బొగ్గు మంత్రిత్వ శాఖ
రూ. 37,500 కోట్ల విలువైన ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ పథకం ముందస్తు దరఖాస్తు సమావేశం.. పారిశ్రామిక వర్గాల నుంచి విశేష స్పందన
प्रविष्टि तिथि:
20 JUL 2026 5:33PM by PIB Hyderabad
ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహకం కోసం ఉద్దేశించిన రూ. 37,500 కోట్ల పథకానికి సంబంధించిన ముందస్తు దరఖాస్తుల సదస్సును బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా అధ్యక్షతన మంత్రిత్వ శాఖ విజయవంతంగా నిర్వహించింది. స్వదేశీ బొగ్గును పర్యావరణహితంగా, విలువ ఆధారితంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంపై పరిశ్రమల వర్గాలు భారీ ఆసక్తి చూపాయి. ఈ సదస్సులో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, సాంకేతికత నిపుణులు, దరఖాస్తుదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పథకం మార్గదర్శకాలు, ప్రతిపాదనల కోసం అభ్యర్థనపై (ఆర్ఎఫ్పీ) మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో స్పష్టతను అందించింది. అర్హత ప్రమాణాలు, మూల్యాంకన విధానం, ఆర్థిక ప్రోత్సాహకాలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన అంశాలను వివరించడంతో పాటు భాగస్వాములు అడిగిన సందేహాలకు సమాధానమిచ్చింది.
2026 మే 13న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన రూ. 37,500 కోట్ల పథకం.. ఉపరితల బొగ్గు,లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి, సింథటిక్ సహజ వాయువు, అమ్మోనియా, మిథనాల్, డీఆర్ఐ, సింథటిక్ ఇంధనాలు, రసాయనాల వంటి అధిక విలువున్న ఉత్పత్తుల తయారీకి మద్దతునిస్తుంది. ఈ పథకం ద్వారా దాదాపు రూ.2.5 నుంచి 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఏటా దాదాపు 75 మిలియన్ టన్నుల బొగ్గు వినియోగానికి అందుబాటులోకి వస్తుంది. సుమారు 50,000 మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఇంధన, రసాయన ఉత్పత్తుల దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దరఖాస్తుల సమర్పణకు 2026 సెప్టెంబర్ 7 చివరి తేదీగా భాగస్వాములకు మంత్రిత్వ శాఖ తెలిపింది. అర్హత కలిగిన సంస్థలన్నీ నిర్ణీత కాలపరిమితిలోగా తమ ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది.
***
(रिलीज़ आईडी: 2286753)
आगंतुक पटल : 28