ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వ్యాధి వ్యాప్తి నిరోధక జాతీయ సంయుక్త బృందాన్ని రంగంలోకి దింపిన కేంద్రం
చండీపుర వైరస్ వ్యాప్తిపై ముమ్మరమైన బహుసంస్థాగత పర్యవేక్షణ
प्रविष्टि तिथि:
05 AUG 2026 12:07PM by PIB Hyderabad
గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న చండీపురా వైరస్ వ్యాధిని అరికట్టే చర్యలను మరింత వేగవంతం చేయడం లక్ష్యంగా వ్యాధి వ్యాప్తి నిరోధక జాతీయ సంయుక్త బృందాన్ని (ఎన్‌జేఓఆర్టీ) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రంగంలోకి దింపింది. రాష్ట్ర నిఘా విభాగాలతో కలిసి, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) నిర్వహించే సమీకృత వ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమం (ఐడీఎస్పీ) కింద వ్యాధులపై నిరంతర పర్యవేక్షణతోపాటు... దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పరిశోధన సంస్థలు నిరంతర శాస్త్రీయ దర్యాప్తును తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఈ బృందాలను పంపించారు. వైరస్ సంక్రమణ విధానం, లక్షణాలు, తీవ్రత, సాధ్యమయ్యే చికిత్స పద్ధతులపై మరింత స్పష్టతను సాధించడంతోపాటు.. శాస్త్రీయ పద్ధతుల్లో స్పష్టమైన రుజువుల ప్రాతిపదికన ప్రజారోగ్య చర్యలను చేపట్టడం ఈ సమన్వయ ప్రయత్నాల లక్ష్యం. అంతేకాకుండా ఎన్‌జేఓఆర్టీకి మద్దతుగా.. ఎన్‌సీడీసీ ప్రజారోగ్య అత్యవసర కార్యకలాపాల కేంద్రం (పీహెచ్ఈఓసీ) కూడా పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు.
జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ (డీఏహెచ్‌డీ)లలోని వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఎన్‌జేఓఆర్టీ బృందంలో ఉంటారు. వ్యాధి వ్యాప్తిపై దర్యాప్తు, విపత్తు అంచనా, చికిత్సాపరమైన నిర్వహణ, ప్రయోగ సమన్వయం, వ్యాధి వాహకాల పరిశీలన, ప్రజారోగ్య చర్యల అమలులో రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు ఈ బృందం తోడ్పాటునందిస్తుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖలతో కలిసి పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన అనంతరం.. మంత్రిత్వశాఖకు సిఫార్సులను అందిస్తుంది.
ఇటీవలి కాలంలో చండీపురా వైరస్‌పై చేపట్టిన అత్యంత సమగ్రమైన శాస్త్రీయ దర్యాప్తుల్లో భాగంగా ఈ బృందాలు రంగంలోకి దిగాయి. చెన్నైలోని ఐసీఎంఆర్ - జాతీయ అంటువ్యాధుల అధ్యయన సంస్థ (ఐసీఎంఆర్-ఎన్ఐఈ), పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్- జాతీయ వ్యాధి వాహక నియంత్రణ పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్- ఎన్ఐవీసీఆర్), పూణెలోని ఐసీఎంఆర్-జాతీయ జాతీయ వైరాలజీ సంస్థ (ఐసీఎంఆర్- ఎన్ఐవీ), హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్- జాతీయ చికిత్స పూర్వ పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్- ఎన్ఐపీసీఆర్), బెంగళూరులోని ఐసీఏఆర్- జాతీయ పశువైద్య అంటువ్యాధుల అధ్యయన, వ్యాధి సమాచార సంస్థ (ఐసీఏఆర్- ఎన్ఐవీఈడీఐ)లకు చెందిన నిపుణులు.. గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖతో కలిసి వ్యాధి వ్యాప్తిపై అత్యంత సమన్వయంతో పరిశోధనలు సాగిస్తున్నారు.
వ్యాధి వ్యాప్తి విజ్ఞాన, వైరాలజీ, కీటక శాస్త్ర, పశు వైద్య శాస్త్ర, ప్రయోగశాల నిర్ధారణ పరీక్ష విభాగాల నిపుణులు ఈ ఉమ్మడి పరిశోధనల్లో కలిసి పనిచేస్తున్నారు. తేలికపాటి జ్వరంతో కూడిన అనారోగ్యం నుంచి తీవ్రమైన మెదడువాపు వ్యాధి లక్షణాల వరకు.. చండీపుర వైరస్ సంక్రమణకు సంబంధించి పూర్తి వైద్యపరమైన లక్షణాల పరిధిని అర్థం చేసుకోవడం, ప్రజారోగ్య చర్యలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన శాస్త్రీయ ఆధారాలను సేకరించడం ఈ భాగస్వామ్య ప్రక్రియ ప్రధాన లక్ష్యం.
ఈ పరిశోధనలో భాగంగా వ్యాధి ప్రభావిత జిల్లాల్లో జ్వరంతో కూడిన అనారోగ్యం నుంచి తీవ్రమైన మెదడువాపు వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులపై క్రియాశీల పర్యవేక్షణను మరింత పెంచారు. అదే సమయంలో లక్షణాలు కనిపించని వ్యాధిగ్రస్తులను గుర్తించి, వైరస్ వ్యాప్తి ఏ మేరకు ఉందో కచ్చితంగా అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో సెరోసర్వేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వ్యాధి పెరిగే విధానాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వీలుగా.. నిర్ధారణ పరీక్షలను బలోపేతం చేయడంతోపాటు మెరుగైన జంతు నమూనాల అభివృద్ధిలో ప్రయోగశాల బృందాలు ఏకకాలంలో పనిచేస్తున్నాయి.
వైరస్ సంక్రమణ వలయాన్ని ఛేదించడమే ఇందులో ముఖ్యమైన అంశం. చండీపురా వైరస్ వ్యాప్తిలో ఇసుక ప్రాంతాల్లోని ఈగలను (సాండ్‌ఫ్లైస్) ప్రధాన వాహకాలుగా గుర్తించారు. అయితే దోమలు, నల్లులు, పురుగుల వంటి ఇతర కీటకాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన భారీ సంఖ్యలోని కీటక నమూనాలు ప్రస్తుతం ప్రయోగశాలల్లో విశ్లేషణ దశలో ఉన్నాయి. అయితే శాస్త్రీయ దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రస్తుత వ్యాప్తికి ఒక నిర్దిష్ట కీటకం కారణమని చెప్పడం తొందరపాటు అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
వైరస్ వ్యాప్తికి ప్రాథమిక వనరులుగా పనిచేసే అవకాశం ఉన్నందున.. పెంపుడు జంతువుల్లో కూడా ఈ వైరస్ వ్యాపిస్తోందో లేదో తెలుసుకోవడానికి జంతువులపై పర్యవేక్షణను విస్తరించారు. ఇందులో భాగంగా ఆవులు, గేదెలు, మేకల నుంచి రక్తం, పాల నమూనాలను పరీక్షల కోసం సేకరించారు. ఇప్పటివరకు దాదాపు 70 జంతువుల రక్త నమూనాలను సేకరించి విశ్లేషిస్తూ.. చండీపురా వైరస్‌తోపాటు ఇతర సంబంధిత వ్యాధికారకాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయోగశాల పరిశీలనలు పూర్తయ్యే వరకు ఎలాంటి తుది నిర్ణయానికి రావద్దని అధికారులు స్పష్టం చేశారు.
2024లో గుజరాత్‌లో చండీపురా వైరస్ వ్యాప్తి నుంచి నేర్చుకున్న పాఠాలను కూడా ప్రస్తుత పరిశీలనల్లో పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఇసుక ప్రాంతాల్లోని ఈగలు సహా అనేక రకాల కీటక నమూనాలను సేకరించి పరీక్షించినప్పటికీ, అన్నింటిలోనూ సీహెచ్‌పీవీ ప్రతికూలంగానే తేలింది. దీంతో నిర్దిష్టంగా ఏ వాహకం వల్ల వ్యాధి వ్యాపించిందో కచ్చితమైన ముగింపునకు రాలేకపోయారు.
వైరస్‌లో జన్యుపరమైన మార్పులేమైనా జరిగాయా అన్న అంశంపైనా శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. గాంధీనగర్‌లోని గుజరాత్ బయోటెక్నాలజీ పరిశోదన కేంద్రంలో ప్రస్తుత వైరస్ నమూనాల పూర్తి జన్యు శ్రేణి విశ్లేషణ ప్రక్రియ జరుగుతోంది. ప్రాథమిక విశ్లేషణలో చిన్నపాటి జన్యు వైవిధ్యాలను గుర్తించినప్పటికీ.. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ గతంలో వ్యాపించిన స్ట్రెయిన్ల నుంచే పరివర్తన చెందినదో లేదో నిర్ణయానికి వచ్చే ముందు సమగ్రమైన తులనాత్మక జన్యుపరమైన అధ్యయనాలు అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.
పెరుగుతున్న శాస్త్రీయ ఆధారాలకు బలం చేకూరుస్తూ... పాట్నాలోని ఐసీఎంఆర్- రాజేంద్ర మెమోరియాల్ జాతీయ ఆరోగ్య పరిశోధన సంస్థ (ఆర్‌ఎంఎన్‌ఐహెచ్‌ఆర్), అహ్మదాబాద్‌లోని బి.జె. వైద్య కళాశాల (బీజేఎంసీ), పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలతోపాటు గుజరాత్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సహకారంతో.. పూణేలోని ఐసీఎంఆర్-ఎన్‌ఐవీ పరిశోధకులు ఇటీవల ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. ‘గుజరాత్‌లో 2024లో చండీపుర వైరస్ ఎన్‌సెఫలైటిస్ వ్యాప్తిపై పరిశోధన’ పేరిట ప్రచురితమైన ఈ అధ్యయనం.. గతేడాది వైరస్ వ్యాప్తిపై వివిధ రంగాల నిపుణులు చేపట్టిన పరిశోధనలను వివరంగా నమోదు చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న 15 తృతీయ శ్రేణి ఆసుపత్రుల్లో విస్తరించి ఉన్న.. ఆసుపత్రుల ద్వారా నిర్వహించే తీవ్ర మెదడువాపు లక్షణాల (ఏఈఎస్) పర్యవేక్షణ వ్యవస్థ కూడా ప్రస్తుత పరిశోధనలకు సహకారాన్ని అందిస్తోంది. వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తున్న భవిష్యత్ పర్యవేక్షణ కార్యక్రమమిది. ప్రామాణీకరించిన చికిత్స విధానాలు, సెరోలాజికల్, మాలిక్యులర్ రోగనిర్ధారణ పరీక్షలు, ఎంపిక చేసిన తదుపరి తరం సీక్వెన్సింగ్‌లను ఉపయోగిస్తూ... అంటువ్యాధుల సంబంధిత, ప్రయోగశాల ఆధారాలను ఈ నెట్‌వర్క్ సేకరిస్తోంది. వ్యాధి వ్యాప్తిని త్వరితగతిన గుర్తించడానికి, ఏఈఎస్ కారణాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, సకాలంలో ప్రజారోగ్య చర్యలు చేపట్టడానికి ఇది దోహదపడుతోంది.
వ్యాధి వ్యాప్తి నిరోధక జాతీయ సంయుక్త బృందం (ఎన్‌జేఓఆర్టీ) రంగంలోకి దింపడంతోపాటు, సమాంతరంగా పలు జాతీయ సంస్థల పరిశోధనలతో.. గుజరాత్, రాజస్థాన్‌లకు శాస్త్రీయమైన, క్షేత్రస్థాయి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం విశేషంగా అందించింది. చండీపురా వైరస్ వ్యాప్తిని సరిగ్గా అర్థం చేసుకుని, అరికట్టడానికి మానవ, జంతు, వ్యాధి వాహకాలపై పర్యవేక్షణను సమగ్రంగా అనుసంధానించే.. సమన్వయంతో కూడిన ‘వన్ హెల్త్’ విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2295422)
आगंतुक पटल : 12