వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జెనీవాలో డబ్ల్యూటీఓ సమావేశం... ఎనిమిదో వాణిజ్య విధాన సమీక్షను విజయవంతంగా ముగించిన భారత్


ఆంక్షలకు తావు ఉండని, పారదర్శకత ప్రధానమైన, డబ్ల్యూటీఓ-అనుకూల వాణిజ్య వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన వాణిజ్య కార్యదర్శి

భారత వాణిజ్య విధాన సమీక్షలో పాలుపంచుకున్న డబ్ల్యూటీఓలోని 68 సభ్యదేశాలు... ఇది భారత్‌‌లో చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పుపై ప్రపంచ దేశాలు కనబరుస్తున్న గొప్ప ఆసక్తికి సూచిక

प्रविष्टि तिथि: 23 JUL 2026 8:49PM by PIB Hyderabad

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో భారత్ ఎనిమిదో వాణిజ్య విధాన సమీక్ష (టీపీఆర్)కు సంబంధించిన రెండో, చివరి కార్యక్రమాన్ని జెనీవాలో ఈ రోజు ముగించారు. వాణిజ్య విధాన సమీక్ష డబ్ల్యూటీఓలో ఓ ప్రముఖ పారదర్శక, పర్యవేక్షక యంత్రాంగం. దీనిలో భాగంగా సభ్య దేశాల వాణిజ్య విధానాలను, వాణిజ్యంతో ముడిపడిన విధానాలను నిర్దిష్ట సమయంలో క్రమం తప్పకుండా పరిశీలిస్తుంటారు. పారదర్శకత్వాన్ని పెంచడానికి, డబ్ల్యూటీఓలో నియమాల పాలనను బలోపేతం చేయడానికి, సభ్య దేశాల మధ్య ఫలప్రద చర్చలకు ఈ ప్రక్రియ మార్గాన్ని సుగమం చేస్తుంది.
ఎనిమిదో వాణిజ్య విధానం సమీక్షలో పాల్గొన్న భారత అధికారిక ప్రతినిధి వర్గానికి వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ అగర్వాల్ నాయకత్వం వహించారు. డబ్ల్యూటీఓ సభ్య దేశాలను ఉద్దేశించి శ్రీ అగర్వాల్ ముగింపు ప్రకటన చేస్తూ, సభ్యుల క్రియాశీల భాగస్వామ్యంతో పాటు భారత వాణిజ్య విధానాల పట్ల ఎంతో ఆసక్తిని వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
సంస్కరణ నిరంతరం సాగుతుంటుందని, ఆంక్షలకు చోటివ్వని, పారదర్శకతతో కూడిన, అంచనా వేయడానికి వీలు ఉండే పెట్టుబడి విధానాన్ని అనుసరించాలని భారత్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత టారిఫ్ సంస్కరణలు, కస్టమ్స్ ప్రక్రియలను సరళతరం చేసే దిశగా చేపడుతున్న చర్యలు, విస్తృత లక్ష్యాల సాధనకు అనువుగా అవలంబిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) వ్యూహం దేశాభివృద్ధికి తోడ్పడుతుండడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత ఏకీకరణను నిరంతరాయంగా బలోపేతం చేశాయని కూడా ఆయన వివరించారు. దీంతో పాటు, అంతర్జాతీయ డిమాండును తీర్చడంలో భారత్ ఒక ప్రధాన పాత్రనూ పోషిస్తోందన్నారు.
సభ్యులు ప్రస్తావించిన అంశాలకు వాణిజ్య కార్యదర్శి జవాబిస్తూ, భారత వాణిజ్య విధానాలు  ఒక పెద్ద అభివృద్ధి ప్రధాన ఆర్థిక వ్యవస్థ అవసరాల్ని తీరుస్తూనే, డబ్ల్యూటీఓ సూత్రాలకు అనుగుణంగా కూడా ఉంటున్నాయని పునరుద్ఘాటించారు. లక్షల కొద్దీ చిన్న రైతులు, తక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్న రైతులు, వనరుల లేమితో సతమతమవుతున్న రైతుల జీవనోపాధిని కాపాడడంతో పాటు నిష్పక్షపాత వైఖరినీ, సమానత్వాన్నీ నిర్ధారించడం లక్ష్యంగా భారత్‌లో వ్యవసాయ టారిఫ్‌లను ఖరారు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో భారత పారిశ్రామిక టారిఫ్‌లు.. మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక వాతావరణంలో సరఫరా వ్యవస్థకు దృఢత్వాన్నీ, వివిధీకరణనూ జతపరచడానికి, దేశీయ తయారీ రంగ సామర్థ్యాలను ప్రోత్సహించడానికి తోడ్పడుతున్నాయని ఆయన తెలిపారు.
సమీక్ష కొనసాగిన క్రమంలో, డబ్ల్యూటీఓ సభ్య దేశాల నుంచి 1,094 రాతపూర్వక ప్రశ్నలు భారత్‌కు అందాయి. 2026 జులై 21 మొదలు 23 మధ్య నిర్వహించిన రెండు కార్యక్రమాల్లో 68 సభ్య దేశాలు తమ స్పందనను వ్యక్తం చేశాయి. ఆ స్పందనలు భారత్‌ ఆర్థిక వ్యవస్థలో మార్పులపైనా, బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థలో భారత్ పోషిస్తున్న పాత్ర పైనా ప్రపంచ దేశాల ఆసక్తి అంతకంతకు పెరుగుతుండడాన్ని సూచించాయి. భారత్‌తో తమ వాణిజ్య, ఆర్థిక సంబంధాలకు ఉన్న ప్రాధాన్యాన్ని అనేక దేశాలు గుర్తుచేసుకున్నాయి. బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థలో భారత్ అందిస్తున్న ఫలప్రద తోడ్పాటును, ఆర్థిక విషయాల్లో భారత్‌ సుదృఢత్వాన్ని సభ్య దేశాలు ప్రశంసించాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు భారత్ అందిస్తున్న సేవలు, కస్టమ్స్, వాణిజ్య సంబంధిత సౌకర్యాలను ఆధునికీకరించడం, నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలకు ప్రోత్సాహకంగా ఉండే కార్యక్రమాలను అమలు చేయడం, ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలను విస్తరించుకోవడం, ఎమ్ఎస్ఎమ్ఈ‌లను ప్రపంచ వేల్యూ చైన్‌తో జతపరిచే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భారత్ అందుకుంటున్న విజయాలను కూడా వారు ప్రస్తావించారు. మత్స్య పోషణ సంబంధిత సబ్సిడీలపై డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని భారత్ ఆమోదించడాన్ని సభ్యదేశాలు స్వాగతించాయి.
స్వచ్ఛతకు, మొక్కల ఆరోగ్యానికి సంబంధించిన చర్యలు, సాంకేతిక నియమ నిబంధనలు, వాణిజ్య  ప్రతిక్రియల విషయంలో పారదర్శకత, ఆసక్తిదారు వర్గాలతో సంప్రదింపులు, డబ్ల్యూటీఓ నియమావళిని అనుసరించడానికి భారత్ కట్టుబడి ఉంటుందని వాణిజ్య కార్యదర్శి పునరుద్ఘాటించారు. సరైన సార్వజనిక విధాన లక్ష్యాలను సాధించడమే భారత నాణ్యత నియంత్రణ ఆదేశాల ముఖ్యోద్దేశమని ఆయన తెలిపారు. వాణిజ్య ప్రతిక్రియలకు సంబంధించిన దర్యాప్తులలో పారదర్శకతను పాటిస్తున్నట్లు, నిష్పాక్షిక సాక్ష్యాలు, తగిన ప్రక్రియలను అనుసరిస్తున్నట్లు, న్యాయస్థానాల సమీక్షాధికారానికి చోటిస్తున్నట్లు వివరించారు. భారత వాణిజ్య ప్రతిక్రియల మొత్తంమీద పరిధి ఒక పరిమితికి లోబడి ఉందనీ, భారత్ తన యాంటి-డంపింగ్ ఫ్రేంవర్కులో ‘తక్కువ సుంకానికి సంబంధించిన నియమా’న్ని వర్తింపచేస్తూనే ఉందనీ ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సుస్థిర అభివృద్ధి, మహిళలకు సాధికారత కల్పన, డిజిటల్ మాధ్యమం ద్వారా సేవలను అందించడం, మేధోసంపత్తి సంస్కరణలు, సేవల సంబంధిత వాణిజ్యం, పెట్టుబడులను సులభతరం చేయడం, వాణిజ్య సౌలభ్యాన్ని పెంపొందించడం.. ఈ మార్గాల్లో భారత్ నిరంతర ప్రయత్నాలను వాణిజ్య కార్యదర్శి వివరించారు. ఆర్థిక వ్యవస్థలో మార్పుల ప్రయోజనాలను అందరికీ అందిస్తుండటం, డిజిటల్ మాధ్యమంలో వాణిజ్య నిర్వహణ, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థకు మెరుగులు దిద్దుతుండటం, పర్యావరణ స్థిరత్వం వంటి విషయాల్లో భారత్ చెప్పుకోదగిన ప్రగతి సాధించిందని ఆయన వివరించారు. నూతన ఆవిష్కరణల ఆధారిత, సమ్మిళిత అభివృద్ధి నమూనాను అనుసరించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
డబ్ల్యూటీఓ సంస్కరణలపై వాణిజ్య కార్యదర్శి మాట్లాడుతూ ఆంక్షలకు తావు ఉండని, పారదర్శక, నియమాల్ని పాటించే బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ పట్ల భారత్ బలమైన నిబద్ధతను కనబరుస్తుందని పునరుద్ఘాటించారు. డబ్ల్యూటీఓ సంస్కరణలు అభివృద్ధి ప్రధానమైనవిగా ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలను దృష్టిలో పెట్టుకొని తగిన విధానాలను రూపొందించేందుకు ఆస్కారాన్ని అట్టిపెట్టుకోవాలని, సంస్థ విశ్వసనీయతను పటిష్ఠపరుచుకోవాలని, ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలను అమలయ్యేటట్లు చూడాలని ఆయన స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓ కీలక సిద్ధాంతాలను పరిరక్షిస్తూనే బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఫలితాలను రాబట్టే విధంగా అన్ని సభ్య దేశాలతో జతపడతానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని భారత్ పునరుద్ఘాటించింది.
వాణిజ్య విధాన సమీక్ష ప్రక్రియలో శ్రేష్ఠ నాయకత్వంతో పాటు అమూల్య తోడ్పాటును అందించినందుకు వాణిజ్య సమీక్ష విభాగ అధ్యక్షురాలు, సమోవా రాయబారి నెలా పెపే తవితా-లెవీకీ, చర్చలో చివరి వక్త పాత్రను పోషించిన బ్రెజిల్ రాయబారి శ్రీ గుయిల్‌హర్మే డీ ఎగువియర్ పెట్రియోటాకు వాణిజ్య కార్యదర్శి కృతజ్ఞత‌ వ్యక్తం చేశారు. భారత ఎనిమిదో వాణిజ్య విధాన సమీక్ష విజయవంతంగా ముగిసేలా చూడడంలో అంకిత భావంతో కృషి చేసిన డబ్ల్యూటీఓ సచివాలయానికి, డబ్ల్యూటీఓ సభ్య దేశాలకు, జెనీవా, న్యూఢిల్లీలలోని భారతీయ బృందాలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
వాణిజ్య కార్యదర్శి సమీక్షను ముగిస్తూ డబ్ల్యూటీఓలో పారదర్శకత, చర్చ, ఫలప్రద తోడ్పాటు.. ఈ అంశాల్లో  భారత్  తిరుగులేని నిబద్ధతను కనబరుస్తుందని పునరుద్ఘాటించారు. ‘‘వసుధైవ కుటుంబకమ్’’ ( ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం) అన్న భారత మూలతత్వాన్ని ఆయన గుర్తుచేస్తూ, బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థను పటిష్ఠపరచడానికి అన్ని సభ్య దేశాలతో భారత్ కలిసి పనిచేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. అలాంటి ఒక వ్యవస్థ ఏర్పడితే  ఉమ్మడి సమృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిరాభివృద్ధిలను కోరుకునే ఒక ప్రధాన శక్తిగా అంతర్జాతీయ వాణిజ్యం నిలదొక్కుకోగలదన్నారు.
చర్చలో (వ్యక్తిగత హోదాలో) పాల్గొన్న బ్రెజిల్‌కు చెందిన శ్రీ గుయిల్‌హర్మే డీ ఎగువియర్ పెట్రియోటా మాట్లాడుతూ ప్రపంచం అనిశ్చితి గుండా సాగుతున్న ఈ కాలంలో,  చర్చల ప్రక్రియను భారత్‌ ప్రోత్సహించి, అందరి సమ్మతిని సాధించి, నియమాలపై ఆధారపడే, సమ్మిళిత, పటిష్ఠ బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థను తీర్చిదిద్ది ఒక వంతెన మాదిరిగా పనిచేయడాన్ని కొనసాగిస్తుందన్న ఆశాభావాన్ని అనేక సభ్య దేశాలు వ్యక్తం చేశాయని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అభిప్రాయాన్ని వినిపించే గొంతుకగా భారత్‌ది ముఖ్య స్థానం అని ఆయన ప్రస్తావించారు. డబ్ల్యూటీఓలో సామూహిక కార్యాచరణను ముందుకు తీసుకుపోవడానికి సభ్య దేశాల మధ్య అభిప్రాయ భేదాలు సమసిపోయేటట్లు చూడడంలో కూడా భారత్‌ది కీలక పాత్ర అని ఆయన అన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రాధాన్యం పెరుగుతోందని డబ్ల్యూటీఓ సభ్య దేశాలలో అనేక దేశాలు అంగీకరించాయని సమోవా రాయబారి, వాణిజ్య సమీక్ష విభాగ అధ్యక్షురాలు నెలా పెపే తవితా-లెవీ అన్నారు. ఆమె కార్యక్రమం ముగింపు సందర్భంలో మాట్లాడారు. ప్రపంచ అభివృద్ధిని, వాణిజ్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో భారత్ భూమికను ఆ దేశాలు గుర్తించాయని కూడా ఆమె అన్నారు. సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనలను ఆమె ప్రస్తావిస్తూ, వాటిని భారత్ తగిన విధంగా పరిష్కరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మొత్తంమీద, భారత్ ఎనిమిదో వాణిజ్య విధాన సమీక్షలో సానుకూల దృక్పథం వ్యక్తమైంది. బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థలో భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతుండటం, నియమాల ఆధారిత ప్రపంచ వాణిజ్య వ్యవస్థను భారత్ బలపరచడంతో పాటు అలాంటి ఒక వ్యవస్థకు రూపురేఖలు దిద్దడంలో కీలక పాత్రను పోషించగలదన్న ఆశాభావాన్ని సభ్య దేశాలు వ్యక్తం చేశాయని సమీక్ష కార్యక్రమం స్పష్టం చేసింది.

 
***

(रिलीज़ आईडी: 2288822) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Punjabi , Gujarati , Tamil