రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

త్రివిధ దళాల మహిళా అధికారుల తొలి సముద్ర ప్రదక్షిణ- నావికా యాత్ర పూర్తి.. స్వాగతం పలికిన రక్షణ మంత్రి

నాలుగు మహాసముద్రాల్లో 25,500 నాటికల్ మైళ్ల దూరం, 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం స్వదేశానికి చేరుకున్న తొమ్మిది మంది మహిళా అధికారులు

‘సముద్ర ప్రదక్షిణ’ నవ భారత్ దృఢ సంకల్పానికి, నారీ శక్తికి, త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

‘‘భారత ఇంజనీరింగ్ ప్రతిభకు, స్వదేశీ సామర్థ్యానికి, వ్యూహాత్మక విశ్వాసానికి ఐఏఎస్‌వీ త్రివేణి నిదర్శనం’’

प्रविष्टि तिथि: 22 JUL 2026 4:23PM by PIB Hyderabad

త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారులు చేపట్టిన తొలి ప్రపంచ నౌకాయాన సాహస యాత్ర ‘సముద్ర ప్రదక్షిణ’ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జూలై 22, 2026న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి స్వాగతం పలికారు. ఇండియన్ ఆర్మీ సైలింగ్ వెసెల్ (భారత సైనిక నావికా నౌక-ఐఏఎస్‌వీ) త్రివేణిలో త్రివిధ దళాలకు చెందిన తొమ్మిది మంది మహిళా అధికారులు ఈ సాహస యాత్ర చేపట్టారు. నాలుగు మహాసముద్రాల మీదుగా దాదాపు 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని 314 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి ముంబయికి చేరుకున్నారు. సెప్టెంబర్ 11, 2025న ముంబయి నుంచి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ఈ యాత్రను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ.. సాహస యాత్ర విజయవంతంగా పూర్తి కావడం భారత నారీ శక్తికి నిదర్శనమని, దేశ దృఢ సంకల్పానికి ప్రతీకగా అభివర్ణించారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం, సమష్టి భాగస్వామ్య సామర్థ్యానికి ఇది సజీవ సాక్ష్యమని తెలిపారు. సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించే నవ భారత్ వైభవానికి ఈ విజయం మహోత్సవం లాంటిదని పేర్కొన్నారు.

 

పక్కా ప్రణాళిక, దాదాపు రెండేళ్ల సుదీర్ఘ శిక్షణ, 24 గంటల అందుబాటులో ఉండే తీరప్రాంత మద్దతు వ్యవస్థ, అనేక సంస్థలు, సహాయక ఏజెన్సీల అంకితభావం వల్లనే ఈ విజయం సాధ్యమైందని రక్షణ మంత్రి తెలిపారు. ఈ ప్రయాణం భూగోళాన్ని చుట్టి రావడానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అన్ని ప్రమాణాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో అన్ని రేఖాంశాలను దాటడం, రెండుసార్లు భూమధ్యరేఖను దాటడం, అంతర్జాతీయ దిన రేఖను దాటడంతో పాటు మూడు ప్రముఖ కేప్‌లను (కేప్ లీవిన్, కేప్ హార్న్, కేప్ ఆఫ్ గుడ్ హోప్) చుట్టి రావడం ఉన్నాయి.

అత్యంత ప్రమాదకరమైన డ్రేక్ జలసంధి మీదుగా ప్రయాణించి, సాహసోపేతంగా కేప్ హార్న్‌ను చుట్టి రావడం ద్వారా ఐఏఎస్‌వీ త్రివేణి సిబ్బంది ప్రతిష్ఠాత్మక కేప్ హోర్నర్స్ బృందంలో సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన సముద్ర మార్గాన్ని అధిగమించిన నావికులకు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కుతుంది. ఐఏఎస్‌వీ త్రివేణి బృంద సభ్యుల ధైర్యాన్ని, సముద్ర సాహస స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. తుఫాను కంటే మానవ ధైర్యమే గొప్పదని ఈ యాత్ర నిరూపించిందని పేర్కొన్నారు. ‘‘సముద్రపు అలలు ఎంత ఎత్తుకు ఎగిసిపడినా, భారతీయ కుమార్తెల ఆత్మవిశ్వాసం అంతకంటే ఎత్తుకు ఎగురుతుంది’’ అని కొనియాడారు. నేడు దేశంలోని మహిళలు సొంతంగా అవకాశాలను సృష్టించుకుంటూ, ముందుండి నడిపిస్తూ, చరిత్ర సృష్టిస్తున్నారనీ ఆయన అన్నారు.

 

ఈ యాత్ర... సైన్యం, నావికాదళం, వైమానిక దళ విభాగాలకు చెందిన అధికారులను ఒకే లక్ష్యం కోసం ఏకతాటిపైకి తీసుకువచ్చింది. ఇది సమగ్ర ప్రణాళిక, నిరంతర భాగస్వామ్యం, ఉమ్మడి నాయకత్వ పటిమను చాటిచెప్పింది. పది నెలకు పైగా కలిసి జీవిస్తూ, శిక్షణ పొందుతూ, ప్రయాణిస్తూ ఈ బృందం ఒకే జట్టుగా పనిచేసింది. దళాల ఐక్యత అనేది కేవలం ఒక వ్యవస్థాగత భావన మాత్రమే కాదని, కార్యచరణ సామర్థ్యాన్ని, జాతీయ శక్తిని పెంచే గొప్ప బలాన్నిచ్చే అంశమని ఈ యాత్ర నిరూపించింది.

 

‘సముద్ర ప్రదక్షిణ’ కేవలం ఒక నావికా సాహస యాత్రగానే కాకుండా.. ఒకే జెండా, ఒకే సంకల్పం, ఒకే లక్ష్యంతో త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారులు ఏకమై భారత అసలైన బలం ఐక్యతలోనే ఉందనే సందేశాన్ని అందించారని చెప్పారు. ‘‘ప్రపంచమంతా సంయుక్త కార్యకలాపాలు, సమీకృత కమాండ్లు, బహుళ రంగ యుద్ధాల గురించి చర్చిస్తున్న ఈ సమయంలో, దళాల సమన్వయం ఎంత కీలకమో ఐఏఎస్‌వీ త్రివేణి నిరూపించింది. సమన్వయం ఉన్న చోట సామర్థ్యం రెట్టింపవుతుంది. త్రివిధ దళాలు కలిసి అడుగులు వేసినప్పుడు విజయం దానంతట అదే మార్గం సుగమం చేసుకుంటుంది’’ అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.

అద్భుతమైన నౌకాయాన విజయానికి మించి, సముద్ర ప్రదక్షిణ సైనిక దౌత్యానికి కీలక సాధనంగా అవతరించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఓడరేవులను సందర్శించిన సమయంలో ఐఏఎస్‌వీవీ త్రివేణి భారత సంస్కృతి, నౌకా వాణిజ్య సంప్రదాయాలు, సైనిక వృత్తి నైపుణ్యం, శాశ్వత విలువలను చాటిచెప్పడమే కాకుండా, మిత్రదేశాలతో సద్భావాన్ని పెంపొందించిందన్నారు. ఈ సాహస యాత్ర కేవలం ఒక నావికా ప్రయాణం మాత్రమే కాకుండా ప్రపంచానికి భారత్‌ తరపున రాయబారిగా కూడా వ్యవహరించిందని, వివిధ దేశాల్లోని ఓడరేవుల సందర్శనలు మన దేశ పరపతిని మరింత బలోపేతం చేశాయని తెలిపారు.

 

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ 50 అడుగుల ఐఏఎస్‌వీ త్రివేణి నౌక దేశ సాంకేతిక ప్రతిభను, ఆవిష్కరణలను, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని.. దీనిని ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతిరూపమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ‘‘భారత ఇంజనీరింగ్ విశిష్టతకు, స్వదేశీ తయారీ సామర్థ్యానికి, వ్యూహాత్మక ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా ఈ నౌక నిలుస్తుంది’’అని ఆయన పేర్కొన్నారు.

 

న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్-2 నుంచి రక్షణ మంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రివిధ దళాల అధిపతి జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, నావికాదళ అధిపతి అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్, సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేథ్, వైమానిక దళ ఉపాధ్యక్షుడు ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్, ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ రామ్‌దేవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన రక్షణ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

 

సదరన్ కమాండ్ ప్రధాన దళాధిపతి లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్, సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ మార్షల్ పీవీ శివానంద్, ఆర్మీ డెప్యుటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ విపుల్ సింఘాల్, వెస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ రాహుల్ విలాస్ గోఖలే, ఇతర సైనిక ప్రముఖులు, మాజీ సైనికులు, నావికా బృందం కుటుంబ సభ్యులు ముంబయిలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద సముద్ర ప్రదక్షిణ పూర్తి చేసుకుని వచ్చిన సిబ్బందికి స్వాగతం పలికారు.

***

 


(रिलीज़ आईडी: 2288080) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Telugu , Malayalam