వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐసీఏఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

దేశం మనకు అన్నీ ఇస్తుంది… మనం తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి

కార్పొరేట్ సీఎస్ఆర్ ద్వారా వ్యవసాయ పరిశోధనను ప్రయోగశాలల నుంచి పొలాలకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రూపకల్పన

అంకురసంస్థలు, నైపుణ్యాభివృద్ధి, అగ్రి-టెక్ ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి సీఎస్ఆర్ మద్దతు కోసం పిలుపు

సీఎస్ఆర్ ద్వారా మహిళా రైతులు, స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ పారిశ్రామిక వ్యవస్థ బలోపేతం

కార్పొరేట్ సామాజిక బాధ్యతను భారత ధర్మకర్తృత్వ సంప్రదాయంతో అనుసంధానిస్తూ... ప్రజా ప్రయోజనాల కోసం సంపదలో కొంత సమాజ సంక్షేమం కోసం వినియోగించాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపు

प्रविष्टि तिथि: 15 JUL 2026 6:31PM by PIB Hyderabad

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) నిర్వహించిన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)-2026 సదస్సులో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ రంగం ధర్మకర్తృత్వ భారతీయ స్ఫూర్తిని స్వీకరించి... తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధన, గ్రామీణ సమాజాల కోసం కేటాయించాలని కోరారు. దేశం అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ... వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ నిర్మాణంలో చురుగ్గా భాగస్వాములు కావడం కార్పొరేట్ రంగ బాధ్యతగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

పరిశోధన కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకూడదని... అది "విజ్ఞాన శాస్త్రం నుంచి రైతులకు" వారధిగా పనిచేయాలని అన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల ఆరోగ్యం, పోషకాహార భద్రత కలిగిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, మహిళా రైతుల వ్యవస్థాపన వంటి రంగాల్లో సీఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన ప్రభావాన్ని కలిగించేలా చూడాలని కేంద్ర మంత్రి కోరారు. 

ధర్మకర్తృత్వ భావనను ప్రతిబింబించే సీఎస్ఆర్ 

కార్పొరేట్లు, మంత్రులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, రైతులు ఒకచోట చేరి... వ్యవసాయానికి ఒక సంపూర్ణ వాణిజ్య కార్యకలాపాల వ్యవస్థను సృష్టించే విశిష్టమైన వేదికగా ఈ సదస్సును శ్రీ చౌహాన్ అభివర్ణించారు. మహాత్మా గాంధీ ధర్మకర్తృత్వ తత్వాన్ని ప్రస్తావిస్తూ... సంపదను కలిగి ఉన్నవారు దాని యజమానులు కాదని, దాని ధర్మకర్తలు మాత్రమేనని, ఆ సంపద అంతిమంగా సమాజానికే చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

కార్పొరేట్ వర్గం తమ సంపాదనలో కొంత భాగాన్ని దేశం, ప్రజల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా కేటాయించడంలోనే సీఎస్ఆర్ నిజమైన స్ఫూర్తి ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేస్తూ, ఇది వనరులను లాక్కోవడం గురించి కాదని స్పష్టం చేశారు. ఇది ప్రతిభ, వ్యాపారాలు వృద్ధి చెందడానికి అవకాశాలను సృష్టించడం ద్వారా పారిశ్రామికవేత్తలు సంపదను సృష్టించి, దానిలో కొంత భాగాన్ని సమాజం, రైతులు, వ్యవసాయ ఆవిష్కరణల్లో పెట్టుబడిగా పెట్టేలా ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి వివరించారు.

చట్టపరమైన నిర్బంధం లేకపోయినప్పటికీ చాలా కాలంగా అనేకమంది పారిశ్రామికవేత్తలు ప్రజా సంక్షేమానికి గణనీయమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎస్ఆర్ చట్టం... సామాజిక బాధ్యతకు సంబంధించిన ఈ స్ఫూర్తిని వ్యవస్థ అనుసరించాల్సిన నియమంగా మార్చిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

పరిశోధనను ప్రయోగశాలల నుంచి రైతుల పొలాలకు తీసుకువెళ్లడం 

వ్యవసాయ పరిశోధన కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చాలని శ్రీ చౌహాన్ స్పష్టం చేశారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌ను ప్రస్తావిస్తూ... నూతన వ్యవసాయ పద్ధతులు, మెరుగైన పంట వంగడాలు, పరిశోధన ఫలితాలపై జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా శాస్త్రవేత్తలను రైతులకు చేరువ చేయడమే ఈ ప్రచారం లక్ష్యమని ఆయన తెలిపారు.

"శాస్త్రం నుంచి రైతులకు" అనే ప్రయాణాన్ని వేగవంతం చేయాలని ఆయన ప్రోత్సహించారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో కార్పొరేట్ రంగం కీలక పాత్ర పోషించగలదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

జనుము రంగం ఉదాహరణను ఉటంకిస్తూ, సాంప్రదాయ పద్ధతిలో నారను తీయడానికి జనపనారను దాదాపు 25 రోజుల పాటు నీటిలో నానబెట్టాల్సి ఉంటుందని తెలిపారు. దీనివల్ల అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడటంతో పాటు, నార నాణ్యత దెబ్బతింటోందని శ్రీ చౌహాన్ వివరించారు. సాంకేతిక పురోగతితో, ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే అత్యుత్తమ నాణ్యత గల నారను తీయగల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. రైతులు ప్రయోజనం పొందేలా ఇటువంటి సాంకేతికతలను వేగంగా వాణిజ్యీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదనీ, దీనికి ప్రైవేట్ రంగం చురుకైన భాగస్వామ్యం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. 

వాతావరణ మార్పులను తట్టుకోగల, ఆరోగ్యకరమైన, సుస్థిర వ్యవసాయం కోసం భాగస్వామ్యం

సదస్సులో చర్చించిన ఐదు ప్రధానాంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ... వ్యవసాయాన్ని వాతావరణ మార్పులను తట్టుకునేలా చేయడం, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, రైతుల ఆదాయాలను, ప్రజారోగ్యాన్ని సురక్షితం చేయడం, పోషకాలతో నిండిన, కాలానుగుణమైన, వాతావరణానికి అనువైన ఆహార సంస్కృతిని ప్రోత్సహించడం వంటివి దేశ అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యాల్లో భాగంగా ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు.

నేలలో సేంద్రీయ కార్బన్ స్థాయిలు తగ్గిపోవడం, సరైన పరీక్షలు లేకుండా ఎరువులు, పురుగుమందులను విచక్షణారహితంగా వాడటం పట్ల కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పాదకతను కాపాడటానికి నేలను పరిరక్షించడం ప్రాథమిక అవసరమని ఆయన అన్నారు. సీఎస్ఆర్ మద్దతు ద్వారా 'సాయిల్ హెల్త్ కార్డ్' వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయవచ్చని ఆయన తెలిపారు.

"ఆహారమే ఔషధం" అనే భారత సాంప్రదాయిక భావనను గుర్తుచేస్తూ... కేవలం తినడం కోసమే జీవించకూడదన్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన ఆహారాన్ని అంటే రుతువులకు అనుగుణమైన, సమతుల్యమైన, పోషకవిలువలు కలిగిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని శ్రీ చౌహాన్ సూచించారు. క్యాన్సర్ వంటి వ్యాధుల పెరుగుదల గురించి ప్రస్తావిస్తూ... వ్యవసాయ దిగుబడులను పెంచడంతో పాటు, పండించిన ఆహారం ప్రజారోగ్యానికి హాని కలిగించకుండా ఉండేందుకూ సమాన ప్రాధాన్యమివ్వాలని ఆయన పేర్కొన్నారు. 

అంకురసంస్థలు, డ్రోన్ పైలట్లు, అగ్రి-టెక్, మహిళా రైతులపై ప్రధాన దృష్టి

అగ్రి-టెక్ అంకురసంస్థలు, వ్యవసాయ శిక్షణా సంస్థలకు మద్దతునివ్వడం, డ్రోన్ పైలట్ల సామర్థ్యాలను పెంపొందించడం, వ్యవసాయ సంబంధిత వ్యాపార నాయకులు, ఆహార శుద్ధిదారుల అభివృద్ధి వంటి వివిధ మార్గాల ద్వారా సీఎస్ఆర్ భారతీయ వ్యవసాయ రంగాన్ని ఎలా బలోపేతం చేయగలదో కేంద్ర మంత్రి వివరించారు.

అర్థవంతమైన అవకాశాలు అందుబాటులో ఉంటే చాలా మంది యువత వ్యవసాయాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరని ఆయన గమనించారు. దానికి బదులుగా, వారు ఆధునిక వ్యవసాయాన్ని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్వీకరించడానికి ఉత్సాహం చూపుతున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా అటువంటి యువతకు కొత్త అవకాశాలను సృష్టించవచ్చని శ్రీ చౌహాన్ తెలిపారు.

మహిళా రైతులు, స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీల) గురించి మాట్లాడుతూ... డ్రోన్ దీదీ, మహిళల నేతృత్వంలోని ఎస్‌హెచ్‌జీల వంటి కార్యక్రమాలు వ్యవసాయ ఆధారిత సంస్థల్లో నూతన విప్లవాన్ని తీసుకువస్తున్నాయని శ్రీ చౌహాన్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మహిళా రైతులకు, మహిళా సంఘాలకు, గ్రామీణ పారిశ్రామిక వృద్ధికి సీఎస్‌ఆర్ కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రాధాన్యిమివ్వాలని శ్రీ చౌహాన్ కార్పొరేట్ రంగాన్ని కోరారు. 

పరిశ్రమ నుంచి విస్తృత నిబద్ధత కోసం పిలుపు 

ఈ సదస్సులో కార్పొరేట్ రంగ ప్రతినిధులు దేశాభివృద్ధి పట్ల తమ నిబద్ధతను, హామీలను తెలిపారు. ఈ నిబద్ధతను ప్రశంసించిన కేంద్ర మంత్రి... ఇటువంటి నిబద్ధత భాగస్వాములందరి నుంచీ రావాలని కోరారు.

చట్టం ప్రకారం కంపెనీలు తమ లాభాల్లో 2 శాతాన్ని సీఎస్ఆర్‌కు కేటాయించాల్సి ఉన్నప్పటికీ... దానిని కేవలం చట్టపరమైన బాధ్యతగా కాకుండా సమాజం పట్ల నైతిక బాధ్యతగా చూడాలని శ్రీ చౌహాన్ సూచించారు.

"ఇతరులకు జీవితాన్ని అందించేవారే నిజమైన జీవితాన్ని కలిగి ఉంటారు" అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని వినియోగించాలని ఆయన కోరారు. ఈ స్ఫూర్తే ఈ కార్యక్రమ సారాంశమని పేర్కొంటూ కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

న్యూఢిల్లీలోని ఎన్ఏఎస్‌సీ కాంప్లెక్స్‌లోని 'భారతరత్న సి. సుబ్రమణ్యం ఆడిటోరియం'లో జరిగిన 'ఐసీఏఆర్ సీఎస్ఆర్ సదస్సు-2026' ప్రధాన సమావేశంలో కార్పొరేట్ రంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, రైతు ప్రతినిధులు ఒకచోట చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు... వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్, శ్రీ భగీరథ్ చౌదరి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2285212) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada