మంత్రిమండలి
రసాయన పార్కుల కోసం ‘భారత్ ఔద్యోగిక వికాస్ యోజన రసాయన్ (భవ్య రసాయన్)’ పథకాన్ని ఆమోదించిన క్యాబినెట్
प्रविष्टि तिथि:
24 JUL 2026 4:11PM by PIB Hyderabad
దేశంలో మూడు ప్రత్యేక రసాయన పార్కులను ఏర్పాటు చేసేందుకు ‘భారత్ ఔద్యోగిక వికాస్ యోజన రసాయన్ లేదా భవ్య – రసాయన్’ పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించారు. ఆర్థిక సంవత్సరం 2026–27 కేంద్ర బడ్జెట్లో దీన్ని ప్రకటించారు.
ఈ పథకం మొత్తం ఆర్థిక వ్యయ అంచనా రూ.3,030 కోట్లు. దీనిలో రూ.3,000 కోట్లతో పార్కు లోపల ఉమ్మడి మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పరిపాలనా వ్యయం కోసం రూ.30 కోట్లు కేటాయించారు. ఆర్థిక సంవత్సరం 2026–27 నుంచి ఆర్థిక సంవత్సరం 2030–31 వరకు అయిదేళ్ల పాటు ఈ పథకం కొనసాగుతుంది.
ఈ పథకం ద్వారా ప్రతి పార్కుకు రూ.1,000 కోట్ల వరకు నిధులను కేంద్రం మంజూరు చేస్తుంది. పార్కు ఏర్పాటు చేసే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.500 కోట్ల వాటాను అందించాల్సి ఉంటుంది.
దిగువ పేర్కొన్న ప్రయోజనాలను భవ్య రసాయన్ పథకం అందిస్తుందని అంచనా వేస్తున్నారు:
-
ఇది రసాయన పరిశ్రమలోని ప్రాథమిక స్థాయి, తదుపరి ఉత్పత్తుల స్థాయి, అనుబంధ పరిశ్రమలతో సహా మొత్తం విలువ ఆధారిత వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అలాగే వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొనేలా చేస్తూ సరకు రవాణా ఖర్చులను తగ్గిస్తుంది.
-
రసాయన పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసే ఉమ్మడి మౌలిక వసతులు, ప్రాథమిక సేవలను పంచుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయి. తద్వారా భారతీయ పరిశ్రమ ప్రపంచ మార్కెట్లో మెరుగైన పోటీ ఇస్తుంది.
-
ఇది అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థల్లో భారతీయ రసాయన పరిశ్రమను మెరుగ్గా అనుసంధానించేందుకు దోహదపడుతుంది. తద్వారా ఎగుమతులను, దిగుమతి ప్రత్యామ్నాయాలను పెంచేందుకు దారి తీస్తుంది.
-
ఉమ్మడి మురుగునీటి శుద్ధి కేంద్రం, వ్యర్థాల శుద్ధి, నిల్వ, పారవేత కేంద్రం, ప్రమాదకరమైన వ్యర్థాల నిర్వహణ మౌలిక వసతులు లాంటి కేంద్రీకృత సౌకర్యాలున్న పర్యావరణహిత వ్యవస్థను సృష్టిస్తుంది. తద్వారా సుస్థిర విధానంలో భారతీయ రసాయన పరిశ్రమ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా పర్యావరణ నియంత్రణల అమలును మెరుగుపరుస్తుంది. తద్వారా పర్యావరణ అనుకూల పద్ధతిలో పరిశ్రమ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
-
రసాయన రంగంలో సాధించే అభివృద్ధి ఫలితంగా ఆర్థిక వ్యవస్థలోని అనుబంధ పరిశ్రమలు కూడా వృద్ధి చెందుతాయి. ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడుతుంది.
వ్యవసాయం, జౌళి, ఫార్మాసూటికల్స్, న్యూట్రాసూటికల్స్, నిర్మాణం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ లాంటి వివిధ అనుబంధ పరిశ్రమల్లో ఉపయోగించే రసాయనాలు, పెట్రోకెమికల్స్‌ను ఈ రంగం ఉత్పత్తి చేస్తుందనే విషయాన్ని గుర్తించి భవ్య రసాయన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఉపాధి కల్పించడం ద్వారా ఈ రంగం అభివృద్ధికి ఈ పథకం దోహదపడుతుంది. అలాగే ఈ రంగంలో పోటీతత్వాన్ని పెంచి ఆత్మనిర్భరతను ప్రోత్సహిస్తుంది.
ఈ పథకం పరిధిలో, ఛాలెంజ్ రూట్ కింద రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మూడు ప్రత్యేక కెమికల్ పార్కుల నిర్మాణానికి కేంద్రం తోడ్పాటు అందిస్తుంది. ప్రతి పార్కులో కనీసం 8 చ.కి.మీ. (కనీసం 2,000 ఎకరాలు) విస్తీర్ణంలో ఎలాంటి చట్టపరమైన వివాదాలు లేని భూమి ఉంటుంది. ఈ పార్కులు రసాయన పరిశ్రమకు అవసరమైన ఉమ్మడి మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యాల రూపంలో తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉన్న వసతులను అందిస్తుంది. అవి
-
ఉమ్మడి మురుగునీటి శుద్ధి కేంద్రం(సీఈటీపీ)
-
వ్యర్థాల శుద్ధి, నిల్వ, పారవేత కేంద్రం (టీఎస్‌డీఎఫ్)
-
నీటి సరఫరా, పంపిణీ వ్యవస్థలు
-
ద్రావకాల పునరుద్ధరణ, డిస్టిలేషన్ సౌకర్యాలు
-
ఆవిరి ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ
-
అంతర్గత పైప్‌లైన్ వ్యవస్థ
-
సరకు రవాణా, గోదాము సౌకర్యాలు
***
(रिलीज़ आईडी: 2289096)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada