ఆయుష్
సీసీఆర్ఏఎస్ 27వ పాలకవర్గం సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్
సాంప్రదాయిక జ్ఞానం నుంచి డిజిటల్ నూతన ఆవిష్కరణ వరకు.. సీసీఆర్ఏఎస్‌కు చెందిన మూడు ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించిన ఆయుష్ శాఖ
సాంకేతికత, పరిశోధన, నూతన ఆవిష్కరణలు ఆయుర్వేదం భవితకు కీలకం: శ్రీ ప్రతాప్‌రావు జాదవ్
యువ పరిశోధకులు, అంకుర సంస్థలు నడుంకట్టి ఆయుర్వేదాన్ని ప్రయోగశాల నుంచి మార్కెట్టు వరకూ తీసుకుపోవాలి: శ్రీ జాదవ్
प्रविष्टि तिथि:
06 AUG 2026 5:07PM by PIB Hyderabad
ఆయుర్వేద విజ్ఞానశాస్త్రాల కేంద్రీయ పరిశోధన మండలి (సీసీఆర్ఏఎస్) పాలక వర్గం 27వ సమావేశాన్ని ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించగా, కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో, కేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ దృశ్య మాధ్యమం ద్వారా పుణేకు చెందిన సీసీఆర్ఏఎస్-ఆర్ఏఆర్ఐలో రిసర్చ్ ల్యాబొరేటరీతో పాటు యానిమల్ హౌస్‌ను, రాణిఖేత్‌లోని సీసీఆర్ఏఎస్-ఆర్ఏఆర్ఐలో అతిథిగృహంతో పాటు నివాస భవనాన్ని ప్రారంభించారు. అలాగే నాగపూర్‌లోని సీసీఆర్ఏఎస్-ఆర్ఏఆర్ఐలో కొత్తగా నిర్మించే 50 పడకల ఆస్పత్రి భవనానికి భూమి పూజ చేశారు. భారత స్థానిక ఆరోగ్య సంప్రదాయాలు, ఎథ్నోమెడికల్ పద్ధతులు, సాంప్రదాయిక పశుచికిత్స జ్ఞానానికి సంబంధించిన వ్యవస్థీకృత డాక్యుమెంటేషన్, మూల్యంకనం, శాస్రీయ ప్రామాణికతలతో ముడిపడిన ప్రధాన కార్యక్రమం ‘సీసీఆర్ఏఎస్-పరంపర’ను కూడా ఆయన ఆవిష్కరించారు.
సీసీఆర్ఏఎస్ నేషనల్ రిసర్చ్ రికగ్నిషన్స్ వెబ్‌సైటును శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ ప్రారంభించారు. దీనిలో ‘సీసీఆర్ఏఎస్ ప్రకాశ’, ‘సీసీఆర్ఏఎస్ నవోన్మేష’తో పాటు ‘సీసీఆర్ఏఎస్ ప్రబోధ్ 3ఎమ్‌టీ’ కలిసి ఉన్నాయి. పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఆయుర్వేద పరిశోధన, నూతన ఆవిష్కరణ, శాస్త్రీయ కమ్యూనికేషన్ రంగాల్లో ప్రావీణ్యానికి గుర్తింపునివ్వడానికి రూపొందించిన ఒక పూర్తి స్థాయి డిజిటల్ వేదికయే ఈ వెబ్‌సైట్. మంత్రి ‘ఆయుర్-డిక్ట్’ను కూడా ప్రారంభించారు. ఇది సీసీఆర్ఏఎస్ రూపొందించిన మొదటి ఆండ్రాయిడ్ ఆధారిత సేవ. అనేక ఆయుర్వేద నిఘంటువులను ఒక్క చోటే పరిశీలించుకొనేందుకు వీలుగా దీనిలో పొందుపరిచారు. కౌన్సిల్ ఇటీవల సాధించిన విజయాల్ని సమావేశంలో సమీక్షించారు. ప్రధాన వ్యూహాత్మక కార్యక్రమాలకు ఆమోదం తెలపడంతో పాటు ఫలితాల ఆధారిత ఆయుర్వేదాన్ని పటిష్ఠపరిచే ధ్యేయంతో పరిశోధనకు సంబంధించిన ప్రధాన మౌలిక సదుపాయాలను, డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు.
పాలక వర్గాన్ని ఉద్దేశించి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ ప్రసంగిస్తూ, ప్రస్తుతం ఆయుర్వేదం ఒక పరివర్తన యుగం ముంగిట నిల్చొని ఉందన్నారు. భారత సుసంపన్న సాంప్రదాయిక జ్ఞాన వ్యవస్థలకు వెన్నుదన్నుగా శాస్త్రీయ ప్రామాణికత, నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ అనుబంధం నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఫలితాల ఆధారిత పరిశోధనను ముందుకు తీసుకుపోవడంలో సీసీఆర్ఏఎస్ కీలక పాత్రను పోషించిందని మంత్రి స్పష్టం చేశారు. ఆయుర్వేదను శాస్త్రీయ దృక్పథంతో మరింత దృఢతరంగా, ప్రపంచ స్థాయిలో ఆమోదయోగ్యంగా, సులభంగా అందుబాటులో ఉండేదిగా తీర్చిదిద్దేందుకు సంస్థ చేస్తున్న కృషిని మరింత పెంచాలని శ్రీ జాదవ్ అన్నారు.
అభివృద్ధి పథంలో ఆయుర్వేద ముందుకు సాగిపోయే క్రమంలో సాంకేతికత, ఔత్సాహిక పారిశ్రామికత్వం, మార్కెట్లతో అనుబంధాన్ని పెంచుకోవడంపై శ్రద్ధ తీసుకోవాలని శ్రీ జాదవ్ సూచించారు. ప్రధానమంత్రి చెబుతున్న ‘‘హీల్ బై ఆయుర్వేద, హీల్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా’’ గురించి మంత్రి ప్రస్తావిస్తూ, శాస్త్రీయ శ్రేష్ఠత్వం, ప్రమాణీకరణం, నూతన ఆవిష్కరణలను ఆయుర్వేద అనుసరిస్తూ ప్రపంచానికి ఆరోగ్యసంరక్షణ ప్రధానమైన ఒక పరిష్కారమార్గంగా నిలదొక్కుకోవాలన్నారు. అంతర్జాతీయ సంస్థలతో సహకారాన్ని ఇప్పటి కన్న మరింత పెంచుకోవాలనీ, ప్రయోగశాలలో సాధించే ఫలితాలను కొత్త కొత్త మందుల, చికిత్సల రూపంలో రోగులకు అందజేసే ప్రక్రియను ప్రోత్సహించాలని, రోగనిర్ధారణ, సమాచార నిర్వహణ, వ్యక్తిగత ఆరోగ్య సేవలను అందజేయడంలో కృత్రిమ మేధ వంటి సరికొత్త సాంకేతికతలను సద్వినియోగపరుచుకోవాలని సీసీఆర్ఏఎస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు శాస్త్రీయ ఆయుర్వేద జ్ఞాన ప్రామాణికతను, మౌలిక సిద్ధాంతాలను సంరక్షించాలని కూడా మంత్రి స్పష్టం చేశారు.
ఆయుర్వేద భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్రను భారత యువత పోషించవలసిన అవసరం ఉందని శ్రీ జాదవ్ అన్నారు. ఆయుర్వేదను ప్రయోగశాలల నుంచి మార్కెట్ వద్దకు చేర్చడంలో యువ పరిశోధకులు, అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ కలిసికట్టుగా చురుకుగా పనిచేయాలని మంత్రి కోరారు. పరిశోధన సంబంధిత గ్రాంట్లు, నూతన వాణిజ్య సంస్థలకు సహాయం, మార్గదర్శకత్వం, పరిశ్రమ భాగస్వామ్యాలను నెలకొల్పుకోవడం వంటి కార్యక్రమాలతో శక్తిమంతమైన నూతన ఆవిష్కరణల విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)ను ఏర్పరచాలని ఆయన పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ప్రపంచానికి వెల్‌నెస్ కూడలిగా భారత్‌ను తీర్చిదిద్దడానికి యువజన పరిశోధన నిధి, ఆయుర్వేద అంకుర సంస్థలకు మద్దతిచ్చే వ్యవస్థ, గ్లోబల్ ఆయుర్వేద ఛాలెంజ్ వంటి కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరించాలని కూడా మంత్రి సూచించారు. ఆధునిక, ఫలితాల ఆధారిత, ప్రపంచ స్థాయిలో పోటీపడే ఆరోగ్యసంరక్షణ సేవల వ్యవస్థగా ఆయుర్వేదను తీర్చిదిద్దడానికి పాలకవర్గం కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పాలకవర్గాన్ని ఉద్దేశించి ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా ప్రసంగించారు. పరిశోధనల నుంచి స్ఫూర్తిని పొందే విస్తారిత అనుబంధ వ్యవస్థను పటిష్ఠపరచడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అలాంటి వ్యవస్థలో నాణ్యమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ నూతన ఆవిష్కరణలు, శాస్త్రీయ ప్రావీణ్యం.. ఇవన్నీ ఫలితాల ఆధారిత ఆయుర్వేదను బలోపేతం చేస్తాయని ఆయన వివరించారు. ఈ రోజు ప్రారంభించిన వివిధ కార్యక్రమాలు పరిశోధన సామర్థ్యాన్ని, విద్యాపరమైన శ్రేష్ఠత్వాన్ని, జ్ఞాన లభ్యతను మరింత పెంపొందింప చేస్తాయని శ్రీ కొటేచా అన్నారు.
కౌన్సిల్ సాధించిన విజయాలను, రాబోయే కాలానికి అనుసరించనున్న కార్యాచరణ ప్రణాళికను గురించి సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్, పాలక మండలి మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ (వైద్య) రబినారాయణ్ ఆచార్య తెలియజేశారు. ఆయన.. ‘‘ఆధునిక సైన్సు, డిజిటల్ నూతన ఆవిష్కరణలు, నాణ్యమైన ఫలితాలతో శాస్త్రీయ ఆయుర్వేద జ్ఞానాన్ని బలోపేతం చేయగల పరిశోధన ప్రధానమైన విస్తారిత అనుబంధ వ్యవస్థను రూపొందించడానికి సీసీఆర్ఏఎస్ కట్టుబడి ఉంది. ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమాలు పరిశోధన సంబంధిత మౌలిక సదుపాయాలను విస్తరిస్తాయి. యువ పరిశోధకులకు మద్దతిస్తాయి. భారత సాంప్రదాయిక జ్ఞానాన్ని పరిరక్షిస్తాయి. పరిశోధకులకు, వైద్యులకు, ప్రపంచ శాస్త్రవేత్తలకు ఆయుర్వేదను మరింత సులభంగా అందుబాటులో ఉంచుతాయి’’ అని పేర్కొన్నారు.
సమావేశంలో సీసీఆర్ఏఎస్ పాలకవర్గం సభ్యులు, ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, సీసీఆర్ఏఎస్ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ విజయాలను పాలకవర్గం ప్రశంసించింది. పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను, సంస్థాగత సామర్థ్యాన్ని, ప్రపంచ స్థాయిలో వివిధ దేశాలకు ఆయుర్వేదను విస్తరించడానికి పాలకవర్గం విలువైన సూచనలను అందించింది.
నాణ్యమైన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, సంస్థాపరమైన శ్రేష్ఠత్వం.. ఈ మార్గాలను అనుసరిస్తూ ఫలితాల ఆధారిత ఆయుర్వేదను బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని సమావేశంలో పునరుద్ఘాటించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆయుర్వేద పరిశోధనలో సీసీఆర్ఏఎస్ నాయకత్వాన్ని మరింత బలపరచడమే కాకుండా అంతర్జాతీయ ఆరోగ్యసంరక్షణ సేవలలో దాని తోడ్పాటును పెంచుతాయని భావిస్తున్నారు.




***
(रिलीज़ आईडी: 2296074)
आगंतुक पटल : 4