మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

13వ బ్రిక్స్ విద్యా మంత్రుల సమావేశంలో ప్రజా కేంద్రీకృత, మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత కలిగిన బ్రిక్స్ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి

భవిష్యత్ తరాల ఆకాంక్షలను నెరవేర్చేలా విద్యా వ్యవస్థలు ఎల్లప్పుడూ మార్పు చెందేందుకు నూతన ఆవిష్కరణలు ఎంతో అవసరమన్న శ్రీ ప్రహ్లాద్ జోషి

13వ బ్రిక్స్ విద్యా మంత్రుల డిక్లరేషన్‌ను ఆమోదించడంతో భువనేశ్వర్‌లో ముగిసిన సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 07 AUG 2026 5:03PM by PIB Hyderabad

ప్రజా కేంద్రీకృత, మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత కలిగిన బ్రిక్స్ సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి పునరుద్ఘాటించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 13వ బ్రిక్స్ విద్యా మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 13వ బ్రిక్స్ విద్యా మంత్రుల డిక్లరేషన్‌ను ఆమోదించడంతో ఈ సమావేశం ముగిసింది.

బ్రిక్స్ భాగస్వామ్య దేశాలన్నింటితో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని మరోసారి తెలియజేసిన కేంద్ర మంత్రి.. ఈ సమావేశం ద్వారా లభించిన ప్రోత్సాహం అర్థవంతమైన ఫలితాలకు దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘దృఢత్వం, నూతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ అనే భారతదేశపు 2026 బ్రిక్స్ అధ్యక్షత ఇతివృత్తాన్ని ప్రస్తావిస్తూ.. మానవ విలువలకు కట్టుబడి ఉంటూనే విద్యా వ్యవస్థలు యువతను వర్ధమాన అవకాశాలకు అనుగుణంగా సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. విధాన రూపకల్పన, అంతర్జాతీయ సహకారంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, యువత కేంద్ర బిందువుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

సమ్మిళిత వృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు విద్యే ఆధారమని శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆమోదించిన ఈ డిక్లరేషన్ ఐదు ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. సంప్రదాయ, స్వదేశీ పరిజ్ఞాన వ్యవస్థలను పరిరక్షించడం, ప్రోత్సహించటానికి ఉన్న ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా చెప్పారు. వినూత్న ఆలోచనలు, సాంస్కృతిక వారసత్వం ఒకదానికొకటి ప్రోత్సాహకంగా ఉంటాయని అన్నారు. బ్రిక్స్ దేశాల సుసంపన్నమైన నాగరికత కట్టుబాట్లు.. సంప్రదాయ పరిజ్ఞానాన్ని పరిరక్షించడానికి, దానిని లోతుగా అధ్యయనం చేయడానికి, భవిష్యత్ తరాలకు దాని విలువను అందించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

పురాతన కాలం నుంచి విద్య విషయంలో కేంద్రంగా ఉన్న ఒడిశా వారసత్వాన్ని, ‘అతిథి దేవో భవ, వసుధైవ కుటుంబకం’ అనే భారతదేశపు శాశ్వత నాగరికత విలువలను కూడా మంత్రి ప్రస్తావించారు. వివిధ దేశాలు తమ సంప్రదాయాలు, అనుభవాలలో భిన్నంగా ఉన్నప్పటికీ.. వాటి పురోగతి పరస్పరం అనుసంధానమై ఉందని ఆయన చెప్పారు. 

బ్రిక్స్ విద్యా రంగానికి సంబంధించిన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో జరిగిన ఈ సమావేశానికి బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) సహా బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు.

13వ బ్రిక్స్ విద్యా మంత్రుల డిక్లరేషన్‌ను ఆమోదించడం ద్వారా బ్రిక్స్ సహకారంలో విద్యను కీలకమైన అంశంగా పునరుద్ఘాటించారు. భారత్ అధ్యక్షతన గుర్తించిన అయిదు ప్రాధాన్యత రంగాల్లో ఉమ్మడి రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. దీని ప్రధాన నిర్ణయాలు:

  1. బాల్యం తొలినాళ్లలో సంరక్షణ, విద్య (ఈసీసీఈ).. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రాల (ఎఫ్ఎల్‌ఎన్) బలోపేతం: నాణ్యమైన ఈసీసీఈని అందరికీ అందుబాటులోకి తీసుకురావటాన్ని ప్రోత్సహించటం, పాఠశాల సన్నద్ధతను బలోపేతం చేయడం, తొలినాళ్లలో నేర్చుకునే విధానంలో వయోపరిమితికి తగిన డిజిటల్ పరిష్కారాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి అంగీకారం కుదిరింది.

  2. నైపుణ్యాభివృద్ధి, టీవీఈటీ‌లో (సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణ) సహకారం బలోపేతం: త్వరలో రాబోయే ద్వైవార్షిక పురోగతి నివేదిక, సుస్థిర నైపుణ్య కార్యక్రమాల సంకలనం ద్వారా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో 'బ్రిక్స్ టీవీఈటీ సహకార కూటమి' (బ్రిక్స్-టీసీఏ) పాత్రను ఈ డిక్లరేషన్ గుర్తించింది. ఆసక్తిగల బ్రిక్స్ సభ్య దేశాల స్వచ్ఛంద భాగస్వామ్యంతో 'అంతర్జాతీయ నైపుణ్య లోపాల అధ్యయనం' చేపట్టిన భారతదేశపు చొరవను కూడా కొనియాడింది.

  3. పరిశోధన, నూతన ఆవిష్కరణలు, అంకుర వ్యవస్థలను మెరుగుపరచడం: ఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించడం.. విద్యలో కృత్రిమ మేధ‌ (ఏఐ) సురక్షితమైన, నైతిక, మానవ కేంద్రీకృత వినియోగాన్ని ప్రోత్సహించడం.. ఆవిష్కరణల ఆధారిత వ్యవస్థాపకతను బలోపేతం చేయడం.. ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధకులు, అంకుర వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత వేగవంతం చేయడానికి అంగీకారం కుదిరింది.

  4. విద్యార్హతల పరస్పర గుర్తింపును (ఎంఆర్‌క్యూ) ముందుకు తీసుకెళ్లడం: విద్యా సంబంధిత రాకపోకలు, సహకారాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో విద్యార్హతల పరస్పర గుర్తింపుకు సంబంధించిన అవగాహన ఒప్పందం‌పై (ఎంఓయూ) చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి వర్కింగ్ గ్రూప్ సమావేశాలను ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.

  5. విద్యాపరమైన నాయకత్వం, సంస్థాగత అభివృద్ధి కోసం సామర్థ్య పెంపును బలోపేతం చేయడం: బ్రిక్స్ విశ్వవిద్యాలయాల రెక్టర్ల వేదిక (రెక్టర్స్ ఫోరమ్), అధ్యాపకులు- నాయకత్వ మార్పిడి కార్యక్రమాలు, స్టెమ్‌పై ప్రత్యేక దృష్టితో ఉపకారవేతనాల కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించటంతో పాటు 'బ్రిక్స్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ర్యాంకింగ్, ఎవాల్యుయేషన్ వ్యవస్థ' విషయంలో పనిచేసేందుకు అవకాశాలను అన్వేషించేందుకు చర్యలు తీసుకోవటానికి అంగీకారం కుదిరింది.

సంప్రదాయ, స్వదేశీ పరిజ్ఞాన వ్యవస్థలపై విద్యా సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలకు సంబంధించి భారత్ తీసుకున్న చొరవను ఈ సమావేశం స్వాగతించింది. సంప్రదాయ, స్వదేశీ పరిజ్ఞాన వ్యవస్థలను ఒక అదనపు అంతర్జాతీయ నేపథ్య సమూహంగా చేర్చడాన్ని బ్రిక్స్ నెట్‌వర్క్ విశ్వవిద్యాలయం పరిశీలించొచ్చని సూచించింది.

2026 భారత్ బ్రిక్స్ అధ్యక్షత కింద విద్యా మంత్రిత్వ శాఖ 2026 ఆగస్టు 5న భువనేశ్వర్‌లో 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశాన్ని (ఎస్ఓఎం) కూడా నిర్వహించింది. విస్తృత సహకారం, నూతన ఆవిష్కరణలు, విజ్ఞాన మార్పిడి ద్వారా సమ్మిళిత, బలమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విద్యా వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లడం పట్ల సభ్య దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ చర్చలు పునరుద్ఘాటించాయి. 

బ్రిక్స్‌ అధ్యక్షత బాధ్యతల్లో భాగంగా భారత్.. వివిధ రంగాల్లో బ్రిక్స్ మంత్రుల స్థాయి సమావేశాలను  కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ 2026 సెప్టెంబర్ 12–13 తేదీలలో ఢిల్లీలో జరగబోయే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంతో ముగుస్తాయి.

 

****


(రిలీజ్ ఐడి: 2296439) సందర్శకుల సూచీ సంఖ్య : : 52
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Punjabi , Kannada , Malayalam , English , Urdu , Odia , Tamil