యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ‘నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా క్విజ్-2026’కు ‘మై భారత్’ శ్రీకారం
ఈ పోటీలో ఆగస్టు 15 వరకూ యువత పాల్గొనవచ్చు.. అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించే వారికి దేశ సరిహద్దుల సందర్శన అవకాశం లభిస్తుంది
प्रविष्टि तिथि:
21 JUL 2026 5:56PM by PIB Hyderabad
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవంతోపాటు ‘ఇంటింటా త్రివర్ణం’ (హర్ ఘర్ తిరంగా) కార్యక్రమంలో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇవాళ ‘మై భారత్’ (MY Bharat) పోర్టల్ ద్వారా ‘నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా క్విజ్-2026’కు శ్రీకారం చుట్టింది. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆగస్టు 15 వరకూ అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించింది. ఇందులో పాలు పంచుకోవడం ద్వారా జాతీయ పతాకం, దాని నిరంతర ప్రాధాన్యంపై అవగాహన పెంచుకునే అద్భుత అవకాశం దేశ యువతరానికి లభిస్తుంది.
ఇదే జాతీయ పోటీని గత ఏడాది నిర్వహించినపుడు అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా దీనికి రూపకల్పన చేశారు. తద్వారా యువతలో జాతీయ పతాక చరిత్ర, పరిణామం, ప్రాధాన్యం, గౌరవంపై ‘మై భారత్’ అవగాహన కల్పిస్తుంది. దీంతోపాటు దేశభక్తి, రాజ్యాంగ విలువలు సహా ఈ వేదికతో యువత అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేయాలన్నది ఈ పోటీ లక్ష్యం.
ఈ పోర్టల్‌లో నమోదయ్యే వినియోగదారులందరూ పోటీలో పాల్గొనవచ్చు. ఇందులో 20 బహుళ-ఐచ్ఛిక (multiple-choice) ప్రశ్నలకు 10 నిమిషాల్లో సమాధానాలు నింపాల్సి ఉంటుంది. ‘భాషిణి’ మాధ్యమం ద్వారా పోర్టల్‌లో అందుబాటులోగల అన్ని భాషలలో ఈ పోటీలో పాల్గొనవచ్చు. నమోదైన ప్రతి వినియోగదారుకూ ఒకసారి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. సరైన జవాబుకు ఒక మార్కు ఉంటుంది.. తప్పు సమాధానాలకు తిరస్కరణ మార్కులేవీ ఉండవు.
ఈ పోటీలో పాల్గొనేవారు జాతీయ పతాకం పరిణామం, చరిత్ర, దాని రూపకల్పనలో మహనీయుల కృషి, త్రివర్ణ పతాక సంబంధిత రాజ్యాంగ నిబంధనలు, ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002’, ‘జాతీయ ప్రతిష్టకు అగౌరవ నివారణ చట్టం-1971’, భారత జాతీయ చిహ్నాల సంబంధిత ఇతర ముఖ్యాంశాలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
నమోదిత వినియోగదారులందరికీ ఈ పోటీలో పాల్గొనే వీలుంది. సరైన జవాబులిచ్చే వారందరికీ ‘ఇ-సర్టిఫికేట్’ లభిస్తుంది. అయితే, నిర్దేశిత షరతుల మేరకు 21-29 ఏళ్ల మధ్య వయస్కులకు మాత్రమే విజేతలుగా ఎంపికయ్యే అర్హత ఉంటుంది. అత్యధిక స్కోరు సాధించిన అర్హుల నుంచి కంప్యూటర్ ఆధారిత యాదృచ్ఛిక ప్రక్రియ ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. వీరికి భారత సరిహద్దు ప్రాంతాలు లేదా ఇతర సముచిత ప్రదేశాలు సందర్శించే అవకాశం కల్పిస్తారు.
దేశ పురోగమన కార్యక్రమాలతో డిజిటల్ అభ్యసనాన్ని సంధానించడం ద్వారా యువతలో అవగాహన సహిత క్రియాశీల పౌర బాధ్యతను పెంచే నిరంతర కృషిలో భాగంగా ‘మై భారత్’ ‘భారత జాతీయ పతాక పోటీ’ని ఏర్పాటు చేసింది. ఈ జ్ఞానాధారిత ప్రత్యేక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని, త్రివర్ణ పతాక స్ఫూర్తిని చాటాల్సిందిగా సంబంధిత శాఖ యువతకు పిలుపునిచ్చింది.
‘మై భారత్’ పోర్టల్ (https://mybharat.gov.in/quiz/quiz_dashboard/UndZOTQ1S3FyU1BYSmVGZmkyaGRpZz09 ద్వారా ఆగస్టు 15వ తేదీ వరకూ ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 2287518)
आगंतुक पटल : 30