యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జాతీయ స్టేడియంలో కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు


‘ఏక్‌ ఘంటా ఖేల్‌ కే మైదాన్‌ మే’ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ.. క్రీడలు, ఫిట్‌నెస్‌లో మరింత మంది భాగస్వాములు కావాలని పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 29 AUG 2026 1:57PM by PIB Hyderabad

దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ 121వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నేడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత క్రీడా రంగానికి ఆయన అందించిన సేవలు నేటికీ క్రీడాకారులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

 

న్యూఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద ఉన్న మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జాతీయ స్టేడియంలో ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ, కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ ఏడాది వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఏక్‌ ఘంటా ఖేల్‌ కే మైదాన్‌ మే’ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. దేశ పౌరులు ముఖ్యంగా యువత కనీసం ఒక గంట క్రీడలు, శారీరక వ్యాయామానికి కేటాయించేలా ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహించారు.

 

కేంద్రమంత్రులు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి వందలాది మంది పాల్గొని వివిధ క్రీడా, ఫిట్‌నెస్‌ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ.. ఫిట్‌ ఇండియా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజలు క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఏక్‌ ఘంటా ఖేల్‌ కే మైదాన్‌ మే’ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

 

“మేజర్‌ ధ్యాన్‌చంద్‌ 121వ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ఫిట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ‘ఏక్‌ ఘంటా ఖేల్‌ కే మైదాన్‌ మే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం” అని ఆయన అన్నారు.

 

“దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ప్రతి వీధిలో, ప్రతి క్రీడా మైదానంలో ఒక గంటపాటు ఆటలాడేందుకు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో దేశం మారుతోంది. ముందుకు సాగుతోంది. కొత్త భారత్‌ నిర్మితమవుతోంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను” అని డాక్టర్‌ మాండవీయ అన్నారు.

 

“ప్రధాని శ్రీ మోదీ కలలుగన్న కొత్త భారత్‌ను నిర్మించే క్రమంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, దృఢంగా ఉండే సమాజాన్ని కూడా మనం నిర్మించాలి. అదే మన దేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుంది. అందరం ప్రతి వారం ఒక గంటను క్రీడా మైదానంలో గడుపుతూ మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.

 

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ శుభాకాంక్షలు తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో క్రమం తప్పకుండా క్రీడలు ఆడటం, శారీరక వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

 

ఆయన మాట్లాడుతూ.. “కబడ్డీ, ఫుట్‌బాల్‌ నుంచి దాదాపు ప్రతిరోజూ బ్యాడ్మింటన్‌ ఆడటం వరకు క్రీడలు ఎప్పుడూ నా జీవితంలో భాగంగానే ఉన్నాయి. ‘ఉదయం సంగీతం.. సాయంత్రం ఆట’ అనేది నా వ్యక్తిగత నినాదం. క్రమం తప్పకుండా క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఒక గంట క్రీడలకు కేటాయించాలన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు దేశానికి ఎంతో కీలకమైనది. ఇది ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ కార్యక్రమానికి మద్దతునివ్వడంతో పాటు వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది” అని శ్రీ మేఘ్వాల్‌ అన్నారు.

 

క్రీడల్లో భాగస్వామ్యాన్ని, బృంద స్ఫూర్తిని, చురుకైన జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు క్రికెట్‌, ఫుట్‌బాల్‌, తాడు లాగడం వంటి పలు క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు.

 

క్రికెట్‌ పోటీలో మంత్రిత్వ శాఖ ఎక్స్‌ఐ, ఎస్‌ఏఐ ఎక్స్‌ఐ, మీడియా ఎక్స్‌ఐ, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ ఎక్స్‌ఐ అనే నాలుగు జట్లు పాల్గొన్నాయి.

 

డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ నాయకత్వంలోని మంత్రిత్వ శాఖ ఎక్స్‌ఐ జట్టులో క్రీడల శాఖ కార్యదర్శి శ్రీ హరి రంజన్‌ రావుతో పాటు మంత్రిత్వ శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ప్రారంభ క్రికెట్‌ మ్యాచ్‌లో మీడియా ఎక్స్‌ఐపై మంత్రిత్వ శాఖ ఎక్స్‌ఐ ఘన విజయం సాధించింది. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ ఎక్స్‌ఐ జట్టులో ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఫిట్‌ ఇండియా అంబాసిడర్లు పాల్గొన్నారు.

 

మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జాతీయ స్టేడియంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా క్రీడలు, ఫిట్‌నెస్‌, చురుకైన జీవన విధానాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ నిబద్ధతను మరోసారి చాటిచెప్పాయి. అదే సమయంలో భారత క్రీడా రంగంలో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ అందించిన చిరస్మరణీయ సేవలకు ఘన నివాళిగా ఈ వేడుకలు నిలిచాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2304556) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam