పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇథనాల్ మిశ్రమ పెట్రోలుపై నిజాలు: అపోహల తొలగింపు-వాస్తవాల విశదీకరణ

प्रविष्टि तिथि: 30 JUL 2026 7:05PM by PIB Hyderabad

   ఇథనాల్ మిశ్రమ పెట్రోలు (ఈబీపీ)కు సంబంధించి పత్రికా-ప్రసార, సామాజిక మాధ్యమాల్లో కొన్ని తప్పుదోవ పట్టించే వాదనలు ఇటీవల ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రీయ నిర్ధారణ, క్షేత్రస్థాయిలో విస్తృతానుభవం, పారిశ్రామిక సమాచారం ఆధారంగా ప్రభుత్వం అపోహలను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కింది అంశాల వారీ వివరణల ద్వారా వాస్తవాలను తెలియజేసింది.

అపోహ 1: దేశంలో 2023కు ముందునాటి వాహనాలు ‘ఇ20’ పెట్రోలుతో నడవలేవు.

·        ఇ15-ప్లస్ ఇంధనం మూడున్నరేళ్లకు పైగా విస్తృత వాడుకలో ఉండగా, ఇ19-ఇ20 ఇంధనం రెండున్నరేళ్ల నుంచి వినియోగంలో ఉంది.

·        పైన పేర్కొన్న  రెండు వ్యవధులలో ఇథనాల్ మిశ్రమంతో వాహన ఇంజిన్లు పెద్ద ఎత్తున విఫలం కావడం లేదా పాడైపోవడం వంటి వార్తలకు కచ్చితమైన ఆధారాలేవీ లేవు. ఒకవేళ ఇథనాల్ మిశ్రమం వల్ల ఇంజిన్లకు లేదా ఇంధన వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లి ఉంటే, ఆ వైఫల్యాలపై భారీ ఎత్తున వారంటీ క్లెయిములు, సర్వీస్ కార్యక్రమాలు, విస్తృత వినియోగదారు ఫిర్యాదులకు దారితీసి ఉండేవి. కానీ, అలాంటి దాఖలాలేవీ లేవు.

·        ఇథనాల్ కొత్త ఇంధనమేమీ కాదు... శతాబ్దానికి పైగా ప్రపంచమంతటా వినియోగంలో ఉంది. బ్రెజిల్ వంటి దేశాలు దశాబ్దాలుగా అధిక ఇథనాల్ మిశ్రమాన్ని కూడా ఉపయోగిస్తున్నాయి. భారత్‌లో ఈబీపీ కార్యక్రమం 2001లో ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టుతో ప్రారంభం కాగా, 2006లో ఇ5ను ప్రవేశపెట్టారు. అటుపైన 2013-14లో సుమారు 1.53 శాతంగా ఉన్నప్పటికీ, అవసరమైన ఉత్పత్తి సామర్థ్యం, మౌలిక సదుపాయాలు. నియంత్రణ చట్రం సృష్టితో అప్పటి నుంచే దీన్ని క్రమబద్ధీకరిస్తూ క్రమేణా  పెంచుతూ వచ్చారు.

కింది పట్టిక ప్రకారం ఈబీపీ పురోగమనం ఇలా క్రమేణా పెరిగింది:

ఇథనాల్‌ సరఫరా సంవత్సరం

సగటు మిశ్రణం (శాతంలో)

2013-14

~1.53

2020-21

~8.1

2021-22

~10

2022-23

~12

2023-24

~14.6

2024-25

~19.2

2025-26 (నవంబరు-జూన్‌)

20

·        భారీ స్థాయిలో వాస్తవ ప్రపంచ నిర్వహణ అనుభవాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దేశంలో నిత్యం సుమారు 8 కోట్ల వాహనాలు చిల్లర ఇంధన విక్రయ కేంద్రాలను సందర్శిస్తాయి (వీటిలో దాదాపు 80 శాతం పెట్రోలుతో నడిచేవే).

·        వాహన తయారీదారుల సర్వీస్ సమాచారం ఆధారంగానూ ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. ఒక ప్రముఖ ‘ఓఈఎం’ 2025-26లో 2.84 కోట్ల వాహనాలకు సర్వీస్ చేసింది. వీటిలో వాస్తవంగా ఇ20 హితమైనవిగా నిర్ధారించని వాహనాల సంఖ్య సుమారు 1.5 కోట్లు. అయినప్పటికీ ఇ20 సంబంధిత తుప్పు, అసాధారణ అరుగుదల లేదా విడిభాగాల జీవితకాలం తగ్గడం వంటి ప్రతికూల ప్రభావాలేవీ కనిపించలేదని ఆ సంస్థ నివేదించింది. ఒక ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కూడా ఇలాంటి క్షేత్రస్థాయి అనుభవాన్నే పంచుకుంది.

·        అంతేకాకుండా ఆటోమొబైల్ తయారీదారులు, సియామ్ (ఎస్‌ఐఏఎం), ఏఆర్ఏఐ, వంటి విడిభాగాల తయారీదారులు, పరీక్ష సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ)తో విస్తృత సంప్రదింపుల తర్వాతే అధిక ఇథనాల్ మిశ్రమ పెట్రోలు వాడకాన్ని చేపట్టారు.

·        అమలుకు ముందు మెటీరియల్ అనుకూలత, ఇంజిన్ కేలిబ్రేషన్, డ్రైవబిలిటీ, మన్నిక, ఉద్గారాలు, ఇంధన వ్యవస్థలు సహా పనితీరును శాస్త్రీయంగా అంచనా వేశారు. తయారీదారులు వాహన వారెంటీలను గౌరవిస్తూనే ఉండటం ఇంధన సానుకూలతపై వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

·        సుదీర్ఘకాలం పర్యవేక్షించిన 1.4 కోట్ల ఇ20 వాహనాల సమాచారం మేరకు ఇథనాల్ ప్రభావిత తుప్పు పట్టడంపై ఎలాంటి ఆధారాలు కనిపించలేదని ఒక ‘ఓఈఎం’ ఇటీవలే పేర్కొంది. అదే సమయంలో ఇ20 హిత వాహనాలు వినియోగదారులకు చేరకముందు కఠిన అంతర్జాతీయ ప్రమాణాల నిర్ధారణకు లోనవుతాయని ఏఆర్‌ఏఐ పునరుద్ఘాటించింది.

·        దీనికితోడు ఇంధన కల్తీపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రాలకు ఆదేశాల జారీ సహా ‘ఓఎంసీ’లు కల్తీ-ఇంధన నాణ్యత ధ్రువీకరణ దిశగా 30,000కు పైగా చిల్లర విక్రయ కేంద్రాల్లో తనిఖీ ద్వారా కఠిన నాణ్యతకు హామీ ఇస్తున్నాయి. ఇథనాల్ మిశ్రమ పెట్రోలు ‘బీఐఎస్‌’ ప్రమాణాలకు అనువైనదే కాకుండా సరఫరా వ్యవస్థలో ఆసాంతం నాణ్యత తనిఖీ అనంతరమే విక్రయానికి వస్తుంది.

·        దీని ప్రకారం “ఎలాంటి విస్తృత సమస్యలు” రాలేదంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కేవలం కొన్ని చెదురుమదురు సంఘటనలపైన కాకుండా 25 ఏళ్లకుపైగా దశలవారీ అమలు, విస్తృత శాస్త్రీయ ధ్రువీకరణ, కోట్లాది వాహనాలపై నిరంతర క్షేత్రస్థాయి అనుభవం, తయారీదారుల సర్వీస్ రికార్డులు, వాటాదారులతో సంప్రదింపులు, కొనసాగుతున్న నాణ్యత పర్యవేక్షణ వంటి అనేక రుజువులపై ఆధారపడినది.

·        సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వాదనలను తయారీదారులు, సాంకేతిక ఏజెన్సీలతో సంప్రదించి ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇలాంటి అనేక వాదనలు అతిశయోక్తులని, తప్పుదోవ పట్టించేవని లేదా సాంకేతిక ఆధారాలు లేనివని తేలింది. ఇథనాల్ మిశ్రమం వల్ల వాహన ఇంజిన్లకు విస్తృత నష్టం వాటిల్లినట్లు నిర్ధారిత ఆధారాలేవీ స్పష్టం కాలేదు.

అపోహ 2: దాదాపు 30 కోట్ల వాహనాలు నిరుపయోగమైపోతాయి.

ఇ15+ మిశ్రమ పెట్రోలు ఇప్పటికే మూడున్నరేళ్లకు పైగా విస్తృత వాడుకలో ఉండగా, ఇ19-ఇ20 ఇంధనాలు రెండున్నరేళ్లకు పైగా వినియోగంలో ఉన్నాయి.

ఈ రెండు వ్యవధులలో:

·        మొత్తం 20 కోట్లకుపైగా ద్విచక్ర వాహనాలు,

·        మొత్తం 3 కోట్లకు పైగా పెట్రోలు కార్లు ఈ ఇంధనాలతోనే నడిచినా ఇథనాల్ మిశ్రమం వల్ల ఇంజిన్లు పెద్ద ఎత్తున విఫలం కావడం లేదా వాహనాలు పాడైపోవడం వంటి సంఘటనలకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట ఆధారాకలూ లేకపోవడం గమనార్హం.

ఒకవేళ ఇ20 వల్ల వాహనాలు నిజంగానే నిరుపయోగమై ఉంటే, దేశవ్యాప్తంగా లక్షలాది బ్రేక్‌డౌన్‌లు, వారంటీ క్లెయిములు, సర్వీసింగ్‌ కార్యక్రమాలు నమోదై ఉండేవి. కానీ, అలాంటి ఉదంతాలేవీ లేవు.

అపోహ 3: ఇ20 ఆమోదయోగ్యం కాదని ఆటోమొబైల్ తయారీదారులు లోపాయికారీగా సూచించారు.

ఈ ఏడాది జూలై 4న పెట్రోలియం-సహజ వాయువులు, భారీ పరిశ్రమల, రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖలు మూడూ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో సంస్థల సీనియర్ అధికారులు సమష్టిగా ఇ20 సంబంధిత ఆందోళనలను ప్రస్తావిస్తూ తమ వైఖరిని ఇలా నిర్ద్వంద్వంగా ప్రకటించారు:

·        పాత వాహనాలపై కఠిన పరీక్షల తర్వాతే ఇ20ని ప్రవేశపెట్టామని టయోటా కిర్లోస్కర్ పేర్కొంది. ఇథనాల్ ఒక స్వచ్ఛమైన, అధిక సామర్థ్యంగల ఇంధనమని, దీన్ని దశాబ్దాలుగా ప్రపంచమంతటా వాడుతున్నారని వివరించింది. ‘యూఎన్‌ఈసీఈ’ నిబంధనల ప్రకారం పరీక్ష విధానాలన్నీ అంతర్జాతీయంగా ప్రామాణీకరించిన నేపథ్యంలో వాటిపై రాజీపడే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది.

·        మారుతి సుజుకి కూడా వినియోగదారులకు “విశ్వాస ప్రకటన”గా అభివర్ణిస్తూ తన అభిప్రాయం ప్రకటించింది. తాము 2025-26లో 2.84 కోట్ల వాహనాలకు సర్వీసింగ్‌ చేసిన అనుభవం ఆధారంగా ఈప్రకటన చేసినట్లు పేర్కొంది. కాగా, వీటిలో ఇ20-ధ్రువీకరణ లేని 1.5 కోట్లకు పైగా పాత వాహనాలు కూడా ఉన్నాయని తెలిపింది. అలాగే ఇ20 సంబంధిత తుప్పు, అసాధారణ అరుగుదల, లేదా విడిభాగాల జీవితకాలంలో తగ్గుదల వంటివేవీ కనిపించలేదని కంపెనీ నివేదించింది. అంతేకాకుండా మైలేజీపై ప్రభావం సాధారణంగా 3–3.5శాతానికి పరిమితమని పేర్కొంది. టైర్ ప్రెజర్, డ్రైవింగ్ శైలి, నిర్వహణ, ట్రాఫిక్ వంటి రోజువారీ అంశాలు కూడా ఇంధన సామర్థ్యంపై అధిక ప్రభావం చూపుతాయని స్పష్టం చేసింది.

·        ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు సంస్థలలో ఒకటైన హీరో మోటోకార్ప్ కూడా తమ విస్తృత సర్వీసింగ్‌ డేటా విశ్లేషణ సందర్భంగా పాత ఇంధనాలతో పోలిస్తే ఇ20తో నడిచే వాహనాలలో ఎక్కువగా నష్టం వాటిల్లిన ఉదంతాలేవీ లేవని పేర్కొంది.

·        ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న హ్యుందాయ్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో సంస్థల ప్రతినిధులు కూడా ఇ20 కార్యక్రమంపై పరిశ్రమకుగల విశ్వాసాన్ని సమష్టిగా పునరుద్ఘాటించాయి. ఈ కార్యక్రమంతోపాటు వినియోగదారుల ఆందోళనలను పారదర్శకంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి.

అపోహ 4: పాత వాహనాలకు ముప్పు పొంచి ఉంది.

ఒక ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ 2025-26లో మొత్తం 2.84 కోట్ల వాహనాలకు సర్వీసింగ్ చేసింది.

వాటిలో సుమారు 1.5 కోట్ల వాహనాలు ఇ20-అనుకూల ధ్రువీకరణ ఉన్నవి కావు.

అయినప్పటికీ:

·        ఇ20 ఇంధనం వల్ల అసాధారణ తుప్పు పట్టడం,

·        అసాధారణ అరుగుదల,

·        విడిభాగాల జీవితకాలం తగ్గడం వంటి ప్రభావిలేవీ కనిపించ లేదు.

ఒక ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కూడా ఇదే తరహా క్షేత్రస్థాయి అనుభవాన్ని నివేదించింది. ఇ20తో నడిచే 1.4 కోట్ల వాహనాలను సుదీర్ఘకాలం పర్యవేక్షించిన మరో ‘ఓఈఎం’ (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్) సంస్థ కూడా ఇథనాల్ వల్ల తుప్పు పట్టినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది.

అపోహ 5: మైలేజీ పడిపోతుంది.

ఇంధన సామర్థ్యం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, కింద పేర్కొన్నవి కూడా అందులో భాగమేనని ప్రభుత్వ అధ్యయనాలతో పాటు ఆటోమొబైల్ తయారీ సంస్థలు కూడా నిరంతరం స్పష్టం చేస్తున్నాయి:

·        డ్రైవింగ్ అలవాట్లు,

·        ట్రాఫిక్ పరిస్థితులు,

·        వాహన నిర్వహణ,

·        టైర్ ప్రెజర్,

·        ఎయిర్ కండిషనర్ వినియోగం.

కొన్ని పాత ఇ10-ఆధారిత వాహనాలకు, ఇంధన సామర్థ్యంలో ఏదైనా తగ్గుదల ఉన్నా సాధారణంగా 3-5 శాతానికి మాత్రమే పరిమితం తప్ప, ప్రచారంలోగల అపోహల స్థాయిలో కాదన్నది వాస్తవం.

అదే సమయంలో ఇ20 వినియోగం ద్వారా:

·        అధిక ఆక్టేన్ రేటింగ్, అత్యున్నత యాంటీ-నాక్ లక్షణాలు,

·        సంపూర్ణ దహనం, ఇంజిన్‌ సున్నిత పనితీరు,

·        మెరుగైన త్వరణం, ప్రయాణ నాణ్యత లభిస్తాయి.

అపోహ 6: ఇ20ని సమర్థించాల్సిందిగా వాహన తయారీ సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉంది.

ఆటోమొబైల్ తయారీ సంస్థలు శాస్త్రీయ ధ్రువీకరణతో సంతృప్తి చెందని పక్షంలో ఈ రెండింటినీ తిరస్కరించి ఉండేవి:

·        ఇ20-అనుకూల వాహన ధ్రువీకరణ,

·        వారంటీ బాధ్యతను గౌరవించడం

ప్రమాణానుగుణ ఇ20 ఇంధనంతో నడిచే వాహనాలకు తయారీదారులు వారంటీని గౌరవిస్తూనే ఉన్నారు. ఎందుకంటే- ఆ ఇంధనం ప్రవేశపెట్టే ముందు నిర్వహించిన విస్తృత పరీక్షలపై వారికి విశ్వాసం ఉంది.

అపోహ 7: ఇ20 ఇంధనంపై వాస్తవాలను దాచేవిధంగా ఆటోమొబైల్ కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది.

·        భారత ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ వినియోగదారుల పట్ల చట్టబద్ధ, నియంత్రణపరమైన బాధ్యతలుగల స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలు.

·        వారంటీ క్లెయిములు, ఉత్పాదక బాధ్యత, నియంత్రణ చర్యలు సహా తీవ్ర అప్రతిష్టకు గురయ్యే విస్తృత వాహన లోపాలను వారెన్నడూ దాచరు.. దాచలేరు.

·        ఇ20 ఇంజిన్‌కు వ్యవస్థాగత నష్టం కలుగుతున్నదని తయారీ సంస్థలు భావిస్తే, అవి అలా చేయవు కాబట్టే... ఇ20 అనుకూల వాహనాలకు వారంటీని కొనసాగిస్తున్నాయి. వారంటీపై ఇంజనీరింగ్ ధ్రువీకరణ, క్షేత్రస్థాయి అనుభవం ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారు తప్ప, రాజకీయ ఒత్తిడిపరంగా కాదు.

·        పరిశ్రమలోని ప్రసిద్ధ సంస్థలన్నీ 2026 జూలై 4న తమ వైఖరిని బహిరంగంగా, పారదర్శకంగా ప్రకటించాయి. ఈ మేరకు టయోటా కిర్లోస్కర్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో సంస్థల సీనియర్ అధికారులు సంయుక్తంగా మీడియానుద్దేశించి ప్రసంగించారు. కఠిన పరీక్షలు, విస్తృత ధ్రువీకరణ తర్వాత మాత్రమే ఇ20ని ప్రవేశపెట్టినట్లు వారు పునరుద్ఘాటించారు.

వారి ప్రకటనను కింది పేర్కొన్న వాస్తవ ప్రపంచ సర్వీసింగ్‌ సమాచారం కూడా సమర్థిస్తోంది:

·        మారుతి సుజుకి 2025-26లో సర్వీస్ చేసిన 2.84 కోట్ల వాహనాల (వీటిలో 1.5 కోట్లకు పైగా పాత వాహనాలు) సమాచారాన్ని విశ్లేషించింది. ఈ సందర్భంగా ఇ20 వల్ల తుప్పు, అసాధారణ అరుగుదల లేదా విడిభాగాల జీవితకాలం తగ్గడం వంటి ప్రతికూలతలేవీ కనిపించ లేదు.

·        హీరో మోటోకార్ప్ విస్తృత సర్వీసింగ్‌ సమాచార విశ్లేషణ ప్రకారం- ఇ20తో నడిచే ద్విచక్ర వాహనాలలో అధిక నష్టం ఉదంతాలేవీ లేవని స్పష్టమైంది.

·        టయోటా కిర్లోస్కర్ సంస్థ కూడా యూఎన్‌ఈసీఈ ప్రమాణాల ప్రకారం, అంతర్జాతీయ  గుర్తింపుగల పరీక్ష విధానాల మేరకు పాత వాహనాలపై కఠిన పరీక్షల తర్వాతే ఇ20ని ప్రవేశపెట్టామని పేర్కొంది.

 

 

***


(रिलीज़ आईडी: 2292151) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Kannada , Malayalam