సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పాలనకు, ప్రజల ఆకాంక్షలకు నడుమ సంధాన కర్తలుగా ఐఐఎస్ అధికారులది కీలక పాత్ర
సమాచార ప్రసారానికే వారు పరిమితం కాదు
కచ్చితత్వం, విశ్వసనీయత, కారుణ్యభావాలతో ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేది వారే: సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి
ఐఐఎస్ ఆఫీసర్ ట్రెయినీలకు మొదటిసారి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను ప్రదానం చేసిన ఐఐఎంసీ: డీమ్డ్ యూనివర్సిటీగా చరిత్రాత్మక మైలురాయి
ప్రసారమంటే కేవలం సమాచారాన్ని అందించడమే కాదు.. అవగాహన కల్పించడం: ఐఐఎంసీ వీసీ
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 3:29PM by PIB Hyderabad
2009, 2023, 2024 బ్యాచ్‌లకు చెందిన భారతీయ సమాచార సేవల (ఐఐఎస్) గ్రూప్-ఎ ఆఫీసర్ ట్రెయినీల శిక్షణ ముగింపు, గ్రాడ్యేయేషన్ వేడుకను.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) ప్రాంగణంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు.
ఈ ముగింపు కార్యక్రమంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమాచార ప్రసార వ్యవస్థ పాలనలో అత్యంత కీలకమైన భాగమన్నారు. మారుతున్న సాంకేతికతలు, డిజిటల్ వేదికలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులను అందిపుచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధ నేడు సరికొత్త విప్లవాత్మక మార్పులు తెస్తోందని, అత్యాధునిక సాంకేతికతలపై అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అదే సమయంలో తప్పుడు సమాచారం, డిప్‌ఫేక్‌లు, కృత్రిమంగా సృష్టించే కంటెంట్ వంటివి కొత్త సవాళ్లను విసురుతున్నాయని గుర్తుచేశారు.

సమాచార వ్యవస్థ ఎల్లప్పుడూ ద్విముఖ ప్రక్రియగా ఉండాలన్న ఆయన.. ప్రభుత్వ విధానాలను, వాటి అమలును మెరుగుపరచడానికి ప్రజాభిప్రాయం దోహదపడుతుందన్నారు. వార్తలను అందించడంలో వేగంతోపాటు.. అదే స్థాయిలో కచ్చితత్వం, విశ్వసనీయత కూడా కీలకమని స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రతి సమాచారమూ ఒక వ్యవస్థ ఆమోదాన్ని పొంది ఉంటుందని గుర్తు చేస్తూ.. ఆ విలువల్లో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
అధికారులు తమ నైపుణ్యాలను నిరంతరం పదునుపెట్టుకోవాలని, క్షేత్రస్థాయిలో నిత్యం అనుసంధానమై ఉండాలని ఆయన సూచించారు. కేవలం సమాచార ప్రసారానికే పరిమితం కాకుండా.. పాలన సంబంధిత ఇతర బాధ్యతలను అప్పగించినప్పుడు వాటిని కూడా సమర్థంగా అర్థం చేసుకుని నిర్వహించడానికి సన్నద్ధులుగా ఉండాలన్నారు. అన్నింటికీ మించి, ప్రజలే కేంద్రంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ప్రజలకు, ప్రత్యేకించి నిరుపేదలకు తమ పని ఎంతవరకు సహాయపడుతోందో అధికారులు ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. అలా జరగని పక్షంలో తమ ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాలని, ప్రజల సమస్యల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తూ వారికి మేలు చేసేలా పనిచేయాలని కోరారు.

ఐఐఎంసీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రజ్ఞా పాలివాల్ గౌర్ మాట్లాడుతూ... ఈ పీజీ డిగ్రీని అందుకుంటున్న తొలి ఆఫీసర్ ట్రెయినీలు వీరేనన్నారు. ఐఐఎంసీ విద్యాపరమైన పురోగతితోపాటు సమాచార ప్రసార రంగంలో నైపుణ్య శిక్షణకు సంస్థ ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమన్నారు. ప్రసారమంటే సమాచారాన్ని కేవలం చేరవేయడమే కాదని, అది ప్రజల్లో అవగాహన కల్పించేలా ఉండాలని అన్నారు. స్పష్టత, నిష్పాక్షికత, సునిశితత్వంతో ట్రెయినీ అధికారులు తమ బాధ్యతలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నిరంతర గతిశీల రంగంలో నిరంతర అభ్యాసం ప్రాధాన్యాన్ని ఈ ఎంఏ డిగ్రీ గుర్తుచేస్తోందన్నారు.

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, సంయుక్త కార్యదర్శి శ్రీ కె. కె. నిరాల, శిక్షణ విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీ ఎల్. మధు నాగ్, సీనియర్ అధికారులు, అధ్యాపకులు, ఆఫీసర్ ట్రైనీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(రిలీజ్ ఐడి: 2305613)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Gujarati
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam