రైల్వే మంత్రిత్వ శాఖ
3,000 లీటర్ల డీజిల్ పొగ స్థానంలో నీటి ఆవిరి మాత్రమే... భారత్ హైడ్రోజన్ రైలు విశేషాలు
प्रविष्टि तिथि:
25 JUL 2026 2:19PM by PIB Hyderabad
ఢిల్లీ పరిసర ప్రాంతంలోని జింద్, సోనిపట్‌ల మధ్య జూలై 17, 2026న దేశపు తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ రైలు ఎటువంటి అంతరాయం లేకుండా 1200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఏకంగా 3200 లీటర్లకు పైగా డీజిల్ వాడకం ఆదా అయింది.
ఈ హైడ్రోజన్ రైలు హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల మధ్య జరిగే రసాయన చర్య ద్వారా ప్రయాణంలోనే సొంతంగా విద్యుత్తును తయారు చేసుకుంటుంది. ఈ ప్రక్రియ రైలు నడవడానికి కావలసిన విద్యుత్తును అందిస్తూ, ఉప ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరిని మాత్రమే బయటకు విడుదల చేస్తుంది. దీని నుంచి ఎటువంటి పొగగానీ, కార్బన్ ఉద్గారాలు గానీ రావు. ఫలితంగా ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత స్వచ్ఛమైన రైలు రవాణా వ్యవస్థగా నిలిచింది.
భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. 10 బోగీలు ఉన్న ఈ రైలులో రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు ఉన్నాయి. ఇవి లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు, హైడ్రోజన్ సిలిండర్ల సహాయంతో మొత్తం 2,400 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
ఈ ప్రాజెక్టు కోసం జింద్‌లో భారతీయ రైల్వే తొలిసారిగా ఒక ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ 500 బార్ వరకు ఒత్తిడితో గ్రీన్ హైడ్రోజన్‌ను నిల్వ చేస్తారు. రైలులోకి ఇంధనాన్ని నింపేటప్పుడు 350 బార్ ఒత్తిడితో పంపుతారు. ఈ కేంద్రంలో మొత్తం 3,000 కిలోగ్రాముల వరకు ఇంధనాన్ని దాచే సదుపాయం ఉంది.
రైలు రక్షణ కోసం పలు రకాల స్వతంత్ర భద్రతా వ్యవస్థలను అమర్చారు. గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను ఇవి తక్షణమే గుర్తిస్తాయి. ఆటోమేటిక్ షట్-ఆఫ్ వ్యవస్థలు, నిరంతర గాలి వెలుతురు ఉండేలా చూసే వెంటిలేషన్, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. జింద్, సోనిపట్ మధ్య ప్రయాణం విజయవంతం కావడంతో, త్వరలోనే దిల్లీ మార్గంలో కూడా ట్రయల్స్ ప్రారంభించనున్నారు.
భారత్ రూపొందించిన ఈ హైడ్రోజన్ ఇంధన ఘటం రైలు కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు. స్వదేశీ హైడ్రోజన్ రైలు వ్యవస్థను బలోపేతం చేస్తూ, పర్యావరణహిత రవాణా పట్ల దేశానికి ఉన్న నిబద్ధతను ఇది చాటిచెబుతోంది. భవిష్యత్తులో ఈ సాంకేతికతను విస్తరించడానికి, స్వచ్ఛమైన రవాణా రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించడానికి మార్గం సుగుమం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2289454)
आगंतुक पटल : 7