హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘బాస్ స్కామ్’పై కార్పొరేట్లు, ఆర్థిక నిపుణులకు ఐ4సీ హెచ్చరిక: హానికరమైన నకిలీ ‘ఖాతా స్టేట్మెంట్లు’, ‘ఎంసీఏ’, ‘ఆర్బీఐ’ ఫైళ్ల ద్వారా వాట్సాప్ ఖాతా స్వాధీనం... భారీ ఆర్థిక మోసాలే టార్గెట్

ఖాతా స్టేట్మెంట్లు, ఆర్బీఐ సమాచారం పేరుతో వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా స్వయంగా మాల్వేర్ వ్యాప్తి

సీఏలు, కంపెనీ డైరెక్టర్లు, సీఎఫ్‌వోలు, కార్పొరేట్ ఫైనాన్స్ బృందాలను లక్ష్యంగా చేసుకుని ఆగడాలు

హ్యాక్ చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వాట్సాప్ ఖాతాల దుర్వినియోగం.. మ్యూల్ ఖాతాలకు నిధులను మళ్లించాల్సిందిగా ఫైనాన్స్ విభాగపు సిబ్బందికి ఆదేశాలు

గత 30 రోజుల్లో బాధితులుగా మారే అవకాశమున్న 58,000 మందికి పైగా వ్యక్తులకు ఎస్ఎంఎస్ హెడర్ ద్వారా సమాచారాన్ని అందించిన ఐ4సీ

సెర్ట్ ఇన్, మైక్రోసాఫ్ట్, దేశంలోని యాంటీ వైరస్, థ్రెట్ ఇంటెలిజెన్స్ కంపెనీలకూ సమాచారం

సహయోగ్ పోర్టల్ ద్వారా సి2 సర్వర్ల జియో బ్లాకింగ్ ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి పైగా భారతీయులకు రక్షణ

प्रविष्टि तिथि: 07 AUG 2026 1:01PM by PIB Hyderabad

ఖాతా స్టేట్‌మెంట్లు, నియంత్రణ సంస్థల సమాచారం పేరిట హానికరమైన ఫైళ్లను పంపుతూ నిపుణులు, వ్యాపారవేత్తల వాట్సాప్ ఖాతాలను దుండగులు తమ ఆధీనంలోకి తెచ్చుకుని దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలకు సంబంధించి.. జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో ఫిర్యాదులు భారీగా పెరిగినట్టు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని భారత సైబర్ నేర నియంత్రణ సమన్వయ కేంద్రం (ఐ4సీ) గుర్తించింది. కొన్ని రోజులుగా ఢిల్లీగుజరాత్మహారాష్ట్ర, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాల్లో ఒకే తరహాలో ఇలాంటి మోసాలు నమోదయ్యాయి. ఈ నయా మోసంపై ఐ4సీ ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ‘నియంత్రణ, ఎగ్జిక్యూటివ్ అధికారుల పేరిట హానికరమైన విండోస్ ఎగ్జిక్యూటబుళ్లతో వాట్సాప్ ఖాతాను ఆధీనంలోకి తెచ్చుకోవడం - భారీ ఆర్థిక మోసాలు’ శీర్షికతో 2026 జూన్ 22న ప్రజలకు సూచనలు చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది.

నమోదైన ఘటనల ప్రకారం.. ‘స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్.zip వంటి పేర్లతో బాధితులకు వాట్సాప్, ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ఒక కంప్రెస్డ్ (.zip) ఫైళ్లు వస్తున్నాయి. వీటిలో చాలావరకు పేర్లకు ముందు తేదీలు (ఉదా: 0704 స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్.zip) ఉంటున్నాయి. ‘RBI.zipMCA.zip’ లాంటి పేర్లతోనూ ఫైళ్లు వస్తున్నాయి. ఇవి సాధారణ ఖాతా స్టేట్‌మెంట్ల లాగా లేదా ఆర్బీఐ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి నియంత్రణ సంస్థల అత్యవసర నోటీసుల లాగా కనిపించేలా సందేశాలను రాసి ఫైళ్లతో జతచేస్తున్నారు. వెంటనే వాటిని అనుసరించాలని ఆ సందేశాల్లో డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆర్కైవ్‌లో ఒక హానికరమైన విండోస్ ఎగ్జిక్యూటబుల్ (.exe), ఒక డైనమిక్ లింక్ లైబ్రరీ (.dll) ఫైల్ ఉంటున్నాయి. యూజర్లు ఈ ఫైల్‌ను విండోస్ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఓపెన్ చేసిన వెంటనే.. ఒక ట్రోజన్ వైరస్ అందులో ఇన్‌స్టాల్ అయిపోతుంది. అది ఆ డివైజ్‌ను హ్యాక్ చేసి, అందులో యాక్టివ్‌గా ఉన్న బాధితుడి ‘వాట్సాప్ వెబ్’ సెషన్‌ను ఆధీనంలోకి తీసుకుంటుంది. చాలా కేసుల్లో ఆదాయపు పన్ను శాఖ పేరిట కూడా ఈ తరహా ఈమెయిళ్లు వచ్చినట్టు గుర్తించారు.

హ్యాక్‌ చేసిన వాట్సాప్ ఖాతా ద్వారా దుండగులు ఆ బాధితుడి కాంటాక్ట్ లిస్టులో ఉన్న అందరికీ, వివిధ గ్రూప్‌లకు అదే హానికరమైన ఫైల్‌ను ఆటోమేటిక్‌గా పంపుతున్నారు. ‘‘ఈ ఫైలును మీ కంపెనీ ఫైనాన్స్ మేనేజరుకు పంపి ధ్రువీకరించుకోండి’’ అంటూ ఓ అభ్యర్థనను కూడా దానికి జోడిస్తున్నారు. కంప్యూటరులో దాన్ని ఓపెన్ చేయాలంటూ కోరుతున్నారు. దీంతో కార్పొరేట్ నెట్‌వర్కుల్లో ఈ వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇక అసలు కథ అప్పుడు మొదలవుతుంది. సాధారణంగా ఈ సైబర్ నేరాన్ని ‘బాస్ స్కామ్’ లేదా ‘నకిలీ సీఈవో’ పేరుతో పిలుస్తారు. దుండగులు సంస్థలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌కు చెందిన అసలైన వాట్సాప్ ఖాతాను వాడుతారు.. లేదంటే హ్యాక్ చేసిన డివైజ్‌లో సైబర్ నేరగాళ్లు తమ నియంత్రణలో ఉన్న నంబరును సదరు కంపెనీ ‘సీఈవో’ పేరుతో రహస్యంగా సేవ్ చేస్తారు. ఆపై అత్యవసరంగా డమ్మీ (మ్యూల్) బ్యాంకు ఖాతాలకు నిధులను మళ్లించాలంటూ సంస్థలోని అకౌంట్స్, ఫైనాన్స్ విభాగపు ఉద్యోగులకు ఆ ఖాతా ద్వారా ఆదేశాలు పంపుతారు.

విదేశాల నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్న వ్యవస్థీకృత నెట్‌వర్కులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాయని, అత్యాధునిక పద్ధతుల్లో అధునాతన మాల్వేర్‌ను దుండగులు వ్యాప్తి చేస్తున్నారని, డీఎల్ఎల్ సైడ్‌లోడింగ్ పద్ధతి ద్వారా దొరక్కుండా తప్పించుకునే సామర్థ్యాలున్న అత్యాధునిక మాల్వేర్‌ను ఉపయోగిస్తున్నారని ఐ4సీకి చెందిన జాతీయ సైబర్ నేరాల ప్రమాద విశ్లేషణ విభాగం (ఎన్సీటీఏయూ) సాంకేతిక విశ్లేషణలో తెలిసింది. చట్టాలను అమలు చేసే సంబంధిత సంస్థలు, సాంకేతిక సంస్థలు సమన్వయంతో వ్యవహరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి.

విండోస్ కంప్యూటర్లలో మాత్రమే ఈ మాల్వేర్ పనిచేస్తుండడం, పంపుతున్న ఫైళ్లు కూడా ఖాతా స్టేట్‌మెంట్లు, నియంత్రణ సంస్థల నిబంధనలకు సంబంధించినవిగా ఉంటుండడంతో... చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ డైరెక్టర్లు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు, కంపెనీల ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల సిబ్బందికి ఈ మోసంతో తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. కార్పొరేట్ సంస్థలన్నీ తమ ఉద్యోగులను, ముఖ్యంగా ఫైనాన్స్ బృందాలను తక్షణమే అప్రమత్తం చేయాలని ఐ4సీ సూచిస్తోంది. నిధుల మళ్లింపు, లేదా బ్యాంక్ ఖాతా వివరాల మార్పులకు సంబంధించి - వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా ఎలాంటి అత్యవసర ఆదేశాలు వచ్చినా.. నేరుగా ఫోన్ కాల్ చేసి లేదా స్వయంగా కలిసి మాట్లాడి ధ్రువీకరించుకోవాల్సిందిగా సూచిస్తోంది.

ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఐ4సీ కింది చర్యలు చేపట్టింది:

(i) బాధితులకు సమాచారం: ఫిర్యాదుల విశ్లేషణసాంకేతిక సమాచారం ద్వారా బాధితులనుప్రమాదంలో పడే అవకాశమున్న ఇతరులను గుర్తించి.. ఐ4సీ వారిని ముందస్తుగానే అప్రమత్తం చేస్తోంది. దీంతో లింక్ అయిన డివైజ్‌ల నుంచి లాగవుట్ కావడంఖాతాలను సురక్షితంగా మార్చుకోవడం వంటి తక్షణ నివారణ చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.

(ii) ప్రమాద సూచనలు చేయడం: ఈ మాల్వేర్‌కు సంబంధించి ప్రమాద సంకేతాలను, సాంకేతిక సమాచారాన్ని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్), మైక్రోసాఫ్ట్ డిఫెండర్, ప్రముఖ భారతీయ యాంటీవైరస్ సంస్థలైన క్విక్ హీల్, కే7 కంప్యూటింగ్, నెట్ ప్రొటెక్టర్లకు ఐ4సీ అందించింది. వివిధ ప్లాట్ఫాంలు, సెక్యూరిటీ ఉత్పత్తుల్లో ఈ హానికరమైన ఫైళ్లను వేగంగా గుర్తించి, బ్లాక్ చేయడంతోపాటు తొలగించేలా ఈ చర్యలు చేపట్టింది.

(iii) పౌరులకు రక్షణ: సమన్వయంతో కూడిన ఈ చర్యల ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి పైగా భారతీయులు ఈ ముప్పును తప్పించుకున్నారు. సహయోగ్ పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు మాల్వేర్‌లను నిరోధిస్తున్నారు.

(iv) ఎస్ఎంఎస్ హెడర్ ‘ఐ4సీఎంహెచ్ఏ-జీ’ ద్వారా హెచ్చరికలు: బాధిత పౌరులకు ‘ఐ4సీఎంహెచ్ఏ-జీ’ అనే ఎస్ఎంఎస్ హెడర్ ద్వారా ఐ4సీ హెచ్చరికలను పంపుతోంది. బాధితులుగా మారే ప్రమాదమున్న 58,000 మందికి పైగా వ్యక్తులకు గత 30 రోజుల్లో ఈ ఎస్ఎంఎస్ హెడర్ ద్వారా ఐ4సీ సమాచారాన్ని అందించింది. సెర్ట్-ఇన్, మైక్రోసాఫ్ట్, భారతీయ యాంటీ వైరస్, థ్రెట్ ఇంటెలిజెన్స్ సంస్థలకూ ఈ ముప్పుపై సమాచారమిచ్చి అప్రమత్తం చేసింది. ‘ఐ4సీఎంహెచ్ఏ-జీ’ ఎస్ఎంఎస్ హెడర్ నుంచి వచ్చే సందేశాలను శ్రద్ధగా గమనించాలని, అందులోని సూచనల మేరకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఐ4సీ ప్రజలను కోరుతోంది.

కింది జాగ్రత్తలను కూడా పాటించాల్సిందిగా ప్రజలు, సంస్థలకు సూచిస్తోంది:

  • తెలియని లేదా ధ్రువీకృతం కాని మూలాల నుంచి వచ్చిన .zip ఫైళ్లను లేదా ఎగ్జిక్యూటబుళ్లను డౌన్‌లోడ్ చేయొద్దుఎక్స్‌ట్రాక్ట్ చేయొద్దు లేదా తెరవొద్దు. ఆర్బీఐ వంటి నియంత్రణ సంస్థలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లనూభద్రతాపరమైన అంశాలనూ లేదా ఖాతా స్టేట్‌మెంట్‌లను ఎప్పుడూ వాట్సాప్ ద్వారా అందించవు.
  • వాట్సాప్ యాప్‌లో (Settings > Linked Devices) లింక్ అయి ఉన్న డివైజ్‌లను ఎప్పటికప్పుడు సమీక్షించండి. ఉపయోగించని వాట్సాప్ వెబ్ సెషన్ల నుంచి వెంటనే లాగవుట్ చేయండి.
  • యూజర్ ప్రొఫైల్ డైరెక్టరీల నుంచి అపరిచిత .exe, .dll ఫైళ్లు ఎగ్జిక్యూట్ అవ్వకుండా అడ్డుకునేలా సాఫ్ట్‌వేర్ నియంత్రణ విధానాలను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు అమలు చేయాలి. అలాగే విండోస్ వాడే అన్ని కంప్యూటర్లలో అప్‌డేట్ చేసిన యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  • ఒకవేళ ఖాతా హ్యాక్‌కి గురైతే.. లింక్ అయి ఉన్న అన్ని డివైజ్‌ల నుంచి వెంటనే లాగవుట్ చేయాలి. సదరు ఖాతా నుంచి వచ్చే ఎలాంటి ఫైళ్లనూ ఓపెన్ చేయవద్దని కాంటాక్టులకు వెంటనే సమాచారాన్ని అందించాలి. అప్‌డేట్ చేసిన యాంటీవైరస్‌తో కంప్యూటర్‌ను స్కాన్ చేయాలి.

సైబర్ మోసాలు, ఇలాంటి అనుమానాస్పద కమ్యూనికేషన్లను ఎంతమాత్రమూ ఉపేక్షించకూడదు. జాతీయ సైబర్ నేరాల హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్ www.cybercrime.gov.inలో వెంటనే వీటిపై ఫిర్యాదు చేయాలి. వివరణాత్మక సూచనలు పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.  

 

***


(रिलीज़ आईडी: 2296158) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Assamese , Kannada , Malayalam