వ్యవసాయ మంత్రిత్వ శాఖ
భారత వ్యవసాయ పరిశోధనా మండలి అభివృద్ధి చేసిన స్వదేశీ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) టీకాతో దేశ జీవ భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వాక్సిన్ ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్
పశువైద్య టీకాల అభివృద్ధిలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా కీలక ముందడుగు
తక్కువ ధరలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) టీకాలను ప్రపంచానికి సరఫరా చేసే దేశంగా భారత్
प्रविष्टि तिथि:
04 AUG 2026 4:14PM by PIB Hyderabad
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ (ఏఎస్ఎఫ్‌వీ) ద్వారా వచ్చే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ ఎఫ్) ప్రపంచవ్యాప్తంగా పెంపుడు అడవి పందులకు సోకే అత్యంత వినాశకరమైన సీమాంతర పశు వ్యాధులలో ఒకటి. తీవ్రమైన జ్వరం, రక్తస్రావం, దాదాపు 100 శాతానికి చేరువయ్యే మరణాల రేటు దీని ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి ప్రపంచ పందుల పెంపకం రంగానికి తీవ్రమైన సామాజిక ఆర్థిక నష్టాలను కలిగించింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ను 2020లో భారత్ లో మొదటిసారిగా గుర్తించినప్పటి నుంచీ పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. దీనిఫలితంగా పందులు పెద్ద ఎత్తున మరణించడం, పందుల ఉత్పత్తికి విఘాతం కలగడం, వాటి రవాణా, వ్యాపారంపై ఆంక్షలు కూడా విధించారు. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలోని చిన్నతరహా పందుల పెంపకందారుల జీవనోపాధికి తీవ్ర నష్టం వాటిల్లింది. భారతదేశంలో దీనికి సమర్థవంతమైన చికిత్స లేదా వాణిజ్యపరంగా ఆమోదించిన టీకా అందుబాటులో లేకపోవడంతో ఇప్పటివరకు వ్యాధి నియంత్రణ కేవలం త్వరిత వ్యాధి నిర్ధారణ, వ్యాధి సోకిన జంతువులను తొలగించడం, కఠినమైన జీవభద్రతా చర్యలపైనే ఆధారపడింది
భారత్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చాలా తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని చూపింది. 2020 లోనూ, 2021లోనూ అస్సాంలో పందుల మరణాల వల్ల సుమారు రూ. 276 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా. మిజోరంలో, 2025 నాటికి వ్యాధి వ్యాప్తి 11,382 పైగా కుటుంబాలపై ప్రభావం చూపగా, దీనివల్ల దాదాపు రూ. 982 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ వ్యాధి వ్యాప్తి సంఘటనలు దేశంలో వ్యాధి నివారణ సన్నద్ధతను బలోపేతం చేయడానికీ, రైతుల జీవనోపాధిని కాపాడటానికీ, పందుల పెంపకం రంగాన్ని మరింత స్థిరంగా మార్చడానికీ ఒక సమర్థవంతమైన స్వదేశీ పరిష్కారం ఎంత అత్యవసరమో స్పష్టంగా చూపించాయి.
ఈ కీలక సవాలుకు పరిష్కారంగా భోపాల్‌లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి - జాతీయ అత్యంత భద్రతా జంతు వ్యాధుల సంస్థ (ఐసీఏఆర్–ఎన్ఐహెచ్ఎస్ఏడీ) శాస్త్రవేత్తలు పందుల కోసం భారత్‌లోనే తొలి స్వదేశీ ఎంఏ–104 సెల్ లైన్ ఆధారిత లైవ్ అటెన్యుయేటెడ్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) టీకాను అభివృద్ధి చేశారు. ఎంఏ–104 సెల్ లైన్‌లో ప్రత్యేక జన్యు తొలగింపులతో రూపొందించిన ఏఎస్ఎఫ్‌వీ జెనోటైప్ - II వైరస్‌ను ఉపయోగించి ఈ టీకాను అభివృద్ధి చేశారు. పశువైద్య పరిశోధన రంగంలో ఇది ఒక కీలక ముందడుగుగా నిలవడంతో పాటు, భారీ స్థాయిలో ఉత్పత్తికి కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది.
ఈ టీకా ప్రయోగశాల స్థాయిలో సమగ్ర పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో సూక్ష్మజీవ రహిత (స్టెరిలిటీ), స్వచ్ఛత, భద్రత, జన్యు స్థిరత్వం, రోగనిరోధక శక్తిని ప్రేరేపించే సామర్థ్యం, రక్షణాత్మక ప్రభావం, వైరస్ మళ్లీ తీవ్రతను సంతరించుకునే అవకాశంపై అధ్యయనాలు నిర్వహించారు. భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పశుసంవర్ధక, పాడి పరిశ్రమల విభాగం (డీఏహెచ్డీ) సహకారంతో ఈ టీకాను క్షేత్రస్థాయిలో కూడా పరీక్షించి ధ్రువీకరించారు. దీంతో వాస్తవ పరిస్థితుల్లోనూ ఈ టీకా సురక్షితమైనదని, సమర్థవంతంగా పనిచేస్తుందని మరింత బలంగా నిర్ధారణ అయింది. ఈ టీకాను ఆరోగ్యంగా... ఎనిమిది వారాల వయస్సు పైబడిన పందులకు సిఫారసు చేశారు. ఇది 1 మి.లీ. మోతాదులో ఇంజెక్షన్ గా ఇస్తారు. ప్రాథమిక టీకా ఇచ్చిన 14 రోజుల తర్వాత బూస్టర్ డోసు ఇస్తారు.
ఈ టీకా దేశవ్యాప్తంగా పందుల మరణాలను గణనీయంగా తగ్గించి, ఆర్థిక నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని, పందుల పెంపకందారుల జీవనోపాధిని మెరుగుపరుస్తుందని అంచనా. ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన పశు వ్యాధులలో ఒకటైన దీనికి వ్యతిరేకంగా సమర్థవంతమైన నివారణ సాధనాన్ని అందించడం ద్వారా, ఇది భారత్ లో జంతు ఆరోగ్య భద్రతను బలోపేతం చేసి, పందుల పెంపకం రంగం సుస్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుంది.
డేర్ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్. జాట్ మాట్లాడుతూ, “ఈ అద్భుతమైన ఆవిష్కరణ పశువైద్య శాస్త్రంలో ఒక నూతన శకానికి నాంది. ప్రపంచ స్థాయి జంతు ఆరోగ్య పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో పెరుగుతున్న భారత్ శాస్త్రీయ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. పశుగణాల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి, వ్యాధి సన్నద్ధతను పెంచి దేశ ఆహార, జీవభద్రతకు మద్దతు ఇచ్చే నూతన తరం స్వదేశీ వ్యాక్సిన్లు, వినూత్న సాంకేతికతల అభివృద్ధికి ఇది బాటలు వేస్తుంది" అని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి వియత్నాంలో మాత్రమే కొన్ని వాణిజ్యపరంగా అనుమతి పొందిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాలను పేటెంట్ పొందిన ప్రత్యేక సెల్ లైన్లను ఉపయోగించి తయారు చేస్తున్నారు. దీనికి భిన్నంగా, ఐసిఎఆర్-ఎన్ఐహెచ్ఎస్ఎడి అభివృద్ధి చేసిన స్వదేశీ టీకా విస్తృతంగా అందుబాటులో ఉన్న ఎంఏ-104 సెల్ లైన్‌ను ఉపయోగిస్తుంది. ఇది సాంకేతిక రంగంలో సాధించిన అతిపెద్ద విజయం. ఇది ప్రత్యేకమైన/పేటెంట్ పొందిన తయారీ విధానాలపై ఆధారపడటాన్ని నివారిస్తుంది. భారీ స్థాయిలో టీకాల తయారీని సాధ్యం చేస్తుంది. ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2294575)
आगंतुक पटल : 22