రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రొమేనియాలో భారతీయ సమాజం ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన భారత రాష్ట్రపతి


భారత్ - రొమేనియా సంబంధాలకు అత్యంత బలమైన పునాది ప్రజల మధ్య సాన్నిహిత్యమే: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత అభివృద్ధి పయనంలో రొమేనియాలోని భారతీయ సమాజం నిరంతరం చురుగ్గా భాగస్వామ్యం వహించాలని రాష్ట్రపతి పిలుపు

प्रविष्टि तिथि: 25 JUL 2026 7:07PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రొమేనియాలో అధికార పర్యటన ముగింపు రోజున (జూలై 25, 2026) బుకారెస్ట్‌లోని భారత రాయబారి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అక్కడి భారతీయ సమాజం, 'ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా' ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ దినేష్ శర్మ, శ్రీ విజయ్ బాఘేల్ కూడా పాల్గొన్నారు.

రొమేనియాలో నివసిస్తున్న ఉత్సాహపూరిత భారతీయ సమాజాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, వారు భారతదేశానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ, తమ మాతృభూమితో నిరంతరం ప్రగాఢమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారని అన్నారు. వారి విజయాలు, మాతృదేశం పట్ల వారికున్న ప్రేమ ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు. భారతీయ కంపెనీలు, నిపుణులు రొమేనియా అభివృద్ధికి గణనీయమైన సహకారాన్ని అందిస్తూనే, రెండు దేశాల మధ్య కొత్త సహకార అవకాశాలను కూడా సృష్టిస్తున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

భారత్ - రొమేనియా సంబంధాలకు అత్యంత బలమైన పునాది రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యమేనని రాష్ట్రపతి అన్నారు. భారతీయ సంతతి సమైక్యంగా ఉంటూ, రొమేనియాలో భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నూతన తరం భారతీయ ఐటీ ఇంజనీర్లు, మేధావులు, పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యార్థులు ఇప్పుడు రొమేనియాను తమ నివాసంగా మార్చుకుంటున్నారని పేర్కొన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థకు,  సమాజానికి భారతీయ సంతతి అందిస్తున్న సహకారం, రొమేనియా భారతీయ సంస్కృతిని, విలువలను ప్రోత్సహించేందుకు వారు చేస్తున్న కృషి వారిని భారతదేశానికి నిజమైన ప్రతినిధులుగా నిలబెడుతున్నాయని రాష్ట్రపతి అన్నారు. కష్టపడే తత్వం, ప్రతిభ, అంకితభావంతో భారత సంతతి సభ్యులు విశేషమైన విజయాలను సాధించారని ఆమె పేర్కొన్నారు. భారతీయ సమాజానికి సాదర స్వాగతం పలికి, వారికి భద్రత కల్పిస్తున్న్నందుకు రొమేనియా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ఆమె అభినందనలు తెలిపారు.

'వికసిత భారత్ 2047' దార్శనికత  సంపన్నమైన, ఆధునికమైన, స్వావలంబన కలిగిన సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించడమేనని రాష్ట్రపతి అన్నారు. భారత అభివృద్ధి పయనంలో రొమేనియా లోని భారతీయ సమాజం నిరంతరం క్రియాశీల భాగస్వామ్యం వహించాలని ఆమె పిలుపునిచ్చారు. వారి అనుభవం, నైపుణ్యం, సాధించిన విజయాలు భారత ప్రగతికి ఎంతగానో దోహదపడతాయని ఆమె స్పష్టం చేశారు.

ఈ విందుకు హాజరైన రొమేనియా 'ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా' ప్రతినిధులను రాష్ట్రపతి అభినందించారు. భారతీయ కళలు, సంస్కృతి పట్ల వారికి ఉన్న ప్రేమ, భారతదేశంతో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం మన ప్రజలను ఏకం చేసే ఒక ముఖ్యమైన వారధిగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు. భారత్, రొమేనియా మధ్య స్నేహబంధాలను, సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో వారు నిరంతరం అందిస్తున్న మద్దతును ఆమె కొనియాడారు.

మూడు దేశాల అధికార పర్యటన విజయవంతంగా ముగిసిన అనంతరం, రాష్ట్రపతి న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.

 

***


(रिलीज़ आईडी: 2289450) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam