WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

రెండో ఎడిషన్ 'వేవ్స్' సదస్సును మరింత ఘనవిజయం చేయడానికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి


ముంబయిలో జరగనున్న 'వేవ్స్ 2027' ముందస్తు ఏర్పాట్లపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వివరాలు అందించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి

 प्रविष्टि तिथि: 17 JUL 2026 6:04PM |   Location: PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసింది. ముంబయిలో నిర్వహించబోయే రెండో ఎడిషన్ 'ప్రపంచ దృశ్య శ్రవణ వినోద సదస్సు' (వేవ్స్) 2027 ముందస్తు ఏర్పాట్లపై ఈ సందర్భంగా వారు ఒక ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు.

మొదటి ఎడిషన్ 'వేవ్స్ 2025' అద్భుత విజయాన్ని సాధించిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. 'వేవ్స్' ప్రారంభ ఎడిషన్ 2025 మే 1 నుంచి 4 వరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. చలనచిత్రాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథలు చెప్పే అద్భుతమైన కళా ప్రపంచాన్ని ప్రదర్శించేలా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, క్రియేటర్ల మధ్య సహకారాన్ని పెంపొందించే ఒక అంతర్జాతీయ వేదికగా 'వేవ్స్'ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టమైన పిలుపునిచ్చారని శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ నేపథ్యంలో  రెండో ఎడిషన్ 'వేవ్స్' సదస్సును మరింత ఘనంగా విజయవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

2027లో ముంబయిలో జరగబోయే రెండో ఎడిషన్ 'వేవ్స్' సదస్సు కోసం చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లు, కీలకమైన కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి ఈ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ వివరించారు.

ఈ సందర్భంగా హాజరైన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులలో ప్రసార భారతి సీఈఓ శ్రీ గౌరవ్ ద్వివేది, అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్.. సమాచార-ప్రసార శాఖ డైరెక్టర్ జనరల్ (పశ్చిమ జోన్) శ్రీమతి స్మితా వాట్స్ శర్మ, జాయింట్ సెక్రటరీ (ఐపీ-సీ) శ్రీ సి. సెంథిల్ రాజన్, జాయింట్ సెక్రటరీ (బ్రాడ్‌కాస్టింగ్) శ్రీ పృథుల్ కుమార్, జాయింట్ సెక్రటరీ (ఫిల్మ్స్) డాక్టర్ అజయ్ నాగభూషణ్ ఎం.ఎన్, జాయింట్ సెక్రటరీ (ఇనిస్టిట్యూషన్స్) డాక్టర్ కే.కే. నిరాలా, ఎన్‌ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మాగ్దుమ్ తదితరులు ఉన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మహారాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీకర్ పరదేశి, ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు, పెట్టుబడులు- సేవలు) డాక్టర్ పీ. అన్బలగన్, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ శ్రీమతి అశ్విని భిడే, డీజీఐపీఆర్ డైరెక్టర్ జనరల్ శ్రీ బ్రిజేష్ సింగ్ తదితరులు ఉన్నారు.

ముఖ్యమంత్రితో సమావేశానికి ముందు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్.. 'వేవ్స్ 2027' ముందస్తు ఏర్పాట్ల గురించి మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం వారు ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో (బీకేసీ) ఉన్న 'జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్'ను సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. 2025లో 'వేవ్స్' ప్రారంభ ఎడిషన్‌కు ఆతిథ్యమిచ్చిన ఈ వేదికనే తదుపరి ఎడిషన్ సదస్సుకు కూడా వేదికగా ఉంది. 

 

***


रिलीज़ आईडी: 2285975   |   Visitor Counter: 5

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil , Malayalam