హోం మంత్రిత్వ శాఖ
నేపాల్ ఆకస్మిక వరదల వల్ల తలెత్తిన పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం
నేపాల్‌లో సంభవించిన విపత్తుకు సంబంధించి బీహార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
నేపాల్‌లో వరదల వల్ల కలిగిన విధ్వంసం అత్యంత విషాదకరం
ఈ విపత్తులో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి
ఈ సంక్షోభ సమయంలో నేపాల్‌కు అండగా భారత ప్రభుత్వం
ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో... స్థానిక యంత్రాంగం, సహాయక బృందాలు, ఎన్‌డీఆర్ఎఫ్‌తో అత్యంత అప్రమత్తంగా ఉన్నాం: కేంద్ర హోంమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
26 AUG 2026 9:08PM by PIB Hyderabad
నేపాల్‌లో ఆకస్మిక వరదల కారణంగా తలెత్తిన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. నేపాల్‌లో సంభవించిన విపత్తుపై బీహార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడారు.
కేంద్ర హోం మంత్రి 'ఎక్స్' వేదికగా ఇలా పేర్కొన్నారు... నేపాల్‌లో వరదల వల్ల సంభవించిన విధ్వంసం అత్యంత విషాదకరం. ఈ విపత్తులో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం నేపాల్‌కు అండగా నిలుస్తుంది. నేపాల్‌లో సంభవించిన విపత్తుకు సంబంధించి బీహార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో మాట్లాడాను. ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం, సహాయక బృందాలతో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందినీ అత్యంత అప్రమత్తతతో సిద్ధంగా ఉంచాం.
సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సూచనలు, మీడియా నివేదికల ప్రకారం... నేపాల్-చైనా సరిహద్దు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరద లేదా గ్లేసియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ (జీఎల్‌వోఎఫ్) కారణంగా, భారత సరిహద్దుకు సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపాల్‌లోని ఫుర్కే ఖోలా వద్ద త్రిశూలి నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగినట్లు సమాచారం. ఈ వరద ప్రభావం దేశంలోని గండక్ నది దిగువ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి ఇతరత్రా సహాయం అందించడం వంటి చర్యలను బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలనీ, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని రెండు రాష్ట్రాలకూ సూచించడమైనది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఏ), జల శక్తి మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలతో కలిసి హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) సమాచారం ప్రకారం... నేపాల్ వైపు ఉన్న జలాశయాల్లో నీటి మట్టం తగ్గుతోంది. పరిస్థితి అదుపులో ఉంది. ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు తలెత్తలేదు.
నేపాల్‌లో భారతీయ పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం ఉంది. నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ప్రభావితమైన భారతీయులకు సహాయం, సమాచారం అందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ, కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర సంప్రదింపు నంబర్లను జారీ చేశాయి. సహాయం అవసరమైన వారు +977 985 131 6807, +977 970 910 7500 అనే హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2303628)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Khasi
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam