ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏడాదిలో కోటి మంది యువతకు కృత్రిమ మేధ నైపుణ్య శిక్షణ: ప్రధానమంత్రి ప్రకటన


పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ వ్యవస్థ

5 నుంచి 15 సంవత్సరాల పిల్లల కోసం దేశవ్యాప్త క్రీడా ప్రతిభాన్వేషణ

ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు శక్తిమంతమైన పౌర రక్షణ వ్యవస్థ ఏర్పాటు

2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యమే భారత్‌ లక్ష్యం

ఈ దశాబ్దంలోనే అయిదు కొత్త అణు రియాక్టర్ల ఏర్పాటుకు ప్రణాళిక

6 కోట్ల లఖ్‌పతి దీదీలే నూతన లక్ష్యం

ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో ముందడుగు.. దేశంలో మరిన్ని సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు

प्रविष्टि तिथि: 15 AUG 2026 1:01PM by PIB Hyderabad

 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. కృత్రిమ మేధ విద్య, క్రీడలు, పౌర రక్షణ, సెమీకండక్టర్ తయారీ, అణు విద్యుత్, మహిళా సాధికారత రంగాలలో అనేక నూతన కార్యక్రమాలను, నిర్దేశిత లక్ష్యాలను ప్రకటించారు.

 

ప్రధానమంత్రి ప్రసంగం లోని ముఖ్యాంశాలు:

 

1. కోటి మంది యువతకు కృత్రిమ మేధ శిక్షణ: రాబోయే సంవత్సర కాలంలో కోటి మంది యువతకు కృత్రిమ మేధ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగానికి నాయకత్వం వహించేలా భారతీయ యువతకు ఈ కార్యక్రమం పూర్తి సామర్థ్యాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

 

2. వివిధ పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కోచింగ్ కేంద్రాల వల్ల పడుతున్న ఆర్థిక భారాన్ని ప్రస్తావిస్తూ.. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తెచ్చి, దేశ యువతకు ఉచిత కోచింగ్ అందించే పూర్తి స్థాయి వ్యవస్థను రూపొందిస్తామని వివరించారు.

 

3. దేశవ్యాప్తంగా 5 నుంచి 15 ఏళ్ల చిన్నారులకు క్రీడా ప్రతిభాన్వేషణ: 

5 నుంచి 15 సంవత్సరాల వయసు గల చిన్నారుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల వ్యాప్తంగా ప్రత్యేక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని చేపడతామని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ ప్రచారంలో ఎంపిక చేసిన చిన్నారులకు ప్రత్యేక శిక్షణ అందించి, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రస్తుతం భారత్ పాల్గొనని లేదా అర్హత సాధించని ఒలింపిక్ క్రీడలలో కూడా సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.

 

4. ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు శక్తిమంతమైన పౌర రక్షణ వ్యవస్థ: 

మారుతున్న యుద్ధ తంత్రాల స్వభావాన్ని వివరిస్తూ, దేశంలో ఒక శక్తిమంతమైన పౌర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. నేటి కాలంలో యుద్ధాలు కేవలం సరిహద్దులకే పరిమితం కావడం లేదని, అవి చమురు శుద్ధి కర్మాగారాలు, బ్యాంకింగ్ రంగం, డేటా సెంటర్లు, కర్మాగారాలు, ఇతర మౌలిక వసతులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గత శతాబ్దపు యుద్ధాల ఆధారంగా రూపొందించిన పాత పౌర రక్షణ వ్యవస్థలు ఇప్పుడు కాలం చెల్లినవని.. అందుకే ఆధునిక వ్యవస్థలపై పౌరులకు అవగాహన కల్పిస్తూ, ఆధునిక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనగల పెద్ద ఎత్తున స్వచ్ఛంద సివిల్ రక్షణ దళాన్ని అభివృద్ధి చేస్తామని ప్రధాని తెలిపారు. 

 

5. స్వావలంబనను బలోపేతం చేసేందుకు మరిన్ని సెమీకండక్టర్ ప్లాంట్లు: 

డిజిటల్, సాంకేతిక ప్రపంచంలో సెమీకండక్టర్ చిప్‌ల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ, ఈ రంగంలో భారత్ వేగంగా స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పటికే మూడు సెమీకండక్టర్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయని, వాటి నుంచి తయారైన చిప్‌ల ఎగుమతులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. రాబోయే ఏడు, ఎనిమిది ఏళ్లలో మరో అయిదు నుంచి ఎనిమిది కొత్త సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. సెమీకండక్టర్ రంగంలో స్వయంసమృద్ధి సాధించడమే వికసిత్ భారత్ దిశగా ప్రధాన చోదక శక్తి అని ఆయన అభివర్ణించారు.

 

6. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యం: కృత్రిమ మేధ, డేటా సెంటర్లు, సాంకేతిక పరికరాల వినియోగం వల్ల పెరుగుతున్న విద్యుత్ అవసరాలను ప్రస్తావిస్తూ.. ఇంధన భద్రత, అణు విద్యుత్ ప్రాధాన్యతను ప్రధానమంత్రి వివరించారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఈ దశాబ్దంలోనే 5 కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించనున్నామని ప్రకటించారు. ఫాస్ట్ బ్రీడర్ అణు సాంకేతికతలో భారత్ ఈ ఏడాది కీలక మైలురాయిని చేరుకుందని, ఇది అణు ఇంధన రంగంలో స్వయంసమృద్ధికి దారితీసే గొప్ప అడుగు అని పేర్కొన్నారు.

 

7. 6 కోట్ల లఖ్‌పతి దీదీల నూతన లక్ష్యం: దేశ నిర్మాణంలో మహిళల పాత్రను కొనియాడుతూ.. అంతకుముందు నిర్దేశించుకున్న 3 కోట్ల లఖ్‌పతి దీదీల లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించినట్లు ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశం 6 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారు చేయడమే నూతన లక్ష్యంగా ముందుకు సాగుతుందని ప్రకటించారు. మరో 3 కోట్ల మంది మహిళలను ఆర్థికంగా సాధికారులను చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా శక్తి సరికొత్త విప్లవాన్ని తీసకొస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


(रिलीज़ आईडी: 2299823) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati