మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అలంకార మత్స్య పరిశ్రమ కోసం “మిషన్ రంగీన్ మఛ్లీ-2031” వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించనున్న ఉపరాష్ట్రపతి


ద్వీప వనరుల సద్వినియోగంలో నిబిడీకృత సామర్థ్యాన్ని సుస్థిర విధానాలతో సద్వినియోగం చేసుకోవడానికి ప్రాధాన్యం

నాడు పోస్టు చేయడమైనది: 30 AUG 2026 11:13AM by PIB Hyderabad

   కేంద్ర మత్స్య-పాడి-పశుసంవర్ధక మంత్రిత్వశాఖ పరిధిలోని మత్స్య విభాగం ఈ నెల 31న (సోమవారం) లక్షద్వీప్‌లోని అగట్టిలో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా అలంకార మత్స్య పరిశ్రమ ప్రగతికి ఉద్దేశించిన “మిషన్ రంగీన్ మచ్లీ-2031” పేరిట వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను గౌరవనీయ ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తారు.

కేంద్ర మత్స్య-పాడి-పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, సహాయమంత్రి ప్రొఫెసర్ శ్రీ ఎస్.పి.సింగ్ బఘేల్ సహా లక్షద్వీప్ పాలన యంత్రాంగాధిపతి శ్రీ ప్రఫుల్ ఖోడే పటేల్ ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. అలాగే, మత్స్యశాఖతోపాటు లక్షద్వీప్ అధికారులు, మత్స్య సముదాయాలు, సంబంధిత ఇతర మంత్రిత్వ శాఖలు-విభాగాల ప్రతినిధులు సహా మహిళా మత్స్య రైతులు, మత్స్యకారులు, ‘ఎస్ఎస్ఎస్ఎస్’ చేపల రైతులు కూడా ఇందులో పాలుపంచుకుంటారు.

భారత్‌కు అపార సముద్ర సంపద ఉన్నప్పటికీ, ఇంతటి విస్తృత వనరులు వినియోగం మాత్రం గణనీయంగా చాలా తక్కువ. మొత్తం 11,099 కిలోమీటర్ల తీరప్రాంతం, 2.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలం (ఈఈజడ్‌), అంచనాల మేరకు 5.31 మిలియన్ టన్నుల సముద్ర మత్స్య సంపద తదితరాలు భారత్‌ సొంతం. అందువల్ల సుస్థిర మత్స్య పరిశ్రమ, సముద్రపు లోతుల్లో చేపల వేట, సముద్ర జీవసాగు, నీలి ఆర్థిక వ్యవస్థ పురోగమనం తదితరాలపరంగా మన దేశానికిగల అవకాశాలు అపారం. దాదాపు 4 లక్షల చదరపు కిలోమీటర్ల ‘ఈఈజడ్‌’ (జాతీయ విస్తీర్ణంలో సుమారు 17%), 4,200 చదరపు కిలోమీటర్లకు పైగా లోతు తక్కువ మడుగులు గల లక్షద్వీప్ ప్రాంతం వినియోగంలోకి రాని కొత్త సామర్థ్యానికి ఒక ఉదాహరణ. ఈ సువిశాల, సుస్థిర వనరుల సమృద్ధిగల సముద్ర జీవావరణ వ్యవస్థ, అధిక విలువగల మత్స్య వనరుల సద్వినియోగం సహా సముద్ర జీవసాగు విస్తరణ, తీరప్రాంత జీవనోపాధి కల్పన, సుస్థిర నీలి ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వేగిరపరచడం తదితరాల్లో గణనీయ అవకాశాలున్నాయి.

మత్స్య రంగంలో సమీకృత, విలువ శ్రేణి ఆధారిత వృద్ధి సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం సముదాయ ప్రాతిపదిక విధానాన్ని అనుసరిస్తోంది. ఈ వ్యూహానికి అనుగుణంగా సాగు, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానానికి ప్రోత్సాహం  తదితరాలకు వీలుఆ లక్షద్వీప్‌ను ప్రత్యేక సీవీడ్ క్లస్టర్‌గా ప్రకటించింది. ఈ దీవులలో సముద్ర అలంకార మత్స్య సంపద సమృద్ధిగా ఉంది. ఇవి సముద్ర జీవావరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ సుస్థిర పెంపకం, ఎగుమతులు, జీవనోపాధి కల్పనలోనూ గణనీయ అవకాశాలను కల్పిస్తాయి.

ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు మత్స్య రంగం లబ్ధిదారులకు గౌరవనీయ ఉపరాష్ట్రపతి వివిధ ప్రయోజనాలను పంపిణీ చేస్తారు. ముఖ్యంగా అలంకార మత్స్య పరిశ్రమ ప్రగతికి ఉద్దేశించిన “మిషన్ రంగీన్ మచ్లీ-2031” వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరిస్తారు. అలంకార మత్స్య సంపద విలువ వ్యవస్థలో శాస్త్రీయ నిర్వహణ, జీవభద్రత, నాణ్యతకు హామీ సహా నియంత్రణ-సమ్మతి దిశగా ఏకరూప చట్రాన్ని ఈ ప్రణాళిక సమకూరుస్తుంది. దీనికింద ప్రామాణిక కార్యాచరణ విధానాలతోపాటు దేశవ్యాప్తంగా ఉత్తమ నిర్వహణ పద్ధతులు స్థిరంగా అమలువుతాయి. బ్రూడ్‌స్టాక్ నిర్వహణ, ప్రజననం, హేచరీ కార్యకలాపాలు, ఉత్పత్తి వ్యవస్థలు, క్వారంటైన్, ఆరోగ్య నిర్వహణ, ట్రేసబిలిటీ, అక్వేరియం కార్యకలాపాలు, నిర్వహణ, రవాణా, వాణిజ్య సంబంధిత పద్ధతులను ఇవి ప్రమాణీకరిస్తాయి. భాగస్వాముల సామర్థ్య బలోపేతం, ఉత్పత్తి నాణ్యత, జీవభద్రత ప్రమాణాల మెరుగుదల, ధ్రువీకరణ, మార్కెట్ సౌలభ్య కల్పన సహా భారత అలంకార మత్స్య పరిశ్రమ సుస్థిర-వ్యవస్థీకృత ప్రపంచవ్యాప్త పోటీతత్వంతో వృద్ధి చెందడానికి ఇవన్నీ మద్దతిస్తాయి.

నేపథ్యం

మొత్తం 11,099 కిలోమీటర్ల తీరప్రాంతం, దాదాపు 24 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలంతో భారత్‌కు విస్తృత, వైవిధ్య సముద్ర వనరుల అపార సంపద ఉంది. దేశంలోని ‘ఈఈజడ్‌’లో సముద్ర మత్స్య సంపద సామర్థ్యం 58.6 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా. దీనివల్ల సుమారు 50 లక్షల మంది మత్స్యకారుల జీవనోపాధికి మద్దతు లభి్తుంది. అంతేగాక ఆహార భద్రత, పోషణ, ఉపాధి, ఆదాయ సృష్టి, ఎగుమతుల ద్వారా రాబడులకు గణనీయంగా దోహదం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త అగ్రగామి మత్స్య, ఆక్వాకల్చర్ ఉత్పత్తి దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా ఉంది. కాబట్టే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 73,890 కోట్ల విలువైన సముద్ర ఆహరోత్పత్తులను ఎగుమతి చేసింది.

చేపల వేట కార్యకలాపాల్లో అధికశాతం తీరానికి 40-50 నాటికల్ మైళ్ల పరిధిలోనే ప్రస్తుతం కేంద్రీకృతమయ్యాయి. అయితే, మరింత లోతులో.. జాతీయ అధికార పరిధికి వెలుపల గల ప్రాంతాల్లో ‘టునా’ చేపలు, అదే జాతిని పోలిన అధిక విలువగల మత్స్య సంపద వేటకు గణనీయ అవకాశాలున్నాయి. సుస్థిర సముద్ర మత్స్య సంపద వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, మన ‘ఈఈజడ్‌’ పరిధిలోనే కాకుండా బహిరంగ సముద్ర జలాల నుంచి మత్స్య సంపద సుస్థిర వినియోగానికి వీలు కల్పించే చట్రాన్ని రూపొందించింది. ఈ మేరకు ‘భారత పతాకం గల వేట నౌకల ద్వారా సముద్రపు లోతుల్లోని మత్స్య సంపద సుస్థిర వినియోగానికి మార్గదర్శకాలు-2025’ను కూడా జారీచేసింది.

లక్షద్వీప్ ప్రాంతంలో సముద్ర మత్స్య వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా- యెల్లోఫిన్ స్కిప్‌జాక్ టునా చేపలు సహా అధిక విలువగల ఆ జాతి మత్స్య సంపద ఇక్కడ అపారం. ఈ ద్వీప సముద్ర మత్స్య రంగానికి ఇవే వెన్నెముకగా నిలుస్తున్నాయి. సువిశాల, సారవంతమైన జలాల ద్వారా వాణిజ్యపరంగా కీలకమైన ఈ జాతుల సుస్థిర వేటకు, విలువ జోడించడానికి, ఎగుమతుల వృద్ధికి, జీవనోపాధి కల్పనకు అవకాశాలు గణనీయంగా ఉంటాయి. ఆ మేరకు టునా ఆధారిత మత్స్య పరిశ్రమతో పాటు నీలి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి లక్షద్వీప్‌ ఓ కీలక కూడలిగా నిలుస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2304693) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam