పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఈ నెల 4న ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం (ఏఐ 2379) ఎత్తు ఒక్కసారిగా తగ్గడంతో పలువురికి గాయాలు
నాడు పోస్టు చేయడమైనది:
09 AUG 2026 5:07PM by PIB Hyderabad
04.08.2026న ఫుకెట్ నుంచి ఢిల్లీ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఏ320 విమానం (వీటీ - ఈఎక్స్ఓ, ఫ్లైట్ ఏఐ 2379) సమయంలో హఠాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తుకు దిగిపోయింది. ఆ తర్వాత విమానం తిరిగి నిలకడ స్థితికి చేరుకుని సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది.
ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలోని కొందరు ప్రయాణికులకు, క్యాబిన్ సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. ఆ సమయంలో విమానంలో ముగ్గురు శిశువులతో సహా మొత్తం 137 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో కలిపి మొత్తం 8 మంది క్రూ సభ్యులు ఉన్నారు.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పాటించే ప్రామాణిక కార్యాచరణ విధానాలలో భాగంగా, ఇద్దరు పైలట్లకు మానసిక ప్రభావిత పదార్థాల (సైకోయాక్టివ్ సబ్‌స్టాన్స్) స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. కమాండ్ పైలట్ కు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలో తదుపరి పరీక్షలు అవసరమని తేలింది. ఆ మేరకు నమూనాలను తదుపరి విశ్లేషణ కోసం ల్యాబొరేటరీకి పంపారు. తుది నివేదిక రావాల్సి ఉంది.
ఈ ఘటనను తీవ్రమైన ఘటనగా (సీరియస్ ఇన్సిడెంట్)గా వర్గీకరించారు. దీనిపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది.
విచారణ పూర్తయి, నిర్ణీత ప్రక్రియ ముగిసే వరకు విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఇద్దరు విమాన సిబ్బందిని విధుల నుంచి తప్పించింది. దర్యాప్తు ఫలితాలు, నిర్ధారణ పరీక్షల తుది ఫలితాల ఆధారంగా తగిన తదుపరి చర్యలు తీసుకుంటారు.
విమానయాన భద్రతలో అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి, ఇటువంటి ప్రతి సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, నిర్దేశిత నిబంధనలు, విధానాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడానికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ, డిజిసిఎ ధృఢ సంకల్పంతో ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2296896)
సందర్శకుల సూచీ సంఖ్య : : 64