పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
డామన్‌లోని నమో విమానాశ్రయం నుంచి తొలి విమాన సర్వీసును ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
డామన్‌ను నేరుగా ఢిల్లీతో కలుపుతున్న అలయన్స్ ఎయిర్
प्रविष्टि तिथि:
17 JUL 2026 11:09AM by PIB Hyderabad
దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూ కేంద్రపాలిత ప్రాంత చరిత్రలో కీలకంగా నిలిచేలా నమో విమానాశ్రయం నుంచి డామన్-డిల్లీ- డామన్ మార్గంలో జూలై 16, 2026న తొలి విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు కింజరాపు, కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ శ్రీ ప్రఫుల్ పటేల్ కలిసి ప్రారంభించారు. ఈ సర్వీసును ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రాంతీయ విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ ప్రారంభించింది. దీంతో డామన్‌కు తొలసారిగా నేరుగా విమాన సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తలపెట్టిన డామన్ విమానాశ్రయం.. భారత తీర రక్షక దళ వైమానిక కేంద్రం (ఐసీజీఏఎస్) పరిధిలో నడిచే ఉభయతారక సదుపాయం. ఏప్రిల్ 25, 2023న ప్రధానమంత్రి ఈ విమానాశ్రయ సివిల్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేయగా.. జూన్ 5, 2026న ఆయనే దీన్ని ప్రారంభించారు.
ఈ టెర్మినల్‌ను 25 ఎకరాల స్థలంలో రూ.124 కోట్ల వ్యయంతో యూటీ పరిపాలనా విభాగం నిర్మించగా.. రూ.88 కోట్లను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తిరిగి చెల్లించింది. 3,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ టెర్మినల్.. రోజుకు 14 ఏటీఆర్ విమానాల రాకపోకలను నిర్వహిస్తుంది. ఏడాదికి 3.67 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఈ టెర్మినల్‌కు ఉంది.
ఈ విమాన సర్వీసు ప్రారంభోత్సవానికి కేంద్రపాలిత ప్రాంత పరిపాలనా విభాగం, భారత విమానయాన ప్రాధికార సంస్థ (ఏఏఐ), అలయన్స్ ఎయిర్, భారత తీర రక్షక దళ ఉన్నతాధికారులతో పాటు డామన్ స్థానికులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. "ఈ చరిత్రాత్మక సందర్భంలో డామన్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ తొలి విమాన సర్వీసు ద్వారా డామన్ ప్రజలు నేరుగా దేశ రాజధానికి చేరుకోవచ్చు. 8-10 గంటల సమయం వెచ్చించి సూరత్, ముంబయి నుంచి వెళ్లటానికి బదులుగా డామన్ నుంచి నేరుగా 2.5 గంటల్లోనే ఢిల్లీకి వెళ్లవచ్చు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం ఉడాన్ ద్వారానే ఇది సాధ్యమైంది" అని అన్నారు.
గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి నాయకత్వంలో దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ.. రూ.13,000 కోట్లకు పైగా విలువైన 450కి పైగా ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందాయని మంత్రి అన్నారు. డామన్ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు, ప్రధానమంత్రి దార్శనికతకు గౌరవ సూచికంగా డామన్ ప్రజలు నూతన విమానాశ్రయానికి నమో ఎయిర్‌పోర్టు అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.
డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ ప్రాంతంలో 7,000లకు పైగా పరిశ్రమలున్నాయి. దాని పరిసర ప్రాంతాలైన వాపి, వల్సాడ్‌లో మరో 15,000లకు పైగా కర్మాగారాలున్నాయి. విమానయాన సౌకర్యం ద్వారా ఇక్కడి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు రావటంతో పాటు స్థానిక యువతకు నూతన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
పర్యాటక రంగానికున్న అవకాశాలను ప్రస్తావిస్తూ.. ఏటా దాదాపు 20 లక్షల మంది పర్యాటకులు డామన్‌ని సందర్శిస్తారని, విమానయాన ప్రయాణం అందుబాటులోకి రావటంతో ఈ సంఖ్య వేగంగా పెరుగుతుందని మంత్రి అన్నారు. రన్ వే పొడవును పెంచటం ద్వారా ఎయిర్ బస్ ఏ320 వంటి పెద్ద విమానాలు డామన్‌లో దిగేలా చేయాలని.. ముంబయి, సూరత్, అహ్మదాబాద్, పాట్నా వంటి నగరాలకు అనుసంధానాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
డయ్యూ విమానాశ్రయ వార్షిక ప్రయాణికుల సంఖ్య 2013లో కేవలం 19,000 ఉండగా.. నేడు లక్షకు పైగా అయిందని మంత్రి తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా డయ్యూ విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌ను, అదనంగా మరో రన్ వేను అభివృద్ధి చేసేందుకు మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని చెప్పారు.
కేంద్రమంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు, డామన్ విమానాశ్రయ ప్రాముఖ్యతను వివరిస్తూ.. "డామన్ బ్లూ ఎకానమీని సముద్రయాన రంగంలోని అపరిమిత అవకాశాలతో పీఎం అనుసంధానించారు. డామన్ మత్స్య సంపద, సముద్ర ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ వస్తువులు ఇకపై కొన్ని గంటల్లోనే దేశంలోని ఏ ప్రాంతానికైనా చేరుకోగలుగుతాయి" అని అన్నారు. దీనివల్ల మత్స్యకారులకు మేలు జరుగుతుందని, సముద్ర ఉత్పత్తులను సాగు చేసే వారికి నూతన మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, స్థానిక ఫార్మా రంగం నూతనోత్తేజంతో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సవరించిన ఉడాన్ పథకం ద్వారా రాబోయే పదేళ్లలో దేశవ్యాప్తంగా 100 నూతన విమానాశ్రయాలు, 200 నూతన హెలిప్యాడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.29,000 కోట్ల నిధులను కేటాయించినట్లు చెప్పారు. దీనిద్వారా భారతదేశ ప్రాంతీయ విమానయాన వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు.
నమో విమానాశ్రయ ప్రాజెక్టును పూర్తి చేయటంలో కీలక పాత్ర పోషించిన భారత తీర రక్షక దళ సిబ్బందికి మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చరిత్రాత్మకమైన ఈ సందర్భంలో.. డామన్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అడ్మినిస్ట్రేటర్ శ్రీ ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. "గుజరాత్‌లోని వల్సాడ్ నుంచి మహారాష్ట్రలోని పాల్ఘర్ పారిశ్రామిక ప్రాంతానికి నమో విమానాశ్రయం కీలకంగా మారుతుంది. ఇది స్థానిక యువతకు నూతన అవకాశాలను కల్పిస్తుంది. రాబోయే 15 ఏళ్లలో డామన్ నమో విమానాశ్రయం ఎంతో అభివృద్ధి చెంది, ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలనే మార్చేస్తుందని నేను విశ్వసిస్తున్నా" అని అన్నారు.
డామన్ నమో విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావటం.. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, చిన్న నగరాలను కూడా విమానయాన వ్యవస్థతో అనుసంధానించాలనే ప్రభుత్వ సంకల్పంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2285756)
आगंतुक पटल : 11