమాణం, సంస్థాగత కొనుగోలుదారుల ధ్రువీకరణ వ్యవస్థలు అందుబాటులో లేవని పేర్కొంది.
ఒక ఈ-కామర్స్ వేదిక తన వ్యాపార విధానాన్ని ఏ విధంగా నిర్వచించుకున్నప్పటికీ, వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు 2020 మార్కెట్‌ప్లేస్ ఈ-కామర్స్ సంస్థలకు వర్తిస్తాయని సీసీపీఏ పేర్కొంది.
సమాచార సాంకేతికత చట్టం 2000లోని సెక్షన్ 79 కింద మధ్యవర్తి సంస్థలకు కల్పించే చట్టపరమైన మినహాయింపు రక్షణపై కూడా డయల్4ట్రేడ్ చేసిన వాదనను సీసీపీఏ పరిశీలించింది. ఈ రక్షణ పొందేందుకు నిర్దేశిత తగిన జాగ్రత్తల నిబంధనలను పాటించాల్సి ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రమాదకర, నియంత్రిత పదార్థాల విషయంలో ఉత్పత్తి జాబితాను ముందుగా ధ్రువీకరించకుండా, గుర్తించిన తర్వాత మాత్రమే తొలగించే ప్రతిస్పందనాత్మక విధానం సరిపోదని సీసీపీఏ స్పష్టం చేసింది.
డయల్4ట్రేడ్‌కు అమ్మకందారులను బ్లాక్ చేయడం, తమ వేదిక నుంచి ఉత్పత్తులను తొలగించే సామర్థ్యం ఉందని సీసీపీఏ గుర్తించింది. దీని ద్వారా సంబంధిత వేదికలో ఉంచిన కంటెంట్‌పై సంస్థకు నియంత్రణ ఉందని స్పష్టమవుతోందని పేర్కొంది.
ఈ-కామర్స్ వేదికలపై విస్తృతస్థాయి పరిశీలన
ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్థాలు, వాటికి సంబంధించిన ముడి పదార్థాలను అనధికారికంగా ఆన్‌లైన్‌లో విక్రయించడంపై సీసీపీఏ కొనసాగిస్తున్న విస్తృత పరిశీలనలో భాగంగానే డయల్4ట్రేడ్‌పై ఈ చర్య తీసుకుంది. ఈ పరిశీలనలో అమ్మోనియం నైట్రేట్, గన్ పౌడర్, పిక్రిక్ యాసిడ్, పెంటాఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) వంటి పదార్థాలు ఉన్నాయి.
ఈ అంశంపై ప్రస్తుతం కింద పేర్కొన్న ఈ-కామర్స్ వేదికలకు సంబంధించి పరిశీలన కొనసాగుతోంది.
1. ఇండియామార్ట్
2. జస్ట్‌డయల్
3. సిగ్మా-ఆల్డ్రిచ్ ఇండియా
4. ఎక్స్‌పోర్టర్స్ ఇండియా
5. ఐబైకెమికల్స్
6. ఆల్ఫా కెమికా
7. ట్రేడ్‌ఇండియా
ఈ-కామర్స్ వేదికలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: సీసీపీఏ
అమ్మోనియం నైట్రేట్ నియంత్రిత పదార్థమని, నిర్దేశిత భద్రతా చర్యలు లేకుండా దాన్ని అనధికారికంగా విక్రయించడం లేదా కలిగి ఉండటం ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించవచ్చని సీసీపీఏ పేర్కొంది. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేటప్పుడు వినియోగదారులు ఉత్పత్తుల జాబితాలు, వాటి వివరాలపై ఆధారపడతారని తెలిపింది. అందువల్ల నియంత్రిత ఉత్పత్తుల విషయంలో ఈ-కామర్స్ వేదికలు తగిన ధ్రువీకరణ, పరిశీలన, భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది.
వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, అన్యాయ వాణిజ్య పద్ధతులను అరికట్టడం, ముఖ్యంగా నియంత్రిత, ప్రమాదకర ఉత్పత్తులకు సంబంధించి ఈ-కామర్స్ వేదికలు నిబంధనలు పాటించేలా చూడటానికి తమ నిబద్ధత కొనసాగుతుందని సీసీపీఏ స్పష్టం చేసింది.
తుది ఉత్తర్వులు సీసీపీఏ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి: https://ccpa.doca.gov.in/
****
(రిలీజ్ ఐడి: 2305980)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5