పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌లో జరిగిన యూఎన్‌సీసీడీ కాప్17లో

కరవు ప్రతిస్పందన నుంచి కరవును తట్టుకొనే స్థితికి మారాలని పిలుపునిచ్చిన భారత్

కరవును పునరావృతమయ్యే విపత్తుగా కాకుండా.. ముందే గుర్తించదగిన, నివారించదగిన ముప్పుగా పరిగణించాలి: శ్రీ భూపేందర్ యాదవ్

ప్రతిస్పందనకు బదులు సన్నద్ధత, విపత్తు నిర్వహణకు బదులు నివారణ, పునరుద్ధరణకి బదులు కరవును తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే లక్ష్యం కావాలి: కేంద్ర పర్యావరణ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 12:59PM by PIB Hyderabad

కరవు విషయంలో ప్రపంచ ధోరణిలో ప్రాథమిక మార్పు రావాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రతిస్పందన స్థాయి నుంచి క్రియాశీలకమైన, సాంకేతిక ఆధారితంగా కరవును తట్టుకొనే సామర్థ్యం దిశగా మారాలన్నారు. మంగోలియాలోని ఉలాన్‌బాతర్‌లో జరిగిన ఎడారీకరణ నిరోధక ఐక్యరాజ్యసమితి ఒప్పందం (యూఎన్‌సీసీడీ) 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్ 17)లో  ‘‘కరవును తట్టుకొనే సామర్థ్యాన్ని వేగవంతం చేయడం’’ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. కరవును ‘‘ఇకపై అప్పుడప్పడూ వచ్చే విపత్తుగా కాకుండా అభివృద్ధికి ప్రధాన సవాలు’’గా వర్ణించారు. ఇది నీటి భద్రతనూ, ఆహార వ్యవస్థలనూ, జీవ వైవిధ్యాన్నీ, ఆర్థిక స్థిరత్వాన్నీ ప్రభావితం చేస్తుందని మంత్రి అన్నారు.

image.png


 

ముందస్తు హెచ్చరికలు, ఉపశమనం, సహాయం, సామాజిక స్థిరత్వాన్ని ఏకీకృతం చేసేలా భారత్ అనుసరిస్తున్న సమన్వయ, బహుళ సంస్థాగత విధానం గురించి శ్రీ యాదవ్ వివరించారు. అంతర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర స్థాయుల్లో వర్షపాత పర్యవేక్షణ, ఉపగ్రహ ఆధారిత కరవు అంచనాలు... ముందుగానే సన్నద్ధం చేస్తాయి. తద్వారా కరవును విపత్తుగా మారకుండా చూస్తాయి. భూమికీ, నీటికీ మధ్య ఉన్న సున్నితమైన సంబంధం గురించి మంత్రి వివరించారు. ‘‘ప్రవాహం ఆరంభానికి ముందే అడవులను పునరుద్ధరించాలి’’ అని అన్నారు. కోతను తగ్గించడానికీ, నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికీ, భూగర్భ జలాలను పునరుజ్జీవింప చేయడానికీ పరివాహక ప్రాంతాలు, నదీతీర ప్రాంతాల్లో అటవీకరణపై భారతదేశం దృష్టి సారిస్తోందని చెప్పారు. నదుల పునరుజ్జీవనం, సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమాలు నీటి భద్రతను,  గ్రామీణ ప్రాంతాల్లో కరవును తట్టుకొనే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి.

భారత్‌లోని కొండ ప్రాంతాల్లో సామాజిక భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న నీటి చెలమలు, రీఛార్జి జోన్ల పునరుద్ధరణ గురించి మంత్రి వివరించారు. అలాగే మైదాన ప్రాంతాల్లో సామాజిక సంస్థల మద్దతుతో, గ్రామీణ ఉపాధి కార్యక్రమాల సమన్వయంతో దేశవ్యాప్తంగా వాటర్‌షెడ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. దీనిలో రిడ్జ్–టు–వ్యాలీ విధానాన్ని అనుసరిస్తూ బీడుగా మారిన వర్షాధార భూములను బాగు చేస్తున్నామని చెప్పారు. స్పష్టమైన సేవా స్థాయులు, స్థానికంగా నిర్వహించే నాణ్యతా పరీక్షలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గృహస్థాయిలో అమలు చేస్తున్న తాగునీటి కార్యక్రమాలు సంక్షోభ సమయాల్లో సైతం విశ్వసనీయమైన సరఫరాను అందిస్తున్నాయి. పంట కాలంలో కరవుతో పాటు నివారించలేని ఇతర నష్టాల నుంచి రైతులను పంట బీమా రక్షిస్తుందని తెలియజేశారు. సబ్సిడీ ప్రీమియంలతో పాటు సాంకేతిక ఆధారిత అంచనా ద్వారా వేగంగా, పారదర్శకంగా బీమా పరిహారం చెల్లించే విధానం గురించి వివరించారు. క్రియాశీలకమైన, సాంకేతిక ఆధారిత స్థిరత్వానికి సామాజిక యాజమాన్యం, సామర్థ్య నిర్మాణం, జీవనోపాధి వైవిధ్యీకరణ కీలకమని మంత్రి స్పష్టం చేశారు.

‘‘పునరావృతమయ్యే, అత్యవసర స్పందన అవసరమయ్యే విపత్తుగా కాకుండా, ముందుగానే గుర్తించదగిన, నివారించదగిన ముప్పుగా కరవును నిర్వహించాలి’’ అని భారత్ విశ్వసిస్తోందని శ్రీ యాదవ్ తెలిపారు. వాటర్‌షెడ్ అభివృద్ధి, నీటి సంరక్షణ, అడవుల పెంపకం, భూగర్భ జలాల పెంపు, వాతావరణ మార్పులను తట్టుకునే పంటల సాగు లాంటి నివారణ చర్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వీటితో పాటు అవసరమైన సందర్భాల్లో విపత్తు నిధులు, ఉపాధి హామీ, పశుగ్రాసం సరఫరా, అత్యవసర తాగునీరు అందించడం లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని శ్రీ యాదవ్ పిలుపునిచ్చారు. పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, ముందస్తు హెచ్చరికల వ్యవస్థల బలోపేతం, సమన్వయంతో కూడిన కార్యాచరణ కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు. ‘‘ప్రతిస్పందనకు బదులు సన్నద్ధత, విపత్తు నిర్వహణకు బదులు నివారణ, పునరుద్ధరణకి బదులు కరవును తట్టుకొనే సామర్ధ్యాన్ని పొందడమే లక్ష్యం కావాలి’’ అని అన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికి కరువును తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం అనేది కేవలం ఒక ప్రత్యామ్నాయం కాదనీ, అది వారి జీవన్మరణ సమస్య అని స్పష్టం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. భవిష్యత్తులో కరవును అందరూ సమర్థవంతంగా ఎదుర్కొనేలా, ముందస్తు హెచ్చరికల వ్యవస్థతో సహా విజ్ఞానాన్ని, నైపుణ్యాలను ప్రపంచంతో పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2303152) సందర్శకుల సూచీ సంఖ్య : : 71
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam