కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఇన్నవేట్ ఇండియా మైగవ్’ వేదికగా మస్కట్ డిజైన్ పోటీని ప్రారంభించిన తపాలా శాఖ

విశ్వాసం, సేవ, డిజిటల్ ఆవిష్కరణ వంటి విలువలను ప్రతిబింబించేలా ఇండియా పోస్ట్ అధికారిక మస్కట్‌ రూపకల్పనకు పౌరులకు ఆహ్వానం



రూ.2 లక్షల నగదు బహుమతి గెలుచుకునే అవకాశం

प्रविष्टि तिथि: 18 JUL 2026 12:33PM by PIB Hyderabad

 కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా శాఖ, ఇన్నవేట్ ఇండియా మైగవ్ వేదికపై  ‘ఇండియా పోస్టు అధికారిక మస్కట్ డిజైన్’ పోటీని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరినీ ఈ పోటీలో భాగస్వాములను చేస్తూ అధికారిక చిహ్నాన్ని రూపొందించాల్సిందిగా ఆహ్వానించింది. విశ్వాసం, విశ్వసనీయత, సమ్మిళితత్వం, సేవ,  డిజిటల్ ఆవిష్కరణ వంటి తపాలా శాఖకు ప్రధాన విలువలను ప్రతిబింబించేఒక ప్రత్యేకమైన బ్రాండ్ అంబాసిడర్‌ను సృష్టించే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. 

 

దేశంలోని పౌరులందరికీ ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. పోటీదారులు తమ సొంత ఆలోచనతో కూడిన ఒక సొంత మస్కట్‌ డిజైన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. దాంతో పాటు ఆ చిహ్నానికి సరిపోయే ఒక చక్కని పేరును ప్రతిపాదించాలి. తాము రూపొందించిన డిజైన్ వెనుక ఉన్న మూల భావనను వివరిస్తూ ఒక సంక్షిప్త భావన పత్రాన్నికూడా జతచేసి మైగవర్నమెంట్‌ వేదిక ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోటీ ప్రక్రియ 2026 జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

 

సృజనాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి తపాలా శాఖ ఆకర్షణీయమైన నగదు బహుమతులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఉత్తమమైన మొదటి మూడు మస్కట్ డిజైన్లకు వరుసగా రూ.75,000, రూ.50,000, రూ.25,000 నగదు బహుమతులు అందజేస్తారు. అలాగే మస్కట్‌కు సూచించిన ఉత్తమమైన మొదటి మూడు పేర్లకు విడిగా వరుసగా రూ.25,000, రూ.15,000, రూ.10,000 చొప్పున నగదు బహుమతులు ఇస్తారు. విజేతలందరికీ ప్రత్యేక ప్రశంసా పత్రాలు లభిస్తాయి.  చిహ్నం డిజైన్, పేరు ఎంపికకు సంబంధించిన బహుమతులు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా కేటాయిస్తారు.

 

ఈ పోటీలో ఎంపికయ్యే మస్కట్ తపాలా శాఖ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతుంది. భవిష్యత్తులో చేపట్టే ప్రచార కార్యక్రమాలు, ఫిలాటెలిక్ ఉత్పత్తులు (తపాలా బిళ్ళల విభాగాలు), ప్రజా చైతన్య కార్యక్రమాలు, ప్రదర్శనలు, సామాజిక మాధ్యమాలు, ఇతర అధికారిక కమ్యూనికేషన్లలో ఈ చిహ్నాన్నే విస్తృతంగా ఉపయోగిస్తారు.

 

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, డిజైనర్లు, కళాకారులు, సృజనాత్మక నిపుణులు ఈ పోటీలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తపాలా శాఖ కోరింది. తపాలా శాఖ భవిష్యత్తు గుర్తింపు ముఖచిత్రాన్ని రూపొందించడంలో తమ వంతు సహకారాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

 

 పోటీకి సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలు, షరతులతో సహా పూర్తి వివరాల కోసం.. దరఖాస్తులను సమర్పించడానికి, ఈ కింది వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


https://innovateindia.mygov.in/mascot-design-contest-for-india-post/

 

 లింక్‌ కోసం ఈ కింది క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయండి.

 

***


(रिलीज़ आईडी: 2286115) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Malayalam , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil