ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నీట్ - పీజీ 2026 పరీక్షల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష


విద్యార్థి కేంద్రిత సంస్కరణలతో సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా పరీక్ష నిర్వహణ

వదంతులను నమ్మొద్దని నీట్ - పీజీ 2026 అభ్యర్థులకు శ్రీ నడ్డా విజ్ఞప్తి

పరీక్ష నిర్వహణకు పటిష్టమైన భద్రతా వ్యవస్థ అమల్లో ఉందని పునరుద్ఘాటన

प्रविष्टि तिथि: 01 AUG 2026 7:19PM by PIB Hyderabad

2026 ఆగస్టు 30న జరగనున్న 'నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్' (నీట్ - పీజీ) 2026 పరీక్షనుసజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించడానికి వీలుగా కేంద్ర ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు పరీక్ష సన్నద్ధతపై  సమీక్ష నిర్వహించారు. 

ఈ సమీక్ష సందర్భంగా జాతీయ వైద్య పరీక్షల బోర్డు (ఎన్బీఈఎంఎస్), సాంకేతిక భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో ఇతర భాగస్వాముల  సంసిద్ధత గురించి మంత్రి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు (రవాణా), అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా వ్యవస్థ, నీట్ - పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత సంస్కరణల గురించి అధికారుల బృందం వివరాలను మంత్రికి అందించింది.

 

పరీక్షల అత్యున్నత ప్రమాణాలు, సమగ్రత భద్రతను కాపాడుతూ, నిష్పాక్షికమైన, పారదర్శకమైన, అభ్యర్థులకు అనుకూలమైన వాతావరణంలో పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. 

నీట్ - పీజీ 2026 కోసం 2,73,183మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు, ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 12.5% ఎక్కువ.  దేశవ్యాప్తంగా అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల అందుబాటును గణనీయంగా పెంచుతూ, దాదాపు 340 నగరాలు, 1,300 పైగా పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు.

నీట్ -పీజీ 2026 పరీక్షకు సంబంధించి వదంతులు లేదా మోసపూరిత ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర మంత్రి శ్రీ  నడ్డా, అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. పరీక్ష ప్రారంభానికి కొద్దిసమయం ముందే అత్యంత సురక్షితమైన, రహస్య కోడ్, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని తెలిపారు. ప్రశ్నపత్రం గోప్యతను పరీక్ష ప్రారంభ సమయం వరకు కాపాడేందుకు బహుళ స్థాయి సాంకేతిక, కార్యాచరణ భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల పరీక్షకు ముందే ప్రశ్నపత్రం తమ వద్ద ఉందని ఎవరైనా  ప్రచారం చేస్తే అది పూర్తిగా అవాస్తవమని, అభ్యర్థులను తప్పుదోవ పట్టించేందుకే అలా చేస్తారని శ్రీ నడ్డా స్పష్టం చేశారు. ఎన్బిఇఎమ్ఎస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసే అధికారిక నివేదికలను మాత్రమే అభ్యర్థులు నమ్మాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు లేదా అక్రమ పద్ధతుల ప్రయత్నాలు జరిగినా వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన సలహా ఇచ్చారు.

 

నీట్-పీజీ 2026లోని ముఖ్యమైన విద్యార్థి కేంద్రిత సంస్కరణలు

పరీక్షా కేంద్రాల ఎంపిక సౌలభ్యం: అభ్యర్థులు మూడు రాష్ట్రాల ప్రాధాన్యతలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా, అభ్యర్థులు తాము నివసిస్తున్న ప్రాంతానికి (చిరునామాకు) సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాల కోసం తమ సంప్రదింపుల చిరునామా ఉన్న రాష్ట్రాన్ని తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులకు మెరుగైన సౌకర్యం: పరీక్ష రాసే నగరం వివరాల సమాచారాన్ని పరీక్షకు దాదాపు మూడు వారాల ముందే విడుదల చేస్తారు. దీనివల్ల అభ్యర్థులు తమ ప్రయాణ, వసతి ఏర్పాట్లను ముందస్తుగా, సౌకర్యవంతంగా ప్రణాళిక చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

పరీక్షా సరళిలో మెరుగుదల: పరీక్షా సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రశ్నల సంఖ్యను 180కి కుదించి, సమయాన్ని 210 నిమిషాలుగా నిర్ణయించారు. దీనివల్ల మొత్తం పరీక్ష వ్యవధి మారకుండానే, అభ్యర్థులకు ఒక్కో ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం లభిస్తుంది.

పటిష్ట ప్రామాణీకరణ: అప్లికేషన్ ప్రక్రియలోనూ. పరీక్ష రోజున కూడా ఆధార్-ఆధారిత ప్రామాణీకరణను అంతర్భాగం చేశారు. వేలిముద్రల గుర్తింపు  విఫలమైన చోట, ఐరిస్ బయోమెట్రిక్ తనిఖీని ఉపయోగిస్తారు. ఇది పరీక్ష ప్రక్రియ పారదర్శకతను,  సమగ్రతను మరింత బలపరుస్తుంది.

మరింత దృఢమైన బహుళ అంచెల భద్రతా వ్యవస్థ

పరీక్ష నిర్వహణ కోసం అమలు చేస్తున్న సమగ్ర భద్రతా ఏర్పాట్లను కూడా కేంద్ర మంత్రి సమీక్షించారు. ఇందులో పరీక్షా కేంద్రాలను ముందస్తుగా సీలు చేసి ధ్రువీకరించడం, సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ ధ్రువీకరణ, అభ్యర్థుల శరీర తనిఖీ,  సిగ్నల్ జామర్ల ఏర్పాటు, డైనమిక్ కంప్యూటర్ కేటాయింపు, కేంద్ర, ప్రాంతీయ కమాండ్ సెంటర్ల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ, స్వతంత్ర పరిశీలకులు, మూల్యాంకన అధికారుల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి పటిష్ట భద్రతా చర్యలు ఉన్నాయి. పరీక్షను సజావుగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 60 వేల మందికి పైగా పరీక్ష నిర్వహణ సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్షా కేంద్రాలకు చేరవేసే వరకు మొత్తం ప్రక్రియను మరింత పటిష్టంగా రూపొందించారు. ఇందుకోసం బహుళ స్థాయిల రహస్య కోడ్ (ఎన్‌క్రిప్షన్), సురక్షిత ఆఫ్‌లైన్ విధానంలో ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష ప్రారంభానికి కొద్దిసమయం ముందే తుది ప్రశ్నపత్రాన్ని ఖరారు చేయడం, నిర్ణయించిన పరీక్ష ప్రారంభ సమయానికే నియంత్రిత డిజిటల్ డీక్రిప్షన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం వంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేస్తారు. 

 

పరీక్షల నిర్వహణలో పారదర్శకతను మరింత బలోపేతం చేయడంతో పాటు అక్రమాలను అరికట్టేందుకు ఎన్‌బీఈఎంఎస్ ప్రత్యేక ఈ-మెయిల్ చిరునామాను అందుబాటులోకి తీసుకువచ్చింది. పరీక్షలో ఇతరుల స్థానంలో హాజరుకావడం, దళారుల కార్యకలాపాలు, ఇతర అక్రమాలపై ఈ ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది.అభ్యర్థుల్లో అవగాహన, అప్రమత్తత పెంపొందించేందుకు ఎన్‌బీఈఎంఎస్ ఎప్పటికప్పుడు సూచనలు, హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది.

పరీక్ష నిర్వహణలో భాగస్వాములైన అన్ని సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసి, ప్రతి అభ్యర్థికి సజావుగా, సురక్షితంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహణ జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య ప్రవేశ పరీక్షలను అత్యున్నత స్థాయి పారదర్శకత, నిష్పాక్షికత, సాంకేతిక పటిష్టతతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిలా శ్రీవాస్తవ, ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) డాక్టర్ లోవెనీష్ జి. కృష్ణ, ఎన్‌బీఈఎంఎస్ అధ్యక్షుడు డాక్టర్ అభిజాత్ షేత్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ వినోద్ కొత్వాల్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ కుమార్ రాహుల్, ఎన్ఎంసీ  కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్, ఎన్‌బీఈఎంఎస్ గౌరవ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ మీను బాజ్‌పాయ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2293136) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia , Tamil , Malayalam