సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐటీ నిబంధనలు 2021 ప్రకారం మద్యం, పొగాకు సంబంధిత కంటెంట్ కోసం వర్గీకరణ తప్పనిసరి
నైతిక నియమావళి ఫిర్యాదుల పరిష్కారానికి మూడు అంచెల వ్యవస్థ
నాడు పోస్టు చేయడమైనది:
07 AUG 2026 3:24PM by PIB Hyderabad
డిజిటల్ మీడియాలో వచ్చే వార్తలు, సమకాలీన విషయాల ప్రచురణకర్తలతో పాటు ఓటీటీ వేదికల ప్రచురణకర్తలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఐటీ చట్టం 2000 కింద 25, ఫిబ్రవరి 21న సమాచార సాంకేతికత (మధ్యవర్తుల మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు 2021ను తీసుకువచ్చింది.
ఈ నిబంధనల్లోని రెండో విభాగం కింద డిజిటల్ వార్తా ప్రచురణకర్తలు, ఓటీటీ వేదికల ప్రచురణకర్తల కోసం ప్రత్యేకంగా ఒక నైతిక నియమావళిని రూపొందించారు.
ఐటీ నిబంధనలు 2021 ప్రకారం చట్టవిరుద్ధమైన, నిషేధించిన ఎటువంటి కంటెంట్‌ను కూడా ఓటీటీ వేదికలు ప్రసారం చేయడానికి వీల్లేదు. అలాగే కంటెంట్‌ను ప్రసారం చేసేటప్పుడు వారు జాగ్రత్తగా, విచక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. నిబంధనల షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రమాణాల ఆధారంగా కంటెంట్‌ను వర్గీకరించడం తప్పనిసరి. ఇందులో భాగంగా i) కంటెంట్‌లోని ప్రధాన అంశాలు, సందేశాలు, ii) హింస, iii) నగ్నత్వం, iv) సెక్స్, v) భాష, vi) మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాల దుర్వినియోగం, vii) హారర్ అంశాల ఆధారంగా రేటింగ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఐటీ నిబంధనలు-2021 షెడ్యూల్‌లోని రెండో విభాగం ప్రకారం ఓటీటీ వేదికల్లో చూపించే కంటెంట్ వర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించింది. ముఖ్యంగా మత్తు పదార్థాలు, మద్యం, ధూమపానం, పొగాకు ఉత్పత్తులు, సమాజంలో ఇతరులు సులభంగా అనుకరించే ప్రమాదకర ప్రవర్తనలను చూపించే కంటెంట్‌ను ఎలా వర్గీకరించాలనే దానిపై కఠినమైన నియమాలు ఉన్నాయి.
ఓటీటీ సంస్థలు ఈ నైతిక నియమావళిని ఉల్లంఘిస్తే, వాటిపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టంలో పటిష్టమైన మూడు అంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు అందే ఇలాంటి ఫిర్యాదులను, ఐటీ నిబంధనల ప్రకారం తగిన పరిష్కారం కోసం వెంటనే సంబంధిత ఓటీటీ వేదికలకు పంపడం జరుగుతుంది.
మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా.. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కంటెంట్‌ను ప్రసారం చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం 26 నవంబర్ 2024న ఓటీటీ సంస్థలకు ఒక సలహా కూడా జారీ చేసింది.
ఈ సమాచారాన్ని రాజ్యసభలో నేడు సభ్యుడు శ్రీ హారిస్ బీరన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2296440)
సందర్శకుల సూచీ సంఖ్య : : 30