ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బంగారం అక్రమ రవాణాపై డీఆర్‌ఐ ఉక్కుపాదం... దేశవ్యాప్త తనిఖీల్లో 27 కిలోల బంగారం స్వాధీనం, 12 మంది అరెస్టు

प्रविष्टि तिथि: 25 JUL 2026 4:01PM by PIB Hyderabad

వ్యవస్థీకృత బంగారం స్మగ్లింగ్ ముఠాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) తనిఖీలను ముమ్మరం చేసింది. పక్కా సమాచారంతో దేశవ్యాప్తంగా చేపట్టిన వరుస దాడుల్లో 27 కిలోలకు పైగా విదేశీ అక్రమ బంగారాన్ని జప్తు చేసింది. ఈ కేసుల్లో మొత్తం 12 మందిని అధికారులు అరెస్టు చేశారు. విమానాల మరుగుదొడ్లు, వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరలు, ఇంట్లో వాడే పాత్రలు, శరీర భాగాలలో దాచడం వంటి పలు వినూత్న పద్ధతుల్లో స్మగ్లింగ్ జరుగుతున్నట్లు ఈ తనిఖీల్లో వెల్లడైంది.

 

జూలై 23-24 తేదీల్లో అడ్డిస్‌ అబాబా నుంచి ముంబై వచ్చిన ముగ్గురు ప్రయాణికులను డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. విమానంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, వెనుక ఉన్న మరుగుదొడ్డి పైకప్పు లోపల దాచి ఉంచిన 6 విదేశీ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు దాదాపు 12 కిలోలు ఉంటుంది. విమానాశ్రయ సిబ్బంది సాయంతో బయటకు తీయడానికి వీలుగా ఈ ప్రయాణికులు బంగారాన్ని అక్కడ దాచినట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని జప్తు చేసి, ఆ ముగ్గురు ప్రయాణికులను అధికారులు అరెస్టు చేశారు.

 

పక్కా సమాచారంతో జులై 23న ఉత్తరప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర మెయిల్‌ రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళను డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. ఆమె నడుము బెల్టు, హ్యాండ్‌బ్యాగ్‌లో దాచి ఉంచిన 5 కిలోల బరువు గల 42 విదేశీ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా ఈ బంగారాన్ని భారత్‌లోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు సదరు మహిళ ఒప్పుకుంది. దీంతో అధికారులు ఆ బంగారాన్ని జప్తు చేసి, ఆమెను అరెస్టు చేశారు.

 

జులై 22, 23 తేదీల్లో ముంబై విమానాశ్రయంలో నిర్వహించిన మరొక ఆపరేషన్‌లో ఒక పెద్ద స్మగ్లింగ్ ముఠా గుట్టును డీఆర్‌ఐ రట్టు చేసింది. మైనపు రూపంలో ఉన్న బంగారు పొడిని విమాన మరుగుదొడ్లలో దాచి, ఆ తర్వాత లోపలికి వచ్చే విమానాశ్రయ క్లీనింగ్ సిబ్బంది ద్వారా దానిని బయటకు తరలిస్తున్నట్లు తేలింది. ఈ దాడిలో 3.7 కిలోల బంగారు పొడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం తీసుకొచ్చిన వ్యక్తి, విమానాశ్రయ క్లీనింగ్ సిబ్బంది, ముఠా నడిపిన హ్యాండ్లర్, బంగారాన్ని తీసుకునే వ్యక్తి  కలిపి మొత్తం అయిదుగురిని అరెస్టు చేశారు. 

 

జులై 19, 20 తేదీల్లో కోల్‌కతా రైల్వే స్టేషన్‌లో ఒక ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన వంట పాత్రల లోపల రహస్యంగా దాచిన 4.6 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ సరిహద్దు ద్వారా  బంగారాన్ని దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అధికారులు జప్తు చేసి, ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

 

అదే వారంలో కొచ్చి, గువాహటిలలో చేపట్టిన వేర్వేరు దాడుల్లో అధికారులు మరో 2 కిలోల విదేశీ బంగారాన్ని జప్తు చేశారు. కొచ్చి విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి శరీరంలో దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గువాహటిలో ఒక కారులో ప్రత్యేకంగా చేసిన రహస్య అరలో దాచిన బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు. ఈ రెండు కేసుల్లో ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. 

 

***


(रिलीज़ आईडी: 2289446) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Tamil , Malayalam