రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్ - జపాన్ సంయుక్త పత్రికా ప్రకటన
प्रविष्टि तिथि:
20 AUG 2026 1:06PM by PIB Hyderabad
భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, జపాన్ రక్షణ శాఖ మంత్రి శ్రీ షింజిరో కొయిజుమి 2026 ఆగస్టు 20న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. సంయుక్త పత్రికా ప్రకటన కింది విధంగా ఉంది:
“జపాన్ రక్షణ మంత్రి శ్రీ షింజిరో కొయిజుమి, భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2026 ఆగస్టు 20న న్యూఢిల్లీలో జపాన్-భారత్ రక్షణ మంత్రుల సమావేశాన్ని నిర్వహించారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్ధికి మూలాధారంగా నిలిచే ‘జపాన్-భారత్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం’ పరిధిలో.. సమాన వ్యూహాత్మక ఆలోచనలు కలిగిన ఇరుదేశాల రక్షణ మంత్రిత్వశాఖలు, సేవా దళాల మధ్య సహకారంతోపాటు, రక్షణ రంగ భాగస్వామ్యం క్రమంగా బలోపేతమవుతుండడాన్ని మంత్రులిద్దరూ స్వాగతించారు.
2026 జూలైలో ఇరు దేశాధినేతలూ విడుదల చేసిన జపాన్ - భారత్ సంయుక్త పత్రికా ప్రకటనను గుర్తు చేస్తూ.. వారి నేతృత్వంలో స్వేచ్ఛా, సార్వత్రిక ఇండో-పసిఫిక్‌ను సాకారం చేసే దిశగా రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని మంత్రులిద్దరూ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా పరిస్థితులపై ఇరుదేశాలు పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం అత్యావశ్యకమని మంత్రులిద్దరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నౌకాయానం, విమానయాన స్వేచ్ఛకు, భద్రతకు విఘాతం కలిగించే ఏకపక్ష చర్యలనూ, అలాగే బలప్రయోగం లేదా బెదిరింపుల ద్వారా యథాతథ స్థితిలో మార్పుల కోసం చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు.
ఆచరణాత్మకమైన, సమర్థమైన రీతిలో నౌకావాణిజ్య రంగ భద్రతలో నిర్వహణపరమైన సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు మంత్రులిద్దరూ అంగీకరించారు. అందుకు అనుగుణంగా నౌకా వాణిజ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. జపాన్ రక్షణ మంత్రిత్వశాఖ - భారత రక్షణ మంత్రిత్వశాఖ మధ్య నౌకావాణిజ్య భద్రతా సహకార అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
నౌకావాణిజ్య భద్రత రంగంలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లను ఈ ఒప్పందం అందిస్తుంది. ప్రత్యేకించి ఇందులో జపాన్ నావికా స్వీయ రక్షణ దళం, భారత నౌకాదళం మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ఇందులో ముఖ్యమైన అంశం. సముద్ర ప్రాంత పర్యవేక్షణ (ఎండీఏ) రంగంలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, శోధన - రక్షణ, మానవతా సాయం - విపత్తు సహాయక చర్యల్లో (హెచ్ఏడీఆర్) విస్తృత సహకారానికి ఇది దోహదపడుతుంది.
సముద్ర రవాణా మార్గాల రక్షణ కోసం ఇరుపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రులిద్దరూ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నౌకా దళానికి చెందిన నావలు, దళాల పరస్పర పర్యటనలు, ఉమ్మడి విన్యాసాలు, సిబ్బంది - విషయ నిపుణుల పర్యటనలు, అలాగే ఓడరేవుల వినియోగం, నిర్వహణ, మరమ్మతు సదుపాయాలు సహా సరుకు రవాణా సహకారం ద్వారా ఈ సమన్వయం దిశగా కృషిచేయనున్నట్టు వెల్లడించారు. ఈ సహకారం భారత్, జపాన్ దేశాలకే కాకుండా.. ప్రాంతీయ, అంతర్జాతీయ సమాజానికీ అత్యంత కీలకమని వారు వ్యాఖ్యానించారు.
వ్యూహాత్మక, కార్యాచరణ అవసరాలకు ఉపయోగపడే పటిష్టమైన నౌకావాణిజ్య భద్రతా సహకారాన్ని త్వరితగతిన సాకారం చేసేలా ముందుకుపోవడంపై మంత్రులిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. మైన్ల విచ్ఛిత్తి సామర్థ్యాలను పెంచుకునే దిశగా ఇరుపక్షాలు తమ నైపుణ్యాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. అలాగే ఇరుదేశాల సంబంధిత విధానాలకు అనుగుణంగా - జపాన్ సాంకేతిక నైపుణ్యాన్ని, భారత ఉత్పత్తి సామర్థ్యాలను మేళవిస్తూ.. నావికాదళ నౌకా నిర్మాణం, రూపకల్పన రంగాల్లో ఉమ్మడి అభివృద్ధికి అవకాశాలను పరిశీలించాలని నిర్ణయానికి వచ్చారు.
రక్షణ రంగ నౌకా నిర్మాణం, అనుబంధ విభాగాల్లో ఇరుదేశాల బలాలు, నైపుణ్యాలను పరస్పరం సద్వినియోగం చేసుకోవాలని మంత్రులిద్దరూ అభిప్రాయపడ్డారు. మేక్ ఇన్ ఇండియా పరిధిలో భారత ఉత్పత్తి సామర్థ్యాలను జపాన్ ఉపయోగించుకునే అంశంపై చర్చలను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా అతిత్వరలోనే ఓడల మరమ్మతు ఒప్పందాన్ని ఖరారు చేయడంతోపాటు.. పరస్పరం ఓడల మరమ్మతు సదుపాయాల ఏర్పాటును కల్పించే ప్రక్రియలో పురోగతిని సాధించాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు.
జపాన్ - భారత్ సైనిక విన్యాసం ‘ధర్మ గార్డియన్’, జపాన్ - భారత్ నౌకా విన్యాసం ‘జైమెక్స్’ సహా.. జపాన్, భారత్ నిర్వహించే ద్వైపాక్షిక విన్యాసాలు నిరంతరం విస్తరిస్తుండడం, వేగవతమవుతుండడాన్ని మంత్రులిద్దరూ స్వాగతించారు. ముఖ్యంగా ఈ ఏడాది నిర్వహించతలపెట్టిన భారత్ - జపాన్ వైమానిక దళ విన్యాసం ‘వీర్ గార్డియన్ 26’ సమన్వయంలో స్థిరమైన పురోగతిని ప్రత్యేకంగా స్వాగతించారు. ఇందులో భాగంగా జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళానికి చెందిన ఫైటర్ విమానాలు మొదటిసారిగా భారత్‌ను సందర్శించి, విన్యాసాల్లో పాల్గొంటాయి. ద్వైపాక్షిక విన్యాసాలను మరింత అధునాతన స్థాయిలో నిర్వహించడం, మానవ రహిత వ్యవస్థల అనుసంధానం, వీలున్నప్పుడల్లా స్వల్ప వ్యవధిలోనే ఉమ్మడి విన్యాసాలను నిర్వహించడం ద్వారా.. ద్వైపాక్షిక విన్యాసాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మంత్రులిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఇరుదేశాల సాయుధ దళాల మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో.. తమ ప్రత్యేక దళాల మధ్య చర్చలను ప్రోత్సహించడానికి, భారత్ ఏర్పాటు చేయబోయే సమీకృత థియేటర్ కమాండ్లతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి మంత్రులిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
రక్షణ పరికరాలు - సాంకేతికత బదిలీ విధానాన్ని జపాన్ ఇటీవల సమీక్షించడాన్ని భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్వాగతించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంతోపాటు ప్రపంచవ్యాప్తంగా శాంతికి, స్థిరత్వానికి జపాన్ మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య రక్షణ, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు.
యుద్ధనౌకలపై అమర్చే యునికార్న్ సమీకృత కమ్యూనికేషన్ యాంటెన్నా సిస్టమ్ ప్రాజెక్టు.. రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య మొదటి పరికరాల మార్పిడికి సంబంధించి మొదటి ప్రాజెక్టు. భారత్, జపాన్ మధ్య రక్షణ పరికరాలు, సాంకేతికత బదిలీకి సంబంధించి బలమైన సహకారానికి ఇది నిదర్శనమని మంత్రులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా సాకారం చేసే దిశగా కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు.
