విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బ్రిక్స్ భారతదేశ అధ్యక్షతన ఎనిమిదో బ్రిక్స్ యువ శక్తి సదస్సు-2026 బ్రిక్స్ ఇంధన సహకారానికి యువతే కేంద్రం
प्रविष्टि तिथि:
19 AUG 2026 2:35PM by PIB Hyderabad
బ్రిక్స్ భారతదేశ అధ్యక్షతన ఆగస్టు 17, 2026న ఎనిమిదో బ్రిక్స్ యువ శక్తి సదస్సు-2026 వర్చువల్ విధానంలో జరిగింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, బ్రిక్స్ సభ్యదేశాల విద్యుత్ మంత్రిత్వ శాఖల యువ నిపుణులతో సహా 100 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. బ్రిక్స్ యువ శక్తి ఏజెన్సీ (బ్రిక్స్ వైఈఏ) ప్రతినిధులతో పాటు అందరికీ సుస్థిర ఇంధనం (ఎస్ఈఫర్ఆల్), అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఐఆర్ఈఎన్ఏ) వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
"పటిష్ఠత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతతో కూడిన నిర్మాణం" ఇతివృత్తమే మార్గదర్శకంగా బ్రిక్స్-2026కు భారత్ అధ్యక్షత వహిస్తుంది. విద్యుత్ రంగానికి సంబంధించి బ్రిక్స్ దేశాలన్నింటిలో సార్వత్రిక, సరసమైన ధరలో, సమ్మిళిత శక్తి లభ్యతను పెంపొందించాలనే నిబద్ధతను తెలియజేస్తూ.. "అందరికీ ఇంధనం" నినాదాన్ని భారత్ పాటిస్తుంది.
బ్రిక్స్ విద్యుత్ సహకారంలో ఈ సదస్సు యువతకు అగ్రస్థానం ఇచ్చింది. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, సాంకేతిక పురోగతి, అంతర్జాతీయ సహకారంలో యువత పాత్రను గుర్తించింది. బ్రిక్స్ దేశాల్లోని యువ నిపుణులు, విద్యావేత్తలు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను ఈ చర్చలు స్పష్టం చేశాయి.
ఉమ్మడి పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలు, విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపుదల కార్యక్రమాల ద్వారా యువత భాగస్వామ్యాన్ని ఆచరణాత్మక ఫలితాలుగా మార్చటంలోని ప్రాముఖ్యతను ఈ చర్చలు స్పష్టం చేశాయి. (i) ఇంధన భద్రత, సుస్థిరత (ii) ఇంధన లభ్యత, సమానత్వం (iii) సాంకేతికత, ఆవిష్కరణ వంటి మూడు ప్రధాన రంగాల ద్వారా 20 మందికిపైగా యువవక్తలు పలు కీలక అంశాలపై దేశాల దృక్పథాలను, అనుభవాలను పంచుకున్నారు. వైవిధ్యమైన ఇంధన మిశ్రమం, ఇంధన సరఫరా వ్యవస్థల స్థిరత్వం, ఇంధన లభ్యత, వినూత్న ఆర్థిక సహాయం, నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఇంధన వ్యవస్థల డిజిటలైజేషన్ వంటి కీలక అంశాలపై చర్చించారు.
స్వచ్ఛ ఇంధన విస్తరణను ముందుకు తీసుకెళ్లేందుకు శక్తిమంతమైన, వైవిధ్యభరితమైన ఇంధన వ్యవస్థలు, అందరికీ అందుబాటులో ఉండే, సమ్మిళిత ఇంధన వసతి, వినూత్నమైన, సరసమైన ధరల్లో లభించే ఆర్థిక వనరుల అవసరంపై ఈ చర్చల్లో విస్తృతంగా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, పటిష్ఠమైన ఇంధన వ్యవస్థలను రూపొందించటంలో సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటలైజేషన్ ను కీలక సాధనాలుగా గుర్తించారు. విశ్వసనీయమైన ఇంధన డేటా, వ్యవస్థల మధ్య పరస్పర అనుసంధానత, సైబర్ భద్రత, నైపుణ్యం గల మానవ వనరులు వీటికి మరింత తోడ్పాటునందిస్తాయని స్పష్టమైంది.
ఇంధన భద్రత, ఇంధన లభ్యత, స్వచ్ఛమైన ఇంధన వనరుల విస్తరణ, విద్యుత్ రంగ సంస్కరణలకు సంబంధించి ముఖ్యమైన జాతీయ కార్యక్రమాలు, విజయాలను భారత యువ ప్రతినిధులు ప్రస్తావించారు. వీటిలో పీఎం-కుసుమ్, పీఎం సూర్య ఘర్, శాంతి చట్టం, పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (ఆర్ డీఎస్ఎస్), ఇండియా ఎనర్జీ స్టాక్ (ఐఈఎస్) వంటివి ఉన్నాయి. వైవిధ్యమైన ఇంధన వనరుల మిశ్రమం, సరఫరా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్‌ను ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశ అనుభవాన్ని పంచుకున్నారు. స్మార్ట్ గ్రిడ్లు, విద్యుత్ నిల్వ (ఎనర్జీ స్టోరేజ్), గ్రిడ్ పటిష్ఠతపై జ్ఞానాన్ని పంచుకోవటం, సామర్థ్య పెంపుదల, సహకారానికి వేదికగా స్మార్ట్ గ్రిడ్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్‌పై ఏర్పాటైన బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (డీసీఓఈ)ను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"అందరికీ ఇంధనం" దార్శనికతకు అనుగుణంగా ఇంధన సహకారాన్ని పెంపొందించటంలో సురక్షితమైన, సుస్థిరమైన, సమ్మిళితమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఇంధన రంగానికి పరిష్కారాలను రూపొందించటంలో బ్రిక్స్ యువత కీలక పాత్రను ఎనిమిదో బ్రిక్స్ యువ శక్తి సమ్మిట్-2026 స్పష్టం చేసింది.
***
(रिलीज़ आईडी: 2301217)
आगंतुक पटल : 7