ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
‘2026 సంవత్సర సైబర్ కుస్తీ’ని ప్రారంభించిన ఎన్ఐఈఎల్ఐటీ... సైబర్ భద్రత రంగంలో ఎంత వేగంగా గుర్తిస్తున్నారన్న అంశానికి బదులు సరి అయిన నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాన్ని పరిశీలించనున్న జాతీయ సైబర్ భద్రత, ఏఐ హ్యాకథాన్
ఈ హ్యాకథాన్‌లో చివరి రౌండును సైబర్ భద్రత, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఇంటెలిజెన్స్ విషయాలపై ఏర్పాటు చేసిన మూడో జాతీయ సమావేశం (‘ఎన్‌సీసీడీఎఫ్ఐ 2026’)లో నిర్వహిస్తారు
प्रविष्टि तिथि:
16 AUG 2026 12:17PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వశాఖ (ఎమ్ఈఐటీవై) పరిధిలోని జాతీయ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఎన్ఐఈఎల్ఐటీ), 2026 ఆగస్టు 15న ‘2026 సంవత్సర సైబర్ కుస్తీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది జాతీయ సైబర్ భద్రత, కృత్రిమ మేధ (ఏఐ)లకు సంబంధించిన ఒక హ్యాకథాన్. సైబర్ భద్రత మూల్యాంకనం పట్ల మనుషులకున్న అవగాహనను, నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాలను పరిశీలించడానికి, గుర్తించడానికి ఈ హ్యాకథాన్‌ను ఉద్దేశించారు.



ఈ హ్యాకథాన్‌ను ఎన్ఐఈఎల్ఐటీ డైరెక్టర్ జనరల్, ఎన్ఐఈఎల్ఐటీ డీమ్డ్ విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ (డాక్టర్) ఎమ్.ఎమ్. త్రిపాఠీ లాంఛనంగా ప్రారంభించారు. ఇది సైబర్ భద్రత, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఇంటెలిజెన్స్ విషయాలపై ఏర్పాటు చేసిన మూడో జాతీయ సమావేశానికి (‘ఎన్‌సీసీడీఎఫ్ఐ 2026’) అధికారిక సమానాంతర టెక్నికల్ ట్రాక్‌గా ఉంటుంది. ఈ పోటీని జాతీయ భద్రత డేటాబేస్ (ఎన్ఎస్‌డీ)లో భాగంగా ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఎనాలిసిస్ సెంటర్ (ఐఎస్ఏసీ ఫౌండేషన్) సహకారంతో నిర్వహిస్తున్నారు. దీనిలో ‘సీఈఆర్‌టీ-ఐఎన్’ జ్ఞాన భాగస్వామిగా పాల్గొంటోంది.
‘2026 సంవత్సర సైబర్ కుస్తీ’కి నమోదుల ఘట్టాన్ని ఆగస్టు 15న మొదలుపెట్టారు. ఈ ప్రక్రియను ఈ ఏడాది సెప్టెంబరు 10 వరకూ అందుబాటులో ఉంచుతారు. దీనిలో పాల్గొనడం ఉచితం. ముగ్గురు సభ్యుల బృందాలతో పాటు స్వతంత్ర పరిశోధకులకు కూడా దీనిలో పాలుపంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
కేవలం లోటుపాటులను గుర్తించడానికే కాకుండా, సరి అయిన నిర్ణయాలను తీసుకోవడం ప్రధానంగా సాగే హ్యాకథాన్
సైబర్‌భద్రతతో ముడిపడిన లోటుపాట్లను అన్వేషించడంపైన లేదా క్యాప్చర్ ది ఫ్లాగ్ (సీటీఎఫ్) సవాళ్లపైన దృష్టిని కేంద్రీకరించే సాధారణ పోటీలకు భిన్నంగా ఈ పోటీ ఉంటుంది. ‘2026 సంవత్సర సైబర్ కుస్తీ’ని.. దీనిలో పాల్గొనే వారికి సైబర్ భద్రతకు సంబంధించిన నిర్ణయాల్ని మూల్యాంకనం చేసే, వాటికి ప్రాధాన్య క్రమాన్ని సూచించే, ఆ నిర్ణయాలను రక్షించే సామర్థ్యాలు ఏమేరకు ఉన్నాయో పరీక్షించడానికి రూపొందించారు.

పోటీలో పాల్గొనే ప్రతి బృందానికీ ఒకే రకమైన, ఉద్దేశపూర్వకంగా అసంపూర్ణంగా వదిలిపెట్టిన ‘భద్రత మూల్యాంకన ప్యాకేజీ’ని ఇస్తారు. దీనిలో కృత్రిమ మేధ సాయం తీసుకుని రూపొందించిన సమాచారం, స్టాటిక్ ఎనాలిసిస్ ఫలితాలు, డిపెండెన్సీ, సీక్రెట్ స్కాన్లు, ఆర్కిటెక్చర్ డాక్యుమెంటేషన్, సోర్స్ కోడ్‌లతో పాటు అప్లికేషన్ లాగ్స్ కలిసి ఉంటాయి.
నిజం కాని విషయాలను, మళ్లీ మళ్లీ ప్రస్తావించిన విషయాలను , కనుక్కున్న విషయాలను ప్యాకేజీలో చేరుస్తారు. కొన్ని వాస్తవిక బలహీనతలను కావాలనే వదిలేస్తారు. సరి అయిన, ప్రాధాన్య పూర్వక భద్రతా మూల్యాంకనాన్ని బృందాలు సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, తీసుకున్న నిర్ణయాలను అవి సమర్ధించుకోవాలి. పోటీలో పాల్గొనే వారు వాస్తవిక అంశాలను గుర్తించినందుకే కాక, కనుక్కున్న విషయాల్లో నిజం కాని వాటిని సరైన పద్ధతిలో తోసిపుచ్చినందుకు కూడా వారికి పురస్కారాలను అందజేస్తారు.
ఈ సందర్భంగా ఎన్ఐఈఎల్ఐటీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ (డాక్టర్) ఎమ్.ఎమ్. త్రిపాఠీ మాట్లాడుతూ, ‘‘భద్రతకు సంబంధించిన పనిలో అన్నింటి కన్నా కష్టమైన భాగం ప్రస్తుతం మార్పునకు లోనైంది. ఒక తరం వరకూ చూసినప్పుడు, సమస్యను గుర్తించడమే అన్నింటి కన్న కష్టమైన పనిగా ఉండేది. ప్రస్తుతం, ఏ బృందానికైనా సరే చదవడానికి సంబంధించి ఉన్న వేగంతో పోలిస్తే, యంత్రాలు చాలా ఎక్కువ వేగంతో ఫలితాల్ని అందించ గలుగుతున్నాయి. అయితే అవి కూడా ఏయే ఫలితాలు సిసలైనవో, ఏవి చాలా అవసరమైనవో, వేటిని ముందుగా సరిదిద్దాలో అనే విషయాలను భరోసా కలిగించేటట్లు సూచించ లేకపోతున్నాయి. సరి అయిన నిర్ణయాన్ని తీసుకునే ఈ రకమైన సామర్థ్యాన్నే మన సంస్థలు అభివృద్ధిపరచాల్సి ఉంది. మరి ఈ విధమైన సామర్థ్యాన్ని పరిశీలించడమే ఈ పోటీ నిర్వహణ వెనుక ఉన్న ముఖ్యోద్దేశం’’ అని పేర్కొన్నారు.
ఉపకరణం ద్వారా రూపొందించిన సమాచారాన్ని అన్ని బృందాలకూ ఏక కాలంలో అందిస్తున్న నేపథ్యంలో, ఖరీదైన భద్రతా ఉపకరణాలతో కలిగే ప్రయోజనం వీలయినంత తక్కువగా ఉండేలా ఈ పోటీకి సంబంధించిన ఫార్మేట్‌ను నిర్దేశించారు. అంతేకాదు, పోటీలో పాల్గొనే వారు తమకు నచ్చిన ఏ కృత్రిమ మేధా సంబంధిత ఉపకరణాలను అయినా సరే, యథేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు కూడా.
ప్రొఫెసర్ (డాక్టర్) ఎమ్.ఎమ్. త్రిపాఠీ మరిన్ని అంశాలను వెల్లడిస్తూ, ‘‘దేశంలో ఏ ప్రాంతానికి చెందిన కాలేజీ విద్యార్థి అయినా ఏ కార్పొరేట్ బృందంతో సమానంగా పోటీ పడవచ్చు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వెసులుబాటును కల్పించారు. మేం ఈ పోటీని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎందుకు మొదలుపెట్టామంటే, యంత్రాలు వేగంగా సత్తాను సమకూర్చుకుంటున్న ఈ కాలంలో స్వాతంత్య్రానికి ఒక నిర్దిష్ట అర్థం ఉంది.. అది, మీకు ఇచ్చిన వస్తువును పరిశీలించే, దాంతో సమ్మతించకపోయే, అది ఎందుకు ఇలా ఉన్నదీ స్పష్టం చేసే ఆత్మవిశ్వాసాన్ని అందించాలనేదే’’నని వివరించారు.
‘అఖండ’, ‘దంగల్’, ‘కేసరి’ పేర్లతో మూడు దశలు
‘2026 సంవత్సర సైబర్ కుస్తీ’ని మూడు దశల్లో నిర్వహిస్తారు:
ఒకటో దశ ‘అఖండ’: ఈ రౌండును 2026 సెప్టెంబరు 15న ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. దీనిలో పాల్గొన్న బృందాల్లో నుంచి 50 బృందాలు ముందంజ వేస్తాయి.
రెండో దశ ‘దంగల్’: ఈ రౌండును 2026 సెప్టెంబరు 24న ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. దీనిలో పాల్గొన్న బృందాల్లో నుంచి 10 బృందాలను తుది రౌండులో పాల్గొనడానికిగాను ఎంపిక చేస్తారు.
ఆఖరి రౌండు ‘కేసరి’: ఈ రౌండును 2026 అక్టోబరు 9న న్యూఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహిస్తారు. తుది రౌండుకు ఎంపికైన పది బృందాలు ‘ఎన్‌సీసీడీఎఫ్ఐ 2026’ ప్రధాన వేదికపై తమ మూల్యాంకనాలను సమర్పించి, వాటిని సమర్ధించుకోవడానికన్నా ముందు నిపుణుల పర్యవేక్షణలో పనిచేస్తాయి.
ఆఖరి రౌండు కొనసాగే క్రమంలో, బృందాల ప్రెజెంటేషన్లతో పాటు వాటి మూల్యాంకన సామగ్రికి సంబంధించిన ఆటోమేటెడ్ విశ్లేషణను కూడా చేపడతారు. దీంతో యంత్రం రూపొందించిన విశ్లేషణ, నిపుణులైన మానవుల అభిప్రాయాలు ఎక్కడెక్కడ ఒకే విధంగా ఉన్నాయో, ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయో పరిశీలించేందుకు ప్రతినిధులకు అవకాశం లభిస్తుంది.
గుర్తింపు, పురస్కారాలు
తుది రౌండులో పాల్గొన్న వారి మూల్యాంకనాన్ని ఎన్ఐఈఎల్ఐటీ, ఐఎస్ఏసీలు కలిసి ఏర్పాటు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక న్యాయ సహాయక బృందం చేపడుతుంది. ఈ జూరీలో ప్రభుత్వం, పారిశ్రామిక రంగం, విద్యా రంగాలకు చెందిన సీనియర్ సైబర్‌భద్రత రంగ నిపుణులు సభ్యులుగా ఉంటారు. వారిలో జాతీయ భద్రత డేటాబేస్ (ఎన్ఎస్‌డీ) గుర్తింపును పొందిన జాతీయ సైబర్ భద్రత పండితులు కూడా ఉంటారు.
విజేతగా నిలిచిన బృందానికి ‘‘సైబర్ కేసరి 2026’’ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. సాంప్రదాయిక గదను కూడా అందిస్తారు. రన్నర్స్-అప్ బృందాలకు ‘‘రుస్తుమ్’’, ‘‘పహిల్వాన్’’ బిరుదులతో సత్కరిస్తారు.
ఒకటో రౌండులో పాల్గొన్న వారికి భాగస్వామ్య ధ్రువపత్రంతో పాటు వ్యక్తిగత స్కోర్‌కార్డును అందజేస్తారు. ఒకటో రౌండు నుంచి ముందుకు వెళ్లిన వారికి ఎన్ఎస్‌డీ రికగ్నిషన్ క్రెడిట్స్‌ను ఇస్తారు. విషయాలను తెలియజేస్తూనే సరికాని సమాధానాన్ని ఇచ్చిన వారికి కూడా ఒక ప్రత్యేక పురస్కారాన్ని అందిస్తారు. ఈ క్రమంలో.. తర్కాన్ని స్పష్టంగా అర్థం చేయించిన, నేర్చుకోవడానికి సహాయపడే సమాధానాన్ని సూచించిన వారిని సన్మానిస్తారన్నమాట.
నియంత్రణతో కూడిన, సురక్షిత పోటీ వాతావరణం
‘2026 సంవత్సర సైబర్ కుస్తీ’లోని అన్ని కార్యకలాపాలను నిర్వాహకులు అందుబాటులో ఉంచిన నియంత్రిత వాతావరణంలో నిర్వహిస్తారు. పోటీలో ఏ దశలో నయినా పోటీలో పాల్గొన్న వారికి లైవ్ సిస్టమ్ గాని, మూడో పక్షం లేదా సార్వజనిక మౌలిక సదుపాయాల సాయాన్ని తీసుకోవాల్సిందిగా పురమాయించరు.. అలాంటి పని చేయడానికి అనుమతించరు.

‘ఎన్‌సీసీడీఎఫ్ఐ 2026’ను గురించి
సైబర్ భద్రత, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఇంటెలిజెన్స్ విషయాలపై ఏర్పాటు చేసిన మూడో జాతీయ సమావేశం (‘ఎన్‌సీసీడీఎఫ్ఐ 2026’) అనేక విషయాలకు సంబంధించిన వేదిక. ఇది ప్రభుత్వాన్నీ, చట్టాన్ని అమలుపరిచే ఏజెన్సీలనూ, న్యాయ వ్యవస్థనూ, పారిశ్రామిక రంగాన్నీ, విద్యారంగాన్నీ, పరిశోధకులనూ, విద్యార్థులనూ ఒక చోటుకు తీసుకువస్తుంది. ఎన్‌సీసీడీఎఫ్ఐ మూడో సంచికను ఈ సంవత్సరంలో అక్టోబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఎన్ఐఈఎల్ఐటీ నిర్వహించనుంది.
‘ఎన్ఐఈఎల్ఐటీ’ని గురించి
కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వశాఖ (ఎమ్ఈఐటీవై) పరిధిలో పనిచేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి గల శాస్త్రీయ సంస్థే జాతీయ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఎన్ఐఈఎల్ఐటీ). ఇది నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సాధికారత రంగంలో అగ్రగామి సంస్థ.
56 ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రాలు, 700 కన్నా ఎక్కువ అధీకృత సంస్థలతోనూ, 8,000కు పైగా ఫెసిలిటేషన్ కేంద్రాలతోనూ ఎలక్ట్రానిక్స్, సమాచార, కమ్యూనికేషన్స్ సాంకేతికత (ఈ అండ్ ఐసీటీ) రంగంలో కొత్త సాంకేతికతలలో లక్షల కొద్దీ విద్యార్థులు నైపుణ్యాన్ని సాధించుకోవడానికి ఎన్ఐఈఎల్ఐటీ దోహదపడి, వారికి ధ్రువపత్రాలను ఇచ్చింది.
విద్యామంత్రిత్వశాఖ ఎన్ఐఈఎల్ఐటీకి విశిష్ట కేటగిరీలో ‘‘డీమ్డ్ టు బి యూనివర్సిటీ’’ హోదాను ప్రదానం చేసింది. ఎన్ఐఈఎల్ఐటీ ప్రధాన కేంపస్ పంజాబ్‌లోని రోపడ్‌లో ఉంది. ఎన్ఐఈఎల్ఐటీకి చెందిన పదకొండు భాగాల క్యాంపసులను ఐజ్వాల్, అగర్తల, కాలికట్, ఛత్రపతి సంభాజీనగర్, గోరఖ్‌పూర్, ఇంఫాల్, ఇటానగర్, అజ్మీర్, కోహిమా, పాట్నా, శ్రీనగర్‌లలో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్స్, సమాచార, కమ్యూనికేషన్స్ సాంకేతికత (ఈ అండ్ ఐసీటీ) రంగంలో డిజిటల్ సాంకేతికతలను సద్వినియోగపరుచుకొని ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులను తీసుకురావాలన్నదే ఎన్ఐఈఎల్ఐటీ ధ్యేయం.
ఐఎస్ఏసీ ఫౌండేషన్, జాతీయ భద్రతా డేటాబేస్‌లను గురించి -
ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఎనాలిసిస్ సెంటర్ (ఐఎస్ఏసీ ఫౌండేషన్): ఇది భారత్‌లో 8వ సెక్షన్‌లో భాగంగా నమోదై కార్యకలాపాలున నిర్వహిస్తున్న సంస్థ. లాభాపేక్ష లేకుండా పనిచేస్తోందీ సైబర్ భద్రతా ఫౌండేషన్. ప్రధానంగా సైబర్ భద్రత, కృత్రిమ మేధ (ఏఐ), వృత్తిరీత్యా నైతిక ప్రమాణాల రంగాలపై ఈ ఫౌండేషన్ తన దృష్టిని కేంద్రీకరిస్తోంది.
జాతీయ భద్రతా డేటాబేస్ (ఎన్ఎస్‌డీ): ఇది సమాచార భద్రత రంగంలో నిమగ్నమైన వృత్తినిపుణులను గుర్తించి, వారికి ధ్రువపత్రాలను అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం.
సీఈఆర్‌టీ ఐన్: ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన జ్ఞాన భాగస్వామ్య సంస్థ.
***
(रिलीज़ आईडी: 2300453)
आगंतुक पटल : 6