రక్షణ పరికరాలు, సాంకేతిక రంగంలో ఇతర ప్రాజెక్టులను కూడా సాకారం చేసే లక్ష్యంతో.. ఆయా రంగాల కార్యాచరణ అవసరాలపై ఇరుదేశాల దళాల మధ్య చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అత్యాధునిక రక్షణ సాంకేతికత రంగంలో.. డీఆర్‌డీవో, జపాన్‌కు చెందిన ఏటీఎల్ఏ మధ్య పరిశోధన – అభివృద్ధి సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని మంత్రులిద్దరూ అంగీకారానికి వచ్చారు. రక్షణ పరిశ్రమల ఫోరంను ఏర్పాటు చేయాలన్న తమ సంకల్పాన్ని కూడా మంత్రులు ధ్రువీకరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జపాన్, భారత్, ఇండోనేషియా మధ్య జరిగిన తొలి త్రైపాక్షిక నావికాదళ ‘పాసెక్స్’ విన్యాసాలను ఇద్దరు మంత్రులూ స్వాగతించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని సమగ్ర కోణంలో వీక్షిస్తూ - ఈ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాలకు ఉమ్మడిగా తోడ్పాటునందించడం లక్ష్యంగా.. ఉన్నత స్థాయి పర్యటనలు, విన్యాసాలు, సంబంధిత ఇతర కార్యక్రమాల ద్వారా ఇతర దేశాలతో సహకారాన్ని మరింత విస్తరించుకోవాలన్న విషయమై ఏకాభిప్రాయానికి వచ్చారు.
ప్రకృతి విపత్తుల సమయంలో సిబ్బందిని, సహాయక సామగ్రిని అందించడం ద్వారా భాగస్వామ్య దేశాలకు మద్దతుగా నిలవడం కోసం.. ఇండో-పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్ ద్వారా సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలన్న విషయమై ఇద్దరు మంత్రులూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ ఏడాది సెప్టెంబరులో జపాన్ రక్షణ మంత్రిత్వశాఖలో ఐపీఎల్ఎన్ రెడో టేబుల్‌టాప్ విన్యాసాల నిర్వహణ ప్రకటనను వారు స్వాగతించారు.
2026 జూలైలో ఇరుదేశాల అగ్రనేతలు విడుదల చేసిన జపాన్ - భారత్ ఉమ్మడి ప్రకటనలోని మార్గదర్శకాలను గుర్తుచేస్తూ.. ఈ ఏడాది టోక్యోలో నాలుగో ‘జపాన్ - భారత్ విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాన్ని (2+2)’ నిర్వహించే దిశగా చర్చలను వేగవంతం చేయడంపై మంత్రులిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఇరుదేశాల భద్రతతోపాటు.. ఈ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ పరిరక్షించేందుకు అవసరమైనప్పుడల్లా సంప్రదింపులు జరపడంపైనా మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఇరుదేశాల విధానాలను, సార్వభౌమ నిర్ణయాలను పూర్తిస్థాయిలో గౌరవిస్తూనే.. కార్యాచరణ, ఇంటెలిజెన్స్, పరికరాలు, సాంకేతికత, పారిశ్రామిక రంగాల్లో సమీకృత పద్ధతిలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం డైరెక్టర్ జనరల్/ అదనపు కార్యదర్శి స్థాయిలో ఒక కార్యబృందం ఏర్పాటుపై మంత్రులిద్దరూ అంగీకారానికి వచ్చారు. మంత్రులిద్దరి మధ్య అంగీకారం కుదిరిన సహకార దిశానిర్దేశాలకు.. సమగ్ర సమన్వయాన్ని ఈ కార్యబృందం అందిస్తుంది. వివిధ రంగాల మధ్య గరిష్ట స్థాయిలో సమన్వయాన్ని సాధించడంతోపాటు.. వాటి అమలును వేగవంతం చేస్తుంది.
సమావేశానికి ముందు.. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, దేశం కోసం ప్రాణాలర్పించిన భారత వీరులకు జపాన్ రక్షణ మంత్రి కొయిజుమీ నివాళి అర్పించారు. త్రివిధ దళాల లాంఛనప్రాయ గౌరవ వందనంతో ఆయనకు స్వాగతం పలికారు. ముంబయిలోని పశ్చిమ నావికా దళ కమాండ్, చెన్నైలోని ఇండియన్ నావల్ షిప్‌లను కూడా కొయిజుమీ సందర్శించారు.”
***
(रिलीज़ आईडी: 2301753)
आगंतुक पटल : 7