జౌళి మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో రేపు ఎన్ఐఎఫ్‌టీ (నిఫ్ట్) సంయుక్త స్నాతకోత్సవానికి (2026) హాజరు కానున్న రాష్ట్రపతి
దేశంలోని 18 నిఫ్ట్ పట్టభద్ర విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురానున్న సంయుక్త స్నాతకోత్సవం
నాడు పోస్టు చేయడమైనది:
30 AUG 2026 9:35AM by PIB Hyderabad
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) కి అధికారిక విజిటర్‌గా ఉన్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆగస్టు 31న న్యూఢిల్లీలో జరిగే నిఫ్ట్ సంయుక్త స్నాతకోత్సవానికి (2026) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై చేరి తమ విద్యాభ్యాస ప్రయాణం ముగింపు దశకు గుర్తుగా డిగ్రీలను అందుకుంటారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల విద్యా ప్రతిభను, సృజనాత్మకతను, నిబద్ధతను, వారు సాధించిన విజయాలను కూడా గుర్తించి ఈ కార్యక్రమం గౌరవిస్తుంది.
కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్‌తో పాటు ఇతర ప్రముఖులు, గవర్నర్ల బోర్డ్ సభ్యులు, ఉన్నతాధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు, పట్టభద్రులైన విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
నిఫ్ట్ లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థుల విజయాలను ఈ స్నాతకోత్సవం ఘనమైన వేడుకగా నిర్వహించడంతో పాటు, సంస్థలో విద్యాభ్యాస కాలంలో వారు ప్రదర్శించిన విద్యా ప్రతిభ, సృజనాత్మకత, అంకితభావం, అందించిన సేవలు, చేసిన కృషిని గుర్తించి అభినందించనుంది. అన్ని క్యాంపస్‌లలోని ప్రతి ప్రోగ్రామ్‌లో అత్యధిక సీజీపీఏ సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను బంగారు పతకాలతో సత్కరిస్తారు.
స్నాతకోత్సవం అనంతరం ఆయా క్యాంపస్‌ల వారీగా డిగ్రీల ప్రదానోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటిలో పట్టభద్ర విద్యార్థులు విద్యాభ్యాస దశను పూర్తి చేసుకుని వృత్తిపరమైన జీవితంలోకి అడుగుపెట్టే కీలక ఘట్టంగా అధికారికంగా తమ డిగ్రీలను అందుకుంటారు.
నిఫ్ట్ చట్టం–2006 కు అనుగుణంగా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ 1986లో ఒక చట్టబద్ధ సంస్థగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ సంస్థ ఫ్యాషన్ విద్యలో ప్రముఖ సంస్థగా ఎదిగింది. సంప్రదాయ కళలు, హస్తకళలు, విద్యా పరిజ్ఞానం, డిజైన్‌లో నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, సృజనాత్మక ఆలోచనలు, పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని సమన్వయం చేస్తూ ఫ్యాషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తోంది.
దేశవ్యాప్తంగా వృత్తిపరంగా నిర్వహిస్తున్న 20 క్యాంపస్‌లతో సమ్మిళిత, చైతన్యవంతమైన విద్యా వాతావరణాన్ని కొనసాగిస్తూ యువ ప్రతిభకు విజ్ఞానం, నైపుణ్యాలు, సృజనాత్మక సామర్థ్యాలను నిఫ్ట్ అందిస్తోంది. భారతదేశ ఫ్యాషన్, సృజనాత్మక పరిశ్రమల అభివృద్ధికి వారు తమ వంతు కృషి చేసేలా తీర్చిదిద్దుతోంది.
ఆలోచనలను అవకాశాలుగా, సృజనాత్మకతను ప్రభావవంతమైన ఫలితాలుగా మలచడం నేర్చుకున్న ఒక తరం విజయాలను వేడుకగా జరుపుకునే సందర్భంగా ఈ ఉమ్మడి స్నాతకోత్సవం నిలవనుంది. పట్టభద్ర విద్యార్థులు నిఫ్ట్ ను వీడి వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్న వేళ, కొత్త కథనాలను ఆవిష్కరించడం, అర్థవంతమైన పరిష్కారాలను రూపొందించడం, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగానికి తమ వంతు కృషి చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని తమతో తీసుకెళ్లనున్నారు. నిఫ్ట్ లో వారి విద్యాభ్యాస ప్రయాణం అధికారికంగా ముగింపు దశకు చేరుకున్నప్పటికీ, ఊహాశక్తి, నూతన ఆవిష్కరణలు, ప్రతిభా నైపుణ్యాల వైపు వారి అసలైన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతోంది.
సాధించిన విజయాల వేడుకగానే కాకుండా, భవిష్యత్తుకు ఒక వేదికగా ఈ సందర్భం నిలుస్తుంది. ఉత్తీర్ణులైన విద్యార్థుల విజయాలను గౌరవిస్తూనే, ఆధునిక భారత ఫ్యాషన్, డిజైన్, సృజనాత్మక రంగాల రూపురేఖలను తీర్చిదిద్దడంలో వారు పోషించబోయే పాత్రను ఈ వేడుక ఆవిష్కరిస్తుంది. వారి ప్రతిభ, చొరవ, ఆలోచనా విధానంతోనే మరింత సృజనాత్మక, వినూత్న, ప్రపంచంతో అనుసంధానమైన వికసిత భారత్ లక్ష్యం ముడిపడి ఉంది.
నిఫ్ట్ నుంచి సృజనాత్మకత, అత్యుత్తమ ప్రతిభతో పట్టభద్రులవుతున్న విద్యార్థుల బృందం భారతదేశ ఫ్యాషన్, సృజనాత్మక రంగాల్లో కొత్త కథనాలకు రూపకల్పన చేసేందుకు సిద్ధంగా ఉంది. సంస్థలో వారి విద్యాభ్యాస ప్రయాణం ముగిసినప్పటికీ, నూతన ఆవిష్కరణలు, సానుకూల ప్రభావాన్ని సృష్టించే వారి ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2304692)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4